ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు – 6

సత్యం మందపాటి చెబుతున్న

మనస్థత్వాలు

బుధవారం రాత్రి. భోజనాలు పూర్తి చేసుకుని, వాకింగుకి వెళ్ళి వచ్చారు కృష్ణ, రుక్మిణి.
ప్రతిరోజూ లాగానే అలవాటు ప్రకారం, కృష్ణ ఒక తెలుగు పుస్తకం, రుక్మిణి ఒక ఇంగ్లీష్ పుస్తకం తీసుకుని చదువుకుంటూ సోఫాలో కూర్చున్నారు. అప్పుడే ఫోన్ మ్రోగింది. అర్జున్.
“బావా, భోజనాలయిపోయాయా? ఇప్పుడు ఆలస్యంగా పిలిచి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నానా?” అని అడిగాడు.
“ఏం లేదులే చెప్పు. మనం మామూలుగా వారాంతాలే కదా మాట్లాడుకునేది. ఇప్పుడు వర్కింగ్ డే పిలిస్తే, ఏదన్నా ఎమర్జెన్సీ ఏమో అనుకున్నాను. బాగానే వున్నావా?” అడిగాడు కృష్ణ.
“నాకేం? సుబ్భరంగా వున్నాను. కాకపోతే ఒక ప్రశ్న. నీ సలహా అడుగుదామని..” అర్జున్.
“ఫరవాలేదు, చెప్పు” అన్నాడు కృష్ణ.
“మా క్వాలిటీ డిపార్ట్మెంట్ మీటింగుకి వెళ్ళాను ఇవాళ. అక్కడ క్వాలిటీ మేనేజర్, నలుగురైదుగురు ఇంజనీర్లు వున్నారనకో. వాళ్ళల్లో మూడు రకాల మనుష్యుల్ని చూశాను” అన్నాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “వావ్.. అప్పుడే మనుష్యుల్ని చదివేయటం మొదలుపెట్టావన్నమాట. ఉద్యోగ విజయాల్లో అది చాల అవసరం. శుభం. ఊఁ అవేమిటో చెప్పు” అడిగాడు కృష్ణ.
“బాసుగాడు చెప్పిన ప్రతి మాటకీ మైక్ ఊఁ కొడతాడు. దానిలో మంచీ చెడూ ఏదీ చూడడు. ఇంతకు ముందు నువ్వు చెప్పావే, ‘రూల్ నెంబర్ వన్ – బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, రూల్ నెంబర్ టు – ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్, సీ రూల్ నెంబర్ వన్’ అని. ఇతను దాన్ని అక్షరాలా పాటిస్తాడు. జాన్ అలా కాదు. ఎవరు ఏమి చేద్దామని చెప్పినా, అది జరిగేది కాదు, సరిగ్గా పనిచేయదు అంటూ అడ్డపుల్లలు వేస్తుంటాడు. ఏదీ ముందుకి కదల నీయడు. ఇక డగ్. మేనేజర్ చెప్పిన దాన్ని, బాగా ఎనలైజ్ చేసి, మంచీ చెడూ చెప్పి, ఆయన చెప్పింది పనిచేయదు అనిపిస్తే, ముఖం మీదే చెప్పేస్తాడు. ముగ్గురూ మూడు రకాలు. ఇలాటి మనస్థత్వాలతో లాభాలూ, నష్టాలూ, కష్టాలూ, సుఖాలూ ఏమిటంటావు?” అడిగాడు అర్జున్.
“భలే ప్రశ్న అడిగావ్, బామ్మరిదీ. ఈ పశ్నకి జవాబు కాదు, కొన్ని జవాబులు వున్నాయి. ముందు మైక్ సంగతి తీసుకో. అతను ప్రతి దానికీ ఊఁ కొడతాడు కనుక, భజన చేయటంలో దిట్ట అని తెలుస్తున్నది. ఈ భజనల్లో కూడా మూడు రకాల భజనలు వున్నాయి. ఒకటి స్వంత భజన. అంటే ఎవరి గొప్పలు వాళ్ళే చెప్పుకోవటం. కోక్, పెప్సీలాటి బిలియన్ డాలర్లు లాభాలు వస్తున్న కంపెనీలు కూడా, ఎన్నో మిలియన్లు ఖర్చుపెట్టి వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటూ ప్రతిరోజూ ప్రకటనలు ఇస్తుంటాయి. ఇలా స్వంత డబ్బా కొట్టుకుంటే, ప్రజలు మర్చిపోరని వాళ్ళ ఉద్దేశ్యం. అంతేకాదు, మిగతా కంపెనీలు వాళ్ళ ప్రకటనలతో హోరెత్తిస్తుంటే, వీళ్ళు వూరికే కూర్చుంటే ఎలా? అందుకే వాళ్ళు విశ్రాంతి లేకుండా వాళ్ళ డబ్బా వాళ్ళు వాయిస్తుంటారు. ఇలాగే ఆఫీసుల్లో కూడా, తమ గురించి డబ్బా కొట్టుకునేవాళ్ళు వుంటారు మరి. వాళ్ళ బాస్ దగ్గరే కాకుండా అందరి దగ్గరా అలాగే చేస్తుంటారు. దీనివల్ల స్వంత డబ్బా కొట్టుకునే వాళ్ళకి సరుకు లేకపోతే, అలాటి భజనలు కొన్నాళ్ళు పనిచేస్తాయేమో కానీ, త్వరలోనే వాళ్ళ బండారం బయట పడిపోతుంది” ఆగాడు కృష్ణ.
“నిజంగా సరుకే వుంటే, ఈ భజనలు చేయటం అనవసరం కదా” అన్నాడు అర్జున్.
“అవును. సత్యం పలికావు అర్జునా. ఇహ రెండవది పర భజన, ప్రతి దానికీ ‘యస్ బాస్’ అంటుంటారు అచ్చం మీ మైక్ లాగానే. దానివల్ల కొంతమంది బాసాసురులు కొంత ఇష్టపడవచ్చు. కానీ ఒక ప్రమాదం వుంది. ఎక్కువ ఖరీదైన ఏ ప్రాజెక్టులోనో, మరీ తక్కువ వ్యవధిలో పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులోనో, బాసుగాడు దాల్లో లెగ్గేస్తే.. అదేలే పప్పులో కాలేస్తే, దానికి మైక్ ధర్మవరపు సుబ్రహ్మణ్యంలా ‘అబ్బ.. ఏం చెప్పారు బాసుగారూ’ అని పూర్తి సహకారం ఇస్తే.. ఇద్దరూ జమిలిగా రోడ్డెక్కే పరిస్థితి రావచ్చు. ఏదన్నా మంచి పనిని మెచ్చుకుంటే మంచిదే కానీ, ప్రతి దానికీ బుర్ర వుపయోగించకుండా అదే పిచ్చి బుర్రని వూపేస్తుంటే మాత్రం చాల ప్రమాదం”
“అవును. అంతే కదా” అన్నాడు అర్జున్, ఫోనులో అవతలి పక్క బుర్ర వూపుతూ.
“నాకు తెలుసు, నువ్వు ఫోనులో బుర్ర వూపుతున్నావని. సరే! ఇక మూడవ భజనని పరస్పర భజన అంటారు. అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని కీర్తిస్తూ, ఇద్దరూ కలిసి విజయపథం వేపు వెళ్ళటానికి ప్రయత్నించటం. అంటే నువ్వు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతా అనే ఒప్పందం మీద నడుస్తుందన్నమాట. ఇదే ఆ ఇద్దరూ ఒకే గ్రూపులో ఒకే ఉద్యోగంలో వున్నవాళ్ళయితే ఒక ప్రమాదం వుంది. నువ్వు రెండో వాడి గొప్పతనాన్ని చాటిస్తుంటే, ఆ రెండో వాడు నీ ముఖం ముందు నిన్ను పొగిడినా, వెనకాల గోతులు తవ్వుతుంటే నువ్వు ఆ గోతుల్లో పడటం ఖాయం. అంటే నువ్వు అతని వీపు గోకుతున్నా, అతను వూరికే అలా నటిస్తూ, నిన్ను వెన్నుపోటు పొడుస్తాడన్నమాట. అక్కడ ఎంతో జాగ్రత్త అవసరం. అలా కాక మంచైనా చెడైనా ఆ ఇద్దరూ కలిసి ఒక జట్టుగా పనిచేస్తే మంచిదే. నాకు తెలిసిన ఒక క్వాలిటీ ఇంజనీరు, తన మేనేజరుకి ఆపరేషన్స్ రివ్యూ మీటింగుల్లో కావలసిన డేటా అంతా గొప్పగా మార్చేసి, తప్పుడు గ్రాఫులు ఇంకా ఎంతో గొప్పగా సృష్టించి ఆయన్ని ఆదుకునేవాడు. ఆయన కూడా అతనికి జీతం పెంచేసి, బోనసులు ప్రమోషన్లు ఇచ్చేసి పెంపుడు కుక్కలా చూసుకునేవాడు. ఇది కూడా పరస్పర భజనలో భాగమే” అన్నాడు కృష్ణ.
‘అవును. నాకు మైక్ మీద అలాటి అనుమానమే వచ్చింది. నిజం తెలుసుకోకుండా అలా అనుకోవటం తప్పు అని తెలుసు కానీ, నేను మనసులో అనుకున్నది నీకు చెబుతున్నానంతే” అన్నాడు అర్జున్.
“ఇంతటితో మూడు రకాల భజన కథలు సమాప్తం. థాంక్స్ టు మైక్” అన్నాడు కృష్ణ.
“మరి జాన్ సంగతో… “ అడిగాడు కృష్ణ.
“సరే.. ఇక జాన్ సంగతి చూద్దాం. ప్రతి పనికీ అడ్డపుల్లలు వేస్తుంటాడు. అవునంటే కాదనిలే అని పాట పాడుతుంటాడు. నేను కొన్నాళ్ళ క్రితం ఒక సెమినారుకి వెళ్ళాను. అది ‘హవ్ టు డు’ అనేవాళ్ళు, ‘హవ్ నాట్ టు డు’ అనేవాళ్ళ గురించి జరిగిన సెమినార్. ‘హవ్ టు డు’ అనేవాళ్ళు ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అయినా, ఎంత క్లిష్టమైన పనిలోనైనా ఎలా చేయాలి అనే ఆలోచిస్తారు. అది వాళ్ళ పరిధిలో లేకపోతే, ఇతరుల దగ్గరనించి సహాయం తీసుకుంటారు. అంతేకాని నిరాశ పడి దాన్ని అర్ధాంతరంగా వదలిపెట్టరు. వాళ్ళకి అసంభవం అనే మాట అంటే ఏవగింపు. పోయినసారి చెప్పుకున్నాం, పక్షుల్ని చూసి గాలిలో తనూ ఎగరాలని అనుకుంటే, అది అసంభవం అన్నారు అంతా. అది అసంభవం కానేకాదు సంభవమే అని, అన్ని అడ్డంకులూ దాటుకుంటూ విమానాల్ని కనిపెట్టారు. అప్పటినించీ ఇప్పటిదాకా ఆకాశవీధిలో వెడుతూ, ‘రైటు బదర్సూ, మీరే రైటు’ అని మనమందరం ఒప్పేసుకున్నాం. అలాగే చంద్రమండలం మీద మనిషి మొట్టమొదటగా కుడికాలు పెడతానంటే నవ్విన వాళ్ళు, అప్పుడే నడక నేర్చిన పిల్లాడిలా ఆస్ట్రోనాట్ ఆర్మ్ ష్ట్రాంగ్ చంద్రమండలం మీద ఎగిరి ఎగిరి నడుస్తుంటే, మనం ఎవరి ముక్కు మీద వాళ్ళే వేలు వేసుకుని, ఒళ్ళు మరచి చప్పట్లు కొట్టాం. అందుకని అలాటివారే కావాలి కంపెనీలకి. ఇలాటివి కొన్ని వందల ఉదాహరణలు వున్నాయి. కాకపోతే, ‘హవ్ నాట్ టు డు’ అనేవాళ్ళు ఎప్పుడూ మనం ఎడ్డెం అంటే వాళ్ళు తెడ్డెం అంటుంటారు. వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ అనగానే భయమో, బద్ధకమో తెలీదు కానీ, నో నో నో అంటుంటారు. అలాటి వారు ప్రతిదానికీ అలా కాళ్ళకి అడ్డం వస్తుంటే. వాళ్ళు ఎక్కువ రోజులు ఆ ఉద్యోగంలో వుండటం కష్టం. వాళ్ళని వెనకాలే వదిలేసి, అందరూ ‘పదండి ముందుకి’ అని ముందుకే వెళ్ళిపోతుంటారు. ‘హవ్ టు డు’ వ్యక్తులు ఎలా ప్రతిదీ సవ్యంగా జరిగేటట్టు చూస్తారో, ‘హవ్ నాట్ టు డు’ వ్యక్తులు, ‘అదా.. అది అయే పని కాదు సార్’ అని వాదిస్తుంటారు” ఆగాడు కృష్ణ.
“అవును బావా. జాన్ అలామాట్లాడుతుంటే, మిగతా వాళ్ళ హావభావాలు చూశాను. ఎవరికీ అతని వైఖరి నచ్చినట్టు లేదు” అన్నాడు అర్జున్.
“శభాష్ అర్జున్. నీకు మంచి అబ్జర్వేషన్ వుంది. అది చాల అవసరం. మన హైద్రాబాదులో బిజీ రోడ్డు దాటేటప్పుడు, ఇటూ అటే కాకుండా, తల మూడు వందల అరవై డిగ్రీలు తిప్పుతూ, కార్లూ గీర్లూ, బస్సులూ గిస్సులూ మనల్ని దున్నేయకుండా ఎలా వెడతామో, అలాగే ఆఫీసుల్లో కూడా రాజకీయాలను తట్టుకోవాలంటే చుట్టు పక్కల చూస్తుండాలిరా చిన్నవాడా.. ” అన్నాడు కృష్ణ.
“మరి.. డగ్ విషయమో?” అడిగాడు అర్జున్.
“వస్తున్నా,, వస్తున్నా.. డగ్ చేసేది చాల మంచి పని. ఏ విషయానైనా అన్ని కోణాలనించీ చూసి, దానిలో మంచీ చెడూ చూపించి, తన విశ్లేషణని వున్నదున్నట్టుగా చూపించి, మంచి నిర్ణయాలు తీసుకోవటం ఎంతో అవసరం. ఉపయోగకరం. కాకపోతే ఒక్కొక్కప్పుడు, మేనేజ్మెంట్ నిర్ణయాలు తప్పు అని చెప్పవలసి వస్తుంది. చెప్పటం అవసరం కూడా. మనవాళ్ళు అంటుంటారే ‘అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది’ అని”
“అవును. నాకూ అదే అనిపించింది. కానీ డగ్ ముఖమాటం లేకుండా, ‘అలాకాదు’ అని సూటిగా చెప్పటంవల్ల వాళ్ళ అహం దెబ్బతింటుంది అని నా అభిప్రాయం” అన్నాడు అర్జున్.
“బాగా చెప్పావు అర్జునుడూ. అక్షర సత్యం. కొన్నేళ్ళ క్రితం నేను ఒక సెమినారుకి వెళ్ళాను. ‘హవ్ టు సే నో, వితవుట్ సేయింగ్ నో’ అని. చిన్నప్పుడు మా పెద్దనాన్న చెబుతుండేవాడు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక కిరాణా కొట్టు వుండేదిట. అక్కడికి వెళ్ళి, ‘కందిపప్పు వుందా?’ అని అడిగితే, అతనికి ‘లేదు’ అనటం లాభసాటి వ్యాపార సూత్రాల ప్రకారం ఆచారం కాదు కనుక, ‘పెసరపప్పు వుంది సార్. పెసరపప్పు పప్పు బావుంటుంది కూడాను’ అనేవాడుట. అంటే కందిపప్పు లేదు అని అర్ధం అని అందరికీ తెలుసు. ఇదేదో సరదాగా చెప్పానుగానీ, మనం ఆఫీసులో కూడా నో అని బల్ల గుద్ది చెప్పటం మంచిది కాదు. లేదు, కాదు అనకుండానే, లేదు, కాదు అని చెప్పటం ఎలానో తెలుసా?” అడిగాడు కృష్ణ.
