ధారావాహికలు

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

-సునీత పావులూరి

“అయ్యయో! ఊర్వశీ విషాదార్ద్రమూర్తి
ఈ నిశీథాన నా హృదయాన నిండె!
పూర్ణిమా శుభ్రయామిని బొగ్గువోలె
ఈ యెడదవోలె కాలిపోయినది నేడు!”

దీనిలో ‘నేను’ అంటే నేను అనే అర్థం. కానీ “నా బాహువు పడుకుంటే, పొలాలు ,కార్ఖానాలు నిద్రిస్తాయి” అన్న ఆధునిక కవి రచన చదివితే, ఇందులో ఉన్న నేను ‘నేను’ కాదు. ఇక్కడ ‘నేను’ అంటే సమాజం అనే అర్థం. కాబట్టి ఆధునిక రచనలోని ఆత్మాశ్రయ కవిత్వం సామాజిక అనుభూతులకి సంబంధించిందే. కవి వైయక్తికంగా తాను పొందిన అనుభూతిని సామాజికంగా చెప్తున్నాడు. ఈ రచన సమాజంలోని ప్రజలందరి భావంగా మారి ప్రయోజనాలను ఉద్దేశించిందిగా కన్పిస్తుంది. కవి రచన అనుభూత్ని స్వాత్మీకరణం చేసుకున్నా, ఆ అనుభూతి సమాజం పొందేదే. శేషేంద్ర-
“నది పోలాలవైపు పరిగెత్తింది
అన్నార్తుల్ని రక్షిద్దామని
చెయ్యి రైఫిల్ వైపు పయనించింది
ప్రజాద్రోహుల్ని శిక్షిద్దామని”
అని అంటాడు. ఇక్కడ చెయ్యి అంటే తన చెయ్యి కాదు. ఏ ఒక్క చేతికో సంకేతమూ కాదు. అది సమాజహస్తం. ఈ భావం కవి హృదయంలోంచి వచ్చినా, ‘నేను’ అని చెప్పబడ్డా ఈ అనుభూతి సామాజికానుభూతియే.

సారస్వత చరిత్ర చెప్పేటప్పుడు యుగవిభజన చేసుకోవటం తప్పని సరి. వీలైనంత వరకూ ప్రదానకవుల ఆధారంగా వారి పేరిట యుగవిభజన చెయ్యటం కొందరు చేసిన పని. సారస్వత లక్షణాలను గ్రహించి, వాటికి అనుగుణంగా యుగవిభజన చేసుకోవటం మరికొందరు ఆచరించిన పని. చరిత్రకారులందరూ ప్రయోజనాన్ని బట్టి తన కనుకూలమైన యుగవిభజన చేస్తూ వస్తున్నారు. అలాగే సమకాలీన సాహిత్య చరిత్రకి కూడా పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు. నలుగురి చేతా ఆమోద ముద్రపడిన పేర్లు ఆయా యుగాలకు స్థిరపడి పోతుంటాయి. అలా ప్రసిద్ధాలైనవే భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం వంటివి. ఇవి “ప్రజల అంతశ్చైత్యనాల స్పందలనకు కామనలకు సమస్పందులుగా, ప్రతీకులుగా ఉంటాయి. అవి జనహృదయాల ప్రతిధ్వనులు.” ఆధునిక కాలంలో కవులు సంఘాలుగా ఏర్పడటం, రాజకీయ పార్టీలకు అంకితమై రచనలు సాగించటం వంటి లక్షణాలు ఉన్నాయి. ఒక రాజకీయ సంఘం నిర్ణయానుసారం ఆ కవులంతా వారి రచనకు ఏదో ఒక పేరు పెట్టుకొని ప్రచారం చేసుకోవచ్చు, అలాగే రచయిత సంఘాలు కూడా వారి ధోరణికి ఏదో ఒక పేరు పెట్టుకుని రచిస్తూ దానికి ప్రచారం తెస్తారు. ఈ పెట్టుబడి పేర్లు తప్పనిసరిగా ప్రచారంలోకి వస్తాయి. వాటిని ప్రజలు స్వీకరించక తప్పదు. ఆయా రాజకీయ పార్టీలు కానీ, కవి సంఘాలు కానీ వారి వారి సంఘాలకు పెట్టుకున్న పేర్లు ఎలా అన్వర్థాలో వారే చెప్పుకుంటారు. దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం ఇటీవల కాలంలో అలా పెట్టుకున్న పేర్లే. కవిత్వం ఎలా దిగంబరమో ఆ కవులే చెప్పుకుంటారు. అలాగే విప్లవ కవిత్వం కూడా. ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ అన్నప్పుడు అందులో ఉండే విప్లవపదానికీ, ‘విప్లవ రచయితల సంఘం’ అనే దానిలోని విప్లవ పదానికీ సంబంధమే ఉండదు. అయినా వీరి కవిత్వాలకి ఈ పేర్లు ప్రసిద్ధాలైపోయాయి. ఏ కవైనా వ్యక్తిగతంగా తాను రాస్తున్న కవితారీతికి కానీ, ఇతరులు చెప్తున్నా కవితావిధానాన్ని కానీ, తనకు నచ్చినది అనుకున్నా లేక తానా కవితా విధానానికి సరిపోతుందనుకున్న రీతికి అనుగుణంగా ఏ పేరు పెట్టినా దాని మీద చర్చలు తప్పవు, పోరాటాలు తప్పవు. ఈ యుద్ధంలో పాల్గొన్నది పరిమిత సంఖ్యంలో ఉండే పండితులు లేక మేధావులు ఈ వాదనలు కొనసాగుతూనే ఉంటాయి, ఇతరులు మాత్రం వారికి నచ్చిన పేర్లతో ఆయా కవిత్వాలని పిలుస్తూ ప్రచారంలోకి తెస్తూనే ఉంటారు. అలాగే ఈనాడు మనం పిలుస్తున్న ‘అనుభూతి కవిత్వం’ కూడా ప్రజలతో పిలవబడి, ప్రచారంలోకి వచ్చింది. అనుభూతి కవిత్వం చరిత్రను గురించి ఒకసారి పరిశీలిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked