సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

“ఏల చెప్పేవు నీ సుద్దులు”

టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య తానే చెలికత్తె పాత్ర ధరించి ” ఏల చెప్పేవు నీ సుద్దులు ” అంటూ స్వామి వారికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఓ శ్రీనివాసా! నీ దివ్యగాధలు ఎన్నని చెప్పను? ఎలా వర్ణించను అంటున్నాడు అన్నమయ్య. “బ్రహ్మచారివైతివి” అంటున్నాడు. శ్రీమహావిష్ణువు బ్రహ్మచారి అవడం ఏమిటి? దానికొక గాధ ఉంది. పరీక్షిత్తు మృతశిశువుగా జన్మించాడు. ఎవరైనా అస్ఖలిత బ్రహ్మచారి ఆ శిశువును ఎత్తుకున్నట్లైతే తిరిగి జీవిస్తాడని వ్యాసమునీంద్రుల వారు చెప్తారు. చివరికి భీష్ములవారితో సహా తమకా అర్హత లేదని తప్పుకుంటారు. శ్రీకృష్ణుడు అలా ఎత్తుకోగానే బిడ్డ కేరుమని ఏడ్చి ప్రాణం పోసుకుంటుంది. పదహారు వేల గోపికలు, అష్ట భార్యలతో అలరారిన శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారా? విచిత్రము కాకపోతే చెప్పండి? ఆ విషయమేమిటో ఈ శృంగార కీర్తనలో చూద్దాం.
ఈ కీర్తన భక్తి భావాలతో సాగినప్పటికీ అన్యాపదేశంగా నీవు బ్రహ్మచారివేమిటివని నిందాస్థుతి చేస్తున్నాడు. నందవ్రజములో చేసిన రాచకార్యాలను ఏకరువు పెడుతున్నాడు అన్నమయ్య. వినండి.
కీర్తన:
పల్లవి: ఏల చెప్పేవు నీ సుద్దులు యెందాఁకా మాతోను
పాలుమాల కింతలోనే బమ్మచారివైతివి ॥పల్లవి॥

చ.1. ఎలమి గొల్లెతలను యిన్నాళ్ళు పొంది పొంది
తొలఁగి మధురలోన దొరవైతివి
కొలఁది ఆవులఁగాచి గొల్లవాఁడవై యుండి
వలవంత నేఁడు రాచవాఁడవైతివి ॥ఏల॥
చ.2. వేడుకలకింటింట వెన్నదొంగిలి నేఁడు
ఆడ ద్వారకలో సోమయాజివైతివి
వోడక రుక్మిణీ దేవి నూరకే యెత్తుకవచ్చి
పాడితోనగ్రపూజకు పాత్రుఁడవైతివి ॥ఏల॥

చ.3. రక్కసుల కాఁపురాలు రచ్చలకెక్కఁ జెరిచి
పెక్కుధర్మాలు నిలిపి పెద్దవైతివి
చిక్కువాసి నన్నుఁగూడి శ్రీ వేంకటాద్రి మీఁద
దిక్కుల నిందరిపాలి దేవరవునైతివి ॥ఏల॥
(రాగం: బౌళి; రేకు సం: 135-3, కీర్తన; 7-207)

విశ్లేషణ:
ఏల చెప్పేవు నీ సుద్దులు యెందాఁకా మాతోను
పాలుమాల కింతలోనే బమ్మచారివైతివి

ఓ వేంకటేశ్వరా! నీ లీలలు (సుద్దులు), కధలు ఎన్నని చెప్పగలము? అష్టభార్యలంటావు. పదారువేల గోపికా మణులంటావు. ఇంతలోనే బ్రహ్మచారినంటావు? నీ మాయ ఎలా అర్ధం చేసుకోవాలి? నిన్ను మేము ఎలా అందుకోవాలి? అంటున్నాడు అన్నమయ్య.
చ.1. ఎలమి గొల్లెతలను యిన్నాళ్ళు పొంది పొంది
తొలఁగి మధురలోన దొరవైతివి
కొలఁది ఆవులఁగాచి గొల్లవాఁడవై యుండి
వలవంత నేఁడు రాచవాఁడవైతివి
ఎంతో వినోదంగా ఆనందంగా నందవ్రజములోని గోపికలనందరినీ ఎన్ని రోజులు రమించావు చెప్పు? ఆ ప్రాంతం వీడి మధురలో చక్రవర్తివై వెలిశావు. కేవలము పశులకాపరిగా ఉన్న నీవు వారికి విరహమిచ్చి గొప్ప ఏలికయైనావు.

చ.2. వేడుకలకింటింట వెన్నదొంగిలి నేఁడు
ఆడ ద్వారకలో సోమయాజివైతివి
వోడక రుక్మిణీ దేవి నూరకే యెత్తుకవచ్చి
పాడితోనగ్రపూజకు పాత్రుఁడవైతివి
అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇంటింటికీ వెళ్ళి వినోదంగా వెన్నను, పాలను దొంగిలించావు. ద్వారకలో యజ్ఞాలను చేసి యజ్ఞకర్తవై, యజ్ఞభోక్తవై ఒక సోమయాజిగా నిలిచావు. యజ్ఞ నారాయణుడన్న పేరు తెచ్చుకున్నావు. ఓటమిని చవిచూడక రుక్మిణీదేవిని తీసుకువచ్చావు. సగౌరవంగా రాజసూయానంతరం యజ్ఞపూజకు ఉచితాసనానికి అర్హత పొందావు.

చ.3. రక్కసుల కాఁపురాలు రచ్చలకెక్కఁ జెరిచి
పెక్కుధర్మాలు నిలిపి పెద్దవైతివి
చిక్కువాసి నన్నుఁగూడి శ్రీ వేంకటాద్రి మీఁద
దిక్కుల నిందరిపాలి దేవరవునైతివి

పెక్కు రాక్షసాధముల పీచమడంచితివి. ఆర్ష ధర్మాన్ని ద్వాపరంలో నిలబెట్టి మునిజనులకు పెద్ద దిక్కుగా నిలిచావు. నేడు సర్వ సంకటములను బాపి తిరువేంకటగిరిపై నాతో సహా అనేకమంది శ్రీహరి దాసులను అనుగ్రహిస్తున్నావు. అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమై మా చిక్కులను తీరుస్తున్నావు. స్వామీ! శ్రీనివాసా అనుగ్రహించు అంటున్నాడు అన్నమయ్య.
ముఖ్య అర్ధములు సుద్దులు = కధలు, లీలలు, మాయలు; పాలుమాలక = వేగముగా, పాలుమాలడం అంటే బద్ధకం. ఆ బద్ధకం లేకుండా అని అర్ధం; బమ్మచారి = అవివాహితుడు; ఎలమి = సంతసము; వేడుకకు = సరదాగా; సోమయాజి = యజ్ఞము చేసిన వాడు; ఓడక = ఓడిపోక; పాడితో = గౌరవంగా; పెద్దవు = సర్వాధికారములు పొందిన వాడవు; చిక్కులు = సంకటములు.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked