ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

1989లో ఈ వాదంపై వెలువడిన మరో వ్యాసం ఆర్,ఎస్, సుదర్శనంగారి “అనుభూతి కవిత్వం” అస్తిత్వవాదంలో మనిషికీ బాహ్యప్రపంచానికీ ఆత్మీయమైన సంబంధం కావాలేకానీ, ఆలోచనాత్మకంగా ఉండదని పేర్కొంటూ, అనుభూతి వాదాన్ని అస్తిత్వవాదంతో ముడిపెట్టారు.
ముందు పేర్కొన్నట్లుగా, ఈ కాలంలోనే ‘అనుభూతి కవిత్వం’, ‘అనుభూతివాదం’ అనే అంశాలపై ఏవిధంగా చర్చ సాగుతుందో, అదేవిధంగా అనుభూతి అనే అంశంపై కూడా చర్చసాగటం గమనార్హం. కవి పొందిన అనుభూతిని పాఠకులకు అందించగలగాలనీ, అసలు కవిత్వానికి గీటురాయి అనుభూతే అని వీరందరి అభిప్రాయం కావటం ముదావహం. ఇలా అభిప్రాయపడిన వారిలో ఎక్కువగా ప్రత్యేకించి 1960 తర్వాత వారు కావటం కూడా గమనించాల్సిన మరో విషయం. వీరు కేవలం అనుభూతి గురించి చర్చించటమేకాక, వారి వారి అనుభూతులను కావ్యరూపంలో వ్యక్తం చేసిన వారు కావటం కూడా గమనించాల్సిన మరో విషయం. కేవలం అనుభూతిని గురించి మాత్రమే చర్చించిన వారిలో ముఖ్యులు తిలక్, శేషేంద్రశర్మ, ఇస్మాయిల్.

అవ్యక్తానుభూతిని వ్యక్తం చెయ్యగలగటమే కాక, ఆ అనుభూతిని పాఠకుడికి అందివ్వగలగాలని తిలక్ అభిప్రాయపడటం జరిగింది. కావ్యసృష్టికి మూలకారణం అనుభూతి అని వీరు ఘంటాపథంగా చెప్పటం జరిగింది. తిలక్ అనుభూతిని కళగా దర్శించినట్లు, 1944లోని “కావ్యసృష్టి” అనే వ్యాసం ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.
1977 శేషేంద్రశర్మగారు కవిసేన మేనిఫెస్టోలో అనుభూతి కళగా ఎలా మారుతుందో చాలా వివరణాత్మకంగా నిరూపించటం జరిగింది. ‘కవిత్వం రాజకీయ పార్టీల చేతిలోని కీలుబొమ్మ కాద’నీ, కవిత్వాన్ని కవిత్వంగానే బతకనివ్వాలనీ శేషేంద్ర అభిప్రాయం. ‘తెలుగుదేశం అకవుల చేతుల్లో పడింద”నీ, ‘దాన్ని రక్షించాల’నీ వీరు కవులకు విజ్ఞప్తి చేశాడు. ‘ఆకలి మీద రాసినా ఆవకాయ మీద రాసినా సరే’ – ఆ కవిత్వం మాత్రం అనుభూతిని అందించగలిగేదిగా ఉండాలి. కవి ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నా, ఏ ధోరణికి చెందిన వాడైనా సరే ముందుగా కవిత్వంలో అనుభూతికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించారు.
1987లో ఇస్మాయిల్ గారు కవిత్వంలో నిశ్శబ్దం అనే గ్రంథంలో అనుభూతిని గురించి చర్చించారు. వీరు కూడా కవిత్వానికి అనుభూతి ముఖ్యమనీ, అసలు కవిత్వం అనుభవంలోంచే పుడుతుందని నమ్మేవాళ్ళల్లో ఒకరు.

మనిషికి సమగ్రమైన అనుభూతి కావాలంటే సమగ్రమైన అనుభవం కావాలి. సమగ్రానుభవాన్ని మానవ శరీరం పంచకోశాల ద్వారా పొందుతుంది. మానవ సమగ్రానుభూతికి ఏవిధంగా పంచవిధమైన జిహ్వాలున్నాయో ఆవిధంగానే కావ్యానికి కూడా పంచవిధ జిహ్వలు అవసరమని 1987 అక్టోబరులో డా.జి.వి. సుబ్రహ్మణ్యంగారు “అనుభూతి కవితావాదం” అనే వ్యాసంలో పేర్కొన్నారు.
వీరి తర్వాత, 1987 నవంబరులో వెల్చేరు నారాయణరావుగారు, తిలక్ కవిత్వాన్ని విశ్లేషిస్తూ,, తిలక్ ను ‘అభ్యుదయ భావకవి’గా గుర్తించారు. అంతేకాదు, తిలక్ అనుయాయులని కూడా ‘అభ్యుదయ భావకవులు’గా పేర్కొన్నారు. అంటే, వెల్చేరువారు అభ్యుదయ కవిత్వ, భావకవిత్వ లక్షణాల సమ్మేళనమే అనుభూతి కవులని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked