-అమరనాథ్ జగర్లపూడి
దుక్కి దున్నందే మొక్క మొలవదు! ప్రయత్నం చేయకుండా ఫలితం రాదు! జయానికి, అపజయానికి మూలాలివే. ప్రతి విజయం వెనక నిరంతర సాధన, ప్రతి అపజయంలో జయం సాధించటం వెనుక పట్టు వదలని దృఢ నిశ్చయం అనేది మరవద్దు! అపజయం అనేది ప్రతికూలం (నెగటివ్) కాదు తిరిగి ప్రయత్నం చేయకపోవటమే నిజమైన అపజయం. ఇది ప్రతి విద్యార్ధి , ప్రతి యువకుడు ఖచ్చితం గా మనస్సులో బలంగా ముద్ర వేసుకొని ప్రయత్నాలు ప్రారంభించాలి.
నేటి విద్యార్ధి, యువత చదువుల్లో మరియు ఉద్యోగాల్లో ఉద్వేగాలకు ముగింపు చెప్పే సమయం ఆసన్నమైంది. దానికి తగ్గట్టుగా ధీటుగా చదువుల్లో నైనా,ఉద్యోగ ప్రయత్నాలలోనైనా పట్టువదలని కృషి పెరగవలసిన ఆవశ్యకం ఎంతైనా వుంది. ముఖ్యంగా విద్యార్థులైనా, యువకులైనా అవసరమైనప్పుడే అవగాహన పెంచుకుంటే చాలానే అభిప్రాయాలకు అడ్డుకట్ట వేసి నిత్య సాధన ద్వారా అనుకున్న ఫలితాలను అవలీలగా సాధించ వచ్చు .ఉదాహరణకు” ఈ రోజు పని రేపటికి వాయిదా వేస్తే రేపు రెండురోజుల పని చేయవలసి వస్తుందనేది చైనా సామెత” అవసరమైన విషయాలలో అవగాహన అలవరచుకోవాలంటే విద్యార్ధి దశ నుండే చేసే సాధనే సంపూర్ణమైన విజయాన్ని అందచేస్తుందనేది తిరుగులేని సత్యం!
పరీక్షలలో కానీ ఉద్యోగ ఇంటర్వూస్ లో కానీ ఒత్తిడికి గురికావటానికి ప్రధాన కారణం వాయిదా పద్దతులలో చేసే సాధనే ప్రధాన కారణం.నేటి ఈ పోటీతత్వ ప్రపంచంలో ఏదో సాధించాలనే తపన ఒక్కటే సరిపోదు. కార్యాచరణంలో ప్రణాళికా బద్దమైన సాధన లేకపోతె చేతికి అందాల్సిన అవకాశాలు పోతాయి. “కోరికనేది అమూల్యమైనది కానీ దానికి ఆలశ్యం అనేది తగిలితే జీవితంలో చెల్లించాలిసిన మూల్య భారీగా ఉంటుంది.
ముఖ్యంగా విజయం అందుకోవడంలో వెనకపడటానికి ఇంకొక ముఖ్య కారణం మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ మనకంటే ఎదుటివారిలోనే నిపుణతల స్థాయి ఎక్కువగా ఉంటాయనే భ్రమల మధ్య నలగటం. వాస్తవంలో ఇది నిజంగా మన ఎదుగుదలకు గొడ్డలిపెట్టే . ఎందుకంటె ప్రపంచంలో ఎవరు ఏ విషయంలోనైనా విజయం సాధించిన దాని వెనుక వున్నా ఒకే ఒక మహత్తర శక్తి క్రమశిక్షణ తో పట్టువదలని నిత్య సాధనే అనేది తిరుగులేని వాస్తవం. అందుకే జీవితంలో మొదట మన మీద మనం నమ్మకం పెంచుకోవాలి అందుకే మనం ఏ పనిని ప్రారంభించినా అది ఆరంభ శూరత్వంగా కాకుండా నిరంతంర సాధన వలన మనలో ఆత్మస్తైర్యం పెరగటమే కాకుండా మనలో ఉన్న భయం స్థానంలో జయం వచ్చి కూర్చుంటుంది.
అసలు భయం తాలూకా మూలలను కూడా ఒక్కసారి తెలుసుకుంటే మనలో ఉన్న అనేకానేక అనుమానాలను కూడా పటాపంచలు చేసినట్లుంటుంది. ఏ విధంగా వీటిపట్ల మన అవగాహన పెరగాలి ? ఏ విధంగా వీటిని అధిగమించాలి ?ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం మనలోని మన మనసే దాని పైనే ఈ భయం తాలూకా ముద్రలు. (మన మెదడులో నిక్షితప్తమైన భయం తాలూకా ఆలోచనలు) అందుకే అభివృద్ధి వైపు అడుగు వేసే ప్రయత్నంలో భాగంగా మన పట్ల, మనం చేసే పని పట్ల స్పష్టమైన అవగాహన పెంచుకోవటం. మన పైన మనకు పెరిగే ఈ నమ్మకమే అపజయాల్ని ఆమడ దూరం లోకి విసిరేస్తుంది. వాస్తవంగా గమనిస్తే తమ పట్ల తమకు నమ్మకం లేనివారే ఎక్కువగా ఈ భయాలకు లోనౌతూ అందాల్సిన విజయాలను దూరం చేసుకుంటుంటారు. దీని వలన మానసిక సున్నితత్వం పెరిగి చిన్న చిన్న అపజయాలను తట్టుకోలేని స్థితికి మనిషి మానసిక స్థితి తయారౌతుంది.
దీనికి మనకు మనంగా నిజాయితీగా వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు మన జీవన చిత్రాన్ని సమూలంగా మార్చటమే కాదు మనల్ని అనుకూల దృక్పధం వైపు నడిపించి జీవితాన్ని జయంతో జత పరుస్తుంది ఇవి ఒక్కసారి చూడండి.
మనం చేసే ఏ పని పైనైనా మన అవగాహన ఏమిటి?
చేయ బోయే పని పట్ల మన ఇష్టత యెంత శాతం వుంది?
అనుకున్న పనిని సాధించటానికి మన ప్రాధాన్యతలు ఏమిటి? ( టైం టేబుల్ )
అనుకున్న పనిని సాధించటానికి మన సాధన ఏ రీతిలో జరుగుతోంది?
రోజు మొత్తంలోని సమయంలో యెంత సమయం మనం మన పని పట్ల నిమగ్నమై వున్నాం?
మనలో పెరిగే అవగాహనను ఎప్పటికప్పుడు మనకు మనం పరిశీలించుకుంటున్నామా?
సామాజికంగా ,సాంఘిక అంశాలపై మనకున్న పట్టు ఏమిటి?
మన ప్రయత్నంలో మన కొచ్చే సందేహాలను నిపుణుల సహాయంతో నివృత్తి చేసుకుంటున్నామా?
మన అని అనుకున్నవారితో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఎలా వున్నాయి?
సెల్ ఫోన్స్ లేదా ఇతర ఎలక్ట్రికల్ గాడ్జెస్ మీద అనవసరం గా యెంత సమయం వృథా చేస్తున్నాం?
మనకున్న కమ్యూనికేషన్స్ స్కిల్స్ (భావ వ్యక్తీకరణ నిపుణత ) ఎలా వున్నాయి ?
ఫై ప్రశ్నలకన్నింటికీ సమాధానాలు మన ముందరే వున్నాయి అవి పాఠ్యపుస్తకాలు,వార్తా పత్రికలూ, మన అవగాహన పెంచే వెబ్ సైట్స్,మన పెద్దలు,మన మిత్రులు, జ్ఞానానికి భాండాగారమైన అమూల్యమైన పుస్తకాలు కావచ్చు. ఏ విజయమైనా తనంతట తానుగా వచ్చి మనల్ని వరించదు. దానికి మానసికంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాధించి తీరాలనే పట్టుదలే మనసులో బలంగా నాటుకొని ప్రయత్నాలు ప్రారంభించాలి. మన ముందర అత్యున్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తులను ఒక్క సారి పరిశీలించండి! అవకాశం ఉంటే పలకరించండి! ఏ ఒక్కరూ కూడా కృషి సాధన లేకుండా పైకి వచ్చామని చేబుతారేమో చూడండి! అందుకే మన ముందరున్న ప్రతి అవకాశాన్ని సానుకూలంగా ఉపయోగించుకుందాం అప్పుడు మీరే అంటారు భయం లేదు జయమే మనదే అంటారు!
అమరనాథ్ జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257