వీక్షణం 56వ సమావేశం
-సుభాష్ పెద్దు
వీక్షణం 56వ సమావేశం ఏప్రిల్ 9, 2017 నాడు మిల్పిటాసు లోని అనిల్ రాయల్ గారి ఇంటిలో జరిగగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దింటి తిరుములాచార్యులు గారు అధ్యక్షత వహించారు.
అధ్యక్షుల వారు ముఖ్య అతిథిగా ప్రముఖ కథా, నవలా రచయిత్రి, టీ.వీ సీరియల్ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారిని సభకు ఆహ్వానించి ప్రసంగించవలసినదిగా కోరారు.
బలభద్రపాత్రుని రమణి గారి ప్రసంగ విశేషాలు - "నేను 7, 8వ తరగతులలో ఉన్నప్పుడు కథలు వ్రాయటం మొదలుపెట్టాను. ఒకసారి ఒక పత్రికకు కథ పంపిస్తుంటే మా అన్నయ్య బల్ల కొట్టి మరీ చెప్పాడు, ఈ కథను ప్రచురించరు అని. ఆ కథ ప్రచురించబడటమే కాకుండా పలు ప్రశంసలకు కూడా పొందింది. అద్రక్-కె-పంజే వంటి నాటికలు, చలం గారి రచనలు, ముఖ్యముగా "దైవమిచ్చిన భార్య" మొదలైనవి నన్ను ప్రభావితం చేశాయి. నన్ను ప్రోత్సహించిన వారు ఎందరో. వారిలో ముఖ్యులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు.