కవితా స్రవంతి

పాపం! పిల్లల పాపం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి పుట్టకముందు దేవుడి దయ. పుట్టిన తరువాత ఆయా దయ. రెండు సంవత్సరాలోచ్చేసరికి బేబీకేర్ సెంటర్ దయ. చదువులకొచ్చేసరికి హాస్టల్ దయ. ఉద్యోగమొచ్చేక విదేశాల దయ. అలా పెరిగిన పిల్లలకు తెలియని పదం దయ. మరి వాళ్ళకెలా తెలుస్తుంది దయ? ఇక వాళ్ళెలా చూపుతారు దయ? ఐనా తాము పొందని దయను వాళ్ళెలా చూపగలరు? వాళ్ళ అమ్మానాన్నల ఆవేదనను వాళ్ళెలా బాపగలరు? అందుకే, అలాంటి పిల్లలు తల్లితండ్రులకు దూరమౌతున్నారు, వారికి అమ్మానాన్నలు భారమౌతున్నారు. అందుకే వారిని వృద్ధాశ్రమాలలో చేరుస్తున్నారు. ***

నిజమైన ప్రేమ

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు. నిజమైన ప్రేమెప్పుడూ నిదర్శనాన్నికోరదు, పదిమందిలో ప్రదర్శనాన్ని కోరదు. మెప్పును ఆశించదు, ముప్పు తలపెట్టదు. విశ్వాసంతోనే విస్తరిస్తుంది,విశ్వాసంలోనే వికసిస్తుంది. మల్లెపూలు,మంచిముత్యాలు ప్రేమకు వీక్షణానికి,ఆక్షణానికి నేస్తాలు. కానీ మంచిమనసు,మంచిమాటలు ప్రేమకు శాశ్వతంగా ప్రశస్తాలు. నిజమైన ప్రేమ పరితాపాన్నిఒర్చుకుంటుంది, ప్రతికులాలనుండి పాఠాలను నేర్చుకుంటుంది. ఒరిమినే తన కూరిమిగా,చెలిమినే తన బలిమిగా, మౌనాన్నే మేలిమిగా భావిస్తుంది. ఇచ్చినమాటనే బాటగా చేర్చుకుంటుంది. తను కొలువున్న మనసునే మధురమైన భావాల తోటగా మార్చుకుంటుంది. ****

నీతి లేని…మానవ జాతి

కవితా స్రవంతి
🌷నీతి లేని...మానవ జాతి🌷 - కొప్పోలు యాదయ్య ముక్కు పచ్ఛలారని పక్షుల నిష్కల్మష ప్రేమకు కుల బురద అంటింది ఆ బురద ఎవరికి కనిపించదు ఆ బురద చూసే కళ్ళ దురదకు తప్ప.. ఆ బురద ఎన్ని రకాలుగా శుద్దిచేసుకున్నా, మూలాలు ఎదుటి వాడి మెదడులో దూలాలై దూరినవి జీవుల్లో మనిషి ఓ జంతువే మరి ఏ జంతువుకు లేని కుల వర్గాలు ఈ మనషికే ఎందుకో.. ఒక రకం చెట్టు ఒకే రకమైన పళ్ళనిస్తవి. ఒక జాతి పక్షులు ఒకే పద్ధతి న జీవిస్తాయి. సృష్టిలో ప్రతి జీవి తమ జీవన ధర్మాలను పాటిస్తూ మనుగడ సాగిస్తున్నాయి కానీ... తెలివైన , మానవతా, నాగరిక జీవిగా చెలామని అవుతున్న మనిషికే ఏ జీవన విధానం లేదు.. లేని కులాల మూఢత్వంలో ప్రకృతికి విరుద్ధంగా మనిషి కొత్త మృగమై రాక్షస క్రీఢలో మానవతా విలువలను మంటగలుపుతున్నాడు ఎవడో అంటించిన ఈ రంగుల రావణకాష్ట మనిషి రక్తం మాంసాలతో మండుతూనే ఉంది. ఇది మానవ అనాగరిక రాక్షసత్వనికి పరాకాష్ట ****

నువ్వుండగలిస్తే

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఎదుటివారితో నవ్వుతూ నువ్వుండగలిస్తే నోములన్నిటి ఫలితం నీకు వచ్చినట్లే! ఎదుటివారి తప్పులను నువ్వు క్షమించగలిస్తే పురుషోత్తముని అంశలో నువ్వు ప్రభవించినట్లే! ఎవరినీ నువ్వు వంచించకుండా వెళ్ళగలిస్తే వ్రతాలన్నిటి ఫలితం నిన్ను వరించినట్లే! ప్రశాంతంగా నువ్వు మనగలిస్తే పూజలన్నిటి ఫలం నీపరమైనట్లే! నిగ్రహంగా నువ్వుండగలిస్తే అనుగ్రహంతో నీజీవితం పండినట్లే! నీ చూపులో కరుణను కురిపించగలిస్తే సిద్దులన్నీ నీ సేవకులైనట్లే! నీ మాటలతో మధువులను ఒంపగలిస్తే మహిమలన్నీ నీ పరమైనట్లే! దగా చేయని జీవితం నువ్వు గడుపగలిస్తే దానాలు చేయటంవల్ల కలిగే దివ్యత్వం నీదరి చేరినట్లే! అబద్ధాలు ఆడకుండా నువ్వు నిలువగలిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం నీకు అంటినట్లే! కోరికలను నువ్వు నిలువరించగలిస్తే కైవల్యం నీకై కాచుకుకూర్చున్నట్లే! *****

కన్నీటి మొగ్గలు

కవితా స్రవంతి
-డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా మనసులో కన్నీటి అలజడులే ఎగిసిపడుతుంటాయి కన్నీరు బతుకుపోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం అనంతమైన విషాదజీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు

ఎందుకు?

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి కడలి నుండి కెరటాలు హృదయం నుండి ఆరాటాలు ప్రేమ కోసం పోరాటాలు దూరమైపోవటం లేదే! మరి పెద్దలనుండి నేటి పిల్లలు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? చెట్టు నుండి పచ్చదనం సూర్యుని నుండి వెచ్చదనం చంద్రుని నుండి చల్లదనం ఇవేవీ విడిపోవాలని కోరుకోవటం లేదే! మరి నేటితరం కొడుకులు తమ తల్లితండ్రులనుండి ఎందుకు విడిపోవాలని కోరుకుంటున్నారు? పగలు నుండి రాత్రి జననం నుండి మరణం శాంతి నుండి అశాంతి ఇవేవీ ఒకదానికి విడిచి వేరొకటి ఉండాలని అనుకోవటం లేదే! మరి ఈ అన్నదమ్ములు ఎందుకు విడివిడిగా ఉండాలని అనుకుంటున్నారు? మూడు కాలాలు పంచభూతాలు ఎనిమిది దిక్కులు విశ్వకుటుంబంనుండి వేరైపోదామని అనుకోవటంలేదే! మన కుటుంబాలే ఎందుకు ముక్కలైపోతున్నాయి?

వరం-శాపం

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఈమె బిడ్డకు అన్నం తానే స్వయంగా తినిపిస్తోంది. ఆమె బిడ్డకు ఆహారాన్నిపనిమనిషి తినిపిస్తోంది. ఈమె దీనిని వరంగా గ్రహించి ఇష్టపడుతోంది, ఆమె దానిని శాపంగా తెలుసుకోలేక నష్టపోతోంది. ఈమెకు సంసారమంటే ప్రాణం, ఆమెకు సంపాదనపైనే ధ్యానం. ఈమె ప్రతివిషయంలోనూ వినయంతో ప్రవర్తిస్తుంది. ఆమె ప్రతి విషయంలోను గర్వాన్నిప్రదర్శిస్తుంది. ఈమె పరిస్థితులకు యజమాని, ఆమె స్థితిగతులకు బానిస. ఈమె బిడ్డపై ప్రేమకు లొంగిపోయింది, ఆమె డబ్బుపై భ్రమలోకుంగిపోయింది. ఈమెకు లోకమంతా ప్రేమమయం, ఆమెకు లోకమంతా కాసుమయం. ఈమెను మనసారా ప్రశంసించేవారు ఎక్కువ, ఆమెను ముఖంఎదుట పొగిడేవారు ఎక్కువ. ఈమె బిడ్డ అదృష్టవంతుడై పెరుగుతున్నాడు, ఆమె బిడ్డ ధనవంతుడై ఎదుగుతున్నాడు. ఈమె బిడ్డకు ముద్దు,మురిపాలకు లోటు లేదు, ఆమె బిడ్డకు కలలోకూడా వీటికి చోటులేదు. వీడు కన్నతల్లి ప్రేమ ప్రవాహంలో ఈదులాడుతున్నాడు,

చిటపట చినుకులతో

కవితా స్రవంతి
- భువనగిరి వేంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆ కురిసే వానలో తడవాలని నాకుంది ! వాన వాన వల్లప్పా పాడలని నాకుంది ! వాన నీటి గుంతలో గెంతాలని నాకుంది ! కాగితపు పడవల తొ అడాలని నాకుంది ! చిటపట చినుకులతో చిందులు వేయాలని నాకుంది ! విరిసిన హరివిల్లు ఎక్కాలని నాకుంది ! మెరిసే మెరుపులతో ఎగరాలని నాకుంది ! గొడుగులతో వానలో తిరగాలని నాకుంది ! ఉరుములతో గొంతు కలిపి అరవాలని నాకుంది ! ****

జీవన సాఫల్యం

కవితా స్రవంతి
- కోడం పవన్ కుమార్ శాపం కాదు వ్యాధి అంతకన్నా కాదు అది రెండో బాల్యం క్షణం గడుస్తుంటే వయస్సు పెరుగుతుంటుంది వయస్సు పెరిగేకొద్దీ ముసలితనంతో పాటు పెద్దరికం వస్తుంది భూమ్మీద ఉండటం శాశ్వతం కాదు పుట్టడమే దేహ నిష్క్రమణ కోసం బాల్య కౌమార యౌవ్వనదశలెంత సహజమో వార్ధక్యం అంతే సహజం వయస్సు పెరిగేకొద్దీ సామర్థ్యం తగ్గుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అంతమాత్రాన కుంగిపోవటం వివేకం కాదు మనఃసామర్థ్యం పదిలపరచుకోవాలి శరీరాన్ని విల్లులా వంచడానికి యోగాసనాలను స్వాగతించాలి మనస్సు మలినపడకుండా ధ్యానం దరిజేర్చుకోవాలి శరీరథర్మంగా దేహం బలహీనపడినా జ్నానార్జన వెలుగుతూనే ఉంటుంది మనస్సు ఆరోగ్యంగా ఉంటే దేహారోగ్యం నిగనిగలాడుతుంటుంది వ్రుద్ధాప్యం మరణానికి దగ్గరి మెట్టు కాదు జీవిత గమనంలో ఓ దశ మాత్రమే గడిచే ప్రతిక్షణాన్ని అమ్రుతంలా పొందాలి జీవితాన్ని పండించుకుని జీవన సాఫల్యం పొందాలి ***