వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం-104 వ సమావేశం

-వరూధిని

వీక్షణం-104 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా, అత్యంత ఆసక్తిదాయకంగా ఏప్రిల్ 11, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా గారు “జాషువా కవిత్వం” అనే అంశం మీద ప్రధాన ప్రసంగం చేశారు.

“సుమారు 18వ శతాబ్దం వరకు ఛందోబద్దమైన సాహిత్యమంతా దైవ స్తుతుల్లోనో, పురాణేతిహాసాల్లోనో , రాజ మందిర చరిత్రలోనో, శృంగారవర్ణనల బాహుబంధాల్లోనో చిక్కుకుపోయిదని, అక్కడక్కడా వేమన పద్యాల్లోనో, శ్రీనాథుని చాటువుల్లోనో కనిపించినా వాటిని కావ్యాలుగా పరిగణించలేం” అని అన్నారు శ్రీధర్ రెడ్డి గారు.
“సుమారు 17~18 శతాబ్దాలలో సాంఘిక, సామాజిక అంశాల పట్ల గురజాడ, కందుకూరి, విశ్వనాథ, దువ్వూరి, దాశరథి, చిలకమర్తి, జాషువా మొదలైన కవులు వ్రాయటం మొదలెట్టినా ఎక్కువమంది కవులు సాంఘిక అంశాలకు కథ, నాటక, నవలా రూపాల్ని ఎంచుకున్నారు. జాషువాగారు మాత్రం ప్రాచీన ఛందోబద్ధమైన శైలిలోనే కొనసాగించారు. జాషువా గారి రచనాశైలి ప్రాచీనం కానీ, వస్తువు తత్కాల సామాజిక అంశాలు” అంటూ వివరిస్తూ
“జాషువా రచించిన కావ్యాల్లో ప్రసిద్ధిగాంచినవి గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తుచరిత్ర, కాందిశీకుడు, మరెన్నో ఖండకావ్యాలు. కాళిదాసు మేఘసందేశంలో ఇరువురు ప్రేమికుల మధ్య మేఘం రాయబారం నడుపుతుంది. కానీ గబ్బిలంలో కథానాయకుడు ఒక నిరుపేద దళిత వర్గానికి చెందిన కార్మికుడు. తాను అనుభవిస్తున్న కులవివక్ష, అస్పృశ్యత, దేవాలయ ప్రవేశ నిషేధం, శ్రమదోపిడీ గురించి మధనపడుతూ, తన ఇంట్లో తిరుగాడుతున్న ఒక గబ్బిలంతో తనబాధలు వర్ణిస్తూ కైలాస శిఖరాన ఉన్న పరమేశ్వరుని వద్దకు రాయబారం పంపుతాడు. సరళమైన పద్యాలు గల ఈ కావ్యంలో హైందవ సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అత్యంత హృద్యంగా వర్ణించారు జాషువా గారు.హైందవం నిరంతరం తనను తాను సంస్కరించుకుంటూ, లోపాల్ని సవరించుకుంటూ పరిణామం చెందుతుందంటే. దానికి కారణం జాషువా లాంటి కవిబ్రహ్మలే.” అన్నారు.

“కావ్యారంభంలో ఆ నిరుపేద అణగారినవర్గ నిర్భాగ్యుణ్ణి వర్ణిస్తూ,

“వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనముబెట్టు వానికి భుక్తిలేదు”

“వాని నైవేద్యమున నంటు వడిన నాడు
మూడు మూర్తులకును గూడ కూడు లేదు”

“ఆ యభాగ్యుని రక్తంబు నాహరించి
ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు
కసరి బుసకొట్టునాతని గాలిసోక
“నాల్గు పడగల హైందవ నాగరాజు”

అతను శ్రమించి పొలంలో కష్టపడితేనే పండిన పంట. దానికి “అంటు” ఉన్నదంటే త్రిమూర్తులకు కూడా నైవేద్యం ఉండబోదు కానీ, అతని శ్రమమీద నిర్మితమైన హైందవ సమాజం అతన్ని చూస్తేనే అంటరాని వాడని బుసకొట్టి వెలివేసిందని తత్కాల సమాజాన్ని వర్ణిస్తూ హృదయాన్ని ద్రవింపజేసారు జాషువాగారు.

“కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్షయేమొ
ఈశ్వరుని చేత రుజువు చేయింపవమ్మ!”

పూర్వజన్మ కర్మఫలం వల్లనే ఈ జీవితం ఇలా ఉంది అని అంటున్నారు, ఆవిషయం ఈశ్వరుని వద్ద నిగ్గుదేల్చమని గబ్బిలంతో అంటున్నాడు.

“నేను నాకను నహము ఖండింపలేక
పదియు నెనిమిది శాస్త్రాలు పదునులుడిగె”

అష్టాదశ అధ్యాయాలతో వర్ధిల్లుతున్న భగవద్గీతను చదవటం తప్ప పాటించట్లేదని ఆవేదన పడుతున్నాడు.

“ధర్మసంస్థాప నార్థంబు ధరణిమీద
నవతరించెద ననె నబ్జభవుని తండ్రి
మునుపు జన్మించి నెత్తి కెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మునిగినది లేదు”

అద్భుతమైన నిందాస్తుతి పద్యమిది. మునుపు అవతారమెత్తి
మమ్మల్ని ఉద్ధరించింది లేదు. ఇపుడు రాకున్నా మాకు పోయేది ఏమి లేదు అంటూ.. దేవదేవునిపై నిందాస్తుతి.

“సహగమనాచార దహనదేవతలెన్ని
చిగురుగొమ్మల బూదిచేసెనొక్కొ?
చదువుదాచెడి దురాచరణ మెందరి కళా
భ్యసన చాతురి గొంతు బిసికెనొక్కొ?”

నాటి సమాజంలో సతీసహగమనం పేరుతో మొక్కుబళ్ల పేరుతో ఎందరు ఆడకూతుర్లు బలయ్యారో అంటూ దురాచారాల్ని ఖండించారు జాషువాగారు” అని ముగించారు శ్రీధర్ రెడ్డి గారు.

ఆ తర్వాత జరిగిన ప్లవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. కవిసమ్మేళనానికి శ్రీ రావు తల్లాప్రగడ అధ్యక్షత వహించగా శ్రీ కిరణ్ ప్రభ, డా||కె.గీత, శ్రీ మధు ప్రఖ్యా, శ్రీమతి శారద కాశీవఝల, శ్రీ కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ దాలిరాజు వైశ్యరాజు, శ్రీ తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, శ్రీ వికాస్ విన్నకోట, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీమతి షంషాద్, శ్రీ వరకూరు గంగా ప్రసాద్ మొ.న కవులు పాల్గొన్నారు. శ్రీ వరకూరు ప్రసాద్ గారు రాసిన లలితగీతాన్ని వారి కుమార్తె కుమారి ఈశా అతి శ్రావ్యంగా పాడడం విశేషం.

తరువాత కిరణ్ ప్రభ గారి ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ అందరినీ అమితంగా అలరించింది.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు విశేషంగా పాల్గొని సభను జయప్రదం చేశారు.

వీక్షణం-104 వ సమావేశాన్ని “వీక్షణం” యూట్యూబు ఛానలులో ఇక్కడ చూడవచ్చు.


——–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked