నవలారచనలో మకుటం లేని మహారాణి… యద్దనపూడి సులోచనారాణి జ్ఞాపకాలివి
(ఈనాడు ఆదివారం అనుబంధంలో.. 2004 మే నెలలో ప్రచురితమైన, కథనం)
(మిత్రుడు రవిప్రసాద్ ఆదిరాజు సౌజన్యంతో)
పదో తరగతితోనే చదువు ఆగిపోయినా… చుట్టూ ఉన్న సమాజాన్నే ఆమె నిరంతరం అధ్యయనం చేశారు. ఆ నిశిత పరిశీలనలో ప్రాణం పోసుకున్న పాత్రలే ఆమె నవలల్లోకి నడిచి వచ్చాయి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలారచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందిన ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి… యద్దనపూడి సులోచనారాణి. రచయిత్రిగా ఆదర్శాలు వల్లించడమే కాకుండా స్వయంగా సామాజిక సేవకూ నడుం బిగించిన సులోచనారాణి సాఫల్యాలతోపాటు వైఫల్యాలనూ చవి చూశారు. తన జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలకు ఆమె ఇచ్చిన అక్షరరూపమిదీ…
చిన్నప్పటి నుంచి నాకు మే నెల అంటే చాలా ఇష్టం. సహజంగా ఆ నెల్లో మండే ఎండలకి అందరూ హుష్షూ-హుష్షూ అంటూ హైరానా పడిపోతూ ఎండలను తిట్టకుంటారు. నేను మాత్రం సంవత్సరం మొత్తం మీద రాక రాక వచ్చే మామిడి పళ్లు, మల్లెపూల కోసం ఆత్రుతగా ఎదురు చూసేదాన్ని. నా మొదటి కథ ‘చిత్ర నళినీయం’ ఆంధ్రపత్రిక వారపత్రికలో 1956 మే నెలలోనే ప్రచురితం అయింది. మే నెలపై ప్రత్యేక ఇష్టం ఏర్పడటానికి ఇది మరో కారణం.
అప్పటికి నేనింకా చీరలు కట్టడం లేదు. పరికిణీ-ఓణీ వయసే. ఆ రోజు ఆంధ్రపత్రిక సెంటర్ స్ర్పెడ్‌లో ‘యద్దనపూడి సులోచనారాణి’ అని ప్రప్రథమంగా నా పేరు చూసుకుని పొందిన ఆనంద స్మృతి పరిమళం నా మనసులో శాశ్వతంగా ఉండిపోయింది. కథ పడటమే కాదు.. రెండు వారాల తర్వాత పత్రిక నుంచి 15రూపాయల పారితోషికం నన్ను వెతుక్కుంటూ రావటం మరింత ఆనందం కలిగించింది. మొట్టమొదటిసారిగా నేను ‘యద్దనపూడి సులోచనారాణి’ అని సంతకం చేసి అందుకున్న డబ్బు అది.
మాది సమిష్టి కుటుంబం. అమ్మనాన్నలకి ఆఖరి సంతానంగా… అమ్మమ్మకి గారాల మనమరాలిగా… ఐదుగురు అక్కయ్యలు-బావలు, ముగ్గురు అన్నయ్యలు-వదినలు, పిన్నులు-బాబాయిలు, అత్తయ్యలు-మామయ్యలు, ఇరుగుపొరుగు బంధువులు. అది చిన్నపాటి సంఘంలా ఉండేది. నాకప్పటికి బాధలు, దరిద్రాలు, అసంతృప్తులు, త్యాగాలు, రోదనలుండే ప్రపంచం గురించి అస్సలు తెలియదు. మా ఊరికి ప్రప్రథమంగా జిల్లా పరిషత్ హైస్కూలు వచ్చింది. నేను దాని మొదటి బ్యాచ్ స్టూడెంటుని. ఆ సంవత్సరమే (1956) ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు రాశాను. మా ఇంట్లో ముగ్గురు అన్నయ్యల తర్వాత నేనే ఇంగ్లిషు బాగా రాయగలగటం, అర్థం చేసుకోగలిగి, చదవడం(మాట్లాడటం రాదు) వచ్చినదాన్ని. క్లాసులో ఇంగ్లిషులో, తెలుగులో నేనే ఫస్ట్(లెక్కల్లో అత్తెసరు మార్కులే).
