సత్యమేవ జయతే
సమీక్షకుడు – తాటిపాముల మృత్యుంజయుడు; రచయిత – సత్యం మందపాటి
మంచి రచన చేయడం అంత సులభమేమి కాదు. మెప్పించే రచనలు చేస్తూ ఒక మంచి రచయితగా పేరొందడమంటే ఆషామాషి వ్యవహారం అసలే కాదు. మందపాటి సత్యంగారు మంచి రచయితల కోవలోకి వస్తారు. నేను అమెరికాలో అడుగుపెట్టి సమయం దొరికించుకొని తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొన్న పాతికేళ్ళ నుండి వారి సాహిత్యంతో నాకు పరిచయం ఉంది. వైవిధ్యమైన రచనలు చేయడంలో వారిది అందె వేసిన చెయ్యి.
పాఠకులను ఆకట్టుకొనే రచనలు చేయాలంటే రచయిత అందరి మనుసుల్లాగే జీవిస్తూ సమాజాన్ని ‘ఓరకంట (Special Eye)’ నిరంతరం పరికిస్తూ ఉండాలి. అలా చేస్తే, కథ వస్తువులకు సరిపడే ముడిసరుకు లభ్యమవుతూనే వుంటుంది. ఈ పుస్తకం ‘సత్యమేవ జయతే’ ముందు మాటలో రచయిత ఉటంకించినట్టు, నిత్యసత్యమైన అనేక విషయాలపై కాసిన్ని హాస్య రచనలు చేయడం జరిగింది. వ్యంగ్యాస్త్రాలను సంధించడం జరిగింది. అప్పుడప్పుడు ఆవేదన వెలిబుచ్చారు. కాని, ఎల్లప్పుడు సునిశిత హాస్యం జోడిస్తూనే పాఠకుణ్ణి హుషారు చేసే ప్రయత్నం చేసారు.
అమెరికా దేశ రాజకీయాలు, మూడు తరాలుగా అమెరికా తెలుగువారి జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో అదుపులేకుండా వ్యాపిస్తున్న కులగజ్జి, విషపు నాలుకలు చాస్తు భూగోళాన్ని ఆక్రమిస్తున్న ఉగ్రవాదం, ‘ఆస్ట్రేలియా’ పేరుకు కారణభూతుడైన మన తమిళ తంబి, తెలుగు భాషకు మన తెలుగువారితోనే పడుతున్న తెగులు… ఇలా ఒకటేమిటి నాలుగు వందల పేజీల నిండా మిమ్మల్ని చదివించే సరుకు ఉంది.
కాని ఒక విషయంలో మాత్రం జాగ్రత్త సుమా! మీరు రైల్లోగానీ, విమానంలోగానీ ఈ పుస్తకం చదువుతున్నప్పుడు కిసుక్కుమని నవ్వే సందర్భాలు చాలా వస్తాయి. ఎందుకైనా మంచిది, పక్కనున్న తోటి ప్రయాణీకునికి ముందే చెప్పి పెట్టండి. లేకుంటే ఏవైనా అపార్థాలకి దారి తీయవచ్చు.
ఈ పుస్తకాన్ని కొనదల్చుకొన్న వారు, నేరుగా రచయితని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించండి.
E-Mail: satyam_mandapati@yahoo.com
***