అరవింద ఆధ్యాత్మిక మానవతావాదం అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపుకు, లౌకికస్థితి నుండి అలౌకికస్థితికి మళ్ళిస్తుంది. ఈ స్థితిలో మానవుడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు. ఈ సమగ్ర పరిపూర్ణతకి మానవుడే ఆధారం. భౌతిక పదార్థాలతో ఆధ్యాత్మిక సత్తను సందర్శించి, లౌకిక జీవితంలో ఆముష్మిక చింతనకు స్థానమేర్పరచి, పారమార్థిక సత్తలో భౌతిక అంశాలను ప్రతిష్టించి భౌతికతకు – ఆధి భౌతికతకు మధ్య, లౌకిక – ఆముష్మిక జీవితాలకు మధ్య అఘాధాన్ని పూరించిన ఘనత అరవిందునిదే.
ఆధ్యాత్మిక చింతన ద్వారా మానవత్వపు విలువలను నేడు పరిరక్షిస్తున్న విశ్వవ్యక్తి సత్యసాయి. మానవుడిలో ఉన్న పశుత్వం నశిస్తేనే మానవత్వం వృద్ధి పొందుతుంది. మానవుడు నిరహంకారిగా ఉండాలి. మనిషిలోని సహజ గుణమైన మానవత్వం పోషింపబడటమే కాదు దాన్ని వికసింప చేయమంటారు సత్యసాయి. మానవత్వాన్ని పవిత్రమైన విద్యగా, పవిత్రమైన దివ్యత్వంగా, పవిత్రమైన తపస్సుగా భావించారు, భావించమంటారు. లౌకిక జీవితంలోనే ఈ మానవతా విలువలను పరిపోషించుకోవాలి. “ఒక దివ్యమైనటువంటి మార్గమందే ఆధ్యాత్మిక మార్గమందే పెరుగుతుంది. ఆత్మా తత్త్వమందే పెరుగుతుంది. ఇది మరొక చోట పెరిగేటటువంటిది కాదు” అంటూ మానవత్వాన్ని పెంచుకొనే చోటును నిర్దేశించారు.
“కవిత్వం స్థూలమైన భౌతిక స్వరూపం నుండి ద్రష్ట పిండుకున్న తాత్త్విక బిందువు” బాహ్య జగత్తులో కన్పించే విషయాలని చూసి చకితుడౌతాడు కవి. ఆ ఆశ్చర్యం నుంచి తన అంతరంగిక జగత్తును ఆశ్రయించి; అక్కడ జరిగే అనుభవానికీ, అనుభూతికి లోనవుతాడు. ఈ అనుభూతినే కవిత్వమనే తాత్త్విక బిందువుగా మారుస్తాడు. కవి పొందే అనుభూతి అవ్యక్తమైంది. ఈ అవ్యక్తానుభూతిని వ్యక్తం చెయ్యటమే కవితా ప్రక్రియలో జరుగుతుంది. కవి తను పొందిన అనుభూతిని పదాల ద్వారా మధురంగా వ్యక్తీకరిస్తాడు. వ్యక్తీకరణ వల్ల కవి చెప్పే భావం కానీ, అనుభూతి కానీ పాఠకుడికి అందుతుంది. అదే అనుభవాన్ని అంటే కవి ఉద్దేశించిన భావాన్నే పఠిత గ్రహిస్తున్నాడా? అంటే కాస్త సమయం కావాల్సిందే సమాధానం చెప్పటానికి. కవిలోని ఒక అస్పష్టాకారం ఆకారం దిద్దుకోవటం; ప్రతీకలకి పదచిత్రానికి అర్థాన్ని కూర్చటం, తార్కికమైన భావం కాని కావ్యార్థం, కవి చైతన్యం (mood), కవి మనఃప్రవృత్తి (attitude) – ఇవన్నీ కలిసి పఠితని కావ్యానుభవానికి కాస్త దూరంగా నెట్టివేస్తున్నాయి. ఆధునిక కవిత్వంలో కథకి స్థానం ఉండదు. వస్తువు ఏదైనా కావచ్చు, అది పాఠకుడికి తెలియదు. ఆధునిక కవితావగాహనకు ముఖ్య దోహదకారులు భావచిత్రాలు, ప్రతీకలు. వీటి ద్వారా పఠిత శబ్దాల వెనక ఉన్న అర్థాన్ని గ్రహిస్తాడు. భావచిత్రం, ప్రతీకలు వైయక్తికం కావటం వల్ల అర్థగ్రాహ్యానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కొక్కసారి వ్యష్టి భావం సమీష్టి భావం కాకపోవటం వల్ల ఆ కవిత అర్థం కాకుండానూ ఉంటుంది. ఆధునిక కవిత్వంలో సంయోజితమై కన్పించే భావరూపాలు అనుభూతి, ఆలోచన. వీటి ద్వారా కవిత్వం అర్థమవుతుంది.
