సారస్వతం

పౌరికుడు

-శారదాప్రసాద్

ధర్మరాజు ! ” పితామహా ! చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. మరి కొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మరి వారిని గుర్తించడం ఎలాగో వివరించండి ” అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ” ధర్మరాజా! నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను.శ్రద్ధగా వినుము! పురిక అనే పట్టణాన్ని పౌరికుడు అనే రాజు పాలించే వాడు. ఆ రాజు చాలాక్రూరుడు. అతడు మరణించిన అనంతరం ఒక నక్కగా పుట్టాడు. పూర్వ జన్మజ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసావ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కిశల్యమైంది. అది చూసిన తోటి నక్కలు ” ఇదేమి వ్రతం? మాంసాహారులం అయిన మనం ఇలా శాకములు తిన వచ్చా ? ” అని అడిగాయి . అందుకు నక్క బదులు చెప్పలేదు. ఈ విషయం తెలిసిన ఒక పులి నక్క వద్దకు వచ్చి ” నక్కా ! నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను. నువ్వు నాతో స్నేహం చెయ్యి లోకం అంతా నన్ను క్రూరుడు అంటున్నది. నీవు నా పక్కన ఉంటే ఆ పేరు సమసి పోతుంది ” అని చెప్పింది. పులిరాజా ! నాకు ఈ లోకంలో ఆశలు లేవు కనుక నా మాటలు నీకు ఇంపుగా ఉండవు, అయినా నేను నీ వెంట ఉంటే నీకు నాకు తోచిన మంచి మాటలు చెప్తుంటాను. నాతో నీ స్నేహం నీ వారికి అసూయ రగిల్చి నీ మీద కోపం పెంచుకుంటారు. నీవు అది లక్ష్యం చెయ్యనని నాకు మాటిస్తే నేను నీతో స్నేహం చెయ్యగలను ” అన్నది. పులి అందుకు అంగీకరించి నక్కతో స్నేహం చేసింది. అది ఇష్టపడని మిగిలిన పులులు వారిరువురి మధ్య భేదం కల్పించాలని ఒక నాడు పులి తినవలసిన మాంసమును నక్క గుహలో పెట్టాయి. పులి వద్దకు వెళ్ళి నీ మాంసమును నక్క దాచింది కనుక నీవు నక్కను చంపు” అని చెప్పాయి. పులి ఆమాటలను నమ్మి నక్కను చంపమని దేశించింది. కాని పులి యొక్క తల్లి ఆ మాటలు నమ్మక ” కుమారా ! నీవు చెప్పుడుమాటలు విని తప్పు చేస్తున్నావు. నక్కను గురించి తెలియక నీవు దాని మీద నింద వేస్తున్నావు. కాని నక్క నీ వారి మీద ఇలాంటి మాటలు చెప్పిందా ! నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్ళు వారి మాటలకు వినవద్దు. బుద్ధి మంతులను చూసి బుద్ధిహీనులు, అందగాళ్ళను చూసి అందహీనులు, అధికులను చూసి హీనులు అసూయ చెందడం సహజం. రాజువైన నీవు తొందర పడకూడదు. కుమారా ! ఒక్కోసారి ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. తెలివి కలవాడు వాటి తారతమ్యం ఎరిగి నడవాలి. నక్క గురించి నీకు బాగా తెలుసు. ఆ నక్క కేవలం మాంసం కొరకు నన్ను వంచిస్తుందా. నీ సేవకుల మాటలు నమ్మి నక్కను చంపమని చెప్పడం భావ్యమా ! రాజైన వాడు కూలంకుషంగా విచారించి నిర్ణయించాలి కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు ” అని తల్లిపులి బోధించింది. ఆ తరువాత అక్కడకు వచ్చిన నక్క జరిగినది తెలుసుకుని ” పులిరాజా ! నన్ను ముందు అందరి ఎదుట మంచి వాడని మెచ్చుకున్నావు. నాతో స్నేహం చేసే ముందు నీ వారి చెప్పుడు మాటలు వినను అని చెప్పి ఇప్పుడు వారి మాట విని నన్ను చెడ్డ వాడని నమ్మావు. నీవు మాట తప్పావు కనుక నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు నేను ఇక వెడతాను ” అని చెప్పి నక్క అక్కడ నుండి వెళ్ళి నిరాహార దీక్షచేసి ప్రాణత్యాగం చేసి పుణ్య లోకాలకు వెళ్ళింది. కనుక ధర్మరాజా ! రాజు ఎప్పుడూ చెప్పుడు మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకొనరాదు. చక్కగా విచారించి నిర్ణయాలు తీసుకోవాలి ” అని చెప్పాడు.ఈ కథ వర్తమాన పరిస్థితులకు బాగా అన్వయిస్తుంది!ఇప్పుడున్న రాజులు (ముఖ్యమంత్రులు) అందరూ పొగడ్తలకు పొంగి ,అవసరాల కోసం పొగిడేవారిని ఉన్నత స్థానాల్లో కూర్చుండ పెడుతున్నారు!ఇటువంటి వారు పనిచేసేది,వారి స్వార్ధం కోసమే!తమ అక్రమ సంపాదన కోసం ముఖ్యమంత్రులకు తప్పుడు సలహాలు ఇస్తుంటారు!ఫలితంగా శిక్ష అనుభవించేది ముఖ్యమంత్రి ,అతని ప్రభుత్వం!పొగడ్తలకు లొంగని మనుషులు సాధారణంగా ఉండరు.ఆ పొగడ్తలను నిజమని నమ్మి గర్వాంధకారంతో,స్వయంకృతాపరాధాలతో ,ప్రజలను కూడా వంచించి ,ప్రజల చేతిలో ఘోరంగా ఓడిపోతారు ముఖ్యమంత్రులు !పొగిడేవారందరూ మిత్రులు కారని, విమర్శించేవారందరూ శత్రువులు కారని రాజు గుర్తించాలి!పొగడ్తలకు పొంగిపోయేవాడిని ,మనం కూడా నమ్మకూడదు!భారతంలో లేని కథ ఉండదు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.నమ్మనివారి ఆశ్రయాన్ని వెంటనే వదిలేయాలి! నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా సరిపోయే చక్కని నీతి కథ ఇది!

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁ గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడిదున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ.
అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుటకన్న,చుఱుకైన యెద్దులను గట్టుకొని పొలము జీవించుటయే మేలు.

శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked