బ్రహ్మ తేజస్సు
-అన్నపంతుల జగన్నాధ రావు
(ఇది తెలంగాణలో నవాబుల కాలంలో జరిగిన యదార్ధ సంఘటనగా జనశ్రుతిలో వుంది)
ఆకలి. మూడక్షరాల మాట. మనిషిని ముప్పుతిప్పలు పెట్టే మాట. జఠరాగ్నిని తట్టుకోవడం కష్టమనిపిస్తోంది నారాయణ సోమయాజికి. అన్నం తిని మూడు రోజులైంది. మూడు రోజుల కిందట సాయంకాలం తిన్న గుప్పెడు అటుకులే ఆఖరి ఆహారం. రెండురోజుల నుండీ మంచినీళ్ళ తోనే కాలం గడుపుతున్నాడు. పొద్దున్న పంటి బిగువున సంధ్యావందనం చేశాడు. అప్పటి నుంచి నిస్త్రాణగా పడుకొనే వున్నాడు మండువాలో. లేచి మంచినీళ్ళు తాగడానికి కూడా సత్తువ లేదు. కానీ కడుపులో అగ్నిహోత్రుడు వూరుకుంటాడా? బలవంతంగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసిన్ని మంచినీళ్ళు తాగడంతో కొద్దిగా ఓపికవచ్చినట్టు అనిపించింది. “అమ్మా, గంగాభవానీ, నా ప్రాణాలు నిలబెడుతున్నావా తల్లీ” అనుకున్నాడు.
ఇల్లంతా కలయ జూశాడు. లంకంత యిల్లు. ఒకప్పుడు పిల్లా పాపలతో, వచ్చేపోయే బంధువులతో కళకళలాడుతూ వుండేది. తన దగ