అష్టవిధ నాయికలు – విప్రలబ్ధ
– టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమయ్య కీర్తించిన విప్రలబ్ధ శృంగార కీర్తన తెలుసుకునే ముందు విప్రలబ్ధ నాయిక గురించి కొంత తెలుసుకుందాం. “క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా| స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||” అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో చెప్పాడు. “ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు” అని అర్థము. భానుదత్తుడు రసమంజరిలో “సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|” – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయును’ – అని ఈ లక్షణమును వివరించాడు. నాట్యశాస్త్రములో భరతుడు కూడా ఈచేష్టలద్వారానే విప్రలబ్ధ తన యవస్థ నభినయించవలెనని తెల్పినాడు.
పై శ్లోకాల వివరణలు గమనిస్తే విప్రలబ్ద అనే శృంగార నాయిక, సంకేత స్థలానికి ప్రియుడు రానందుకు వ్యాకులపడే నాయిక, మోసగించబడినది గా భావించవచ్చు. ఈమె రాత్రంతా ప్రియుని కోసం వేచియున్న నాయికగాను మరియూ ప్రియుడు నమ్మించి రానందుకు కోపగించి ఆభరణాలను విసిరిపారేసే వనితగాను చిత్రకారులు చిత్రిస్తూ ఉంటారు.
ఇక్కడ అన్నమయ్య మనకు విప్రలబ్ధ అయిన నాయిక చెలికత్తెలతో తనగోడు చెప్పుకునే విధానాన్ని వివరిస్తున్నాడు. చూడండి.
కీర్తన:
తానెంత మన్నించినాను తన చిత్తమింతే కాక
నేనే నా యంత వలపు నెరపఁగవచ్చునా ॥పల్లవి॥
చ.1. తలఁపు గలిగితేను తానే వచ్చీఁగాక
బలిమిఁ దన్నుఁ బిలిచేపాటి దాననా
అలరి దయవుట్టితే నాదరించీఁగాక నన్ను
కలికితనాల దన్ను గరఁగించ నేర్తునా ॥ తానెంత ॥
చ.2. చుట్టరిక మెంచి నన్ను సొరిది నేలీఁగాక
వట్టి వినయాలఁ దన్ను వంచఁగలనా
అట్టె తనవేడుకకు నంటిపెనఁగీఁగాక
గుట్టుతోడ మెప్పించి కొసర నావసమా ॥ తానెంత ॥
చ.3. మొగమోటమునఁ దానే ముంచి కాఁగిలించీఁగాక
నగుతాఁ గొనగోరఁ జెనకవచ్చునా
తగ శ్రీవేంకటేశుఁడు తానే నన్ను నేలెఁగాక
జిగిమించి తన్ను రట్టు సేయఁగ సంగతా ॥ తానెంత ॥
(రాగము: పాడి, 28-534 రాగిరేకు 1891)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక విప్రలబ్ధ యైన పద్మావతీదేవి, నాయిక చెలికత్తెలతో నాయకునికి గురించి తెలియజేసే సన్నివేశం.
పల్లవి: తానెంత మన్నించినాను తన చిత్తమింతే కాక
నేనే నా యంత వలపు నెరపఁగవచ్చునా
చెలులారా! చూశారా! తనను నేను ఎంత గౌరవిస్తున్నానో మీకు తెలియనిది కాదు కదా! శ్రీవారి చిత్తము నెరుగక నేను వలపు సందేశాలు పంపించ వచ్చునా! అని అమ్మవారు పద్మావతిదేవి చెలికత్తెలతో తనంత తాను వచ్చి నన్ను చేపట్టడంలేదని వాపోతున్నది.
చ.1. తలఁపు గలిగితేను తానే వచ్చీఁగాక
బలిమిఁ దన్నుఁ బిలిచేపాటి దాననా
అలరి దయవుట్టితే నాదరించీఁగాక నన్ను
కలికితనాల దన్ను గరఁగించ నేర్తునా
ఒకవేళ నామీద కోరిక, యిష్టం ఉన్నట్లయితే తానే విచ్చేయవచ్చుగదా! నాకై నేను తనను ఔదార్యంతో పిలవడం కుదురుతుందా చెప్పండి. నామీద ప్రేమ, యిష్టం, దయ ఉంటే నన్నాదరించి తీరుతాడు కదా నా స్వామి. నేనే స్వామిని మోహింపజేసేవిధంగా ప్రవర్తించడం సబబేనా? నా కౌగిట్లో కరిగించాలనుకోవడం ఎంతమాత్రం ఒప్పో చెప్పండి అని అడుగుతోంది నాయిక.
చ.2. చుట్టరిక మెంచి నన్ను సొరిది నేలీఁగాక
వట్టి వినయాలఁ దన్ను వంచఁగలనా
అట్టె తనవేడుకకు నంటిపెనఁగీఁగాక
గుట్టుతోడ మెప్పించి కొసర నావసమా
నేను వరుస అవుతానుకదా చుట్టరికమునెంచైనా నన్ను జేరవచ్చును గదా! వినయంతో అతన్ని లొంగదీసుకోవడం బావుంటుందా? తను వేడుకతో నన్ను కూడడం బావుంటుంది కదా! అలా కాక గుట్టుగాను, మోసంతోనూ విజృంభించిన కోరికలతో స్వామిని చేరడం ఏమైనా మర్యాదగా ఉంటుందా?
చ.3. మొగమోటమునఁ దానే ముంచి కాఁగిలించీఁగాక
నగుతాఁ గొనగోరఁ జెనకవచ్చునా
తగ శ్రీవేంకటేశుఁడు తానే నన్ను నేలెఁగాక
జిగిమించి తన్ను రట్టు సేయఁగ సంగతా
దాక్షిణ్యం చూపి తానే వచ్చి నన్ను కౌగలించుకోవడం ఎంత బావుంటుంది చెప్పండి? అలాకాక నవ్వుతూనే గోటగిల్లడం సబబేనా? శ్రీవేంకటేశ్వరుడు తానే వచ్చి నన్ను ఏలిన ఎంత బావుంటుంది. కాంతులీనే నాస్వామిని మోహంతో నేను రచ్చకీడ్చడం ఎంతవరకూ సరీయిన విషయమో చెప్పండి అని చెలికత్తెలను అడుగుతోంది అమ్మ పద్మావతి.
ముఖ్యమైన అర్ధాలు: మన్నించు = గౌరవించు; నెరపుట = నెరవేర్చుట, నింపు, వ్యాపింపజేయు; తలపు = కోరిక; బలిమి = ఔదార్యం; అలరి = ఇష్టము, సంతోషము; కలికితనము = చక్కదనం; కరగించు = కరుగజేయడం, లొంగదీసుకోవడం; సొరిది = వరుస, క్రమము; పెనగు = కలియు, కూడు; గుట్టుతోడ = వంచనతో; కొసరు = విజృంభించు, ఏదైనా కొన్నపుడు అధికంగా వేసే కొసరు అర్ధం ఇక్కడ సరిపోదు; మొగమాటము = దాక్షిణ్యము; గోరజెనకు = గోటగిల్లు; జిగిమించు = కాంతులీను, ప్రకాశము; రట్టుసేయు = రచ్చకీడ్చు, నవ్వులపాలుసేయు.
-0o0-