సారస్వతం

తెలుగేల యన్న…..

– వాసిరెడ్డి అమర్ నాథ్
Founder Chairman of Slate Schools (AP & Telangana)

” నా బుజ్జి కన్నా ! బంగారు కొండా .. నీకు లాల పోస్తాను .. అయ్యాక వెండి గిన్నెలో చందమామ రావే అంటూ గోరు ముద్దలు తినిపిస్తాను .. అయ్యాక ఇద్దరం కలిసి బజ్జున్దాము . అప్పుడు నీకు కాశీ మజిలీ కథ లు చెపుతాను . సరేనా … నా చిట్టి తండ్రికి బుగ్గన చుక్క పెట్టాలి .. ఈ రోజు నా దిష్టి తగిలేట్టు వుంది “

అర్థం చెడకుండా దీన్ని ప్రపంచం లోని ఏ ఇతర భాష లో కైనా అనువదించండి చూద్దాం !
కావడం లేదా ? పోనీ దీన్ని ట్రై చెయ్యండి .

” నాకు కడుపు కోత మిగిలిచ్చి వెళ్ళిపోయావు కదరా నా తండ్రీ!.. ఏదో బిడ్డ బాగుపడుతాడు…. మంచి కొలువు సాధిస్తాడు . కడుపులో చల్ల కదలకుండా బతుకుతాడు ….అని నిన్ను ఆ కార్పొరేట్ హాస్టల్ వేయించాను . ఆ నరరూప రాక్షసులు బిడ్డ ఉసురు పోసుకొంటారు నేనేమైనా కలకన్నానా ? గర్భశోకం పగవాడికి కూడా వద్దు తండ్రీ !………. “

కావడం లేదా ?
మీరు ఎంతగా ప్రయత్నించినా కుదరదు .

ఒక భాష స్థానిక భౌగోళిక చారిత్రక పరిస్థితుల నుంచి పుడుతుంది . ఆ స్థానిక సంస్కృతీ కి చెందిన వ్యక్తుల మనోభావాలను వ్యక్తీకరిస్తుంది . ప్రపంచం లో ఒక్కో సంస్కృతీ సమూహానిది ఒక్కో అనుభం .. అలాంటి అనుభవం మరో సమాజం లో వుండే అవకాశం లేదు . కాబట్టి మరో భాషలో ఈ భాషా పదాలకు పర్యాయ పదాలు వుండవు .

ఎస్కిమో భాషలో మంచు కు అరవై పదాలు వున్నాయి. ఒక్కో రకం మంచు ను వారు ఒక్కో లా పిలుస్తారు. ఉదాహరణకు” అపుట్ “అంటే నేల పై ఉన్న మంచు. “పుకాక” అంటే గడ్డలుగా మారిన మంచు. “నిలక్” అంటే మంచి నీటిని తయారు చేసుకోవడానికి అనువైన మంచు . తెలుగు లో అనువాదం చేస్తే ఎలా ఉంటుంది ? ఇది మంచా ? { అపుట్ }. కాదు ఇది మంచు { నిలక్ } . పిచ్చిగా వుంది కదా ? వారిది మంచు ప్రాంతం . కాబట్టి అన్ని రకాల మంచులు . మనకి ఒకటి లేదా రెండు రకాలు అంటే. వారి అవసరాలు వేరు. అవసరాల కొద్దీ భాష.

భాష ఒక తరంనుండి మరో తరానికి సంస్కృతీ ని అందించే డిఎన్ఏ . సంస్కృతీ అంటే అనేక తరాల సంచిత విజ్ఞానం . అంటే ఒక తరం వారు తమ బాషా ద్వారా, తాము తమ జీవితకాలం లో నేర్చుకొన్న దాన్ని అలాగే తమ పూర్వీకులు తమకు నేర్పిన దాన్ని కింది తరాల వారికి అందిస్తారు . భాష ను మరచిపోతే ఇక ఆ సంస్కృతీ అంతరించినట్టే . సంస్కృతి అంతరించడం అంటే మన పూర్వీకుల ఎన్నో వేల సంవత్సరాలుగా తమ అనుభవంనుండి మనకు అందించిన పాటలను మరచిపోవడమే .

తెలుగేల యన్న .. తెలుగు మన మాతృ భాష . ఈ ప్రాంతం లో పుట్టి పెరిగిన మన జాతి సంపద. వారసత్వం. సంచిత విజ్ఞానం. అనుభవాల హారం. మనం తెలుగు మరచిపోతే మన సంస్కృతీ తో, పూర్వీకుల సంచిత అనుభవం తో సంబంధం తెగగొట్టుకొన్నట్టే. అంటే మన అసిత్వాన్ని పోగొట్టుకొన్నట్టే. అప్పుడు ఎండిన పండుటాకుల గాలి ఎటు వీస్తే అటు యెగిరి పోతాం. మాతృ భాష ను మాట్లాడితే మన వేళ్ళు బలం గా ఉన్నట్టు . అప్పుడు ఎంత ఎత్తుకైనా ఎదగ వచ్చు . ఎన్ని దిక్కులైన విస్తరించి వచ్చు.

మాతృ భాష తల్లి పాల వంటిది . ఇంగ్లీష్ భాష డబ్బా పాలు . మీ పిల్లకు తల్లి పాలు దూరం చేస్తారా ? ఉపాధి కోసం ఇంగ్లీష్ నేర్చుకోవలసిందే. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర లేదు. కానీ ఇంగ్లీష్ భాష మోజులో పడి పిల్లల్ని మాతృ భాష కు దూరం చెయ్యకండి . పిల్లలు రెండు మూడు భాష లు చాల సులభం గా నేర్చుకొంటారు. పెద్దయ్యాక కొత్త భాష నేర్చుకోవడం చాల కష్టం. అదే పదేళ్ల లోపు పిల్లలు రెండు మూడు భాష లు చాల సులభం గా నేర్చుకొంటారు. ఒకే భాష నేర్చుకొన్న పిల్లలకన్నా రెండు మూడు భాష లు నేర్చుకొంటున్న పిల్ల మనోవికాసం బాగా జరుగుతుంది. చురుకైన బుద్ధి, గ్రహణ శక్తి కలిగి వుంటారు . వయసయ్యాక అల్జీమార్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గి పోతుంది .చదువు ఆంగ్ల మాద్యం అంటే అది తెలుగు కు వ్యతిరేకంకాదు అని గ్రహించండి . ఏ మాధ్యమం చదువు అనేది పెద్ద సమస్య కాదు. మాతృ భాష లో మాట్లాడాలి

ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలు ఆంగ్లాన్ని స్కూల్ లో నేర్చుకొంటారు. మీరు వారితో ఇంట్లో తెలుగు లోనే మాట్లాడండి . రెండు భాష లు వారు చక్కగా నేర్చుకొంటారు. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం.. ఈ నాలుగు ప్రక్రియల ద్వారా ఒక భాష ను నేర్చుకోవచ్చు. ఇది పీరామిడికల్ గా ఉంటుంది . మన స్కూల్స్ లో దీన్ని తలకిందులు చేసి…. అంటే ముందుగా రాయడం తో ఇంగ్లీష్ భాష నేర్పుతారు . అందుకే పిల్లలు సరిగా ఇంగ్లీష్ నేర్చుకోరు. అదేంటి అంటే” మీరు ఇంట్లో కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితేనే పిల్లకు ఇంగ్లీష్ వస్తుంది “అంటారు. అలాంటి మూర్ఖ గురువులకు చెప్పండి .. తల్లి పిల్లలకు భాష నేర్పించినట్టే అంటే పిల్లలతో చిన్న చిన్న మాటలతో మాట్లాడడం .. వారు దాన్ని తిరిగి చెప్పేలా చెయ్యడం .. బాషా బోధనా ఇలా జరగాలి అని . భాషా బోధనలో తల్లి కి మించి న గురువు లేదు. అందుకే మాతృ భాషా అన్నారు. తల్లి తండ్రీ గురువు అన్నారు .

పరాయి భాషా పై మోజు తో మీ పిల్లల్ని ఈ రోజు తెలుగు కు దూరం చేస్తే వారికి కన్న ప్రేమ దూరం అయినట్టే .. వారు రేపు మిమ్మల్ని వృద్దాశ్రమాల్లో దించేస్తారు. పిల్లి మియ్యావ్ అంటుంది. కుక్క భౌ భౌ అంటుంది. ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ లో తాను మాట్లాడడం కాదు. ప్రపంచానికి తన భాషా ను నేర్పాడు. తమిళులు ఆరు తరాలు దాటినా మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఇంకా స్వచ్ఛమైన తమిళాన్ని మాట్లాడుతున్నారు .

తెలుగు వారికి మాత్రం తెలుగు లో మాట్లాడడం నామోషీ. వెనకపాటు తనానికి చిహ్నం. పోనీ ఇంగ్లీష్ లో నైనా చక్కగా మాట్లాడుతారా అంటే అది ఉండదు . మొత్తం సంకర భాష. ఒక్క భాష లో కూడా సరిగ్గా మాట్లాడలేని దౌర్భాగ్య స్థితి లో ఎవరైనా వున్నారా అంటే అది తెలుగు వారే ! అంతేలే .. సొంత భాష పై మక్కువ లేని వారికి ఇతరత్రా భాష లు నేర్చుకొనే అవకాశం ఎక్కడ ఉంటుంది .

తెలుగు భాష ను కాపాడండి అనే దిక్కుమాలిన స్లోగన్ నేను ఇవ్వను. కాపాడు కోవలసింది మన అస్తిత్వం. మన సంస్కృతీ. మన మనుగడ. మనల్ని మనం కాపాడు కోవాలి అంటే మన భాష ను మనం మరవొద్దు. భాష ను మనం కాపాడ్డం కాదు .. భాష మనల్ని కాపాడుతుంది. తెలుగు కు మన పిల్లలు దూరం అయితే ప్రపంచం లోని అత్యుత్తమ లైఫ్ స్కిల్స్ పాఠాలైన వేమన సుమతి పద్యాలకు, త్యాగయ్య రామదాసు అన్నమయ్య పలుకులకు వారు దూరం అయినట్టే. త్యాగయ్య .. నాకు సంగీతం రాక పోయినా నేను గురువుగా భావిస్తాను. విగ్రహం తిరుపతి లో ని స్కూల్ లో ఏర్పాటు చేశాను. తిరువయ్యుర్ లో జరిగే ఆయన ఆరాధనత్సవాలకు వెళ్లడం అంటే మహాబాగ్యంగా భావిస్తాను. అయిన పుట్టింది పెరిగింది తమిళనాడు లో రాసింది తెలుగు లో  తమిళులకు భాష అభిమానం ఎక్కువ. అలాంటి తమిళుల చేతనే తెలుగు పాటల్ని లక్షల సార్లు పాడించిన త్యాగయ్య సాహిత్య ప్రేరణతో , తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న తెలుగు మహా సభ లా సందర్భం గా నైనా ఒక్క ప్రతిన పూనండి. ఇంట్లో తెలుగు మాట్లాడుదాం. తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుదాం. యాస లు భాష లో ఊడలు లాంటివి. ఎన్ని యాసలుంటే అంత దూరానికి ఊడల మర్రి విస్తరిస్తుంది. యాసల్ని గౌరవంచండి. భాష ను ప్రేమించండి, అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది. ఎందరో మహానుభావులు .. అందరికి వందనములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked