-శారదాప్రసాద్
ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళిని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు! మొదటి వర్గం -పరమాత్మను గురించి తెలియని వారు . వీరే అజ్ఞానులు.రెండవ వర్గం -పరమాత్మను గురించి తెలుసుకోవటానికి తపనపడేవారు. వీరిని జిజ్ఞాసువులు అంటారు.ఇక మూడవ వర్గం –పరమాత్మను గురించి తెలిసినవారు.వీరిని జ్ఞానులు అనొచ్చు! వీరందరూ కూడా ప్రపంచాన్ని వారి వారి దృష్టిలో చూస్తారు.దృగ్దృశ్య వివేకం అనే ఈ గ్రంధం మూడవ వర్గం వారి కోసం వ్రాయబడింది .నిత్యానిత్య వస్తు వివేకం వలన మాత్రమే వైరాగ్య భావం ఏర్పడుతుంది.ఇటువంటి విశ్లేషణం వలన మనసులో ద్వద్వములు లేకుండా పోతాయి.అలా వైరాగ్యం ఏర్పడుతుంది.దృగ్ -దృశ్యం అంటే ఏమిటని కదూ మీ సందేహం?సాధారణ భాషలో చెప్పాలంటే– చూచేది చూడబడేది -వీటిని గురించి తెలుసుకోవటం.
నాలుగు వివేకములను పూర్తి చేసిన సాధకుడు, దృక్ దృశ్య వివేక పరిధిలోకి వస్తాడు.
1) నిత్యానిత్యవస్తువివేకము.
2) ఆత్మానాత్మవివేకము
3) సదసద్వివేకము
4) కార్యకారణవివేకము.
–ఇవే ఆ నాలుగు వివేకములు. ద్రుగ్ (అంటే జ్ఞానం/knowledge of the self/consciousness.) దృశ్యం (అంటే బయటికి కనిపించే ప్రపంచం) రెండూ, పరస్పర విలక్షణం – అంటే వేటికవే వేరు. (mutually exclusive) దృగ్ బ్రహ్మ, ప్రపంచం/దృశ్యం మాయ. వేదాంతం చెప్పే అద్వైత సారం ఇదే ! నయనానికి, దృశ్యానికి మధ్యనున్న అనంతమైన ఆకాశాన్ని వివేచన చెయ్యడమే యోగ సారం.
చూచేది చూడబడేది అని రెండు వేఱువేఱైన పదార్థాలు ఉన్నాయి. వాటిలో చూచేది పరంబ్రహ్మతత్త్వము, చూడబడేది మాయ అని మొత్తం వేదాంతం చెబుతోంది. అంధకారాన్ని ధ్యానం ద్వారా పారద్రోలవచ్చు!ధ్యానం అంటే మనస్సును నియంత్రణ చేయకూడదు. ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ సంఘర్షణలో పడకూడదు. మనస్సు యొక్క అన్ని క్రియలను చూచేది సాక్షి, చూచేది మరియు చూడబడేది వేరు. చూచే సాక్షిని మీరు చూడలేరు. సాక్షి మీ స్వరూపము, మీ స్వభావము. సాక్షిభావము మేల్కోగానే మనసు ఉండదు, ఆత్మ ఉండును. ఈ స్థితిలో దృక్ మాత్రమే మిగిలింది. ఆ దృక్ స్థితి పేరే పరమాత్మ. ఆ దృక్ స్థితిలో ఎవరైతే ఉన్నారో ఏరకమైన అనుభూతి అనుభవాలు, దర్శనములుకాని ఉండవు. కేవలం దృక్ గానే ఉంటారు. అలాంటి దృక్ స్థితిని సాధించమని చెప్పటమే దృక్ దృశ్య వివేక లక్ష్యము, గీతాచార్యుని ఉపదేశమైన “యద్దృష్టం – తద్నష్టం” [“యత్ దృష్టం – తత్ నష్టం” అనగా, యే వస్తువు చూడ బడుతుందో, ఆ వస్తువునకు అంతముండునని గ్రహింపుము”] అనే విచారముతో వివేకాన్ని పొంది, సరళమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలి. ఈ దృశ్యమానప్రపంచమంతా, అనంతవిశ్వమనే ప్రపంచమంతా కూడా పరమాత్మపై ఆధారపడిందేకాని వాస్తవం కాదు. దృక్ + దృశ్య = [seer + seen]. చూస్తున్న వానిలో చూసేవాడు ఎవరు? ఎలా చూడగలుగుతున్నాడు ? అనే వివేకాన్ని పొందాలి. ఈ గ్రంధాన్ని శ్రీ ఆది శంకరులు వ్రాసారని ప్రతీతి. కొన్ని భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి.జటిలమైన వేదాంత సారాన్ని సరళమైన భాషలో, సైంటిఫిక్ గా చెప్పటం ఒక్క ఆది సంకరులకే సొంతం. ఇక విషయంలోకి వస్తే– రంగు చూడబడేదైతే, చూచేది కన్ను. ఆ కన్ను,రంగు అన్నీ చూడబడివైతే చూచేది మనస్సు. చూచే సాక్షి అయినవాడు మాత్రం ఎప్పుడూ చూచేవాడే,కానీ చూడబడేవాడు కాదు. చైతన్యానికి చావు పుట్టుకలు లేవు. అది తనంతట తానే ప్రకాశిశిస్తుంది. ఇతర పదార్ధాలను కూడా ప్రకాశింపచేస్తుంది.అదే శాశ్వతం మరియు స్వయం ప్రకాశం. బుద్ధియందు వికాసం కలగటం వలన జ్ఞానం ఏర్పడుతుంది.ఆ బుద్ధి(జ్ఞానం)రెండు రకాలు. ఒకటి – అహంకారం, రెండు-అంతకరణం. తాను బ్రహ్మముగా అనుభూతిని పొందుతూ ఆనంద పారవశ్యం పొండటాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. మొత్తాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే–చూచేది ఒకటే,చూడబడేవి అనేకం. ప్రపంచాన్ని బ్రహ్మ అని చూస్తే నిజంగా ప్రపంచం ఉన్నట్లు తెలుస్తుంది.లేకపోతే మిధ్యగా తోస్తుంది. ఆత్మ ఒక్కటి మాత్రమే ప్రకాశిస్తుంది. దీని ప్రకాశం వలెనే అన్నీ ప్రకాశింపబడుతాయి–అని కఠోపనిషత్తులో చెప్పబడింది. ఈ వివేకాన్ని పొందినవాడికి సర్వం శివమయమే!
శుభం భూయాత్!