సారస్వతం

నిర్వాణ షట్కం

-శారదాప్రసాద్

ఆది శంకరాచార్య

(వేదాంతపరంగా చాలా గొప్ప భావన ఇది! అందరూ జాతి,కుల,మత బేధాలు లేకుండా తప్పకుండా కంఠతా చెయ్యగలరు,అర్ధంతో సహా!ఎందుకంటే,ఆత్మతత్త్వం అందరికీ ఒకే విధంగా ఉంటుంది కనుక!నిర్వాణం అంటే సూక్ష్మంగా చెప్పాలంటే మోక్షం! ఆరు శ్లోకాలలో ఆత్మ స్వరూపాన్ని గురించి అద్భుతంగా బోధచేసారు ఆదిశంకరులు. ఈ శ్లోకాలు ఆత్మతత్వాన్ని గురించి చక్కగా తెలియచేశాయి కనుక, ఈ ఆరు శ్లోకాలని ఆత్మషట్కం అని కూడా కొందరు అంటారు.షట్కం అంటే ఆరు! ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఇలా వేదాంత సారాన్ని ఇంత సరళంగా,క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూ ఉండకపోవచ్చు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ! వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు ప్రణమిల్లుతున్నాను!)

1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం-మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అనేటటువంటివి ఏమీ నేను కాను.చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
2.న చ ప్రాణ సంజ్నో న వై పంచవాయు:
న వా సప్తధాతు ర్న వా పంచకోశ:
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం-ప్రాణమనే పేరు కలవాడను కాను.ఐదు రకములైన వాయువును కాను.సప్తధాతువులను కానే కాను.పంచకోశములను కాను.మాట,చేయి,పాదములను కాను.సహాయపడే ఇంద్రియాలను కానే కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
3.న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మే నైవ మాత్సర్యభావ:
న ధర్మో న చార్ధో న కామో న మోక్ష:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం-రాగద్వేషాలంటే నాకు తెలియదు.లోభమోహాలు అంటే అసలు తెలియవు. మద మాత్సర్యములు నాకు లేనే లేవు.ధర్మ,అర్ధ,కామ మోక్షములు నాకు అసలు లేనేలేవు. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా:
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–పుణ్యపాపాలు,సుఖదు:ఖములు నాకు లేనే లేవు.మంత్రంలేదు,క్షేత్రములు లేవు.వేదములు,యజ్ఞములు అసలు లేనే లేవు.నేను భోజనాన్ని కాను,భోజ్యమును కాను,భోక్తను కూడా కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
5.న మృత్యు ర్న శంకా న మే జాతి భేద:
పితో నైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–నాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
6.అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చా సంగతం నైవ ముక్తి ర్నమేయ:
చిదానంద రూప: శివోహం శివోహం
అర్ధం–నాకు ఎటువంటి వికల్పములు,బేధములు నాకు లేవు.నేను,నా ఇంద్రియాలు విశ్వమంతా వ్యాపించినట్లు అనిపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ,విషయములు కానీ లేనేలేవు.నేను తెలుసుకొన వలసినది మరియూ పొందవలసిన మోక్షమూ లేదు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
వీడియో లింకు-https://www.youtube.com/watch?v=_AHBSi2_Dpc

-శుభం భూయాత్-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

10 Comments on నిర్వాణ షట్కం

ఇలపావులూరి సత్యేంద్ర ప్రసాద్ said : Guest 4 years ago

మీ ఈ 'సుజనరంజని' సాహితీ సంచికను ప్రప్రథమంగా చూశాను. మీ సాహితీ వ్యాసంగానికి హార్ధికాభినందనలు. మిగిలిన సంచికలు కూడా చదవాలనే జిజ్ఞాస.. వీలు చేసుకొని చదువుతాను. కృతజ్ఞతలు. సత్యేంద్ర ప్రసాద్.ఇలపావులూరి.

  • Gujarat
శశిభూషణ్ said : Guest 5 years ago

Excellent

  • Hyderabad
వ్యాసమూర్తి said : Guest 5 years ago

Simply superb

  • విశాఖపట్నం
విజయలక్ష్మీ ప్రసాద్ said : Guest 5 years ago

Well Narrated

  • GUNTUR
తురగా వెంకటేశ్వర్లు said : Guest 5 years ago

Thank you. Sankaraachaaryaaya నమః