సారస్వతం

మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు

జ్యోతిష విజ్ఞాన భాస్కర బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు

-శారదాప్రసాద్

​సుప్రసిద్ధ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ మధుర కృష్ణ మూర్తి శాస్త్రి 06-04-2016 న మధ్యాహ్నం కన్నుమూసారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామంలో 1928 ఫిబ్రవరి 28న మధుర వెంకయ్య , శచీదేవి దంపతులకు జన్మించిన కృష్ణమూర్తి శాస్త్రి 8వ తరగతి వరకు ఇంగ్లీషు చదువుకున్నారు.1948 లో వివాహం చేసుకున్న ఈయన గారి భార్య పేరు శ్రీమతి మహాలక్ష్మి గారు. వీరికి ఇద్దరు కుమారులు , నలుగురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణమూర్తి శాస్త్రి గారి పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు సి. ఎ పూర్తిచేసి, విశాఖలో చార్టర్డ్ ఎక్కౌంటెంట్ గా స్థిరపడ్డారు. రెండవ కుమారుడు పాలశంకర శర్మ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 1940 నుంచి 42 వరకు శ్రీ పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి (పిఠాపురం) దగ్గర పంచకావ్యాలు, వ్యాకరణ శాస్త్రం కౌముది కొంతవరకు చదువుకున్నారు. 1944 నుంచి 48 వరకు శ్రీ వాజపేయాజుల వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు (ఉండ్రాజవరం) గారి దగ్గర ఋగ్వేద స్మార్తం , సంస్కృత నాటకాలంకారాది సాహిత్యం , జ్యోతిశ్శాస్త్రంలో హోరా – సంహిత భాగములు(జాతక – ముహూర్త – ప్రశ్న తదితరాలు ),వాస్తు శాస్త్రం అధ్యయనం చేసారు.1954 నుంచి 1962 వరకు రామచంద్రాపురంలో జ్యోతిషాచార్య శ్రీపాద వెంకట రమణ దైవజ్ఞ శర్మ దగ్గర జ్యోతిష శాస్త్రంలో సిద్ధాంత భాగం , పంచాంగ రచన , ధర్మ శాస్త్రాలు , అధ్యయనం చేసారు.1956-57లో శాస్త్ర పరిశోధనం, పంచాంగ గణితం అయనాంశంలపై పరిశోధన అధ్యయనం చేసారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం 2000 సంవత్సరంలో ‘వాచస్పతి ‘ బిరుదు ప్రదానం చేసి, 2012లో ‘మహామహోపాధ్యాయ’ పురస్కారంతో గౌరవించింది. డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా , 2005 డిసెంబర్ 6వ తేదీన కృష్ణమూర్తి శాస్త్రి గారు రాష్ట్రపతి చేతుల మీదుగా భారత ప్రభుత్వం తరపున గౌరవ పురస్కారం అందుకున్నారు. జ్యోతిష విజ్ఞాన కేంద్రం సంస్థను1964లో నెలకొల్పిన కృష్ణమూర్తి గారు దాని ద్వారా ‘జ్యోతిష విజ్ఞాన పత్రిక’ ను త్రైమాసిక పత్రికగా నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. 1982-85లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎస్త్రాలజి సంస్థకు 3ఏళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు.హాలెండ్, జర్మనీ పర్యటించి ‘మహర్షి మహేష్ యోగి’ యూనివర్సిటీలో జ్యోతిష – వాస్తు శాస్త్రాలపై
ఉపన్యాసాలు ఇచ్చారు.తాను నమ్మిన ద్రుక్ సిద్ధాంతాన్నిఎందరో శిష్యు లకు బోధచేసిన మధుర కృష్ణ మూర్తి శాస్త్రి గారు గడిచిన గోదావరి పుష్కరాలలో తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే పుష్కర స్నానం పుష్కరాల రేవులో ఆచరించారు. జ్యోతిష విజ్ఞాన కేంద్రం, విశ్వ విజ్ఞాన ప్రతిష్టానమ్ సంస్థ ద్వారా సంస్కృత భాషాభివృద్ధికి – జ్యోతిష వాస్తు తదితర శాస్త్రాల అభివృద్ధికి కృషి సాగిస్తూ, ఎన్నో పురస్కారాలు , గౌరవ సత్కారాలు అందుకున్న మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు –ఎన్నో పంచాంగాలు రావడం – జనం తికమక పడడం నేపధ్యంలో ఆరోజుల్లోనే ఒకే పంచాంగం ఉండాలని తపించి , ఆ దిశగా కృషి సాగిస్తూ , అందుకోసం పరితపించారు. గత కొంతకాలంగా అస్వస్థతో ఉన్న ఆయన 06-04-2016న తుది శ్వాస విడిచారు.శ్రీ శాస్త్రి గారి మరణం జ్యోతిష్య లోకానికి పెద్ద లోటే!

ఆ మహనీయునికి నా స్మృత్యంజలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked