-శారదాప్రసాద్
మోక్షం అంటే ఏమిటి ? బందాల నుంచి విడుదల అవ్వటం మోక్షం! బందం అంటే ?. ఎప్పుడైతే జీవన భ్రాంతిలో పడి కర్మలు చేస్తున్నామో, వాటి ఫలాలు అనుభవించాల్సి వచ్చి మళ్ళీ మళ్ళీ జన్మలను పొందుతున్నాం..ఈ కర్మ ఫలాలను అనుభవించటమే బంధం అంటే! ఈ జన్మ, కర్మల వలయంలో చిక్కుకోకుండా ఉండటమే మోక్షం అంటే. మనం కర్మలు చేయకుండా ఉండలేము. బ్రతకాలంటే కర్మలు చేయాల్సిందే! మనం చేసే కర్మ నిష్కామ పూరితమై ఉంటే, అప్పుడు కర్మ ఫలాలు మనకు అంటవు. నిష్కామ కర్మ యోగం,జ్ఞాన యోగం, భక్తి యోగాలు మోక్షానికి సోపానాలు! నిష్కామ కర్మే
అసలైన మోక్ష మార్గం. మనిషి జీవితానికి నాలుగు లక్ష్యాల్ని చెప్పారు. అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి. ధర్మం అంటే సమాజ నీతి, నియమాలకు అనుగుణంగా నడుచుకోవడం. అర్థం అంటే జీవితం సుఖంగా గడవటానికి కావల్సిన ధనాన్ని సంపాదించడం. కామం అంటే అన్ని విధాల కోరికలు, వాటిని తీర్చుకునే మార్గాలు.ఇవి కూడా ధర్మాన్ని అనుసరించే ఉండాలి. మోక్షం అంటే వీటన్నిటి నుండి బయటపడి అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవటం!.ఇహ పర లోకాలలో సుఖాన్ని సమకూర్చుకోవడాన్ని అభ్యుదయం అంటారు. శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షాన్ని పొందటానికి చేసే ప్రయత్నాన్ని శ్రేయస్సు అంటారు. మోక్షాన్ని కర్మ, భక్తి , జ్ఞానయోగాల ద్వారా కూడా పొందొచ్చు! భక్తి, జ్ఞానం ఒకటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం.
జ్ఞానమెన్న గురువు జ్ఞాన హైన్యము బుద్ధి
రెంటి నందు రిమ్మ రేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినురవేమా…!
జ్ఞానం గురువులాంటిది. చంచలమైన మనస్సు జ్ఞానాజ్ఞానాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఈ భ్రమలను తొలగిస్తేనే మోక్షం లభిస్తుందని వేమన చెప్పాడు. ఆత్మానాత్మ వివేకమే నిజమైన జ్ఞానం. వివేకం అంటే తెలివితేటలు. తెలివితేటలు కలిగివుంటే జ్ఞానం రాదు. ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ దేని నుండి పుడుతుంది? “నేను” ఎవరు? అని తెలుసుకోవటమే జ్ఞానం. మిగిలినది అంతా అజ్ఞానమే! విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ ఈశ్వరమయమని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. అటువంటివాడే భగవంతునికి ప్రియతముడు. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించటమే మోక్షం. మోక్షం కావాలని కోరుకున్నా అది అందరికీ లభించదు . ఘోర తపస్సులు చేసిన ఋషులందరికీ మోక్షం లభించలేదు. మోక్షం లభించటానికి గత జన్మలో చేసిన కర్మ ఫలాలు కూడా కారణం అవుతాయి . ఈ జీవితంలో సత్కర్మలు కూడా చేయాలి. మోక్షం పొందటానికి ప్రతి ఒక్కరూ కర్మయోగిగా మారాలని భగవద్గీత చెబుతుంది . ఈ కర్మలు రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. అవి 1. ధర్మబద్ధమైనవి అంటే చేయటానికి నిర్దేశించబడినవి. 2. ధర్మ విరుద్ధమైనవి అంటే చేయటాన్ని నిషేధించినవి. కర్మను చేయాలా? త్యజించాలా? అని అర్జునుడి సందేహం. అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానం, “కర్మ చేయకుండా ఉండడం కర్మ సన్యాసం కాదు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ సాధన ధ్యానయోగానికి దారి తీస్తుంది. ఫలాసక్తిని విడచి, బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వమూ బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఈ సమత్వమే బ్రహ్మజ్ఞానానికి అత్యవసరం. ఎల్లపుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడు”. జనన జరా మరణాల నుండి మోక్షాన్ని పొందగోరినవారు పరమాత్మను ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మస్థితిని పొందుతారు. నిష్కామ కర్మ ఆచరిస్తూ, కర్మ ఫలాలను త్యజించడం వలన జ్ఞానియైనవాడు మోక్షాన్ని పొందుతాడు అని పైన చెప్పుకున్నాం! జ్ఞాని అయితేనే కర్మ ఫలాలను త్యజించగలడు. కర్మ ఫలాలను త్యజిస్తే జ్ఞానం లభిస్తుంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.
ఇక నిష్కామ కర్మ అంటే మోక్షం కలగాలనే కోరికను కూడా త్యజించటం. మోక్షం కోసం చేసే కర్మలు సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే వాటిలో కోరికలు, ఫలాలను ఆశించటం ఉన్నాయి.అయితే జ్ఞానానికి మనిషిలో అహంభావాన్ని పెంచే(పంచే) లక్షణంవుంది. ఒక యోగ మిత్రుని ద్వారా నేను తెలుసుకున్న కొన్ని విషయాలను ఈ సందర్భంగా మీతో పంచుకుంటాను. సాహిత్యాభిలాష (చదవటం,వ్రాయటం,ఏదైనా కావచ్చు) కూడా జ్ఞాన సముపార్జనలో భాగమే కదా! ‘తెలుసును’ అనే భావమే జ్ఞానం.ఆ ‘తెలుసును’ అనే ‘భావం’ ఏర్పడటానికి ఏది మూల కారణమో తెలిసిన రోజున ‘తెలుసును’ అనేది ‘భావం’ గానే మిగులుతుంది! తప్పితే, దానికి ‘అహం’ తోడు కాదు. అది తెలియకపోతే ‘భావా’ నికి ‘అహం’ తోడు కావటం తధ్యం. తెలియటానికి పనికివచ్చే సాధనం మాత్రమే మనలో ఉంది. తెలిసే ప్రక్రియకు మూలకారణం మాత్రం మనం కాదు. నేను తెలుసుకుంటున్నాను అనే భావం కాక, ‘తెలియవలసిన అవసరం నా తత్వానికి ఉంది, తెలుస్తుంది’ అని భావన చేసుకోవాలి.అదే వాస్తవం కూడా! ఒక ప్రఖ్యాత రచయిత గొప్ప శాస్త్రవేత్త కాకపోవచ్చు!అలాగే, ఒక శాస్త్రవేత్త ప్రఖ్యాత రచయిత కూడా కాకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి, అన్నీ తెలియవు! ఈ నేర్చుకోవటం, అర్ధం చేసుకోవటం, తెలియటం అనేది నిత్యం జరిగే ప్రక్రియలు!
అందరికీ అన్నీ తెలియడమనేది ఇప్పుడు నడుస్తున్న సృష్టి విధానంలో అసంభవం. తెలిసే విషయాలలోనూ, తెలిసే విధానంలోనూ, తెలిసే స్థాయిలోనూ కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ఈ తెలియటమనేది వ్యక్తిపరమైనదీ, వ్యక్తి ప్రమేయంతో జరిగేది కాక, సృష్టి పరమైనదీ, సృష్టి ప్రణాళికలోనిదీ! కనుక,ఏయే తత్వమున్న వ్యక్తులకు ఎప్పుడు, ఏది, ఎలా తెలియాలో, తెలియబడాలో, అప్పుడే అవి తెలియబడుతాయి! మనం కోరుకునే జ్ఞానం మరెక్కడో లేదు. అది మనలోనే ఉంది. ప్రయత్నం చేస్తే దాన్ని సులభంగా పొందవచ్చు. మనస్సుకు జ్ఞానం ఉందని తెలుసు. జ్ఞానం విడుదల అయిన తర్వాత మోక్ష మార్గం సులభం అవుతుంది. ఇంద్రియ జ్ఞానమే మోక్షమని కొందరి భావన! కానీ అది మోక్షం కాదు “నేను-నాది” అనుకున్న స్వార్ధమే దుఃఖాన్ని కలిగిస్తుంది. త్యజించబడింది ఏదీ దుఃఖాన్ని కలిగించలేదు. “ఈ శరీరం నేను కాదు” అని అనుకున్న మరుక్షణం ఈ శరీర మరణం మన మరణం కాజాలదు. ఆ స్థితిని పొందటం అంటే మోక్షం లభించినట్లే! నాస్తిక సంప్రదాయాన్ని అనుసరించిన బౌద్ధ దర్శనం కూడా మోక్ష సిద్ధాంతాన్ని నిర్ద్వంద్వంగా సమ్మతించింది.
మోక్షానికి బౌద్ధం ‘నిర్వాణం’ అని పేరు పెట్టింది. అన్ని బంధాలు, దుఃఖాలు తీరిపోవటమే నిర్వాణం. ఐహిక బంధాల నుండి విముక్తి పొందడమే మోక్షం. “మనస్సును, బుద్ధిని నాయందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు. మనస్సు లగ్నం చేయడం చేతకాకపోతే కాకపోతే అభ్యాస యోగంలో ప్రయత్నించు. అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి. అది కూడా సాధ్యం కాకపోతే నన్ను శరణు పొంది నీ సర్వ కర్మ ఫలాలు నాకు సమర్పించు. అభ్యాసం కంటే జ్ఞానం, జ్ఞానం కన్నా ధ్యానం, ధ్యానం కన్నా కర్మ ఫల త్యాగం శ్రేష్ఠం. త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది.”అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అరటిపండును వలిచిపెట్టినట్లు చెప్పాడు. సహజంగా జీవించటమే మోక్షానికి మార్గం! సహజంగా జీవించటమంటే, కర్మ ఫలాలను త్యజించి ముందుకు నడవటం! మిగిలినవన్నీ అసహజాలే!