కవికి కలిగిన వ్యక్తిగతానుభవాలను కవితలో వెలువరిస్తాడు. ఈ అనుభవాలన్నిటినీ కవి ఆత్మాశ్రయ కవితలుగా రూపొందిస్తాడు. కవిలో కలిగిన ప్రతి అనుభవాన్నీ కవి వ్యక్తపరచకపోవచ్చు. కవి వ్యక్తపరచిన అనుభూతిని పఠిత తన అనుభూతిగా మార్చుకుంటారు. స్వాత్మీకరణంలో సామాజికుడికి అనుభవయోగ్యమైన స్వీయానుభవాన్ని కవితలో కవి వ్యక్తీకరించటం, దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం జరుగుతుంది. అనుభూతి ప్రధానంగా ఏర్పడిన కవిత్వంలో వాడిన పదాలు అనుభూతికి మరో పేరుగా ఉంటాయి. ఆత్మగతమైన కవితలో ఈ పదాలకు అనుభూతులే చిహ్నాలు.
అనుభవాలని అనుభూతులుగా మార్చుకొన్నప్పుడు కవికి సమగ్రదార్శనికత ఏర్పడుతుంది. సమగ్ర దార్శనికత వల్ల కవి పఠితకు సమగ్రానుభూతిని అందించగలడు. ఈ సమగ్రానుభూతి కవిలో ఏ విధంగా కళానుభూతిగా మారుతుందో వారి మాటల్లోనే చూద్దాం.
“సచేతనంగా, సబుద్ధికంగా, సంకల్పసహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యడం అనుభూతిని కళగా అభ్యసించటం …. అనుభూతిని కళగా నేర్చుకునే దశలో ఒకడు మొదట సచేతనంగా అనుభవిస్తాడు. కనుక వాడు వచ్చే బాధల్ని ఆహ్వానిస్తాడు. అప్పుడు బాధ అంతర్ముఖత్వం బోధిస్తుంది. అప్పుడు సమస్త ప్రపంచాన్ని తనలో చూచుకుంటాడు. అంటే జగత్తు కవి ఆత్మలో పడి కరిగిపోతుంది లేదా కవి జగత్తులో పడి కరిగిపోతాడు. ఇలా సంభవించే బాహ్యాభ్యంతర ప్రయాణ కళాభ్యాసంలో వాడు సుఖదుఃఖ విచక్షణ కోల్పోతాడు. ఈ ప్రక్రియే ఆత్మకళ అనబడింది. అణుఛేదనం చేత అపారశక్తి విముక్తమైనట్లు ఈ ప్రక్రియ చేత ఆత్మనిక్షిప్త చైతన్య మహాసాగరం గట్లు తెంచుకొని ఘోషిస్తుంది. ఈ చైతన్య జాగృతి వల్ల మనిషి
ఆపాదమస్తకమూ మారిపోతాడు. ఒక నూత్నా వేళ ప్లావితుడవుతాడు. అంతా కొత్తగా కనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది. ఒక దృగ్విశేషం ఆవిర్భవిస్తుంది. ఈ దృగ్విశేషాన్ని శబ్దీకరించటమే కవిత్వం అవుతుంది”.
అనుభూతిని ఒక కళగా అభ్యసించాలని శేషేంద్ర అభిప్రాయం. ఈ అనుభూతి అనేది సచేతనంగా, సబుద్ధికంగా, సంకల్పసహితంగా జీవితాన్ని ఆచమనం చెయ్యగలిగే కళగా ఉండాలి. ఈ కళా దశలో కవి సర్వేంద్రియాలూ అనుభూతి చెందుతాయి. బహిర్జగత్తు వల్ల కలిగే బాధను అంతర్ముఖీనం చేసుకొని, సమస్త ప్రపంచం తనలో ఉందని భావిస్తాడు. జగత్తులో తాదాత్మ్యాన్ని అనుభవిస్తాడు. ఈ తాదాత్మ్యా సమయంలో కవి సుఖదుఃఖాతీతుడు. అనుభవాన్నే అనుభూతిగా నిలుపుకొని, దానికి అభివ్యక్తి నిచ్చేవరకు కవిలో జరిగే ఈ ప్రక్రియే ఆత్మకళాభ్యాసం. ఈ ఆత్మకళాభ్యాసం వల్ల కవిలో నూత్నావేశం కలుగుతుంది. ఈ ఆవేశం వల్ల కలిగే దృగ్విశేషమే కవిత్వం. అనుభూతి ఆత్మిక చైతన్యాన్ని జాగృతం చేసి, వికసింపచేస్తుంది. ఈ వికాసమే దృగ్విశేషంగా మారుతుంది. కవిత్వం అనేది ‘Spiritual individuality”ని సిద్దంప చేసుకోవటమంటే ఆత్మకళాభ్యాసం చేయటం.
ఈ ఆత్మకళనే లోవెల్ ‘లోలోతులు’గా పేర్కొన్నాడు. మనస్సు యొక్క లోలోతులే కవిత్వస్థానం.
“And I believed the poets; it is they who uttered wisdom from the central deep and listening to the inner flow-of things speak the age out of eternity”
లోవెల్ దృష్టిలో లోలోతులకి వెళ్ళిన కవి అక్కడ అంతర్ముఖాన్ని పొందుతాడు. ఈ లోలోతులంటే మనస్సుని దాటి మరింత లోతుకి వెళ్ళటం. ఇక్కడ కవికి బాహ్యజగత్తుతో సంబంధం ఉండదు. లోలోతుల వల్ల కలిగే జీవచైతన్యమే కవిత్వ జన్మస్థానం. సర్వెంద్రియాలతో సహా కవి లోతుల్లోకి పోతాడు. ఆ లోతుల్లోంచే కవిత్వ కళని వెలికి తీస్తాడు. ఈ లోలోతులనే షెల్లీ అదృశ్య స్వభావంగా గుర్తించాడు.
విశ్వనాథ ఈ స్థితినే పరమ చైతన్య స్థితిగా వర్ణించాడు. “భావుకునకు, పాఠకునకు కావ్యరూపమైన వాక్కు మనస్సును పొందును. వాక్కు మనస్సును పొందునా? వాగ్వ్రుత్తి నశించును. మనోవృత్తి నశించును. మనస్సు ప్రాణములందు చేరదు. మనస్సు సూటిగా విజ్ఞానాత్మను పొందును. ఇది జాగ్రదవస్థాక్రమము. వాక్కు నశించలేదు. మనస్సు నశించలేదు. ప్రాణము నశించలేదు. వాని వృత్తులు నశించనవి … అనగా వాజ్మనః ప్రాణములు స్తంభించినవి. ఇంద్రియములు పనిచేయుట లేదు. వాక్కు మనస్సు ప్రాణము మూడును స్తంభించిపోయినవి. భావుకుని యొక్క చైతన్యము పరమ చైతన్యమునందు సుంతపాటు లీనమైనది. కావ్యపఠితకు క్రమక్రమముగా అన్ని యావరణలు దొలగవలయును. అతడాభ్యంతర వృత్తిమాత్ర రసికుడు కావలెను.”
మనస్సును దాటి విజ్ఞానాత్మను చేరే దశ పరమ చైతన్యదశ. ఈ దశలో కవికి మనస్సుతో పని ఉండదు. కవి కావ్యస్థితి పొందుటకు ముందు అతడు పరమ చైతన్య స్థితిని పొందుతాడు. ఈ స్థితిలో కవికి వాజ్మనః ప్రాణాలు నశిస్తాయి. అంటే బహిర్జగత్తును వదిలి అంతర్ముఖి అవుతున్నాడు కవి. భావుకుడిలో ఉన్న చైతన్యం పరమ చైతన్యంలో కొంచెం సేపు లీనమై తిరిగి కావ్యరూపాన పఠితకు అందుతుంది.
“జాగ్రత్ స్థితిలో కవికి తెలియని ఈ మనస్సులోని మరుగు కవిత్వ రచనా వేళ కవికి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు అతడు పొందే అనుభూతే ఆనందం.”
కవియోగి పరమ చైతన్యస్థితిలో మనస్సుకి, ఇంద్రియాలకి మధ్య తెరని వేస్తాడు. అందుచే ఈ మనస్సు తిరిగి ఇంద్రియాలని ఆశించటానికి వీలు లేదు. చైతన్యంలోకి వెళ్ళటానికి మాత్రమే మార్గాన్ని ఏర్పరుస్తాడు కవి. ఈ మనస్సు చైతన్యంలోకి వెళ్ళి ఆనందాన్ననుభవిస్తుంది. కవి సుంతపాటు మనస్సుని నిలిపి తిరిగి రచనకి ఉపక్రమిస్తాడు. కావ్యపఠిత మనస్సు చైతన్య భూమి దాకా వెళ్ళినా కవి కాడు కనుక వెంటనే మనస్సు తిరిగివస్తుంది.
మొదట్లో మనం అనుభూతి అంటే ఏమిటో, అనుభూతి రచనల పరమార్థం ఏమిటో చర్చించాం. తర్వాత ఆధ్యాత్మికానందం అంటే ఏమిటో చెప్పి అనుభూతి కవిత్వానికీ, ఆధ్యాత్మికానందానికీ ఉన్న భేదాన్ని స్పష్టం చేశాం. ఆధునిక కావ్యేతిహాస యుగంలో ప్రభవిల్లుతున్న అనుభూతి విభావానుభావ సంచారి భావ పరిపుష్టమైన రసానందశాఖకు సంబంధించింది కాదు. ఆధ్యాత్మిక ఆనందానికి సంబంధించినది కాదు. యోగి గమ్యమైన ఆధ్యాత్మికానందానుభూతిని సమగ్రస్థితిలో రసానందం అందుకోగలదు. నేటి అనుభూతి కవిత్వం ఆ క్రమవికాస సమగ్రస్థితికి చెందినది కాదు. అందువల్ల సంప్రదాయమైన రససిద్ధాంతానికి భిన్నమైంది. సద్యఃపరనిర్వ్రుత్తిగా ఖండకావ్యంలో, మినీ కవితలలో తోరణాల వంటి భావచిత్రాల వలన పొందే దీర్ఘకాలిక భావతాదాత్మ్యం. ఆ తాదాత్మ్యస్థితిలో వాస్తవిక కాల్పనిక వైజ్ఞానిక భూములను దాటిన జీవచైతన్య క్షేత్రంలో ఆనంద సంవలితమైన అనుభవాన్ని అందుకోగలిగే కళాత్మకమైన ఆ అనుభవమే అనుభూతి. దీన్నే కొందరు భావకవిత్వానుభూతి అన్నారు. ఇంకేదో అన్నారు ఒట్టి అనుభూతి అన్నా ఇదే అర్థం కావాలి. ఇది కవితాసృష్టికి ముందున్న స్థితి కాదు. కవితానుభూతిలో కవి, సహృదయుడు సమంగా అనుభవించే సాహిత్య కళానుభవం. ఇటువంటి దాన్ని లక్షించి రాసే కవులే అనుభూతివాద కవులు.