కథా భారతి

పెయ్యేటి శ్రీదేవి గారి కధ

శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి

ప్రముఖ రచయిత్రి , కార్టూనిస్ట్ , గాయని శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు( 68 సం.లు) ఫిబ్రవరి 21వతేదీ ,2021న గుండెపోటు తో హఠాన్మరణానికి గురికావటం వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు మిత్రులను , బంధువులను ,సాహితీ మిత్రులను అందరినీ కూడా విచారసాగరంలో ముంచివేసినది. వారి శ్రీవారు పెయ్యేటి రంగారావు గారు స్టేట్ బ్యాంక్ లో ఆఫీసర్ గా చేసి రిటైరయ్యారు. వారుకూడా కధా రచయిత, ప్రముఖ రంగస్థల నటులు , పాటల రచయిత. వారు రాసిన పాటలు శ్రీదేవిగారు స్వయంగా రాగాలు కట్టి పాడుతుంటారు. వీరి పెద్ద కుమార్తె విజయ మాధవి గొల్లపూడి ఆస్ట్రేలియా లో ప్రభుత్వరంగసంస్థలో ఉద్యోగం చేస్తూ తెలుగు వన్.రేడియో టోరీలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిన్న కుమార్తె కాంతి కలిగొట్ల అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం వీరి స్వంత ఊరు. సందేశాత్మకమైన కధలు, హాస్యకధలు చాలారాశారు శ్రీదేవిగారు.

కళ్ళజోడు

సులోచన అప్పుడే పేపరు కుర్రాడిచ్చిన వీక్లీ పుచ్చుకుని ఇల్లంతా వెతికేస్తోంది. ఎక్కడా కనిపించలేదు. కనిపించడానికి కళ్ళకి కళ్ళజోడుంటేగా? అసలు కళ్ళజోడే కనిపించక పోతే ఎలా?

‘ఏమిటే సులోచనా, వెతుకుతున్నావు? బట్టలు, పేపర్లు, పుస్తకాలు అన్నీ కింద పడేసావు. ఏం కనబడలేదు?’ అడిగింది అత్తగారు.

పదకొండేళ్ళ సుపుత్రుడు మధు, ‘ఏం పోయింది మమ్మీ? నా టేబుల్ మీద బుక్సన్నీ పడేసావు?’

‘ఏం కనబడలేదమ్మా? నా బుక్ షెల్ఫ్ లో పుస్తకాలన్నీకూడా కింద పడేసావు? ఇప్పుడు స్కూల్ కి తీసికెళ్ళాల్సిన బుక్సు కూడా కనిపించటల్లేదు. ఏం పోయింది?’ అడిగింది కూతురు సుధ.

‘నా కళ్ళజోడే. కొంచెం వెతికిపెట్టండి. వెంటనే వెతికిచ్చిన వాళ్ళకి మంచి బహుమతిస్తా. అర్జంటుగా ఇవ్వాలి. ఉదయమే బ్రష్ చేసుకునొచ్చి కాఫీ కలపబోతుంటే జయలక్ష్మాంటీ ఫోన్ చేసి, ‘సులోచనా! వీక్లీలో నీ కథ పడింది.’ అంటూ కంగ్రాట్సు చెప్పింది.’

‘నిన్న టి.వి. మీద చూసా మమ్మీ.’ అంటూ టి.వి.మీదున్న కళ్ళజోడు ఇచ్చి, ‘వెతికిచ్చాగా? ఏదీ నా బహుమతి?’ అన్నాడు.

గమ్మున ఆ కళ్ళజోడు కళ్ళకి పెట్టుకుని తన కథ చదువుదామని వీక్లీ తిరగేస్తుంటే అక్షరాలు ఒక్కటీ కనిపించలేదు. ‘ఒరేయ్! ఈ కళ్ళజోడు నాది కాదురా, నానమ్మది.’

‘ఒరేయ్! నా కళ్ళజోడు తియ్యకురో. ఏదీ, ఇలాగియ్యి. దీనికోసమే ఎక్కడ పెట్టానో మర్చిపోయి వెతుక్కుంటున్నాను.’

‘అయితే నానమ్మా! నీ కళ్ళజోడు వెతికిచ్చాగా? నాకు బహుమతియ్యి.’

‘ఏడిసావులే వెర్రినాగన్నా! నిన్నేమన్నా కళ్ళజోడు వెతికిమ్మన్నానా? నేనక్కడ పెట్టుకున్న కళ్ళజోడు తీసి నాకిచ్చి బహుమతి అడుగుతావా?’

‘ఐనా అమ్మా, నానమ్మా! మొహానికంత చారెడేసి కళ్ళేసుకుని కనబడక పోవడమేమిటి?’

‘సరేలే. అమ్మమ్మవి అంటే, మా అమ్మవి మాకన్నాపెద్దకళ్ళు. మా మామయ్యలు దీనికి ఒళ్ళంతా కళ్ళే అనేవాళ్ళు. ఎప్పుడన్నా కళ్ళజోడు కనబడకపోతే అంత పెద్ద కళ్ళున్నా ఏమన్నా వుత్తరాలొస్తే కళ్ళు చికిలించుకు చదివేది. అప్పుడు నేనూ నీకులాగే అనుకునేదాన్ని, అంత పెద్ద కళ్ళుంటే కనబడక పోవడమేమిటని. ఇప్పుడా బాధేమిటో తెలిసింది. రేపు నీకూ పెద్దయ్యాక కళ్ళజోడొస్తే ఆ బాధేమిటో తెలుస్తుంది లేరా.’
అంది సులోచన కొడుకు మధుతో.

‘అమ్మా! ఒకవేళ వాషింగ్ మెషీన్లో బట్టలతో పాటు వేసేసావేమో చూడు. ఆదివరకోసారి అలాగే జరిగిందిగా?’ అంది కూతురు సుధ.

‘నిన్న, ఇవాళా బట్టల మెషీన్లో వెయ్యలేదుగా, కనుక ఆ చాన్సే లేదు.’

‘ఐనా అమ్మా! కళ్ళజోడు తీసి ఎక్కడన్నా పెట్టేటప్పుడు ఇక్కడ పెడుతున్నాను అని గుర్తు పెట్టుకోవాలి. అలా అయితే ఎప్పటికీ మర్చిపోరు.’

‘సరేలే, వెతికిచ్ఛేదట్టే పోయి నాకు నీతులు చెప్పమనా? నువు ఏమన్నా పెన్ను కనబడకపోతే ఎంత హడావిడి చేస్తావు?’

‘నా పెన్ను ఎవరో తీసి వాడతారు కాబట్టి వెతుక్కోవాల్సి వస్తుంది. అయినా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ పెడితే అది మనిల్లెందుకవుతుందీ? పక్కవాళ్ళిల్లవుతుంది. పక్క వాళ్ళిల్లు ఇంతకన్నా ఘోరంగా వుంటుంది. అయినా నేనో పక్క కళ్ళజోడు కనబడక బాధ పడుతుంటే నీ జోకులేమిటే?’

‘సరేలే, ఎక్కడ పెట్టి మర్చిపోయావో ఒకసారి బాగా గుర్తు చేసుకో అమ్మా.’

కూతురు చెప్పినట్టు ఎక్కడ పెట్టిందో గుర్తు చేసుకుంటూ అలా చాలా దూరం వెనక్కి ఎటో వెళ్ళిపోయింది మనసు.

***************************

సులోచనకి అమ్మ గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆ వీధి మొత్తానికి టి.వి. వీళ్ళకొక్కళ్ళకే వుండేది. అప్పటిరోజుల్లో ఇంకా సి.డి.లు, పెన్ డ్రైవ్ లు లేవు. టి.వి.లో ఇప్పుడున్నన్ని ఛానెళ్ళూ లేవు. ఒక్క దూరదర్శన్ హిందీ ఛానెల్ మాత్రమే వుండేది. ఎప్పుడో ఆరునెలలకోసారి హిందీ దూరదర్శన్ లో ఓ తెలుగు సినిమా వస్తే, టి.వి. ఇంకా కొనని వాళ్ళు, ఇరుగు పొరుగు, అందరూ కలిసి ఎగబడి చూసేవారు ఆ తెలుగు సినిమాని. అప్పుడు వాళ్ళ హాలంతా నిండిపోయి, వాళ్ళు కూచోడానికి జాగా లేక, బైటివాళ్ళు కుర్చీలన్నీ ఆక్రమించి హాయిగా తమ ఇంట్లో చూస్తుంటే, వాళ్ళు మాత్రం బైటివాళ్ళలా బైట నుంచుని చూడాల్సొచ్చేది. అలా నుంచున్నప్పుడు ఒకమ్మాయి తనెవరో తెలియక, టి.వి. వాళ్ళదే అనే ఇంగిత జ్జానం లేకుండా తనని తోసేసి లోపలికెళ్ళి హాయిగా తను చదువుకునే కుర్చీలో కూచుని టి.వి. చూడసాగింది. అమ్మకి, నాన్నకి మొహమాటం వెళిపోమని చెప్పటానికి. ఇరుగు పొరుగుతో గొడవ పెట్టుకుంటే అవసరానికి ఎవరూ రాకపోగా, ఊరూ వాడా చెడ్డ ప్రచారం చేస్తారు.

శని, ఆదివారాలు అమ్మ సుందరం కిళ్ళీషాపులో సావిత్రి, జమున సినిమాలు, లవకుశ, సీతారామకళ్యాణం సినిమా కేసెట్లు రెంటుకి తెచ్చేది. అమ్మతో ఎప్పుడన్నా తనూ వెళ్ళేది. అప్పటికి అమ్మకి రోజు తలనెప్పి అని బాధపడేది. పుస్తకం చదవలేకపోయేది. అప్పుడు కళ్ళు పరీక్ష చేసి సైటు వచ్చిందంటూ అమ్మకి కళ్ళజోడు వాడుతున్నారు.

అమ్మ కళ్ళజోడు పెట్టుకుంటే ‘డాక్టరమ్మలా వున్నావే.’ అనేవారు నాన్నగారు. అమ్మ పేపరు చదువుకునేటప్పుడు మాత్రమే కళ్ళజోడు పెట్టుకునేది. ఒకసారి అమ్మతో షాపింగ్ కెడుతూ దారిలో శంకరం షాపులో కేసెట్ తీసుకుందామని వెళ్ళింది. శంకరం ఏం సినిమాలున్నాయో లిస్టు చూపించాడు. అమ్మ చదువు రానిదానిలా దీని పేరేమిటి, దీని పేరేమిటి అని అడిగింది షాపతన్ని. సినిమా పేర్లన్నీ చెప్పాడు. అప్పుడు వాడు చెప్పిన వాటిలో వెలుగునీడలు, సిరిసంపదలు, లవకుశ కేసెట్లు తీసుకుంది.

‘ఏమిటమ్మా? అందులో సినిమా పేర్లు ప్రింటు సరిగా లేదా? అన్నీ ఏమేమిటని చదువు రానిదానిలా ఆ కొట్టబ్బాయిని అడుగుతావేమిటి?’ అంది సులోచన తల్లితో.

‘అదేమిటోనే, అక్షరాలన్నీ అలుక్కు పోయినట్లుగా వుండి ఏమీ కనిపించలేదు.’

‘చెంపకి చేరేడేసి కళ్ళేసుకుని కనబడక పోవడమేమిటి?’ అనుకుంది.