నేను పుట్టిన ఊరు కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ. అదో కుగ్రామం. ఊరినిండా చెరువులు. వాటిల్లో ఎరుపూ తెలుపూ తామరపూలు. పండగలు వస్తే ముస్తాబు అయి గుళ్లకి పరిగెత్తటం, అట్లతద్ది వస్తే పిల్లలందరం పెరట్లో తులశమ్మ చెట్టు దగ్గర గోరింటాకు పెట్టుకుని, తెల్లవారుజామున లేచి పరుగులు తీస్తూ ఆడటం, ఉయ్యాలలు ఊగటం… ఇట్లా పెద్దవాళ్ల గారాబంతో, నా సమవయస్కులైన అక్కయ్య కొడుకులు, కూతుళ్లతో కథలు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ బతికేస్తుండగా… ఒకసారి నేనే స్వయంగా కథ రాసి రహస్యంగా అక్క కొడుకుల చేత ఆంధ్రపత్రిక వీక్లీకి పంపిస్తే… అది ప్రచురితం అవడమే కాకుండా, నాకు పేరు, డబ్బూ తెచ్చి పెట్టింది.
పల్లెటూరులో 15 సంత్సరాలు నిండుతున్న అలా నాకు పేరు, డబ్బు రావటం… అసలు ఈ ప్రపంచంలోగానీ, జీవితంలోగానీ ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకేదీ ఉండదేమో అనుకున్నాను. ఆనందం పట్టలేక ఆ పత్రికను గుండెలకి హత్తుకున్నాను. ఆ తర్వాత పత్రిక గంటసేపు అందరి చేతుల్లోకి మారింది. మా ఇంట్లో అందరూ పుస్తకాల ప్రియులే. వాళ్లందరికీ, ఇది నమ్మలేనంత చిత్రంగా అన్పించింది. మా నాన్న చాలా సంతోషపడ్డారు. పంచాయతీ లైబ్రరీలో చదివిన నలుగురైదుగురు రైతులు వచ్చి నాన్నకి చెప్పటంతో ఆయన ఇంకా ఆనందపడ్డారు.
ఆ తర్వాత వెంటవెంట నా జీవితంలో విషాదాలు తరుముకు వచ్చాయి. నన్ను తన పక్కలో పడుకోబెట్టుకుని రామాయణ భాగవతాలను పాటల రూపంలో చెప్పి, కథలపట్ల ఆసక్తి కలిగించిన అమ్మమ్మ ఆ వేసవిలో పోయింది. తర్వాత ఏడాది తిరగకుండా నేనెంతో ప్రేమించే అమ్మ పోయింది. నన్ను హైదరాబాద్ అత్తవారింటికి పంపించివేశారు. పక్కా పల్లెటూరు నుంచి వచ్చాను. బస్తీ వాతావరణం. అత్తగారూ ఆడబడుచు పిల్లలూ… అంతా కొత్త వాతావరణం. ఇంకో ఏడాదిలో నాన్న గొంతు క్యాన్సర్‌తో పోయారు. అనుకోకుండా ఒంటరితనం (మానసికంగా) చీకటిలా వచ్చేసింది. బాగా అంతర్ముఖం అయిపోయాను. పుస్తకాలే ప్రియనేస్తాలు అయ్యాయి. కథలు రాయసాగాను. పత్రికకే పంపించేదాన్ని. నేను పంపగానే వాళ్లు వేసేవాళ్లు. వెంటనే మనియార్డర్ వచ్చేది.
తర్వాత రెండుమూడు వారాల పాటు నా కథ నచ్చిందంటూ పాఠకులు రాసిన ఉత్తరాలు వేసేవాళ్లు. వాటిని సంతోషంగా చదువుకునేదాన్ని. వాళ్లు నన్ను మెచ్చుకుంటుంటే, లీలగా కళ్లలోకి తడి వచ్చేది. మెల్లగా సంతోషం దగ్గరయింది. అమ్మా, నాన్న, అమ్మమ్మ పోయినప్పుడు ఏర్పడిన మానసిక శూన్యతలోకి అభిమానులైన పాఠకులు రాసాగారు. వాళ్లు ఎవరో నాకు తెలియదు. నా కథలు వాళ్ల హృదయాలని తాకితే, వారి అభిమానం నా మనసుని సేద తీర్చసాగింది. ఈ, కథలు చిన్న అలలుగా మొదలయ్యాయి.
తర్వాత ‘సెక్రటరీ’ రాశాను. అది నా మొదటి తెలుగు నవల. తెలుగు నవలా చరిత్రలో అదో ఉత్తుంగ తరంగం. అప్పటికి నాకు 23 సంవత్సరాలు. అప్పుడే నాకు అమ్మాయి పుట్టింది. తల్లిగా కొత్త అనుభూతి! ఉక్కిరిబిక్కిరి అయ్యే సంతోషం. ప్రపంచంలో ఈ మాతృత్వపు సంతోషానికి ఇక ఏదీ సాటిరాదు అని నమ్మాను. ఊహు, ఇంకో కొత్త సంతోషం… నాకు మా అమ్మాయితో పాటు సెక్రటరీ నవల కవల పిల్ల అన్నట్టుగా నా హృదయంలోకి వరదలా వచ్చేసింది. ఆ నవలకి వచ్చిన పాపులారిటీ, ప్రశంసలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏకకాలంలో రెండు అద్వితీయమైన ఆనందాలు నా హృదయాన్ని పులకరింపజేశాయి. ఒకటి మా అమ్మాయి, రెండోది సెక్రటరీ నవల.
రెండుమూడేళ్లు గడిచాయి. మళ్లీ ‘జీవనతరంగాలు’ నవల. అది పాపులారిటీలో సెక్రటరీని మించిపోయింది. అదే సమయంలో వచ్చిన మరో నవల ‘మీనా’ కూడా పాఠకుల ఆదరణకు నోచుకుంది. ఓసారి నార్ల వెంకటేశ్వర్రావు గారు స్వయంగా మా ఇంటికి వచ్చి ‘జీవనతరంగాలు’ నవల రాబోయే కథ ఫారాలని కంపోజర్స్ ద్వారా డబ్బులిచ్చి స్మగుల్ చేయించుకుని పాఠకులు చదువుతున్నారని చెప్పారు. ఒక రైటర్ నవల ఆదరణకి ఇంతకంటే పడికట్టు రాయి ఏముంటుంది? ఆంగ్లంలో ఒకే ఒక రచయితకి ఇలాంటి పాపులారిటీ దక్కిందని చెప్పారాయన (ఆ రైటర్ పేరు మరిచిపోయాను). ఆ విధంగా, నార్ల వెంకటేశ్వర్రావుగారు ‘యువ’ చక్రపాణి గారిలాంటి పెద్దల ఆదరాభిమానాలు పొందటం నా అదృష్టంగా అన్పించింది. అప్పటికే ఆత్మీయులు, మనుషులు-మమతలు సినిమా కథల వల్ల నేను సినిమా కథా రచయిత్రిని కూడా అయ్యాను. నా చదువు మా ఊరి హైస్కూలుతోనే ఆగిపోయినా నా మనసు నిరంతర అన్వేషి. అందువల్లనే నా చుట్టుపక్కల మనుషుల్నీ వారి సాధక బాధకాల్నీ నిశితంగా గమనించటం, వివిధ రచనలు చదవటం ద్వారా తెలియనివి నేర్చుకోవడం నాకు అభ్యాసం అయింది.
నేను మీకింత వరకూ- నా అనుభవాల్లో విజయవంతమైనవే చెప్పాను. నా జీవితంలో అన్నీ అవే అనుకోకండి. అపజయాలు, నిస్పృహ కూడా ముఖాముఖీ ఎదుర్కొన్నాను. వాటితో బాగానే యుద్ధం చేశారు. వాటిలో ఒకటి ‘కోకిల’ ఆడియో క్యాసెట్ మేగ్‌జైన్. ఇది ఇండియాలోనే కాదు- బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్త ప్రయోగం అన్నారంతా! నాకెంతో ఇష్టమైనది! ఆడియో మేగ్‌జైన్ చేయడానికి ముఖ్య కారణాలు మూడు… ఒకటి అంధులు, రెండు వృద్ధులు, మూడు చదువురాని వర్గాలు. మేగ్‌జైన్ మంత్లీ. ఎనిమిది నెలలు వరసగా రిలీజ్ చేశాను. చాలా బాగుంది అని ప్రశంసల వర్షం కురిసింది. కానీ డబ్బు రాలేదు. నా దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. మార్కెటింగ్‌లో సున్నా క్యాటగిరీకి వెళ్లింది. మేగ్‌జైన్ ఆగిపోయింది. నేను నేర్చుకున్న పాఠం- ‘‘నాలో సృజనాత్మకత ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని మార్కెట్ చేసే ప్రణాళిక ఎంతో అవసరం’’.
ఎవరైనా సరే ఏదయినా కొత్తది స్టార్ట్ చేయాలి అనుకుంటే ముందు ఎంతవరకూ దాన్ని మార్కెట్ చేయగలం అని రీసెర్చ్ చేయాలి. ‘కోకిల’ ఆపేసిన తరుణంలో నేను చాలా నిస్పృహకి గురి అయ్యాను. అది ఓటమి కాదు. మార్కెటింగ్‌లో నా చేతకానితనం. ఆ విషయాన్ని త్వరగా అర్థం చేసుకుని, ఆ నిస్పృహ నుంచి బైటపడ్డాను. అందుకే ఏ విషయంలోనైనా మనం అపజయం పొందితే, ‘‘అసలేం జరిగింది! కారణం ఏమై ఉంటుంది? నేనెక్కడ తప్పు చేశాను?’’ అని మన గురించి మనం నిర్మొహమాటంగా, నిజాయితీగా విశ్లేషణ చేసుకోవాలి.
తర్వాత ఇంకో ఫెయిల్యూర్- చిన్నప్పటి నుంచి నాలో జాలి, సేవాభావం అధికంగా ఉండేవి. వీటికి నాలో బీజం పడటానికి వృద్ధురాలు అయిన మా అమ్మమ్మ, మధ్య వయసులో అంధత్వం వచ్చిన రెండో అక్కయ్య. పెద్దయి పేరుప్రతిష్ఠలు వచ్చిన తర్వాత, ఇన్ని సంతోషాలు, సుఖాలు సులువుగా పొందేసిన నేను, అవి లేనివారికి ఏదయినా చేశానా అని నాకు నేను ప్రశ్నించుకునేదాన్ని. నిరుపేదలకు ఏదో ఒకటి చేయాలని నిరంతరం తపన పడేదాన్ని. అందుకే ‘విన్’ (విమెన్ ఇన్ నీడ్) అనే సేవా సంస్థను స్థాపించాను. దాని ముఖ్యోద్దేశం- వృద్ధులైన స్త్రీలకి, పేద తరగతి మహిళలకి, పిల్లలకి అవసరమైన సాయం చేయటం. హెల్పేజ్ ఇండియా వారు వచ్చి చూసి, దీన్ని పెంచమనీ భారీగా గ్రాంట్ ఇస్తామనీ చెప్పారు. ఒక చిన్న పాఠశాల (మా వరండాలోనే) ఏర్పరిచి పనిపాటలు చేసుకునే వారి పిల్లలకి నేనే చదువు చెప్పసాగాను. అనతికాలంలోనే దానికి బాగా ఆదరణ, పేరుప్రతిష్ఠలు వచ్చాయి.
ఆ టైమ్‌లోనే నా కన్నుకి క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది. అది పూర్తిగా సక్సెస్ కాకపోగా అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాను. సంస్థని చూడమని ఒకామెకి అప్పగిస్తే జీతం తీసుకునేది కానీ నిర్లక్ష్యంగా ఉండేది. అందరినీ విసుక్కునేది. ఆమెని తీసేశాను. ఇంకో ఆమె వచ్చింది. ఈమెకు కబుర్లు ఎక్కువ- పని తక్కువ! ఆమెనీ తీసేశాను. ఆమె నామీద అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది. అసలే నా కళ్ల విషయంలో నేను చాలా నిస్పృహకి లోనయి ఉన్నాను. పైనుంచి ఈ సమస్యలు. నిధులు నాకు అవసరంలేదని అందరికీ రాసేశాను. సంస్థను క్లోజ్ చేసేశాను. ఆ తర్వాత ఒకరిద్దరు పేద వృద్ధులని, విద్యార్థులని ఎడాప్ట్ చేసుకుని వారి పోషణ చూశాను. అది నాకు బాగానే అన్పించింది.
సాంఘిక సేవ విషయంలో కూడా నేను తప్పు చేశాను. అది ప్రారంభించే ముందు, నా శక్తి ఎంత… నాలాంటి భావసారూప్యత గల వారు నాకు తోడుగా ఉన్నారా లేదా… అని ఆలోచన చేయలేదు- అది నా ఫెయిల్యూర్! ఒకటి మాత్రం నాలో బలీయంగా ఉంది. నేనెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో డబ్బు పోగొట్టుకుంటే, కుంగిపోతూ కూర్చోను. ‘‘అది నేను సంపాయించలేదు. అది నాది కాదు’’ అని మానసికంగా చేతులు దులిపేసుకుంటాను. ఉన్నదాంతో ఆనందంగా, సంతృప్తిగా బతకటం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు కాబట్టి ఆ ఇబ్బందులేవీ నన్ను ఎక్కువసేపు బాధ పెట్టలేవు. వాటికి ఎదురు తిరుగుతాను. జీవితంలో ఎక్కడైనా, ఏ విషయంలోనైనా, ఒక కోణం మూసుకుపోతే మీరు దిశ మార్చుకోండి! ఇంకో కొత్త కోణం జీవితంలో మీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది. అన్నింటికంటే, మన జీవితం మనకి ముఖ్యమైనది. మన జీవితాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు జీవితం కూడా తప్పక మనకి ప్రేమని పంచుతుంది. నిరాశ, నిస్పృహలతో కళ్లు మూసేసుకుని, మోకాళ్ల మధ్య తల దూర్చేసుకుని, కుంగిపోయి కూర్చుంటే చీకటి తప్ప ఇంకేం కన్పించదు. జీవితంలో మీ దగ్గరకి వచ్చే ఆనందాలు రావు. అవి నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోతాయి.
నాకెదురైన చేదు అనుభవాలతో, నేనిక భయపడిపోయి, చేతులు ముడుచుకుని కూర్చున్నానని అనుకున్నారా? ఊహు! అస్సలు లేదు! అట్లా అయితే నేను నేనే కాదు! నిజమైన సృజనాత్మకత గల వ్యక్తి అలా ఉండలేరు!.