కవి హృదయం సహృదయం కన్నా విశిష్టమైంది. కవి ప్రతిదీ తనంతట తానుగా అనుభవించి, తద్వారా
వ్యక్తీకరిస్తాడు. అవ్యక్తమైన అనుభూతిని వర్ణించటం కష్టం. కానీ కవి కది కష్టసాధ్యం. కవి తన కనుకూలమైన పదజాలాన్ని సృష్టించుకొని, కొన్ని భావ చిత్రాల ద్వారా, ప్రతీకల ప్రతిభతో తన గాఢానుభూతిని రూపు కట్టిస్తాడు.
కవిలో కలిగిన అనుభూతిని అనుభూతిగా కవి మన ముందుంచడు. కవిలో కలిగిన రసాన్ని వాగ్రూపం చెయ్యడు. సమాహిత స్థితికి కారణమైన స్థాయిభావాన్ని ఆశ్రయించి రచన చేస్తాడు. ఆ సమయంలో అతడికి అనుభూతి మూల పదార్థమైనా ముడిపదార్థమే. ఇలా వెలువడిన రచననే, పఠిత పఠించిన వెంటనే కవికి కలిగిన అనుభూతి పఠితకి కలుగుతుంది. అప్పుడు పఠిత అనుభూతి స్థితిని అనుభవిస్తాడు. కాకపొతే కవి అనుభూతే, పాఠకుడి సాహానుభూతిగా మారుతుంది.
“ఏ వస్తువునైనా సరే మొట్టమొదటిసారిగా చూచేది ఇద్దరే. ఒకడు కవి, మరొకడు శాస్త్రవేత్త. శాస్త్రవేత్తకు ఉండవలసిన లక్షణాలలో ఏ కొద్ది ఉన్నా ఆ కవి క్లాసిస్ట్ అవుతాడు. కేవలం కవిత్వతత్త్వ దృష్టే ఉన్నవాడు, మానవత్వపు విలువలే శిరోధార్యమనుకున్నావాడు రొమాంటిసిస్టుగా మిగిలిపోతాడు.
వీరిద్దరికీ కూడా సమగ్రమైన దార్శినికత ఎప్పుడు సిద్ధిస్తుందీ అంటే – అనుభవాన్ని పూర్తిగా అనుభూతిగా స్వీకరించినప్పుడే.” కవికి శాస్త్రవేత్తల పరిశీలనా విధానంతో పాటు ఊహ కూడా ముఖ్యం. కవి భావనలకి ముఖ్య ఆధారం ఊహ. కవి కాంచిన వస్తువుని ఉన్నదున్నట్లుగా కాకుండా తన ఊహాజనితమైన కల్పనలతో వర్ణిస్తాడు. కవిత్వతత్వ దృష్టి ఉన్నవాడే కవి. ఆధునిక కాలంలో కవి ఏది చెప్తున్నాడు అనే దాని కన్నా ఎలా చెప్తున్నాడు అన్నదే ప్రశ్న.