నవ్వాడు అర్జున్. “సరే, అదే తెలిస్తే నిన్ను రాత్రి పూట పిలిచి ఈ ప్రశ్నలు అడగటం ఎందుకు” అన్నాడు.
కృష్ణ కూడా నవ్వి, “ఒక ఉదాహరణ చెబుతాను విను. ‘అవును. బాగా చెప్పారు. మీరు చెప్పినట్టు అలా చేయటం మంచిదే. కాకపోతే, ఫలనా ఫలానా విషయాలలో ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి నాకు ఇలాటి పరిస్థితే వచ్చింది. ఆ అనుభవంతో, దాన్ని కొంచెం మార్చి చేస్తే సులువుగా ఏ గొడవలూ లేకుండా ఆ ప్రాజెక్ట్ పూర్తయింది. మా కష్టమర్లు కూడా ఎంతో మెచ్చుకున్నారు. అలాగే మన ప్రాజెక్టుని మీరు చెప్పినట్టుగానే చేస్తూ, ఇలా కొంచెం మారుద్దాం. సరిపోతుంది’ అని చెప్పటం. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, వాళ్ళు చెప్పింది మెచ్చుకోవటం. కానీ పాత అనుభవాల వల్ల, కొన్ని మార్పులు అవసరం అని చెప్పటం. అవేమిటో, ఆ మార్పుల వల్ల లాభాలేమిటో చెప్పటం. అలా చెప్పవలసి వచ్చినప్పుడు, కొంత లౌక్యంగా చెప్పటం అవసరం. వ్యక్తిపరంగా కాకుండా విషయపరంగా చెబితే, ఎవరినీ నొప్పించము. గుర్తుంది కదా, బద్దెనగారి పద్యం. నొప్పింపక తానొవ్వక.. ఇవన్నీ నేర్పుగా చెబుతే, ఎంత బాసయినా ఒప్పుకోక ఏం చేస్తాడు”
“అవును. సుమతీ శతకం పద్యం. అదెలా మరచిపోతాను. అవునంటూనే, కాదని చెప్పటం బాగుంది” అన్నాడు అర్జున్.
“అదీ ఇందాక చెపినట్టు ఆ ప్రాజెక్టులోని మంచీ చెడులని విశ్లేషణని చేసి చూపిస్తూ, వాళ్ళనే ఇలాటి పరిస్థితిలో మనం ఎలా ముందుకి వెడితే బాగుంటుందో చెప్పమని అడగటం బాగా పనిచేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలా.. ఎలా.. చేద్దామనుకుంటుంటే, మన మనసులోని పరిష్కారం సూచనప్రాయంగా చెబితే, ఇక సెంచెరీ కొట్టినట్టే. ఇటు మన పరిశీలనాత్మతకీ, అటు మన స్థిరమైన ప్రవర్తనకీ (Positive Attitude), రెండిటికీ రెండు శతకాలు. అలాటి సంఘటనలు మేనేజర్లు మరచిపోలేరు. తర్వాత ఇలాటి విషయాల్లో మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా వుంది” అన్నాడు కృష్ణ.
“బాగుంది బావా, ఈ మూడు రకాల మనస్థత్వాలనీ విపులంగా విశ్లేషించి చెప్పావు. చాల ధన్యవాదాలు. ఇలాటివే నాకింకా కొన్ని ప్రశ్నలు వున్నాయి. వచ్చేసారి తీరిగ్గా వాటి గురించి మాట్లాడుకుందాం. నీకు మరీ ఆలస్యం అయిపోతున్నదేమో.. ” అన్నాడు అర్జున్.
“ఓకే.. నేను చెప్పేది నీకు ఉపయోగపడితే, నాకంతకన్నా ఏం కావాలి. గుడ్ నైట్” అన్నాడు కృష్ణ ఆవలిస్తూ.

0 0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked