ఈజీ ఈజీ గా ఇంటర్వూస్ చేసేద్దాం!
అమరనాథ్ . జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257
ఇంటర్వ్యూ అంటే చాలామందికి మాటల్లో కంగారు, గుండెల్లో బేజారు ,ఎదుటివారిని చూస్తేనే భయాలు, పొడారిపోయే గొంతులతో , స్వాధీనం తప్పేశరీరాలతో. మొత్తంగా శరీరం మరియు మనసు వేటగాడి చేతిలో చిక్కబోయే లేడి పిల్లలా గజ గజ వణికి పోతూ వుంటారు. ఇది నిజంగానే మనసు ఆడించే ఆటే! ఎందుకని చాలామందికి ఇలా జరుగుతుంటుంది? ఎక్కువ భాగం ఈ పరిస్థితికి కారణం ఇంటర్వ్యూ ల్లో ఎదుర్కొబోయే విషయాల పట్ల పూర్తిగా అవగాహన లేకపోవటం ఒకటైతే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనే ఆందోళన మరో వైపు మనసును ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మన మన మెదడులో ఆడ్రెనాలిన్ (Adrenaline) అనే న్యూరోట్రాన్సమీటర్ Stressful గా భావించే situations లో మన శరీరాన్ని అనేక మార్పు చేర్పులకు గురిచేస్తూ ఉంటుంది. దీనివలన మన శరీరం అనేక మార్పులకు గురి అవుతూ గుండె దడ, శ్వాసలో మార్పులు, మాటల్లో తడబాటు, అకారణ చెమటలు, బ్లడ్ ప్రెషర్ మరియు మానసిక స్థితి భయంగా మారుతుంది. ఒక ఇంటర్వ్యూ లో గెలవటానికి ఇటువంటి పరిస్థితా! నిజానికి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనే సమర్ధవంతంగా ఎదుర్కొనే మంత్ర దండం మనచేతిలోనే వుంది. అదే ఇంటర్వ్యూకు వెళ్ళవలసిన ప్రతివారికి కావాల్సింది ఇంటర్నల్ వ్యూ (Internal view) అంటే మనలోకి మనం తొంగి చూసుకోవటం. మన బలాలు, మన బలహీనతలను ఎటువంటి సెన్సార్ లేకుండా స్పష్టంగా గమనించటం! ఇది మనం చేయగలిగామా ఇంటర్వూస్ అంటే ఇంత తేలికా అని మీరే అంటారు.
ఇంటర్నల్ వ్యూ (మనలోకి మనం) మనిషి అనే ప్రతి ఒక్కరికి బలం మరియు బలహీనత రెండు సహజమైన లక్షణాలే. మనలోని ప్రతి బలహీనతను మన బలంతోనే ఎదుర్కొనాలి. దానికి కొంత కృషి మన నుంచే జరగాలి ఒక్కసారి మన గురించి మనం ఆలోచిద్దాము మనలో ఉన్న బలమేమిటి (Strength) ఉదాహరణకి మన చదువు మనకున్న ఒక బలం కావచ్చు, రెండోది మనకున్న కంప్యూటర్ పరిజ్ఞానం కావచ్చు ప్రధానంగా ఈ రెండు మన ఉద్యోగానికి అవసరమయ్యే ప్రధాన అర్హతలే! ఈ రెండూ లేకపోతె మనకు ఇంటర్వ్యూ కు వెళ్లే అర్హతే ఉండదు ఆవునా! మరి మన బలహీనతలేమిటి కమ్యూనికేషన్ స్కిల్స్ ,బాడీ లాంగ్వేజ్ ,సామాజిక పరిజ్ఞానం కావచ్చు పట్టుదలతో ప్రయత్నిస్తే కేవలం కొన్నిరోజులలో వీటిని సాధించవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది దాదాపు 20 సంవత్సరాలు చదువుకు కోసం పడిన కష్టం కేవలం కొన్ని రోజులు ఇంటర్వ్యూ కోసం పడలేమా అని ! దీనిని చిత్తశుద్ధి తో సాధన చేస్తే ఫలితం మనదే. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి కోచింగ్ అవసరంలేదు మన ఇంటినుండి మన ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సామాజిక జ్ఞానం అంటే మన ప్రపంచం, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా ఈ సమాచారం మనకు ఎక్కడ లభిస్తుంది దినపత్రికలలో లేదా ఇ-పేపర్స్ లో కొంత సేపు రోజూ మొత్తంలో ఒక గంట దీనికోసం మనం కేటాయించలేమా? మన దేశ రాష్ట్రపతి లేదా మన దేశ ప్రధమ పౌరుడు ఎవరు అంటే యెంత మంది ఈనాటి యువతకు తెలుసో ఆలోచించండి! ఇటువంటి విషయాలు మనకు అందించ గలిగేవే దినపత్రికలు. ఇక చక్కటి హావభావాలతో (బాడీ లాంగ్వేజ్) తో కూడిన కమ్యూనికేషన్ ఇది మీరు అనుకున్నంత కష్టమేమి కాదు ప్రయత్నిస్తే ఈ అవకాశం కూడా మీ చేతుల్లోనే వుంది అంతేకాదు మీ తప్పులను మీరే సరి చూసుకుని సరి దిద్దుకునే అవకాశం కూడా వుంది అదెలా మీరు సాధించబోయే లక్ష్యానికి సంబంధించిన విషయాలను మీకు మీరే గట్టిగా రిహార్సల్స్ చేసుకుంటూ అద్దం ముందర నుంచుని ప్రాక్టీస్ చేయండి మీరు ఎలా ఉంటే బాగుంటుందో మీరే తెలుసుకుంటారు. మనం ఎలా ఉంటే బాగుంటాం, చక్కటి చిరునవ్వుతో కూడిన రూపంలో అవునా!ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొండి కచ్చితంగా మీకు బాగా ఉందనిపించింది అవునా! అదే మీ నుంచి అవతలి వ్యక్తులు ఆశించేది కూడా. కొన్ని సందర్భాలలో మీరు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పగలిగే మీ నిజమైన స్నేహితుడు అద్దమే.చిరునవ్వుతో మాట్లాడే మాట ఇతరులలో మీ పట్ల సదాభిప్రాయాన్ని కలుగ చేస్తోంది. అవసరమైతే దీనిని మీ స్నేహితుల ముందర కూడా సాధన చేసి తగిన సూచనలు పొంద వచ్చు. ఈ సాధన మనం చాలా తేలికగా చేయగలం ప్రయత్నించండి.
విద్యార్ధి దశ అంటే దాదాపు 15 నుండి 20 సంవత్సారాల వరకే ఉండేది మరి ఆ తర్వాత మన జీవితాంతం మనల్నినడిపించేది మన ఉద్యోగ స్థితే! అందుకే పెద్దలు చెప్పేది జీవితంలో మన కాళ్ళమీద మనం నిలబడగలమని నిరూపించుకునే ఒక గొప్ప అవకాశమే వుద్యోగం. అంతేకాదు సమాజంలో ‘జెంటిల్మెన్’ గా మన కొక గుర్తింపు. నిజంగా వుద్యోగం చేసే దశ యువత కు ఒక గొప్పవరం ఎందుకంటె నిన్నటి వరకు తన మీద బాధ్యత ఇంటి పెద్దలది మరి వుద్యోగం వస్తే తనపై తన బాధ్యత, కుటుంబలో ఎదిగిన పిల్లల్ని చూసి మురిసే ఇంటి పెద్దలు, దానితో పాటు వచ్చే పెద్దరికం, గౌరవం అవకాశాన్ని బట్టి ఇంటి బాధ్యతలు మరియు ఆర్ధిక భరోసా.నిజంగానే మనిషి తనకు తానుగా నిలబడటం లో యెంత గొప్పతనం వుందో చూడండి. దాదాపు కనీస విద్యార్హత ఉన్న ప్రతి యువతా ఉద్యోగ ప్రయత్నంలోనే వుంటారు సహజంగానే ఏదో వుద్యోగం అని కాకుండా మన జీవితాంతం వరకు తోడుగా నీడగా నిల్చె వుద్యోగం సంపాదించాలంటే ఎన్నో సంవత్సరాల పాటు చదివిన చదువులకు సార్ధకకత దక్కాలంటే కేవలం కొన్ని రోజులు కష్టపడితే చాలు మనం ఎదుర్కోబోయే ఇంటర్వూస్ కోసం అందుకే శ్రమ, పట్టుదలతో కూడిన ప్రయత్నాలు అవసరమనేది ప్రతి ఒక్కరూ మనసులో ఒకటికి వంద సార్లు మననం చేసుకోవాలి.
