సారస్వతం

శ్రీ వారాహీ దేవి

-శారదాప్రసాద్

కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ
వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!!
ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!!
తా|| శ్రీవారాహీ దేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు(అష్టభుజ) కలిగి ఉంటుంది.

వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశమహావిద్యలలో ఒకామెగా కొలుస్తారు. ఈమె వరాహ(పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీ దేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి.

శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ(పంది) రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు.

వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సైన్యాధిపతి,దండనాధ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గునపం, అభయ వరదాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి,మాహేశ్వరి, కౌమారి,వైష్ణవి, వారాహి.,ఇంద్రాణీ,చాముండి, వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు.వారాహి దేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది.లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం ఉండటం కనిపిస్తుంది. వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా , తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం.ప్రతి మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో…శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది.

గుర్రము, సింహము, పాము, దున్నపోతు,గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపూర్ (చెన్నై)లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూ గృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్లిన తర్వాత నేల పై రెండు కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది . ఒక రధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు.అయితే ఇటీవల కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టు బట్టారు. లేదంటే సుప్రీం కోర్టుకు వెలుతామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు. వారు భూ గృహంలో కి వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చబోయారు. అటు పై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూ గ`హంలోనుంచి బయటకు తీసుకువ చ్చేశాడు. అటు పై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. ‘ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్ర కళ, లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది. అందువల్లే చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువ సేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్చబోయారు. ఆ ఉగ్ర కళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్లే తెల్లవారుజాము 4.30 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రం వారాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అదీ కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామ చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట!అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసి వేసి ఉంటారు. సాధారణంగా ఉగ్ర రూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి , తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడిని ఉదయం, సాయంత్రం పూట మనం కొంత వరకూ చూడగలం. అదే
మధ్యాహ్న సమయంలో మనం చూడలేము కదా?అన్నది ఇక్కడి పండితుల వాదన. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలు దేరి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజాము
4.30 గంటలకు భూగృహంలోకి వెళ్లి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు.వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు వెళ్లడానికి ముందు ఎడమ వైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు. పడవలో వెళ్లేవారు మన్ మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారి పైకి వెళ్లితే కుడి వైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది.ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం.
(సోర్స్ –శ్రీ నండూరి శ్రీనివాస్ గారి వీడియో ప్రసంగం)

శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on శ్రీ వారాహీ దేవి

శారదయామిని said : Guest 6 years ago

చక్కని విషయాలను ఆసక్తికరంగా చెబుతున్నందుకు ధన్యవాదాలు

  • హైదరాబాద్