సర్వలోక శరణ్యాయ రాఘవాయ!
– దీప్తి కోడూరు
తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన రాముణ్ణి, కన్న కొడుకు మీద మమకారంతో, అసూయాపరురాలైన పినతల్లి కైక అడవులకు పంపమని దశరథుని కోరింది.
తండ్రి మాటను అనుసరించి రాముడు భార్య, తమ్ముడితో కలిసి అడవులకు పయనమయ్యాడు. ఋష్యాశ్రమాల్లో మహర్షుల సత్సంగంలోనూ, జనపదాల్లో సామాన్యులను బాధిస్తున్న రాక్షసులను హతమారుస్తూ, ముని జీవనం సాగిస్తున్నారు వారు.
అలా ఉండగా ఒకనాడు మాయలేడి నాటకంతో మోసగించి రావణుడు సీతను అపహరించి సముద్రానికి ఆవలి వైపున ఉన్న తన లంకా నగరానికి తీసుకుపోయాడు.
సీత లేని రాముడు శశి లేని నిశిలా కుంగిపోయాడు.
ఏమైందో, ఎక్కడ వెతకాలో తెలియక కుప్పకూలిపోయాడు రాముడు. ఎన్నో ప్రయాసలు, వెతుకులాటల తర్వాత, ఎందరో సన్నిహితుల సహాయంతో సీత జాడ తెలుసుకున్నాడు.
లంక మీదకి దండెత్తాలని నిర్ణయించుకున్నాడు.
హనుమత్సహిత సుగ్రీవ, అంగ, జాంబవంతాది వానర మహావీరులతో కూడి కోట్ల సంఖ్యలో వానర సైన్యం వెంటరాగా రామలక్ష్మణులు లంకా నగరం దిశగా బయలుదేరారు. సముద్ర తీరం చేరుకున్నారు.
సముద్రాన్ని దాటడం గురించి, లంకను ముట్టడించడం గురించి మంతనాలు జరుపుతుండగా, సముద్రం మీదుగా దూరంగా ఒక వ్యక్తి, బలిష్ఠులైన నలుగురు అనుచరులతో కూడి సాయుధులై రావడం కన్పించింది.
చూస్తుండగానే వాళ్ళు రాముడి దగ్గరగా వచ్చి, కాస్త ఎడంగా నిలబడి, వినయంగా ఇలా చెప్పారు.
నేను రావణ సోదరుణ్ణి. విభీషణుణ్ణి. నా అన్న సీతమ్మను అపహరించి తెచ్చి లంకలో ఉంచాడు. తప్పని ఎంత వారించినా నా మాట వినలేదు సరికదా నన్ను నానా దుర్భాషలాడి సభాస్థలిలో నలుగురి ఎదుట అవమానించాడు. అందుకే నేను నా వాళ్ళందర్నీ వీడి రాముని శరణు కొరకు ఇలా వచ్చాను.
విభీషణుడి మాటలు వింటూనే సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి, “రామా, యితడు శతృ పక్షం వాడు. వీళ్ళను నమ్మడానికి లేదు. సంహరించడానికో లేక వెన్నుపోటుకు సిద్ధపడో ఇలా వచ్చారని నా అనుమానం. కాబట్టి వీళ్ళను బంధించడం లేదా వధించడమే శ్రేయోదాయకమని నా అభిప్రాయము.” అని చెప్పాడు.
రాముడు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించక తక్కిన వానర ప్రముఖుల అభిప్రాయమేమిటని అడిగాడు. రాముడి మాటలు వినగానే అందరికీ ఉత్సాహం వచ్చేసింది. ప్రతివారూ తమ అభిప్రాయం చెప్పాలని ఉవ్విళ్లూరసాగారు.
ముందుగా సుగ్రీవుడి కొడుకు, యువరాజైన అంగదుడు మాట్లాడాడు. “ఇతడు శతృ పక్షంవాడు కనుక అనుమానించడం యుక్తమే. కానీ అంతకంటే ముందు ఇతడి గుణదోషములు విచారించి, అధిక గుణ సంపన్నుడైతే మనలో ఒకడిగా స్వీకరించడం మంచిదే అని నాకనిపిస్తోంది.”
తరువాత శరభుడనే వానరయోధుడు ఇలా చెప్పాడు. “ఇతడి గురించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు మనం ఒక గుఢాచారిని లంకకు పంపి, విషయం తెలుసుకుంటే మేలని నా అభిప్రాయం”
అటు పై జాంబవంతుడు, “యితడు రావణుడి తమ్ముడు. కచ్చితంగా అతడి పాపపు స్వభావాన్ని ఎంతో కొంత యితడు కూడా కలిగి ఉంటాడు. కాబట్టి ఇతన్ని అనుమతించటం ప్రమాదకరం కావచ్చు” అని చెప్పాడు.
” ఇతడితో కొంతసేపు మాట్లాడి, అతడి మాటలను బట్టి అతడి గుణగణాలు అంచనా వేయొచ్చు” అని మైందుడనే వానరుడు సలహా ఇచ్చాడు.
అలా ఎవరికీ తోచిన సలహా వారు చెప్తున్నారు.
చివరగా హనుమంతుడు లేచాడు. వినయంగా రామునికి నమస్కరించి చెప్పటం ఆరంభించాడు.
“రామా, మీకు చెప్పగల వారమా మేము? అయినా మీరు అడిగారు కనుక నాకు యుక్తమని అనిపించింది చెప్తాను. ఇంత వరకూ చెప్పిన వారి సలహాలేవీ అనుసరణీయాలు, ఆచరణయోగ్యాలు కావు. ఇతడిని నిశితంగా గమనిస్తే ఇతడిలో కపట ఛాయలు గోచరించడం లేదు. లోపల కల్మషం ఉన్నవాడు పైకి ఇలా నిర్మలంగా ఉండలేడు. ఇతడి రాక మనకు శుభశకునంగా అనిపిస్తోంది. బహుశా ఇతడు కూడా రావణుడి పతనాన్ని ఊహించి, రాజ్యాధికారం కోసం రాముని శరణు వేడటానికి వచ్చాడు అనిపిస్తోంది. వాలిని చంపి సుగ్రీవుని రాజుని చేసావు కదా, అలాగే తనకు కూడా జరగవచ్చేమో అనే ఆశతో వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఇతడికి ఆశ్రయమిచ్చుట యుక్తమే అని అనిపిస్తోంది.”
అందరి మాటలు విన్న తర్వాత రాముడు తన నిర్ణయాన్ని ఇలా తెలియజేశాడు.
శ్లో|| మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన|
దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదగర్హితం ||
“ఎవరైనా నా చెంతకు వచ్చి “నేను నీకు శరణాగతుడను” అని వేడితే, వారిలో ఎన్ని దోషాలున్నా వారిని నేను విడిచి పెట్టాను. అది నా వ్రతము.అతడిలో మంచి, చెడ్డలు నేను ఎన్నను.” అని ఒకే వాక్యంలో రాముడు తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా చెప్పాడు,
” విభీషణుడే కాదు సాక్షాత్తు రావణుడే వచ్చి, “శరణు రాఘవా!” అంటే తప్పక శరణమిచ్చి, ఆదుకుంటాను. అదే నా ధర్మము. అదే క్షత్రియ ధర్మం. క్షత్రియుడు ఎవడైనా శరణన్న వాడికి అభయమిచ్చి, కాపాడాలి.
విభీషణుడు రాజ్యం కోసమే నా సహాయార్థం వచ్చినా తప్పక అతడి కోరిక నేను తీరుస్తాను. రావణ సంహారం తథ్యం కనుక ఇతడే లంకకు రాజు.
ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. ఒకవేళ నేను చెప్పినట్టు రావణుడు నా శరణు జొచ్చితే, రావణుణ్ణి అయోధ్యకు రాజును చేసి, నేను దండకారణ్యానికి వెళ్ళిపోతాను.” అని చెప్పాడు రాముడు.
రామో విగ్రహవాన్ ధర్మః అంటే ఏమిటో బోధపడటానికి ఈ ఒక్క సందర్భం చాలదా?
ఈ సందర్భమే ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
శరణన్న వాణ్ణి కాపాడతానని రాముడు అభయమిచ్చింది కేవలం విభీషుణుడికి మాత్రమే కాదు.
సర్వ లోకాలకు!
అంటే మనందరికీ.
త్యక్త్వా పుత్రామశ్చ దారామశ్చ రాఘవం శరణం గతః – అని విభీషణుడిలాగా శరణు వేడితే రాముడు ఎవరినైనా, ఎట్టివారినైనా అనుగ్రహించి, అక్కున చేర్చుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు.
సర్వ మానవాళి రామ చంద్రుని దివ్యప్రేమలో ఓలలాడి సమస్త శుభాలు సంప్రాప్తించుకోవాలని ప్రార్థిస్తూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!