రండి! కాళన్నను ఆవాహన చేసుకుందాం!!
- సంగిశెట్టి శ్రీనివాస్
1937లో 23 యేండ్ల వయసులో నిజామాబాద్ ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది మొదలు 2002లో చనిపోయే వరకూ మొత్తం ఆరున్నర దశాబ్దాల పాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయం వైపు, పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజి నారాయణరావు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తెలుగు ప్రజలందరి గుండెల్లో కాళన్నగా నిలిచిపోయిండు. ఆర్యసమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్ళిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, అనువాదకుడిగా, పేదల అడ్వకేట్‍గా, ఎమ్మెల్సీగా ఎప్పటికప్పుడు తన, పర అనే తేడా లేకుండా తప్పెవరు చేసిన తిప్పి కొట్టిండు. తోటి వారి బాధను తన బాధగా పలవరించిండు. కన్నీళ్ళ పర్యంతమయ్యిండు. మొత్తం తెలుగువారి ఇంటి మనిషిగా, తెలంగాణ ప్రజలకు ఆత్మీయుడిగా, ఆత్మగా బతికిన కాళోజి నారాయణరావు శతజయంతి సందర్భమిది. అనితర సాధ్యమైన ఆయన ఆచరణను ఆవాహన చేసుకోవా