కోరికలు లేకుండా జీవించేవారే మోక్షానికి అర్హులు!
-శారదాప్రసాద్
పూర్వం రంతీదేవుడనే రాజు ఉండేవాడు. అతడు రాజు అయినప్పటికీ మహర్షివలె, మహాయోగి వలె ప్రాపంచిక సుఖాలకు లోనుకాక నిరంతరం హరి నామస్మరణతో కాలం గడిపేవాడు . లభించిన దానితోనే తృప్తిగా జీవించిన మహానుభావుడు ఆయన . ఆ రాజు గొప్ప దాన గుణం కలవాడు. దానాలు చేసీ చేసీ చివరికి కడు పేదవాడయ్యాడు. ఆయనతో పాటు కుటుంబం అంతా కష్టాల పాలయింది . 48 రోజులు అన్నము, నీళ్ళు లేకుండా గడపవలసి వచ్చినా గుండెనిబ్బరం చెడలేదు. ఒక రోజు ప్రాతః కాలమున అతనికి నెయ్యి పాయసము, నీళ్ళు లభించాయి. భోజన కాలం కాగానే రంతీదేవుడు సకుటుంబముగా భోజనం చెయ్యడానికి సిద్ధపడ్డాడు. అందరూ ఆకలి బాధను, దప్పికను తీర్చుకుందాం అని అనుకుంటున్న సమయములో, ఓ పేద బ్రాహ్మణుడు అతిధిగా వచ్చాడు. రంతీదేవుడు అతనిని ఎంతో ప్రేమగా గౌరవించి హరి సమర్పణముగా ఆహారములో అర్ధ భాగాన్నిఅతడికిచ్చాడు. ఆ బ్రాహ్మణుడు తృప్తిగా భుజించి వెళ్ళాడు.ఆ వెంటనే ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అతిధిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు రంతీదేవుడు. అతను కూడా సంతృప్తిగా తిని వెళ్ళిన వెంటనే కుక్కలు గుంపుతో మరొకడు వచ్చాడు. “రాజా! నేనూ, ఈ కుక్కలు ఆకలిచే బాధపడుతున్నాం! మాకు సరిపోయే ఆహారం ఇవ్వండి ” అని వేడుకున్నాడు . అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి , నమస్కరించి పంపాడు రంతీదేవుడు. ఇక రంతీదేవుడు వద్ద నీళ్ళు మాత్రమే మిగిలాయి. అవి కూడా ఒక్కరికి మాత్రమే సరిపోతాయి . దప్పికతో ఉన్న రంతీదేవుడు అవి త్రాగబోతుండగా , ఓ చంఢాలుడు వచ్చి ఇలా అన్నాడు, “అయ్యా! నాకు చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాను . నీ వద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు” . దాహంతో ఉన్న ఆ దీనుని చూచి , “నా వద్ద అన్నం లేదు, ఈ తియ్యని నీళ్ళు మాత్రమే ఉన్నాయి.నీ దాహం తీరేటట్లు త్రాగు.ఆపదలలో ఉన్న వారిని ఆదుకోవడం కన్నా పరమార్ధమేముంది “? అని రంతీదేవుడన్నాడు. రంతీదేవుడు అంతా ఈశ్వరేచ్ఛగా భావించి, ఆ చంఢాలుని పాత్రలో నీళ్ళు పోసాడు.రంతీదేవుడి దాతృత్వానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి ఆ రంతీదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యారు.జరిగినదంతా విష్ణుమాయా ప్రభావమని చెప్పారు. బ్రాహ్మణ, శూద్ర, చంఢాల వేషములో వచ్చింది తామే అని చెప్పి ఆశీర్వదించారు. రంతీదేవుడు వారికి నమస్కరించాడు. ప్రతిగా రంతీదేవుడు వారిని ఏమీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకు ఏ కోరికలుండవు కదా!చివరికి విష్ణుసాయుజ్యాన్ని పొందాడు రంతీదేవుడు .
కోరికలు లేకుండా జీవించేవారే మోక్షానికి అర్హులు!
****