జానామ్యహంతే సరసలీలాం
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
ఇది ఒక శృంగార మధురభక్తి సంకీర్తన. అన్నమయ్య ఒక నాయికగా మారి ఈ శృంగార సంస్కృత కీర్తనలో స్వామిని ఎలా వేళాకోళం చేస్తున్నాడో, ఎలా దెప్పిపొడుస్తున్నాడో చూడండి. నాయకుడైన శ్రీనివాసుడు నాయిక వివిధ ప్రశ్నలకు సమాధానం ఏమిచ్చాడో తెలీదు. ఆయన ప్రత్యుత్తరాలకు కినుక వహించిన నాయిక స్వామిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నాయిక ఖండిత అనవచ్చు. ఆ విశేషాలు చూద్దాం.
కీర్తన:
పల్లవి: జానామ్యహంతే సరసలీలాం
నానావిధ కపటనాటక సఖత్వమ్ ॥పల్లవి॥
చ.1 కిం కరోమి త్వాం కితవ పరకాంతాన-
ఖాంకురప్రకటన మతీవ కురుషే
శంకాం విసృజ్య మమసంవ్యాన కర్షణం
కింకారణమిదం తే ఖేలన మిదానీం ॥జానా॥
చ.2 కిం భాషయసి మాం కృతమానసతయా
డాంభికతయా విట విడంబయసి కిం
గాంభీర్యమావహసి కాతరత్వేన తవ
సంభోగ చాతుర్య సాదరతయా కిం ॥జానా॥
చ.3 కిమితి మామనునయసి కృపణ వేంకటశైల-
రమణ భవదభిమతసురతమనుభవ
ప్రమదేన మత్ప్రియం ప్రచురయసి మానహర
మమతయా మదననిర్మాతా నకిం త్వం ॥జానా॥
(రాగం: ముఖారి ; రేకు: 24-4, కీర్తన; 5-135)
విశ్లేషణ:
పల్లవి: జానామ్యహంతే సరసలీలాం
నానావిధ కపటనాటక సఖత్వమ్
నాకు నీ సరశృంగార లీలల విషయం బాగ తెలుసు స్వామీ! నీ కపట నాటక స్నేహాలు మరింత బాగా తెలుసు అంటున్నాడు.
చ.1 చ.1 కిం కరోమి త్వాం కితవ పరకాంతాన-
ఖాంకురప్రకటన మతీవ కురుషే
శంకాం విసృజ్య మమసంవ్యాన కర్షణం
కింకారణమిదం తే ఖేలన మిదానీం
ఒహో! టక్కులా మాయగాడా! నిన్ను ఏమి చేయాలి? పరకాంతలు నీ మేనిపై చేసి నఖక్షతాలను బాగా ప్రదర్శిస్తున్నావు. ఇంకా సందేహం లేకుండా నా పైటకొంగు పట్టి లాగుతున్నావు. ఈ నీ క్రీడలకు కారణం ఏమిటో నాకు తెలియజెప్పు ముందు అంటున్నాడు.
చ.2 కిం భాషయసి మాం కృతమానసతయా
డాంభికతయా విట విడంబయసి కిం
గాంభీర్యమావహసి కాతరత్వేన తవ
సంభోగ చాతుర్య సాదరతయా కిం
నీ కపటపు మనస్సుతో నాతో ఎందుకు మాట్లాడుతావు? ఓరి విటుడా! ఇంకా గంభీరంగా తెలీనట్టు బుకాయిస్తూ డాబుసరిని ప్రదర్శిన్స్తున్నావు ఎందుకు? నీకు లోలోపల భ్యంగా ఉన్నప్పటికి నాదగ్గర ఎందుకు గాంభీర్యాని ప్రకటిస్తున్నావు? సంభోగ చాతుర్యాని ప్రదర్శించినంత మాత్రాన ఏమి ప్రయోజనమున్నది. అసలు విషయం చెప్పు అని అంటున్నది నాయిక.
చ.3 కిమితి మామనునయసి కృపణ వేంకటశైల-
రమణ భవదభిమతసురతమనుభవ
ప్రమదేన మత్ప్రియం ప్రచురయసి మానహర
మమతయా మదననిర్మాతా నకిం త్వం
ఓయీ! లోభీ! నన్నెందుకు బ్రతిమాలుకుంటున్నావు? ఓ శ్రీనివాసా నీకు ఇష్టమైన సంభోగాన్ని అనుభవించు. నా మానాన్ని దోచుకున్నవాడా! సంతోషంతో ప్రియవచనాలేల పలుకుతున్నావు? మమకారంతో మన్మధుని జన్మకు కారణమయినవాడవు నీవే కదా! అవునా! కాదా! చెప్పు అంటూ అన్నమయ్య నాయికగా మారి శ్రీనివాసుని అడుగుతున్నాడు.
-0o0-