– కాకుమాని మూర్తికవి
కలికిరా పూములికిరా ముద్దు చిలుకరా అలుకేలరా
కులుకు గుబ్బల తళుకు చెలగే కొమ్మరా ముద్దుగుమ్మరా
అళులు మ్రోయగ నంతకంతకు నలరి వెన్నెల గాయగా
జలజలోచన నోర్వలేదిక జానకీపతి రాఘవా
ఏర పొందును జామురా నా స్వామిరా నికు ప్రేమరా
తీరు గలిగిన బొమ్మ చక్కని దివ్య కపురపు క్రోవిరా
సారె సారెకు యేచ నేటికి జాణ శేఖర మానరా
రార యేలుకొ బుక్కపట్ణము రామచంద్ర దయానిధి
వద్దురా యెలుగొద్దురా యీ ప్రొద్దుయే సరిప్రొద్దురా
బుద్ధి విను నా సద్దు లడిగెడి ముద్దుబాలకి గోలరా
ఒద్దికతొ కూడుండరా యీ ప్రొద్దు నేనిక మ్రొక్కెదా
సుద్దులాడక సుదతి నేలుకొ సొంపుతోడుత రాఘవా
మాటిమాటికి యింతేటికి యిచ్చోటికి అలుకేంటికీ
నాటినాటికి విరహమెచ్చెను నలినలోచను తేగదే
పూట యొక యేడాయనే పూబోణికి అలివేణికి
బోటినేచ నీబోటివారికి పొందుకాదుర రాఘవా
కొమ్మరా (నిను సమ్మెరా) ముద్దుగుమ్మ అన్నియు నెరుగురా
ఎమ్మెమీరగ యేచనేటీకి యింతిపూవుల బంతిరా
కమ్మవిలుతుడు పూవు వింటను యిమ్మరింపుచు నుంటనూ
క్రమ్ముకొని వేయంగ నోర్వదు కాంతనేలుకొ రాఘవా
అంతరంగలోన నుండియు చింత చేయుచు నుండియున్
ఇంతయేచుట నీకు వద్దుర పంతమా బలవంతమా
కొంతదూరుచు నిన్నె కోరెడి కాంతనిప్పుడు యెంచెరా
సంతతంబును వింతలేటికి జానకీపతి రాఘవా
పొంచి మదనుడు శరము లేయుచు అంచ గమనపై నించగా
మించె విరహము మీనలోచన యెంచగా దయ యుంచరా
సంచితంబున దైవరాయ మేలెంచియున్ లాలించియున్
చంచలాక్షిని యేలు వేడుక జానకీపతి రాఘవా
వసుమతీసుత వాసవార్చిత వారిజానన మిక్కిలీ
కుసుమకోమలి కిసలయాధరి బిసప్రసూనపు నేత్రిరా
పసిమి కలిగిన భామరత్నము నేలుకో రహి మించగా
(రసిక శే)ఖర ముణుకులొత్తుదు రామచంద్ర దయానిధీ