-*శారదాప్రసాద్ *
చాటువులు కవి ఆశువుగా ఏదో ఒక సందర్భంలో చెప్పిన చక్కని పద్యాలు.చాటు పద్యాన్ని చెప్పేటప్పుడు కవి మిగిలిన కవితా విశేషాలు పెద్దగా పట్టించుకోడు. చాటు పద్యానికి కవితా వస్తువు ఏదైనా కావచ్చు.
“చాటు” అంటే ప్రియమైన మాట అని అర్ధం చెప్పుకోవచ్చు. చాటు పద్యం చెప్పేటప్పుడు దాన్ని ఎందుకు, ఏ సందర్భంలో చెప్పవలసి వచ్చిందో చెబితే కాని ఆ పద్యం యొక్క విశేషం తెలియదు.”పరమేశా!గంగ విడువు పార్వతి చాలున్” అన్న చాటు పద్యంలో, పల్నాటి సీమలో దాహంతో ఉన్న శ్రీ నాధుడు ఆశువుగా ఆ పద్యాన్ని చెప్పాడు అని చెబితే గాని ఆ పద్యంలోని సొగసు తెలియదు. ఒక సారి శ్రీనాధ కవి దరిద్ర బాధ తట్టుకొనలేక, మిక్కిలి కష్టములు అనుభవించే వేళలలో తనను ఒక భోగపు దానిగా సృష్టించిన బాగుండేదని ఈ విధంగా వాపోయాడు–
కవితల్ సెప్పిన,బాడనేర్చిన వృధాకష్టంబే యీ భోగపుం
జవరాండ్రె కద భాగ్యశాలినులు పుంస్త్వంబేలపో పోచకా
సవరంగా సోగాసిచ్చి మేల్ యువతి వేషంబిచ్చి పుట్టింతువే
నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరుగాదే పాపముం దైవమా!
శ్రీ నాధుని చాటువులలో సునిశిత హాస్యం కూడా ఉం టుంది. ఒక సారి శ్రీ నాద మహాకవి తనకు వరసకు బావమరది అయిన రామయ మంత్రితో కలసి ఆతని ప్రక్కన కూచొని భోజనం చేస్తున్నాడు. బావమరది తిండిపుష్టిని చూసి బిత్తరపోయిన శ్రీ నాధుడు ఈ విధంగా చెప్పాడు–
గ్రామము చేతనుండి పరికల్పిత ధాన్యము నింటనుండి శ్రీ
రామకటాక్ష వీక్షణ పరంపరచే గడతేరెగాక మా
రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చు?నా
స్వామి యెరుంగు దత్కబళచాతురి తాళ ఫల ప్రమాణమున్
*మరికొన్ని చాటు పద్యాలు –*
పంచదార కంటె పరదార తీయన
రాజుకంటె మోజు రంకు మగడు
ఐనదాని కంటె కానిది మేలయా
విశ్వదాభిరామ వినుర వేమ—-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
కలవు నాలుగూళ్ళ కావలికీవల
బిట్రగుంట ఒకటి పెద్ద స్టేష
నులవపాడు మాత్రమొంగోలు వైపున
పడుగుపాడు పిదప కొడవలూరు —శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
కత్తి వదలి రాజు కామిని చేపట్టె
గంట మొదలి మంత్రి గరిటె పట్టే
వేసమునకు మిగిలె మీసాల దుబ్బులే
విశ్వదాభిరామ వినుర వేమ—శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
వేద విద్య నాటి వెలుగెల్ల నశియించె
గారే బూరె పప్పుచారు మిగిలె
బుర్ర కరిగి బొర్రగా మారెరా
విశ్వదాభిరామ వినుర వేమ —-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
ఆడిన మాటలు తప్పిన-గాదిద కొడుకంచు తిట్టగా విని,మదిలో
వీడా కొడుకని ఏడ్చుచు-గాడిదయను కుందవరపు కవి చౌడప్పా!—కవి చౌడప్ప
బూతులు నీతులు చెప్పితి-నీతులు విని మెచ్చ బుధులు,నీతి విదూరుల్
బూతులు మెచ్చందగు నని–కౌతుక మతి కుందవరపు కవి చౌడప్పా!—కవి చౌడప్ప
పప్పే పస బాపలకును-ఉప్పే పస రుచులకెల్ల,వువిదల కెల్లన్
కొప్పె పస,దంతములకు-కప్పే పస కుందవరపు కవి చౌడప్పా!–కవి చౌడప్ప
ఇంటికి పదిలము బీగము-వింటికి పదిలంబు నారి,వివరింపగా
చంటికి పదిలము రవికెయు-కంటికి పదిలంబు కుందవరపు కవి చౌడప్పా!–కవి చౌడప్ప
చదువు రానివేళ ‘చంకరుండ’న్నాడు
చదువు కొనెడివేళ ‘సంకరు’డనె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస ! శ్రీనివాస! —‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు
ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరకుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ –శ్రీశ్రీ
చారు మీద శ్లోకం
చారు చారు తరంభాతి
హింగూజీరా సమన్వితం
కించిల్లవణలోపేన
పాలాశకుసుమం యథా!– శ్రీ బులుసు వేంకటరమణయ్య గారు
కరకరలాడు కొంచెమగుకారము గల్గు బలాండువాసనా
హర మగుగొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట
ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
దరమునబల్కుచుందు రదితాదృశమే యగునంచుదోచెడిన్ —- పకోడీ గురించి తిరుపతి వెంకట కవులు
చచ్చిపోయి జీవి ఎచ్చాటికేగునో
ఎమియగునో ఎవరి కెరుగరాదు
ఎరుకలేనివార లేమేమో చెప్పగా
విని తపించువారు వేనవేలు — శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారు.
*ఇలా ఎన్నో చాటువు పద్యాలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి*.
*అన్నీ చదువుతాను, కానీ ఏ సిద్ధాంతానికి,ఎవరి భావాలకు బానిసను మాత్రం కాను! *
*పాఠకుల సుస్పందనే రచయితలకు ప్రాణం!ప్రణవం!!*
*సాధ్యమైనంత వరకూ తెలుగువారందరం తెలుగులోనే మాట్లాడుదాం*
*తెలుగులోనే వ్రాద్దాం.దేశ భాషలందు తెలుగు లెస్స!*
“తెలియని దానిని తెలుసుకోవటానికే ఈ నిరంతర ప్రయాణం, అన్వేషణ!”
నా చిరునామా-
TVS SASTRY
*Retd.MANAGER,ANDHRA BANK,*
*Flat.No.212,Palnadu Towers,
**1 st,Lane,Ravindra Nagar,*
*New Pattabhipuram,*
*GUNTUR-522006.*
*Phone- 0863-2243124