ఒకసారి అమ్మ తమ్ముడి పుట్టినరోజుకి వాడికిష్టమని చింతపండు పులిహోర చేసింది. అమ్మ పులిహోర చాలా బాగా చేసేది. అలాంటిది నన్ను కెవ్వున కేక పెట్టి, ‘ఏమే, పులిహోర ఇల్లా వుందేమిటే, ఉఠ్ఠి పసుపన్నం లాగ? నీకూ అలాగే కనిపిస్తోందా? అప్పటికీ శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, ఇలా పోపు చాలా ఎక్కువే వేసి చేసాను. పోపుగింజలేం కనిపించటల్లేదేమిటీ?’ అంది.

అప్పుడు గమ్మున లోపలికి పరిగెత్తి, కళ్ళజోడు తెచ్చి, అమ్మ కళ్ళకి తగిలించి, ‘ఇప్పుడు చూడు.’ అన్నాను.

‘ఔనేవ్! కళ్ళజోడు పెట్టుకుంటే పోపుగింజలన్నీ బాగా కనిపిస్తున్నాయి.’ అంది అమ్మ.

ఇంక ఆరోజు నించి రోజంతా ఉదయం లేచిందగ్గర్నించి పడుకునే వరకు అమ్మ కళ్ళజోడు కళ్ళనే వుండేది. ఎప్పుడన్నా కళ్ళజోడు కనబడక పోతే ‘ఎవరన్నా నా కళ్ళజోడు వెతికి పెట్టండర్రా.’ అని ప్రాధేయపడేది. అప్పుడు తను, అన్నయ్య, చిట్టిచెల్లి అందరూ యుధ్ధప్రాతిపదికను ఇల్లంతా చిందర వందర చేసి వెతికిచ్చేవాళ్లం. ఒకసారి కళ్ళజోడు కొంచెం పగిలింది. కొత్త కళ్ళజోడు కొనుక్కోకుండా పోయేదాకా పాపం ఆ కళ్ళజోడు తోనే కాలక్షేపం చేసింది.

ఒకసారి అమ్మ ఉల్లిపాయలు తరుగుతూంటే, అమ్మ కళ్ళు మండి కన్నీళ్ళు కారుస్తుంటే అప్పుడే వచ్చిన అన్నయ్య, అప్పుడు పదేళ్ళు వాడికి, ‘అమ్మ ఎందుకేడుస్తోందే? నాన్నేమన్నా అన్నారా?’ అని అడిగాడు తనని. ‘ఎమోరా, నాకేం తెలియదు.’ అంది. వాడికి అమ్మంటే ప్రాణం.

అయిదేళ్ళ తన చిట్టిచెల్లి రమ, ‘అయినా అమ్మ కళ్ళజోడు పెట్టుకుందిగా? ఎందుకు కన్నీళ్ళొస్తున్నాయి?’ అంది తెలీక.

అప్పుడు దాని మాటలకి అమ్మ, అంత ఉల్లిపాయ పెట్టిన ఉల్లిబాధలోను, ‘ఓసి పిచ్చిమొహమా! చత్వారం వచ్చి కళ్ళకి కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన కన్నీళ్ళు కళ్ళకే వస్తాయి గాని కళ్ళజోడుకి రావు కదే?’ అంది.

అమ్మ అన్న ఆ మాట విని కళ్ళజోడుకి సంబంధించిన జీవిత సత్యమేదో చెప్పినట్టనిపించి, అది గుర్తొచ్చి నవ్వుకుంటోంది. ‘గారడి చేసే నీ కనులు, ఆరడి చేయును నా మనసు, తీయని ఆశల అలజడిలో ఊగే ఆగని లేవయసు ….’ అంటూ పాట మొదలెట్టింది.

అమ్మ నవ్వుకుంటూ తనకిష్టమైన పాట పాడుకుంటూంటే, సుధ ఎక్కడ పెట్టిందో గుర్తొచ్చి నవ్వుతోందేమో అనుకుని, ‘అమ్మయ్య, అమ్మా! గుర్తొచ్చిందే ఎక్కడ పెట్టావో?’ అని అడిగింది కూతురు సుధ.

‘నీ మొహం! కళ్ళజోడు కనబడలా, ఏదీ కనబడలా. మా అమ్మ కళ్ళజోడు బాధ గుర్తొచ్చి, నవ్వొచ్చి, ఎందుకో ఆ పాట పాడాను.’

ఓ పక్క చేతిలో స్వాతి వీక్లీలో పడిన తన కథ చదువుకోలేక పోతున్నానే అన్న బాధ! స్వాతి వీక్లీలో తన కథ ఏ పేజీలో వుందో తిరగేసింది. చదువుదామని ఎంత ప్రయత్నించినా అక్షరాలు అలుక్కుపోయినట్లు కనిపిస్తున్నాయి గాని, ఒక్కక్షరం కనబడితే ఒట్టు. ఎమ్.ఏ. చదివి, గోల్డ్ మెడల్ సంపాదించి, అక్షరం ముక్క రానిదానిలా, ఆఖరికి చదువు రాని దానిలా అయింది తన బతుకు. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి తన దీన దుస్థితికి.

ఈలోగా పదిహేను రోజులు కేంపు అంటూ ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్ళిన భర్త రాజశేఖరం ఫోన్ చేసాడు.

‘సులో! నీ కథ పడిందని ఆఫీసులో మా ఫ్రెండు ఫోన్ చేసి చెప్పాడు. కంగ్రాట్సు. ఎన్నిసార్లు చదువుకున్నావు కథ?’

కళ్ళజోడు కనబడక చదవలేదంటే చిన్నతనంగా వుండి ఏం చెప్పలేక పొడిపొడిగా ‘ఆ, చదివాను.’ అంది.

‘ఏమిటో అంత ముభావంగా వున్నావు? ఒంట్లో బాగాలేదా? మనసు బాగాలేదా? నా కోసం బెంగ పెట్టుకున్నావా? ఒక వారం విరహం తప్పదు. సరే, వుంటా. సాయంత్రం మాట్లాడతా. అర్జంటు మీటింగుంది, వెడుతున్నా. బై.’ అంటూ ఫోను పెట్టేసాడు.

‘అమ్మా! నే కాలేజికి వెడుతున్నా.’ ‘అమ్మా! స్కూల్ కి వెడుతున్నా.’ అంటూ పిల్లలు వెళ్ళబోతుంటే, ‘ఆగండి, రెండు నిముషాల్లో టిఫిన్ చేసిస్తా.’

‘ఇప్పుడు టైమెంతైందనుకున్నావు? 9 గంటలు దాటింది. నానమ్మ టిఫిన్ పెట్టి లంచ్ బాక్సు ఇచ్చిందిలే. ఈలోగా కళ్ళజోడు వెతుక్కో. దొరక్కపోతే సాయంత్రం మేం వచ్చి వెతుకుతాంలే.’ అంటూ వెళిపోయారు.

‘రావే, కళ్ళజోడు నెమ్మళంగా వెతకచ్చులే. వున్నచోట వెతకాలి గాని, లేనిచోట వెతికితే ఏం కనపడుతుంది? ఏమూల పడిందో! స్నానం చేసిరా. టిఫిన్ తిందూగాని. ఇడ్లీ చేసాను. వంట కూడా వండేసాను. పోనీ ఎలాగూ పొద్దుపోయింది. భోజనం చేద్దూగాని రా.’ అంది అత్తగారు.

ఉదయం బ్రష్ చేసుకోగానే తన ఫ్రెండు జయలక్ష్మి ఫోను చేసి చెప్పగానే, పేపరు వాడిచ్చిన స్వాతి వీక్లీలో తన కథ ఎంతో ఆత్రంగా చదువుదామంటే, కళ్ళజోడు కనబడక, కాఫీ కూడా తాగకుండా, ఇల్లంతా వెతికింది. కడుపులో ఆకలి, ఎలకలు పరిగెడుతున్నాయి.

అత్తగారు అది గ్రహించి వేడిగా కాఫీ అందించింది కోడలికి. తన అత్తగారు దేవత. అలాంటి అత్తగారు దొరకడం తన అదృష్టం. అనుకుంటూ కాఫీ తాగి, కాస్త శక్తి వచ్చినట్లనిపించినా, ఇంక కళ్ళజోడు వెతుకులాట, స్నానం వాయిదా వేసుకుని అలసటగా పడుకుంది.

ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది. కొరియర్ బాయ్. తన కథ పడినందుకు స్వాతి వీక్లీ కాంప్లిమెంటరీ కాపీ, కథకి పారితోషికం చెక్కు సంతకం పెట్టి తీసుకుంది.

‘రా. భోంచేద్దాం.’ అంది అత్తగారు.

‘అయ్యో, మీరు తినలేక పోయారా? ఎప్పుడూ నాతోనే కలిసి భోంచేయాలంటారు. మీరు ముందర తినేయచ్చుగా? ఉండండి. స్నానం చేసొస్తా.’ అంటూ స్నానం చేసి వచ్చాక ఇద్దరూ భోంచేసారు.

మళ్ళీ కళ్ళజోడు కోసం వెతుకుతూంటే అత్తగారు అడిగింది, ‘మర్చేపోయాను. రెండు రోజుల క్రితం ఈ కళ్ళజోడు సరిగా కనిపించటల్లేదని, అమ్మాయీ, నువ్వూ కళ్ళజోడు డాక్టరు దగ్గరకెళ్ళి పరీక్ష చేయించుకున్నారుగా? సైటు పెరిగిందని, కళ్ళద్దాలు పవరు పెరిగిందని ఇంకో కళ్ళద్దాలు రాసారన్నావు. ఆర్డరిచ్చారుగా? ఏమైంది? ఆ కొత్త కళ్ళజోడు అయిందేమో, వెళ్ళి తెచ్చుకోలేక పోయావా?’

అప్పుడు గుర్తొచ్చింది. తను వాడే కళ్ళజోడు సడన్ గా చదువుతుంటే కనబడ్డం మానేసింది. తలనెప్పి వచ్చి కళ్ళు లాగడం మొదలైంది.

‘ఒరే మధూ! నా కళ్ళజోడుకి కూడా చత్వారం వచ్చినట్టుందిరా. అక్షరాలు కనిపించటల్లేదు. భూతద్దం వుంటే తీసుకురా.’ పుస్తకం చదువుతూ అంది.

‘ఎందుకూ? భూతద్దాలే కళ్ళజోడుకి పెట్టవే మమ్మీ.’

అప్పుడు కొడుకు మధు ఫ్రెండు రవి తండ్రి కళ్ళడాక్టరు, మధుని తీసుకుని రవి తండ్రి దగ్గర చూపించుకుంది. ఇంట్లోనే వుండి చూస్తాడు. కళ్ళజోళ్ళ షాపూ అక్కడే వుంది. రవి వాళ్ళమ్మగారు ఇంట్లోకి రమ్మని ఎంతో మర్యాద చేసారు. రవి తండ్రి కళ్ళు టెస్ట్ చేసి, ‘ఈ కళ్ళజోడు మీకు పనికిరాదు. సైటు పెరిగింది. బాగా దూరదృష్టి పెరిగింది. కళ్ళద్దాలు మార్చాలి.’ అంటూ పవర్ ఎక్కువ వున్నది రాసిచ్చాడు.

‘మా మమ్మీకి ఐ.క్యూ. ఎక్కువైపోయి, అన్నీ దూరదృష్టితో ఆలోచిస్తుంది. అందుకే సైటు పెరిగి భూతద్దాలు వెయ్యాల్సొస్తోంది.’ అన్నాడు రవి. వాడి మాటలకి అందరూ నవ్వారు.

కొత్త కళ్ళజోడు అర్జంటుగా ఇమ్మని చెబుతే, మర్నాడే ఇచ్చేస్తానన్నాడు.

అది గుర్తొచ్చి ఫోన్ చేసింది కళ్ళజోడు షాపుకి, కళ్ళద్దాలు ఆయాయేమోనని. ఇంకో వారం రోజులు పడుతుందిట. చేసే అతను ఊరెళ్ళాడుట. అత్తగారితో చెప్పింది.

ఆరాత్రి భర్త ఫోన్ చేసాడు. ‘సులో! అనుకోకుండా మీటింగ్ కాన్సిల్ అయింది. అందుకని నేను ఈరోజు రాత్రి 11 గంటల ఫ్లైట్ లో బయలుదేరి వస్తున్నాను. ఇక్కడ స్వాతి వీక్లీ దొరికింది. నీ కథ చదివాను. చాలా బాగుంది. ఎలా అయినా నువు చేయి తిరిగిన రచయిత్రివోయ్. కథకి బొమ్మ చాలా బాగా వేసాడు కదూ. ఏమిటీ, ఇంకా డల్ గా వున్నావు? అమ్మ, పిల్లలు బాగున్నారు కదా?’

‘ఆ. అంతా బాగున్నాం.’ అంది.

ఆరాత్రి ప్రత్యేకంగా వంట చేసింది. కూతుర్ని పిలిచి, ‘సుధా! నాన్నగారు ఈరోజు వస్తున్నారు. త్వరగా దుప్పటి తీసి కొత్త దుప్పటి వెయ్యాలమ్మా.’ అని పురమాయించింది.

‘ఆ. నేను హోమ్ వర్క్ చేసి మారుస్తాను మమ్మీ.’

‘అప్పటిదాకా కుదరదు. నాన్న వచ్చేది రైల్లో కాదు. ఫ్లైట్ లో. త్వరగా మార్చు.’

‘అలాగే.’ అంటూ పాత దుప్పటి తీస్తుంటే కిందపడిన చప్పుడై ఏమిటా అని చూసి, ‘అమ్మా!’ అని ఒక్కసారిగా ఇల్లు అదిరిపోయేలా గావుకేక పెట్టింది.

‘ఏమిటే, ఏమైంది?’ అంటూ కంగారుగా పరిగెట్టుకొచ్చింది. ఇదిగో నీ కళ్ళజోడు. దుప్పటి తీస్తుంటే పడింది. నీ కళ్ళజోడు వెతికిచ్చినందుకు నాకేం గిఫ్టిస్త్తావు?’ అడిగింది.

‘నీ మొహంలే. నువ్వేం వెతకలేదు. ఇలాగియ్యి. ముందర కథ చదవాలి.’ అంటూ లాక్కుంది.

అది మెరూన్ కలర్ కలంకారీ డిజైన్ దుప్పటి. ఆ డిజైన్ లో కళ్ళజోడు ఎదురుగుండానే వున్నా కనిపించలేదు. కథ చదువుదామన్నా ఆ కళ్ళజోడు సరిగా ఆనలేదు.

ఈలోగా టాక్సీలోంచి సూట్ కేస్ తో రాజశేఖరం లోపలికొచ్చాడు. ఆ రోజు ఉదయం నించి రాత్రి దాకా కళ్ళజోడు గురించి పడ్డ కష్టాలు చెప్పలేదు. మధు పడుకుని నిద్ర పోయాడు. లేకపోతే చెప్పేసే వాడే.