ఇంటర్వ్యూ అంటే ఏదో కఠినమైన శిక్షలేమి కాదు మిమ్మల్ని మీరు సమర్ధవంతులుగా నిరూపించుకునే ఒక గొప్ప అవకాశం. అలాగే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా పెద్ద పులులో, సింహాలో లేదా అతీత శక్తులో కాదు వారు కూడా మన లాంటి మనుషులే కాక పొతే వారు ప్రశ్నలు అడిగే స్థానం లో వుంటారు మనం సమాధానాలు చెప్పే స్థానంలో ఉంటాం. వారికి కావలసింది ప్రతిభ కలిగిన వ్యక్తులు ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను చూసి భయపడాల్సిన అవసరమేలేదు. వారు మన పరిధికి సంబంధించిన ప్రశ్నలే వేస్తారు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక్క విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. మీకు వుద్యోగం యెంత అవసరమో ప్రతి సంస్థకు మంచి ఉద్యోగస్తులు కూడా అంతే అవసరం. ఉద్యోగుల ఎన్నిక అనేది ప్రతి సంస్థకు చాలా ఖర్చుతో కూడిన పని అందుకే ప్రతిభ వున్నా ఏ వ్యక్తిని ఏ సంస్థ వదులుకోదు. కాక పోతే మనం లేని ఆపదను చూసి భయపడతాం. ఇక్కడ ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకోండి చాలా మందిలో ఉద్యోగానికి కావాల్సిన చదువులు, అనుభవాలు ,సామాజిక జ్ఞానం ,కంప్యూటర్ పరిజ్ఞానం, మరియు సమాజంలో చక్కటి సంబంధ బాంధవ్యాలు కూడా ఉంటాయి వాస్తవంలో ఇవన్నీ మన బలాలే కానీ ఇంటర్వూస్ కు వచ్చే సరికి కేవలం ఒకే ఒక్క బలహీనత మాట్లాడ లేకపోవటం.(Communication Disorder)ఇక్కడే ప్రతి ఒక్కరూ అనుక్షణం జ్ఞప్తికి తెచ్చు కోవాలసింది మీ బలాన్నే, ఇదే మీకు కొండత అండ. ప్రయత్నం ఫలించిందా విజయం మీదే లేదా ఇదొక అనుభవంగా మీమరో ప్రయత్నంలో విజేతా మీరే! అందుకే ఒక ప్రయత్నంలో అవకాశం చేజారినా మరెన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకే కొండల్ని పిండి చేయగల శక్తి బయట ఎక్కడో లేదు మీలోనే ఉందనేది నేటి యువత గుర్తుంచుకోవాలి. అందుకే చేసే ప్రయత్నంలో ఓడిపోవటం పెద్ద విషయం కాదు తిరిగి ప్రయత్నం చేయక పోవటమే నిజమైన ఓటమనేది ప్రతి ఒక్కరూ బలంగా మనసులో ముద్రించుకోవాలి.
ఇంటర్వూస్ ఎన్నిరకాలు గా ఉంటాయంటే ఈ విషయంలో ఒక్కొక్క కంపెనీ ఒక్కో పద్దతిని అవలంభిస్తుంది. ప్రధానంగా ఉండేవి వ్రాత పరీక్షలు (WrittenTest) దీని తర్వాత మౌఖికంగా అడిగే పరీక్షలు (Oral Interviews) ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి మొదటగా కొన్ని కొన్ని కంపెనీలు ఇంటర్వూస్ కు పిలిచే విషయంలో ఫోన్ కాల్స్ కూడా చేస్తుంటారు ఇక్కడ ఎటువంటి తడబాటు లేకుండా వారు ముందుగా ఏమి చెబుతున్నారో విని సమాధానం చెప్పాలి. వ్రాత పరీక్ష (Written Test) తర్వాత ఉండేదే మౌఖికంగా ఇంటర్వ్యూ (Oral interview) ఉంటుంది. ఇందులో ఒకేసారి ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తులు కలిసే ఇంటర్వ్యూ చేయవచ్చు. ఇందులో ఒకొక్కరూ ఒక్కొక్క అంశం మీద ప్రశ్నలు వేయవచ్చు. కంగారు పడకుండా భయం లేదు జయం నాదే అని అనుకుంటూ రంగంలోకి దిగండి.
ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి అంటే ఇలా!
1.వ్రాత పరీక్షలలో ఎట్టి పరిస్థితులలో సెల్ ఫోన్ ద్వారా నెట్ ఓపెన్ చేసి కొందరు సమాధానాలు చూసి వ్రాస్తుంటారు. ఇది చాలా నెగటివ్ ఆటిట్యూడ్ మిమల్ని ఖచ్చితంగా చివరికి వెనక్కి నెట్టేస్తుంది అంతేకాదు కొన్ని కంపెనీలు సీసీ కెమెరాల ద్వారా మీరు చేసే కార్యకలాపాలను పరిశీలిస్తుంటాయి అంతేకాదు మౌఖిక ఇంటర్వూస్ లో(Oral Interviews) ఒక్కక్కసారి మీరు వ్రాసిన వ్రాత పరీక్షను ఆధారం చేసుకుంటూ ప్రశ్నలు వేస్తారు.
2..మొదటగా వ్రాత పరీక్షలు దాదాపు ఇది మనం వ్రాసే పరిధిలోనే ఉంటాయి కొంత సబ్జెక్టు ,కొంత జనరల్ నాలెడ్జి, కొన్ని లెక్కలకు సంబంధించిన ప్రశ్నలు, మరికొన్ని సామాజిక అంశాలు కూడా ఉండవచ్చు.ఈ పరీక్షలో మీ కొచ్చే మార్కుల కంటే కూడా మీ సంసిద్ధతే (Preparedness) చాలా ముఖ్యమైనది. ధైర్యంగా మీ కొచ్చినది వ్రాయండి.
3.మొదటగా ఇంటర్వ్యూ లో అడుగు పెట్టె ముందు మరోసారి మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఇంటర్వ్యూ కోసం మీరు సాధన చేసిన అంశాలను ఒకసారి మననం చేసుకొని,అవసరమనుకుంటే ఒక చిన్న పేపర్ మీద అడిగే అవకాశాలున్న అంశాలను నోట్ చేసుకొని ఇంటర్వ్యూ చేసే గదిలోకి వెళ్లేముందే ఒకసారి పరిశీలించుకోండి.
4.మౌఖికంగా (Oral Interview) జరిగే ఇంటర్వ్యూ ఇందులో మొదట మీ గురించి మీ కుటుంబ వివరాలు మరియు మీ వ్యక్తిగత అలవాట్లు ,అభిరుచులు గురించి ఆడవచ్చు. ఇక్కడ ఒక్క విషయం మరవద్దు మీరు చేస్తోందే మీరు చక్కగా చెప్పవచ్చు తడబాటు అవసరమే లేదు. ఇక్కడ మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలు గురించి ప్రశ్నలు ఉంటాయి నిజాయతీగా విషయం చెప్పండి, కధలు అల్లటం, మీ కష్టాలు ఏకరువు పెట్టటం, బతిమిలాడటం చేయవద్దు.
5.ఇంటర్వూస్ చేసే వారి నోటి నుండి ప్రశ్న పూర్తిగా రాకుండానే సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేయ వద్దు. మీకు వారు అడగబోతున్న ప్రశ్న తెలిసినా సరే విన్న తర్వాతే సమాధానం చెప్పండి.
6.ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలలో సామాజిక విషయాల గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి దీటైన జవాబులు మీ చేత పలికించేది మీరు సాధన చేసే దినపత్రికా పఠనం అనేది గుర్తుంచుకోండి.
7. ఇంటర్వూస్ లో ప్రధానం గా భాష యెంత ముఖ్యమో భావం అంత ముఖ్యం. అందుకని చక్కటి చిరునవ్వు తో కూడిన హావభావాలతో సమాధానాలు చెప్పండి. మీకు అర్ధం కానీ ప్రశ్నలను తిరిగి ఒకసారి చెప్పమని వినయంగా అడగవచ్చు. అంతే కానీ సగం విని తెలిసీ తెలియని సమాధానాలు చెప్పవద్దు. అందుకే ఇంటర్వ్యూ చేసే వాళ్ళ కళ్ళలోకి చూస్తూనే (Maintain Eye Contact) సమాధానం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నలు అడిగే సమయంలో ఎటో చూస్తూనో లేదా క్రిందకు చూడటం లాంటివి చేయవద్దు. అది మీ బలహీనతగా (inferiority complex) గమనించే అవకాశం ఉంటుంది.
8. ఇంటర్వూస్ జరుగుతున్న సమయాలలో మీ తోటి స్నేహితులతో కలిసినప్పుడు అవకాశముంటే ఇంటర్వ్యూకు సంబంధించిన విషయాలు చర్చించండి. ఆ సమయంలో అనవసర విషయాల కంటే అవసరమైన విషయాల వలన అందరికి మేలు కలిగే అవకాశం మెండుగా ఉంటుంది
9.ఇంటర్వూస్ కు అటెండ్ వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం కొందరు మనకి ఇతరులతో సంబంధం లేని విధంగా సెల్ ఫోన్స్ లో మునిగి పోతుంటారు.దీని వలన వచ్చే నష్టం ఏమిటంటే చాలా చోట్ల మన ఆటిట్యూడ్ మీద మనకు తెలియకుండానే మన మీద పరిశీలనలు ఉంటాయి కొన్ని సందర్భాలలో మన ముందు నుంచే మనల్ని ఇంటర్వ్యూ చేసే వారు వెళుతుంటారు ఖచ్చితంగా వారి కళ్ళు మన Alertne మీద కచ్చితంగా పడతాయి.
10.ఇంటర్వూస్ కు అటెండ్ అయ్యే ముందర సెల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వాడటం చేయక ఫోవటమే మంచింది ఎందుకంటె వీటికి సంబందించిన విషయాలు మన మీద మానసికంగా ప్రభావాలు చూపవచ్చు దీనివలన మనకు ప్రతికూల (నెగెటివ్ ) రిజల్ట్స్ వచ్చే అవకాశముంది.
పోటీ బరిలో నిల్చినపుడు మనపై తక్కువ అంచనాలు వేసుకుంటూ ఇతరులపై ఎక్కువ అంచనాలు పెంచుకోవటం లాంటివిఎట్టి పరిస్థితులలో చేయవద్దు. మన మానసిక సంసిద్ధత (Mind Preparedness) ఎలావుండాలి! ప్రతికూల ఆలోచనలను మనసులోంచి బయటకు పంపి మైండ్ ను
- అనుకూలంగా ఎలా Re frame చేసుకోవాలి అంటే ఇలా ….
- నేను ధైర్యంగా ఈ ఇంటర్వ్యూ ను ఎదుర్కోగలను.
- ఈ ఇంటర్వ్యూ కు కావాల్సిన నాలెడ్జి నాలో ఉండటానికి కావాల్సిన ప్రయత్నం చేసాను.
- సామాజిక అంశాలను సైతం సాధన చేసాను.
- నా స్కిల్స్ (Skills) వారికి అవసరం .. ఈ వుద్యోగం నాకు అవసరం.
- బాధలు ,భయాలకు నా మనసులో చోటు లేదు అవి జీవితంలో రాకూడదనే ఈ వుద్యోగం ప్రయత్నం!
- నేను చేసిన ప్రతి మంచి మంచి పనులే ఇప్పుడు నా మనసులో వుంచుకుంటా.
- ఇంటర్వ్యూ లో అడిగే ప్రతి ప్రశ్నకు నేను ధైర్యంగా సమాధానం చెప్పగలను.
- ఈ ఇంటర్వ్యూ లో హాజరైన వారెవరు నాకు పోటీ కాదు నాకు నేనే పోటి!
- ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు కూడా నాలాంటి మనుషులే.
- నా ఈ ప్రయత్నం నా జీవితానికే భరోసాగా నిలుస్తుంది
- విద్యార్ధి దశలో నేను సాంధించిన ఏ చిన్న విజయమైన నాకు ఇప్పుడు మానసిక బలం ఇస్తుంది
ఈ విషయాలు మనసులో ఒకటికి వంద సార్లు మననం చేయండి. అడుగు ధైర్యంగా ముందుకు పడాలి! ఫలితం అనుకూలంగా ఉండాలి ! ఇదే మన లక్ష్యం సాధనకు ఆలంబన గా నిలవాలి అందుకు సిద్ద పడదాం అనుకున్నది సాధిద్దాం! OK నా!
****