శీర్షికలు

నీకు నీవే పోటీ!

అమరనాథ్. జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257

సామాజిక వాతావరణంలో పోటీతత్వం రోజు రోజుకు పెరిగిపోతొంది. చదువుల్లో, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో, ఉద్యోగ పదోన్నతుల్లో ఈ పోటీ సర్వసాధారణంగా మారిపోయి అనేకానేక మానసిక ఉద్వేగాలకు తెరలులేపుతోంది! ఆరోగ్యకరమైన పోటీ తత్వం అవసరమైన విషయమే కానీ అనవసర పోటీతత్వంతో మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసికోవటంలోనే అసలు సమస్యలనేవి ప్రారంభం అవుతాయి. మనలో చాలామందికి వుండే అలవాటు మనల్ని ఇతరులతో పోల్చుకుని మనల్ని తక్కువ చేసుకోవటం. పరీక్షల్లో అనుకున్న రాంక్ సాధించగలనా? ఉద్యోగ ప్రయత్నంలో అనుకూల ఫలితం లభిస్తుందా? ఇలా అనేక విషయాలకి సంబంధించి మనమే కాదు మనతో పాటు అదే స్థాయిలో ఈ పోటీ పరీక్షలకి, ఉద్యోగ ఇంటర్వూస్ కు వచ్చే వారిలో కూడా ఇటువంటి ఆందోళనే ఉంటుంది. కారణం మన కంటే ఇతరులలో ఎక్కువ జ్ఞానం ఉందనో, మన కంటే ఎక్కువ చదువుందనో, మనకంటే బాగా మాట్లాడగలరేమో, మన కంటే వారి పెర్సనాలిటీ బాగుందేమో ఇలాంటి సందేహాలు మన అంతరంగంలో ప్రారంభమై ఒక్కసారి మనకు తెలిసిన విషయాలను కూడా సమర్ధవంతం గా చేయలేక పరాజయం పాలవడం మనం చూస్తూనే వున్నాము. దీనికి ముఖ్యమైన కారణం మన కంటే కూడా ఇతరులపైనే మన అంచనాలను ఎక్కువగా పెంచుకొని మనల్ని మనం తక్కువగా చూసుకోవడం. ఒక మనిషి అందాన్ని,ఆకర్షణను,వేషం, భాషా చూసి గొప్పగా అంచనా వేయలేము. ఎందుకంటె అంత గొప్పగా కనిపించినా కూడా విషయం దగ్గరకు వచ్చేసరికి వారిలో అవసరమైన జ్ఞానం ఉండకపోవచ్చు .దీనికి ఒక చిన్న ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జార్జ్ బెర్నాడ్ షా … ఈయన పేరు వినే వుంటారు గొప్ప నాటక రచయితా, తత్వవేత్త , గొప్ప మానవతావాది ఒక సారి ఆయన భార్య ఆయనతో “మనకు పుట్టబోయే పిల్లలకు నా అందం మీ తెలివితేటలూ వస్తే యెంత బాగుండునో అందట” దానికి బెర్నాడ్ షా “నా అందం నీ తెలివితేటలో వస్తేనో” అన్నారట! కనుక అనవసర అంచనాలు అనర్ధదాయకాలని చెప్పటానికే ఫై ఉదాహరణ.
ఈ పోటీతత్వంలో మొదటగా కలిగే మానసిక ఆందోళన ఏమిటంటే మనకంటే మిగతావారు ముందుకెళ్లి పోతున్నారనే ఒక అనవసర భావన రెండోది మనలో మనకు అవసరమైన నైపుణ్యాలు వున్నా కూడా ఒక్కొక్కసారి ఇతరుల వేషం, భాషా చూసి వారి నైపుణ్యాల గురించి మనకు తెలియక పోయినా కూడా ఓటమికి భయపడిపోవటం. దీనికి మొదట మనకు మనం ఆలోచించి అలవరచు కోవాల్సింది మనపై మనకు భరోసా. ఇది సహజంగా మనకు అవసరమైన రంగాలలో అవగాహన పెంచుకొంటే మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. దానికై దానికై మనం సంసిద్ధులం కావాలి.
ఇతరులకంటే ఉన్నతంగా వుండాలను కోవటం ఉన్నతంగా ఎదగాలను కోవటం తప్పులేదు! తప్పు కాదు! కానీ లక్ష్య సాధనలో మనలోవున్న అనుకూల లక్షణాలు తక్కువ చేసుకొని ఇతరులలో అవి ఎక్కువగా వుంటాయనుకునే బ్రమలే మన మనసులను అనవసర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి విద్యార్ధి మరియు యువత దృష్టి లో ఉంచుకొని అడుగులు ముందుకు కదపాలి. ఒక చిన్న ఉదాహరణలో చెప్పాలంటే పరీక్ష హాలులో అడిషనల్ పేపర్స్ అధికంగా తీసుకొనే ప్రతి వారికి ర్యాంక్స్ రాక పోవచ్చు, కానీ వారిని చూసి మనం కంగారు పడితే అవతలి వారి సంగతి యెట్లా వున్నా ముందు మనకు వచ్చినవి మర్చిపోయి ముందు మనం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చదువైనా , ఉద్యోగమైనా, వున్నత పదవులైన, వ్యాపారమైనా ఇలా జీవితంలో ఎటువంటి లక్ష్యాన్ని సాధించాలన్నా ఆ లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన మరియు ఆచరణా ప్రయత్నాలు మనదైనా రీతిలో జరగాలి. అందుకై అనవసర పోటీతత్వాల నుండి మనం ఎలా బయట పడాలి? దానికి మనలో ఉన్న మానసిక శక్తిని వెలికి తీసేదెలా ? మన ఆలోచనా విధానం మార్చుకొనేదెలా ? మనం నిర్దేశించుకున్న గమ్యస్థానాన్ని చేరేదెలా? వీటిని ధీటుగా ఎదుర్కొనే పరిష్కారాలు కావాలంటే మనకు మనం వేసికోవాల్సిన ఈ ప్రశ్నలే మన ఎదుగుదలకు కచ్చితమైన సమాధానాలు చెప్తాయ్!
చదువులైనా,పోటీ పరీక్షలైనా,ఉద్యోగ ఇంటర్వూస్ అయినా,వ్యాపారాలైనా మొదట మనపై మన నమ్మకాన్ని పెంచుకోవాలి కానీ ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని ఎందుకు తక్కువ చేసికోవాలి !
మన భవిష్యత్ కోసం మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు ఇతరుల గురించి మనకెందుకు అనవసరపు ఆలోచనలు !
నీ భవిష్యత్ కోసం నీవు చేయదలచుకున్నలేదా చేస్స్తున్న పని పట్ల, ప్రయత్నం పట్ల నమ్మకం వున్నప్పుడు ఇతరులు నీకు పోటీ అని నీవు ఎందుకనుకోవాలి !
అసలు నిన్ను,నీ జ్ఞానాన్ని ఇతరులతో పోల్చి చూసుకొని నిన్ను నువ్వు తక్కువ చేసికోవటం సరైన విధానమేనా!
నీకు తెలియనివి తెలిసి కోవటానికి అనేకానేక సాంకేతిక సాధనాలు అందుబాటులో నీ ముందర ఉంటే నీ కెందుకు కుంగుబాటు!
గెలిచినా ప్రతిసారి మరో గెలుపుకు కృషి చేసే నువ్వు ఓడిన సందర్భాలలో ఓటమి తాలూకా మూలాలు వెదకి పెద్దలు లేదా అనుభవం కలిగిన వారి సలహా సంప్రదింపులతో ముందుకడుగు వేయలేవా!
విజయం మొదటి దశ కాదని ఓటమి చివరి దశ కాదని నీకు తెలియదా? పడ్డ ప్రతిసారి పట్టుదలతో పైకి లేచిన వారి గురించి నీకు తెలుసా !
అసలు నీలాగానే ఇతరులు కూడా ఆలోచిస్తున్నారేమో! నీకేమి తెలుసు?
మనం నిర్దేశించుకొన్న మార్గాన్ని ప్రణాళికబద్దంగా రూపొందించుకొని ఏది ముందు ఏది తర్వాతా అనే ప్రాధాన్యతలతో ప్రయత్నాలు జరపాలనేది వాస్తవం కాదా!
మన కృషి, మన ఆచరణ మనకు అండగా వున్నప్పుడు మన మెందుకు ఆత్మన్యూనతా (Inferiority Complex) భావనలకు లోను కావాలి ఆలోచించండి!

మనలో అంతర్లీనంగా దాగున్న మన మానసిక అణు శక్తే మనల్ని విజయతీరాల వైపు నడిపిస్తుంది. అందుకే మన అంతః శక్తితో మనం పోటీ చేయగలిగేతే బాహ్య ప్రపంచంలో మన మనుకున్న ఏ లక్ష్యాన్నైనా అవలీలగా సాధించగలం. “గూడుకట్టే ప్రతి ప్రయత్నంలో ఎన్నో పర్యాయాలూ క్రింద పడి లేచే సాలీడు అంతిమంగా గూడు కట్టి తీరుతుంది. అద్భుతమైన ఆలోచనలకు నిలయమైన మన మనసు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుందనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు ! కోరికా నీదే , ప్రయత్నం నీదే, ఫలితం నీదే అందుకే అందుకే నీకు నీవే పోటీ ! నీకు నేవే సాటి ! ”

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked