పైన చెప్పబడిన ప్రముఖుల భావాలు పరిశీలిస్తే భావకవితానంతర కాలంలో ప్రభవిల్లిన అభ్యుదయ కవిత్వం నియమాలకూ, నిబద్ధతకూలోనై వర్తిస్తుండగా, సామాజికావసర కారణంగానే అనుభూతి కవిత్వం పుట్టుకొచ్చిందనే తోస్తున్నది.
అనుభూతి కవితావాదం విషయమై మంచి వ్యాసాన్ని ప్రభురించారు ఆర్.ఎస్. సుదర్శనంగారు. ఆ వ్యాసంలో వారు చేసిన వివేచన, విశ్లేషణ విలువైన అంశాలను అందిస్తున్నాయి. అనుభూతి కవిత్వంలోని నవ్యత హృదయానికి హత్తుకొని అనిర్వచనీయమైన, అనిర్ధిష్టమైన అనుభూతిగా మిగలాలి. ఇది పోలికల ద్వారా కానీ ఊహల అల్లికల ద్వారా కానీ ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణన ద్వారా కానీ కావచ్చు. ఒక ఖండిక చదివిన తర్వాత దానిలోనుంచి మనం ఎటువంటి సందేశాన్ని పొందనవసరం లేదు. అది మనకెటువంటి దృక్పథాన్నీ కల్గించాల్సిన అవసరం లేదు. ప్రాచీన కవితోద్దేశాలను పరిశీలిస్తే –
“యద్వేదాత్ప్రభు సమ్మితాదధిగతం శబ్దప్రధానాచ్చిరం
యచ్చేర్థ ప్రవణాత్పురాణ వచనాదిష్టం సుహృత్సమ్మితాత్
కాంతా సమ్మితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియా
కర్తవ్యేకుతుకీ బుధో విరచితస్తె స్పృహాం కుర్మహే”
అని చెప్పబడిన ఆలంకారిక లక్షణంలో వేదాలు ప్రభుసమ్మితాలుగా, పురాణాలు మిత్రసమ్మితాలుగా, కావ్యం కాంతాసమ్మితంగా కర్తవ్యబోధని చేస్తాయి. అనుభూతి కవిత్వంలో సారస్వత సంబంధమైన ఈ నియమం సైతం లేదు. రచన చదవగానే పాఠకుడు అంతర్ముఖుడవుతాడు. దానివల్ల అతనికి ఒక అనిర్వచనీయ స్థితి కలుగుతుంది. ఇదే బాహ్యాంతరాలను మరచిపోయే స్థితి. ఈ స్థితిని కలిగించటమే అనుభూతి కవిత్వ ప్రధాన
కొన్ని సన్నివేశాలు వర్ణించి పాఠకులలో అనుభూతి కలిగే ప్రయత్నం చెయ్యగలం. వారు ఆ అనుభూతిని పొందారా లేదా అన్నది పక్కవాళ్ళు నిర్ణయించేది కాదు. ఒక రచన చదివేటప్పుడు ‘ఇదిగో ఈ అనుభూతిని నేను ఇలా పొందాను’ అని చెప్పటం సాధ్యమయ్యే పనికాదు. అలా చెప్పేది బుద్ధి. అందుకే “అనుభూతి బుద్ధితో అర్థం చేసుకునేది కాదు” అనుభూతి ఇంద్రియ వ్యాపారాలు అణిగిపొతే కానీ పొందేది కాదు. అందుకే దానిని అనిర్వచనీయం అంటారు. ఇది ఆస్వాద్య విషయం కాదు. ఇది ఆస్వాద్యం. కేవలం అనుభూతిని పొందటమే.
“కాల్పనిక వాదకవుల్లో శృంగారం, కరుణ వంటి సాంప్రదాయికంగా గుర్తింపదగిన రసపోషణ, పాత్రపోషణ, సన్నివేశ చిత్రణ వంటివి ఉంటాయి. అనుభూతి కవిత్వంలో మాత్రం అనుభూతి నిర్దేశం పాఠకునికే వదిలి పెట్టబడింది” అంటే భావకవిత్వానికి అవసరమైన విషయసామాగ్రి అనుభూతి కవిత్వానికి అవసరం లేదు.
“అనుభూతి కవిత్వానికి సంగీతంతో అవసరం లేదు” అంటే అనుభూతి కవిత్వంలో అవశ్యం సంగీతం ఉండక్కర్లేదని దీని అర్థం. అంతమాత్రంతో అనుభూతి కవిత్వానికి సంగీతం పరిహార్య లక్షణంగా భావించనవసరం లేదు. భావకవిత్వానికి ఒక లయ, ఒక తూగు, శాబ్దిక సౌందర్యం, కుసుమపేశల భాషా సౌకుమార్యం అపరిహార్య లక్షణాలు. వచనకవితా ఖండికల్లో వస్తున్న అనుభూతి కవిత్వం భావకవిత్వం నుంచీ వినబడుతోందని చెప్పే విశేషమిదే.
అనుభూతి కవిత్వానికీ, అస్తిత్వవాదానికీ చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు. కానీ అస్తిత్వవాదమే అనుభూతివాదమని చెప్పటానికి వీల్లేదు. అస్తిత్వవాద దృక్పథంలో మనిషికీ బాహ్యప్రపంచానికీ గల సంబంధం ఆత్మీయమైంది. ఇది ఆలోచనకు సంబంధించింది కాదు. కలం చేతికి ఇవ్వగానే ఎలా చెయ్యి రాయటానికి సమాయత్తమౌతుందో గమనిస్తే, ఈ ప్రయత్నంలో ఆలోచనకేమీ తావులేదని తెలుస్తుంది. అంటే మన శరీరం బాహ్య వస్తువులతో సమన్వయం కుదుర్చుకుంటుంది. రచనలో ఆలోచించి విషయాన్ని గ్రహించటం కంటే, విషయం సొంతమైపోవటం అనుభూతి కవితా లక్షణం. ఆలోచించటానికి అవసరం కల్పించే సైన్సు, మతం, రాజకీయాలు, ధర్మబోధవంటివి మనిషి చైతన్యాన్ని ఆక్రమించివేస్తాయి. అందువల్ల ఈ వస్తు అస్తిత్వం ద్వారా సహజసిద్ధంగా పొందవలసిన ఆనందాన్ని ఇవి అణచివేస్తాయి. వేదాలు, పురాణాలు మొదలైనవి చదువుతున్నప్పుడు బుద్ధి పనిచేస్తుంటుంది. మనం జ్ఞానం పొందుతాము. అలాగే రాజకీయ సంబంధమైన విషయాలు వినేటప్పుడు మనసు వ్యగ్రంగా ఉంటుంది. మనిషి తెలివిలో ఉంటాడు. బుద్ధి పని చేస్తుంటుంది. అనుభూతి కవిత్వం ఇలాంటి ఆలోచనలను, ప్రేరణలను ఇచ్చేది కాదు. చదువుతున్న దాన్లోంచి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందటమే అనుభూతికవిత్వ ప్రధాన ఉద్దేశం.
‘కళ కళకోసమే’ అన్న సిద్ధాంతం అనుభూతి కవిత్వానికి వర్తించేది కాదు. రసాస్వాదనకు సమగ్రమైన మెట్లు ఉన్నాయి. విభావానుభావ సంచారిభావ పరిపోషకమైన రసానందాన్ని అనుభవయోగ్యంగా చెప్పే సంప్రదాయాలు విశిష్టంగా, ప్రముఖంగా ఉన్నాయి. అంత విస్తృత ప్రాతిపదిక మీద కవిత చెప్పటానికి అవసరం లేని ఖండకవితా ప్రక్రియ అనుభూతి కవిత్వానికి ప్రక్రియ. విషయం రసపర్యవసాయిగా సాగనవసరం లేదు. అనుభూతి పాఠకునికి అందటమే ఇందులో పరమప్రయోజనం.