అష్టవిధ నాయికలు – అభిసారిక
– టేకుమళ్ళ వెంకటప్పయ్య
“మదనానలసంతప్తా యాభిసారయతి ప్రియమ్|
జ్యోత్స్నాతమస్వినీయానయోగ్యాంబరవిభూషణా|
స్వయం వాభిసరేద్ యా తు సా భవేదభిసారికా”||
(రసార్ణవసుధాకరము)
మదనానలసంతప్తయై ప్రియుని తనకడకు రప్పించుకొనునది గాని, వెన్నెల రాత్రులలో, చీకటిరాత్రులలో తన్నితరులు గుర్తింపనిరీతిగా వేషభూషలను ధరించి రహస్యముగా ప్రియుని గలియుటకు సంకేతస్థలమునకు బోవునది గాని, అభిసారిక యనబడునని పైశ్లోకమునకు అర్థము.
కానీ ఈ అభిసారిక నాయికలలో ఉన్న స్వల్ప బేధాలను గమనిస్తే మొదటి రకమైన యభిసారిక సామాన్యముగా నొక దూతిక ద్వారా సందేశమును పంపి, ప్రియుని తనకడకు రప్పించుకొనును. అతడు వచ్చినప్పుడు వాసకసజ్జికవలెనే సర్వము సంసిద్ధము చేసికొని అతనితో సవిలాసముగా గడపును. ఇట్లు ఈవిధమైన అభిసారికకు, వాసకసజ్జికకు, కించిద్భేదమే యున్నది. వస్తుతః శృంగారమంజరీకర్త వంటి కొందఱు లాక్షణికులు ఈరకమైన అభిసారికను వాసకసజ్జికగానే పరిగణించుచున్నారు. అలా కాక తానే ప్రియుని సంకేతస్థలమున కలసికొనునది రెండవరకమైన అభిసారిక. ఇట్టి అభిసారికనే తరచుగా కవులు ప్రబంధములలో, కావ్యములలో వర్ణించియున్నారు. ఇందులో స్వీయా, పరకీయా, సామాన్యాభేదము లున్నవి. స్వీయ యనగా తన కంకితయైన ప్రియురాలు. పరకీయ వేఱొక స్త్రీ. ఈమె కన్యక గాని, అన్యవిధమైన స్త్రీ గాని కావచ్చును. సామాన్య యనగా వేశ్య. గూఢముగా వెన్నెలరాత్రులలో నభిసరించు స్త్రీకి జ్యోత్స్నాభిసారిక యనియు, అట్లే చీకటిరాత్రులలో నభిసరించు స్త్రీకి తమోభిసారిక యనియు పేర్లు. బాహాటముగా నభిసరింప బోవు స్త్రీకి ఉజ్జ్వలాభిసారిక యని పేరు. వీరిలో జ్యోత్స్నా, తమోభిసారిక వర్ణనమే అధికముగా కావ్యములలో కన్పించుచుండును.
అన్నమయ్య కీర్తనలలో నాయిక అమ్మవారు కనుక జ్యోత్స్నాభిసారిక వర్ణను, తమోభిసారిక వర్ణను వర్జించి నాయకుని తనవద్దకు రప్పించుకొని మాట్లాడే అభిసారికగా వర్ణించిన విధానాన్ని పరిశీలిద్దాం.
కీర్తన:
పల్లవి: వాకిట నుండి యెంత వాడికలు సేసేవు
లోకమెల్లా నెరుగును లోనికి రావయ్యా
చ.1. పడతి వినయముల బయలు వందిలి వెట్టె
తడబాటు సిగ్గులను దడిగట్టెను
వుడివోని తమకము నొడినిండా నీకు నించె
యెడమాట లికనేల ఇంటికి రావయ్యా || వాకిట ||
చ. 2. కలికి కనుచూపుల కానుకలు నీకు నిచ్చె
సులభాన వలపుల సూడిదలంపె
సెలవుల నవ్వులనే చిత్తమెల్లా గరగించె
వెలినుండి జంపులేల విడిదికి రావయ్యా || వాకిట ||
చ.3. భామ తమ్మిమొగ్గలను పాన్`పు నీకు బరచె
వేమరు మోవి తేనెల విందులు వెట్టె
ఆముక శ్రీవేంకటేశ యట్టె యీకె గూడితివి
దామెల సన్నలవేల తావుకు రావయ్యా || వాకిట ||
(రాగము: లలిత, 28-463 రాగిరేకు 1879)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అభిసారికయైన అలమేలుమంగమ్మ, నాయకుని తనవద్దకు రప్పించుకొని మాట్లాడే సన్నివేశం.
పల్లవి: వాకిట నుండి యెంత వాడికలు సేసేవు
లోకమెల్లా నెరుగును లోనికి రావయ్యా
అమ్మ శ్రీవేంకటేశ్వరునితో ముచ్చటలాడుతున్నది. ఇలా ఎంతసేపు వాకిటిలో నిలబడి రహస్యంగా ఈ కధ నడిపిస్తావు? మన విషయాలు లోకంలో అందరికీ తెలుసు గానీ ఇక త్వరగా లోనికి విచ్చేయవయ్యా మహాప్రభో! అని వేడుకుంటున్నది.
చ.1. పడతి వినయముల బయలు వందిలి వెట్టె
తడబాటు సిగ్గులను దడిగట్టెను
వుడివోని తమకము నొడినిండా నీకు నించె
యెడమాట లికనేల ఇంటికి రావయ్యా
నా యొక్క వినయ విధేయతలవలన విషయం బయటపడిపోయి ఆపద నెత్తికెక్కేట్టున్నది సుమా! నా యొక్క తడబాటు ఆతృత సిగ్గులతో గూడి దడి గట్టినట్టైనది. మనం తొలిసారిగా కలిసినపుడు మాట్లాడుకున్న మాటలు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవలసినవి చాలా ఉన్నవి. ఇంకా యెడమాటలు ఎందుకు త్వరగా వచ్చేయండి స్వామీ శ్రీనివాసా! అంటున్నది అమ్మ.
చ.2. కలికి కనుచూపుల కానుకలు నీకు నిచ్చె
సులభాన వలపుల సూడిదలంపె
సెలవుల నవ్వులనే చిత్తమెల్లా గరగించె
వెలినుండి జంపులేల విడిదికి రావయ్యా
తన గురించి చెప్పుకుంటూ అందమైన మనోజ్ఞమైన ఆడదాని ఓరకంటి చూపులు సులభంగా వలపుల కానుకలవలే నీకు ఇస్తున్నాను కదా! నీ నవ్వులచే నా మనసు కరిగి నీరై పారుతున్నది సుమా! బయటనుండి నీ చూపులతో ఎందుకు నన్ను ఇంకా చంపుతున్నావు హాయిగా విడిదికి వచ్చి నన్నేలవయ్యా! అంటోంది అమ్మ.
చ.3. భామ తమ్మిమొగ్గలను పాన్`పు నీకు బరచె
వేమరు మోవి తేనెల విందులు వెట్టె
ఆముక శ్రీవేంకటేశ యట్టె యీకె గూడితివి
దామెల సన్నలవేల తావుకు రావయ్యా
నిను వలచిన భామ (అంటే అమ్మ తనగురించి చెప్పుకుంటూ) పద్మాల మొగ్గలతో చేసిన పానుపు నీకు పరచి సిద్ధంగా ఉంచినది. వేయిమార్లు అధరామృతంతో నీకు విందు చేసినది. ఆరంభములోనే అంకురార్పణతోడుగా నన్ను నీవు కలిసావు గదా! మధయలో ఈ పైటచాటుమాటలేల దగ్గరకు రావయ్యా శ్రీవేంకటపతీ! అని అమ్మ అర్ధిస్తోంది.
ముఖ్యమైన అర్ధాలు: వాడికలు = రహస్యాలు; వందిలి = ఆపద; ఉడివోని = మొదటి మినుకులు, వేదాలు, ప్రాఁబలుకులు; దడిగట్టెను = మాట్లాడనీయక నిర్బంధించు; యెడమాట = వెలుపల ఉండి మాట్లాడే మాట; కలికి = అందమైన లేక మనోజ్ఞమైన స్త్రీ; సూడిదలు = కానుకలు; సెలవు = వ్యయం అనే అర్ధంలో వాడిన పదం; వెలి = బయట; జంపు = ప్రేమతో చంపుతున్నాడని సుకుమారంగా సున్నితంగా చెప్పడం; తమ్మి = పద్మం; వేమరు = వేమారు అనే పదానికి గ్రామ్యం అయిఉండవచ్చు లేదా తరచు అనే అర్ధం కూడా ఉంది; మోవితేనె = అధరామృతం; ఆముక = ప్రారంభం, అంకురార్పణం; దామెలసన్న = ఈడొచ్చిన కన్నెపిల్లలు వేసుకొనే పైటలాంటి వస్త్ర విశేషము.
-0o0-