-సునీత పావులూరి
ఇందులో వాస్తవికానుభూతి లేదని ఎలా చెప్పగలం? తేలిందేమంటే ఏ కవిత్వమని నువ్వు పేరు పెట్టుకున్నా, ఏ ప్రక్రియలో నువ్వు రాస్తున్నా అది నిజంగా కవిత్వమే కనుక అయితే అనుభూతికి అది దూరంగా ఏమాత్రం ఉండదు. కాకపొతే తరతమ భేదాలుంటాయి. అంతే.
అయితే మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. “భారతీయులు – ఆ మాటకొస్తే మార్క్సిస్టులు కాని వారందరూ భావించే సామాజికానుభూతికిన్నీ మార్క్సిస్టులు చెప్పే అనుభూతికిన్నీ ఎంతో భేదం ఉంది. మార్క్సిజం వల్ల సాంఘిక వ్యవస్థలోని కొన్ని రంగాలలో సుస్థితి ఏర్పడుతుందని నమ్మేవాళ్ళు కూడా అనుభూతి విషయంలో వారి దృక్పథాలను అంగీకరించారు. మార్క్సిజంకు కట్టుబడిన అభ్యుదయ రచయితలూ, విప్లవ రచయితలూ సమాజ వ్యక్తిలోని వాస్తవానుభూతిని, విజ్ఞానానుభూతిని అంగీకరింపగలరేమో కాని మిగిలిన మూడూ వారి దృష్టిలో మృగ్యాలే లేదా మిధ్యలే. ఆ మూడు ప్రవృత్తులను స్పృశించే కవితా చైతన్యాలను వారు వ్యక్తివాద ధోరణులనీ, రూపవాద ధోరణులనీ, సాంప్రదాయకమైన ధోరణులనీ, బూర్జువా పద్ధతులనీ, తిరోగామి విధానాలనీ వారి పారిభాషిక పదాల్లో, చట్రాల్లో ఇమిడ్చి తిరస్కరిస్తారు. నిజంగా మానవ సమగ్ర వ్యక్తిత్వాన్నీ, మానవవికాసాన్నీ, కళానుభవ సమగ్ర స్వరూపాన్ని, సాహిత్య స్పృహను మన్నించేవారు మార్క్సిస్టులను అనుభూతి విరోధులుగా భావిస్తారు. మార్క్సిస్టు ధోరణి మేధను కదిలించినంతగా, బోధను కలిగించినంతగా జీవచైతన్య స్పందనను అందించలేదు. అందులోని బలమైన వాస్తవికత లోకాన్ని ఎంతో ఆకర్షిస్తుంది. కాని, ఆ రచయితల నిబద్ధత కవితను సృజనాత్మక కళగా ఎదగవలసినంత ఎదుగనీయకుండా చేస్తుంది. అందువల్లనే వారిది ఆకవిత్వమని అధిక్షేపించేది. అనుభూతి స్పృహకు దూరమైనా కవిత అని విచారించేది. తెలుగులో అనుభూతి కవితావాదం తల ఎత్తటానికి అభ్యుదయ కవిత్వ ధోరణిలోనూ,
విప్లవసాహిత్య ధోరణిలోనూ మార్క్సిస్టులు – తరతరాలుగా ఈ దేశంలో, మన సాహితిలో పరిపూర్ణ కళానుభవమనీ, రసానందమనీ దేనిని భావిస్తున్నారో, దానిని ఏయే సమర్థవంతమైన ప్రక్రియల ద్వారా అభివ్యక్తీకరించటానికి వీలున్నదని తెలిసి ప్రయోగాలు నిర్వహిస్తున్నారో, వాటిని చదివి సమాజం కళానుభవాన్ని ఏవిధంగా పొందుతున్నదో — సరియైన వివేచనతో, విలువలతో గ్రహింపక తిరస్కరించటమే బలమైన కారణం. మార్క్సిస్టు దృక్పథమే సాహిత్య ప్రమాణమని చెప్పే సిద్ధాంతం ప్రపంచంలోని మేధావులందరి చేతా విమర్శింపబడుతున్నది. సమాజ సమగ్రానుభవ స్పృహను, సాహితీ స్పృహను కాదనే వారి తీవ్రవాదం ఆంద్ర సాహిత్యరంగంలో మార్క్సిస్టేతరుల ఆగ్రహానికి, తిరస్కారానికి గురి అయింది. మార్క్సిస్టుల ప్రచారంలో, సాహిత్యంలో అపార్థం పాలౌతున్న విషమూర్చితమైపోతున్న సాహిత్య సమగ్రానుభవాన్ని, సామాజికపరంగా రచయితలపరంగా దానికి చెప్పుకోవలసిన సమన్వయాన్ని మరలా పునరుజ్జీవింప చేసుకోవటానికి తమ రచనల ద్వారా ఉద్యమాన్ని సాగిస్తున్న రచయితల నిశ్శబ్ద సంగ్రామమే అనుభూతి కవితాధోరణి”
పైన చెప్పబడిన విషయాన్ని మరోసారి పరిశీలిస్తే ఈ కింది విషయం విషదమవుతుంది. “కల్పవృక్షం సమకాలీన సమాజంలోని సమగ్రకళానుభవాన్ని కోరే సాత్త్వికశక్తుల బలమైన ఆకాంక్షకు ప్రతిఫలం. 1934 నాటికి భావకవిత్వయుగంలో రాయప్రోలువారి అమలిన శృంగార సిద్ధాంతం, కృష్ణశాస్త్రిగారి ఆదర్శ సౌందర్యాన్వేషణం, చలంగారి స్త్రీ వ్యక్తిత్వ విప్లవ చైతన్యం, త్రిపురనేని రామస్వామి చౌదరిగారు సంప్రదాయంపై తీసుకొనివస్తున్న వివేచనాత్మకమైన విమర్శ (దీన్నే కొందరు హేతువాదమంటున్నారు). మొదలైనవి నూత్నభావ చైతన్యానికి తెలుగు సాహిత్యంలో మార్గాల నావిష్కరించాయి. స్వాతంత్ర్యోద్యమం, ప్రబోధ కవిత్వం, హరిజనోద్యమం, బ్రహ్మసమాజాది మతవ్యాప్తి – ఇవన్నీ జాతిలో నూత్న జాగృతిని కలిగించాయి. ఆధునిక నాగరకత, పాశ్చాత్య సంస్కార సంవలితమైన భారతీయమైన సంస్కృతి సమస్యలను పునః పరిశీలనకు గురిచేస్తున్నది. కాలానుగుణంగా సమాజంలో విలువలు మారుతూ వస్తున్నవి. ఎన్ని మార్పులు వచ్చినా వాటికి ప్రాతిపదికంగా నిలువగలిగినది గార్హస్థ్యజీవితం. స్త్రీ, పురుషుల సంబంధంలో పరమార్థ దృష్టి క్రమంగా లోపించడం, ధర్మం అర్థసాధనకనువుగా మారటం, కామం సర్వ ప్రవృత్తులను మూలచైతన్యంగా భావించటం వంటి మార్పులు ఆ వ్యవస్థను అర్థరహితంగా మార్చే ప్రమాదం వాటిల్లింది. ఆధునిక నాగరకత, నవ్యభావ విప్లవం భారతీయ గార్హస్థ్య జీవన వ్యవస్థను భగ్నం చేయరాదనే విశ్వాసం కలవాడు విశ్వనాథ. సర్వధర్మాలకు బీజరూపమైన ధర్మమిది. సీతారాముల ప్రణయం అద్వైతప్రేమకు చిహ్నం, భారతీయ జీవిత పరమార్థాన్ని జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలో కూడా శాసిస్తున్న తత్వమది. దాన్ని నవ్యకవితా ప్రక్రియల్లో కులపాలికా ప్రణయతత్వంగా విశ్వనాథ ప్రతిపాదించాడు. దాన్ని మహాకావ్య ప్రక్రియలో రూపొందించటానికి రామాయణ కల్పవృక్షాన్ని రచించారు.