-శారదాప్రసాద్
ఇది శ్రీ మహాభాగవతంలోని కధ.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం యొక్క అంతరార్ధం ఈ కధలో ఇమిడి ఉంది.ఆ శ్లోకం ఏమిటంటే–“యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ
భావితః,”అంటే ,జీవుడు దేనిని గూర్చి స్మరించుచు శరీరమును చాలించునో అద్దానిని గూర్చియే పునర్జన్మమును పొందుచున్నాడని అర్ధం! ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము.జడభరతుని కధ దీనికి చక్కని ఉదాహరణ.
జడభరతుడు యోగియైనప్పటికిని మరణ సమయమున ప్రగాఢముగనున్న మమకారము వలన జింకనుగూర్చి యోచించుచు ప్రాణములను చాలించినందువలన మరుజన్మమున జింకయై జన్మించెను. దాదాపుగా అటువంటిదే ఈ అజామిళుడి కధ కూడా! కేవలం మరణ సమయంలో మాత్రమే నారాయణ నామ స్మరణ చేయటంవలన అజామిళుడు మోక్షాన్ని పొందాడు.ఇక అజామిళుడి కథను గురించి తెలుసుకుందాం!
కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పాపాత్ముడు, సదాచారాలను విడిచిపెట్టిన దౌర్భాగ్యుడు.జూదరి,దొంగతనాలను చేసేవాడు .యౌవనపు మదంతో ఒక దాసిని భార్యగా చేసికొని ఆమె వలన పదిమంది కొడుకులను కన్నాడు. సంసార వ్యామోహంలో పడి చాలాకాలం సుఖాలు అనుభవించి వృద్ధుడయ్యాడు. అజామిళుని నల్లని వెండ్రుకలు తెల్లబడ్డాయి. అవయవాలు పట్టుదప్పాయి . ఇంద్రియ వాంఛలు ఇక వద్దు అన్నట్లుగా తల అడ్డంగా వణకసాగింది. కంటిచూపు తగ్గిపోయింది. నోటికి రుచితెలియటం లేదు . దంతాలు ఊడిపోయాయి. అజామిళుడికి ఎనబై ఎనిమిదేండ్లు నిండాయి. కాని భ్రాంతి వదలలేదు . అతని చిన్న కొడుకు పేరు నారాయణ. చిన్నకొడుకంటే అతనికి ప్రాణం .ఎక్కువగా అతనితోనే త్రాగుతూ, తింటూ జీవితాన్ని గడుపుతున్న అజామిళుడు దరిచేరుతున్న మృత్యువును గురించి తెలుసుకోలేకపోయాడు. ఆ వయసులో అతను ముగ్గురు యమకింకరులను గుండెలు అదిరిపోగా దూరంగా చూశాడు. వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. చేతుల్లో భయంకరంగా ఉన్న పాశాలను పట్టుకొని ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.దూరంగా ఆడుకుంటున్న కుమారుడు అతని హృదయసీమలో గోచరించగా “ నారాయణా! నారాయణా! నారాయణా!” అంటూ కొడుకును పిలిచాడు.
అజామిళుడు మరణ సమయంలో నారాయణ నామస్మరణ చేస్తుండగా ఆ పరిసరాలలో తిరుగుతున్న విష్ణుదూతలు తమ ప్రభువు నామాన్ని విని అక్కడికి వచ్చారు. వెంటనే యమకింకరులను వారించారు .ఆ బ్రాహ్మణుని శరీరం నుండి ప్రాణాలను బయటికి గుంజుతున్న యమభటులను విష్ణుదూతలు బలవంతంగా త్రోసి అవతల పడవేశారు.తమ ప్రయత్నం విఫలం కాగా యమదూతలు ఇలా అన్నారు.“మీరెవరు? ఇలా మా చేతికి చిక్కినవాణ్ణి ఎందుకు బలవంతంగా విడిపించారు? యముని శాసనాలను నవ్వులపాలు చేస్తారా? శాంతంతో కూడిన మీ శరీర కాంతులు చీకట్లను పారద్రోలుతూ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మీరు మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి?” అని యమదూతలు పలుకగా ఆ విష్ణుదూతలు,“మీరు యమదూతలైతే పుణ్య లక్షణాన్ని, పాప స్వరూపాన్ని, దండనీతిని వివరించండి. ఇతడు ఉండవలసిన స్థానాన్ని వెల్లడించండి. దండింపదగినవారెవరు? లోకంలోని సర్వ ప్రాణులా? లేక పాపకర్ములైన కొందరా?”అనగా, యమభటులు ,”వేదాలలో ఏది చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మం. దానికంటే భిన్నమైనది అధర్మం. వేదాలన్నీ విష్ణుస్వరూపాలని విన్నాము కదా! నారాయణుడు అంతర్యామియై సర్వప్రాణులలో నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నాడు. అంటే సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, గోవులు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలాలు, భూమి మొదలైనవి. కర్మబద్ధులైన జీవులందరూ దండింపదగినవారే. కావాలని కర్మలను చేసేవారికి ఆ కర్మల ననుసరించి శుభాలు, అశుభాలు కలుగుతూ ఉంటాయి.”
“ఈ లోకంలో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత శాంత స్వభావులు, ఘోర స్వభావులు, మూఢ స్వభావులు అని మూడు విధాలుగా విభజించబడ్డారు . వీరిలో శాంతస్వభావులు ధర్మమార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు. ఘోరస్వభావులు చెడు మార్గాలలో నడచి నానా కష్టాల పాలవుతారు. మూఢస్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తారు . వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోయే జన్మలు లభిస్తాయి. ధర్మస్వరూపుడైన యముడు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆయా జీవుల ధర్మాధర్మాల స్వరూపాలను విశేష దృష్టితో గమనిస్తూ వాటికి అనురూపమైన మార్గాలను కల్పిస్తుంటాడు. అజ్ఞానం, తమోగుణంతో కూడినవాడైన జీవుడు పూర్వకర్మల చేత ఏర్పడిన ఇప్పటి ఈ దేహమే తానని భావిస్తాడు. అందువల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. సంసార బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు.కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాన్ని జయించలేక సంసార బద్ధుడైన జీవుడు కర్మలు బంధహేతువులని తెలిసి కూడా పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల ఇష్టం లేకపోయినా బలవంతంగా కర్మలు చేస్తున్నాడు. “
“పట్టుపురుగు తన నోటిలో నుండి వచ్చిన దారాలతోనే తనచుట్టూ ఒక గూడు అల్లుకొని దానిలోనుండి బయటపడే మార్గంలేక నశించినట్లే జీవుడు స్వయంగా తనచుట్టూ ఏర్పరచుకొన్న కర్మబంధాలలో చిక్కి నలిగిపోతున్నాడు. జీవుని వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వ జన్మంలో ఎట్లా ఉండేవాడో రాబోయే జన్మలో ఎలా ఉంటాడో నిర్ణయింపవచ్చు. ఏ జీవి అయినా ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేడు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి.అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండి జీవుని స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతుంటాయి. అవి అప్పటి తల్లిదండ్రుల పోలికలను సంతరించుకుంటాయి.”
“ఈ అజామిళుడు పూర్వజన్మంలో చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కులంలో జన్మించాడు. ఎల్లప్పుడు సదాచారాన్ని పాటించే బుద్ధి కలవాడై ఉత్తమమైన జ్ఞానమార్గాన్ని అవలంబించే సమయంలో మదనోన్మాదాన్ని కలిగించే నవయౌవనం అతని హృదయంలో జొరబడింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో… రతిక్రీడలో చతురురాలైన తన ప్రియురాలైన స్వైరిణి వృషలితో ఆనందిస్తున్న ఒక కాముకుణ్ణి చూశాడు. దిగంబరంగా ఉన్న కటిప్రదేశం కల విటుణ్ణి చూశాడు. కాముకత్వం మూర్తీభవించిన ప్రియురాలితో శృంగారకేళిలో తేలియాడుచున్నవాణ్ణి అజామిళుడు చూశాడు. అతని పులకించిన రోమాలు నిక్కబొడుచుకున్నాయి.”
“ఆ వెలయాలిని చూచి అజామిళుడు కామోద్రేకంతో ఉవ్విళ్ళూరాడు.మాటిమాటికి ఏపు మీరిన ఆమె చూపులనే మోహపాశాలలో చిక్కుకొన్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను మరిచిపోయాడు. అతని మనస్సనే అరణ్యంలో కామేద్రేకమనే కార్చిచ్చు చెలరేగ సాగింది. అప్పటినుండి అతని మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు.అజామిళుడు కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రి సంపాదించిన ఆస్తినంతటినీ దాని పాలు చేశాడు. సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల వెలయాలి అందచందాలకు లొంగిపోయాడు. సుగుణవతి, సౌందర్యవతి అయిన తన భార్యను ఇష్టపడక, నీచుడై తెలివితక్కువతనంతో ఆ వెలయాలి ఇంటికి వెళ్ళసాగాడు. బంధువులను తిట్టి, సజ్జనులను బాధించి, దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసి, దారులు కొట్టి దోచుకొనడంలో దిట్టయై, నిందలను లెక్క చేయకుండా జీవింపసాగాడు. ఈ విధంగా చాలాకాలం అజామిళుడు భ్రష్టాచారుడై ఆ వేశ్య కుటుంబాన్ని పోషిస్తూ ఆమెనే భార్యగా భావిస్తూ చెడుమార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఈ పాపాత్ముడు, కుటిల చిత్తుడు, సజ్జన కంటకుడు, ధూర్తుడు అయిన ఈ క్రూరుణ్ణి బలవంతంగా తీసుకొని పోతున్నాము. తరువాత ఇతడు తగిన దండనం పొంది ధన్యుడౌతాడు ”.
ఈ విధంగా మాట్లాడుతున్న యమదూతలతో విష్ణుదూతలు ఇలా అన్నారు.“ఔరా! మీ ధర్మాధర్మ విచక్షణా సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను, దండింపరాని వారిని దండిస్తారన్న విషయం వెల్లడి అయింది. యమదూతలారా! ఇతడు మరణ సమయంలో అమృతమయమైన అక్షరాలతో కూడిన భగవంతుని పుణ్యనామాన్ని స్వీకరించడం వలన కోటి కంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాపాల నన్నింటినీ పోగొట్టుకున్నాడు. హరినామ కీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, సత్యలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు.ఇతడు “నారాయణా!” అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోనైనా, ఆటలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా కమలాక్షుణ్ణి స్మరిస్తే పాపాలు తొలగిపోతాయి. ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు.”
“అంత్యకాలంలో ధైర్యం సన్నగిల్లినప్పుడు పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కాని కేశవుడు మనస్సుకు తోచడు.శ్రీహరి నామమనే అమృతాన్ని ఈ అజామిళుడు ప్రత్యక్షంగా సేవించాడు. ఈ హరినామ స్మరణమనే ధర్మం ఈ సత్పురుషుని మరణానంతరం ఎందుకు వృథా అవుతుంది?”అని ఈ విధంగా విష్ణుదూతలు భాగవత ధర్మాన్ని నిరూపించి “ఈ విషయంలో మీకు సందేహం ఉంటే మీ యమధర్మరాజును అడగండి. పొండి” అని చెప్పి, బ్రాహ్మణుడైన అజామిళుని భయంకరమైన యమపాశాల నుండి విడిపించి యమభటుల వల్ల కలిగిన భయాన్ని పోగొట్టారు. అప్పుడు ఆ యమదూతలు శాంతించి, చేసేది లేక యమలోకానికి వెళ్ళి, యమునికి జరిగినదంతా తెలియజేశారు.
అప్పుడు,ఆ అజామిళుడు యమపాశాలనుండి బయటపడి ధైర్యాన్ని పొంది ఎదుట ఉన్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో నమస్కరించాడు.ఆ అజామిళుడు నిలబడి చేతులెత్తి నమస్కరించి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. విష్ణుభటులు అతని మనస్సులోని భావాన్ని తెలుసుకొని అంతర్ధానం చెంది ఆ దేవదేవుని సన్నిధికి వెళ్ళిపోయారు.మూడు వేదాల సారమూ, విష్ణుదూతల యమభటుల సంవాదాన్ని అజామిళుడు సమగ్రంగా వింటూ… అతని మనస్సులో అణిచిపెట్టబడినవి అయిన పాపాలు మాటిమాటికి తలంపుకు వచ్చి, పశ్చాత్తాపంతో క్రుంగిపోయి, ఆ బ్రాహ్మణుడు పరమేశ్వరుడైన శ్రీహరిని ఆశ్రయించి తనలో ఇలా అనుకున్నాడు.వేశ్య మీద మోహం పెంచుకొని సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపాను. నా బ్రతుకును రచ్చ కెక్కించాను. సిగ్గుమాలిన పనులు చేసి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైబడినా సంసార బంధాలనుండి బయట పడలేక, లోకనిందలను లెక్కచేయక, నా జీవితాన్ని భస్మం చేసుకున్నాను. చదువు చట్టుబండలైపోయింది. శాస్త్రజ్ఞానం మట్టిపాలయింది. పుణ్యం నశించింది. తెలివి నశించింది. స్వచ్ఛమైన జ్ఞానం మొత్తానికే లేకుండా పోయింది.చక్కని సౌందర్యంతో నన్ను ఇష్టపడే ఇల్లాలిని విడిచి మద్యం త్రాగే ఈ డొక్కు మాయలాడికి విటుణ్ణై చెడిపోయాను.నా భయంకర పాపాగ్ని జ్వాలలు నన్ను చుట్టుముట్టి కాల్చి భస్మం చెయ్యకుండా ఎందుకు విడిచి పెట్టాయో కదా! నేను తప్ప మరో దిక్కు లేని వృద్ధులైన నా తల్లి దండ్రులను ఎన్నెన్నో బాధలు పెట్టి ఇంటినుండి వెళ్ళగొట్టాను.
ఎన్నెన్నో పాపాలకు ఒడిగట్టి అత్యంత భయంకరమైన నరకంలో పడి కొట్టుకొని పోతున్న నన్ను దయతలచి అడ్డుకొని ఆపదలు బాపి రక్షించిన ఆ పుణ్యపురుషు లెవరో? ఎక్కడివారో? భయంకరమైన పాశబంధాలతో నరక సముద్రంలో పడుతున్న నన్ను నాశనం కాకుండా రక్షించిన పుణ్యమూర్తులు, అయిన ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళిపోయారో?పాపాత్ముడనైన నాకు ఆ దేవతా శ్రేష్ఠుల సందర్శనం పూర్వ జన్మలో చేసిన పుణ్యవిశేషం వల్లనే కాని లభించదు. వాళ్ళ దర్శనం నా ఆత్మకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది.మరణిస్తున్న సమయంలో నా నాలుకకు భగవంతుని నామాన్ని ఉచ్చరించే భాగ్యం ఎలా అబ్బుతుంది?నేను పాపాత్ముణ్ణి.నిందలకు నిలయమైనవాణ్ణి, గుణహీనుణ్ణి, దురదృష్టవంతుణ్ణి నే నెక్కడ? భగవంతుని పవిత్ర నామాన్ని ఆలపించడం ఎక్కడ? ఇదంతా పూర్వపుణ్యం లేనిదే ఎలా సాధ్యం? భవబంధాలను విడిచివేశాను. మాయతో కూడిన అజ్ఞానాంధకారాన్ని అణచివేశాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులను జయించాను. జనన మరణాలనే సముద్రాన్ని తరించాను.అని ఈ విధంగా హృదయంలో ఆత్మజ్ఞానమనే తైలంతో బ్రహ్మజ్ఞానమనే దీపం ప్రకాశించిగా ఆ బ్రాహ్మణుడు…గొప్ప తత్త్వజ్ఞానియై, సంసార బంధాలన్నిటినీ పారద్రోలి గంగా ద్వారానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక దేవాలయంలో కూర్చొని యోగమార్గాన్ని ఆశ్రయించాడు. దేహం ఇంద్రియాలు మొదలైన వాని మార్గం నుండి విడివడి తన యోగ సమాధి ద్వారా పరతత్త్వంతో జోడించాడు. త్రిగుణాతీతుడై తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్యపురుషులు కనిపించారు. అతడు వారికి నమస్కరించాడు.ఈ విధంగా అజామిళుడు యోగమార్గం ద్వారా తన శరీరాన్ని విడిచి దివ్యమైన పుణ్యశరీరం ధరించినవాడై తన ఎదుట పూర్వం తనను రక్షించిన విష్ణుకింకరులను చూశాడు. అతని దేహం ఆనందంతో పులకించింది. అజామిళుడు విష్ణుదూతలకు చేతులు మోడ్చుతూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు.
యం యం వాపిస్మరన్ భావం త్యజత్యన్తే కళేబరమ్
తం తేమవైతి కొన్తేయ సదా తద్భావ భావితః
***