ప్రక్షాళన
-G.S.S. కళ్యాణి.
కాశీక్షేత్రంలో ఉన్న కేదారఘాట్ మెట్ల మీద కూర్చుని, గంగానదిని తదేకంగా చూస్తున్నాడు జానకీపతి. గంగ నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీతీరానికి వస్తున్న చిన్న చిన్న అలలు, జానకీపతి పాదాలకు చల్లగా తాకుతున్నాయి. మహాపుణ్యక్షేత్రంలోని పవిత్ర తరంగాలు జానకీపతి మనసుకు ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేస్తున్నా, ఏదో బాధ అదే మనసును అల్లకల్లోలం చేస్తోంది. ఒంటరిగా కూర్చుని ఉన్న జానకీపతికి తన జీవితమంతా ఒక్కసారి కళ్ళముందు గిర్రున తిరిగింది!
జానకీపతి తండ్రి రాఘవయ్య గవర్నమెంట్ పాఠశాలలో సైన్సు మాష్టారు. రాఘవయ్య అంటే వాళ్ళ ఊరిలో అందరికీ అమితమైన గౌరవం ఉండేది. అయితే, రాఘవయ్య కేవలం అధ్యాపకుడు మాత్రమే కాదు, అతడు మొక్కలపై పరిశోధనలు జరిపే ఒక శాస్త్రవేత్త కూడా అని ఆ ఊరిలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు! మొక్కలు మనుషుల మాటలకు స్పందిస్తాయనీ, అవి మనుషులకు ప్రాణస్నేహితులుగా ఉండగలవని రాఘవయ్య నమ్మేవాడు. తమ ఇంటివెన