మర్నాడు పొద్దున్నే తన స్నేహితురాలు జయలక్ష్మి వచ్చి కళ్ళజోడు తెచ్చి, ‘తల్లీ! నువు రెండు రోజుల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు నీ కళ్ళజోడు తీసి టేబులు మీద పెట్టి మొహం కడుక్కున్నావు, ఏదో అంటుకుందని. గుర్తుందా? అక్కడే పక్కన మా ఆడబడుచు కళ్ళజోడుంటే పెట్టుకుని వెళిపోయావు. మా ఆడబడుచు ‘బాబో! నాకేదో అయిపోయింది కళ్ళకంటూ కళ్ళ డాక్టరు దగ్గరకి వెడితే, ‘ఈ కళ్ళజోడు మీది కాదు. ఇది బాగా హైపవరు.’ అన్నాడు. ఈ పొరపాటు ఎలా జరిగిందా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూంటే నువు షాపింగ్ కెడుతూ మా యింటికి రావడం, మొహం రుద్దుకోవడం గుర్తొచ్చింది. ఇదిగో తల్లీ, నీ కళ్ళజోడు. ఏదీ, మా ఆడబడుచు కళ్ళజోడు? ఆవిడ నామీద కారాలు మిరియాలు నూరుతోంది. ఈ రోజు రాత్రి ఊరెళిపోతుంది.’ అంటూ కాఫీ తాగమన్నా కూడా తాగకుండా హడావిడిగా వెళిపోయింది జయలక్ష్మి.

‘హమ్మయ్య!’ అనుకుంటూ ఆ కళ్ళజోడు శుబ్భరంగా తుడిచి కళ్ళకి పెట్టుకుంది. అర్జంటుగా గదిలోకెళ్ళి వీక్లీలో తన కథ చదువుకుంది ఆనందంగా.

జరిగిన రాధ్ద్ధాంతమంతా కూతురు తండ్రికి చెప్పింది.

‘నీకోసం మరో రెండు కళ్ళజోళ్ళు కొని బీరువాలో పెట్టానని చెప్పాగా? తీసుకోలేదా?’ అడిగాడు భర్త.

‘నాకు తెలీదే, మీరు కొన్నట్టు? నాకెక్కడ చెప్పారు? చెప్పలేదు.’

‘చెప్పాను.’

‘చెప్పలేదు.’

‘చెప్పాను, చెప్పాను, చెప్పాను.’

‘చెప్పలేదు, చెప్పలేదు, చెప్పలేదు. ‘

‘అబ్బబ్బ, వాదులాడుకోకండి. ఎలాగో కళ్ళజోడు కనిపించిందిగా? ఈ సారెప్పుడన్నా కళ్ళజోడు కనిపించకపోతే, ఇంకో కళ్ళజోడు పెట్టుకుని వెతుక్కోవే సులోచనా!’ అత్తగారి ఉచిత సలహా.

ఆరోజు మధ్యాహ్నం సైటు పవరు పెరిగిందంటూ డాక్టర్ రాసిచ్చిన కళ్ళజోడు ఆర్డర్ కేన్సిల్ చెయ్యమంది ఫోను చేసి.

*************************

కొన్నేళ్ళు పోయాక కూతురు సుధకి పెళ్ళయి అమెరికా వెళిపోయింది.

కొడుకు పెళ్ళి చూపులకి వెళ్ళి, అమ్మాయిని ఏమన్నా అడుగు అని తన అన్న, చెల్లి అంటుంటే, మొహమాట పడుతూనే, ‘నాకేం పనక్కర్లేదమ్మా. నా కళ్ళజోడు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటా. అది వెతికిస్తే చాలు.’ అంది.

‘అందులో మా అమ్మాయి ఎక్స్ పర్ట్ అక్కయ్య గారూ! ఎక్కడే వస్తువున్నా, గుండుసూది దగ్గర్నించి చిటికెన వేలి వుంగరం దాకా ఎక్కడున్నా చిటికెలో వెతికిస్తుంది.’ అన్నాడు అమ్మాయి శోభన తండ్రి.

‘అయితే సులోచనా! నీ సులోచనాలకి మంచి బాడీగార్డు దొరికింది.’ అన్నాడు రాజశేఖరం హాస్యంగా.

అందరూ హాయిగా నవ్వుకున్నారు.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked