సారస్వతం

జ్ఞాన భూములు

మన దేశ సంస్కృతి అంతా గంగానదితో పెనవేసుకొని ఉంది. గంగకు ఎగువున ఉన్న హిమాలయాలను దేవభూములు అని, గంగానది పర్వతాలనుండి మైదానాలకు వచ్చిన ఋషీకేశ్, హరిద్వార్ లను జ్ఞానభూములు అని, ఇంకా గంగకు దిగువ ప్రాంతమంతా కర్మభూమి అని పరిగణిస్తారు.
శివుని జటాజూటం నుండి బయలు వెడలి భగీరధుని వెంట ప్రయాణించిన పాయను భాగీరధి అంటారు. ఇది గంగోత్రి వద్ద గోముఖం ద్వారా బయటకు వస్తుంది. గంగోత్రి నుండి ఋషీకేశ్ కి వచ్చే దారిలో 5 ప్రయాగలు (సంగమ స్థానాలు) ఉన్నాయి.

(1) విష్ణుప్రయాగ వద్ద అలకనంది దౌళీగంగతో కలిసి ముందుకు సాగి (2) నంద ప్రయాగ వద్ద నందాకినితో కలిసి సాగుతుంది. (3) కర్ణ ప్రయాగ వద్ద పిండారినదితో కలిసిన అలకనంద (4) రుద్ర ప్రయాగ వద్ద భాగీరధితో కలుస్తుంది. ఇక నుండి గంగానదిగా పిలవబడుతూ, ఋషీకేశ్ ను చేరుతుంది. ఇక్కడ గంగానది రెండు కొండల మధ్య యిరుకైన దారిలో పరవళ్ళు తొక్కుతూ 30కి||మీ|| ముందుకు సాగి హరిద్వార్ వద్ద సమతుల ప్రదేశం (విశాలమైన మైదానంలోకి ప్రవేశిస్తుంది)

హిమాలయ పర్వతాలలోని బదరీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ సందర్శనకు ముఖ్యమైన దారి హృషీకేష్ నుండే మొదలవుతుంది. ఇది అంతా పర్వతప్రాంతమే. రోడ్డుకి ఒకవైపు కొండ, ఒకవైపు నది మధ్యలో సన్నని యిరుకైన దారి, నదికి అవతల ఉన్న కొండమీద ఊరు విస్తరించి (కొండచరియల మీద) ఉంటుంది. రెండు కొండలను కలుపుతూ పురాతనమైన లక్ష్మణ్ ఝూలా, ఈ మధ్యకాలంలో నిర్మించిన రామ ఝూలా అని రెండు సస్పెన్షన్ బ్రిడ్జిలు యాత్రికులకు బాగా ఉపయోగంగా ఉన్నాయి. పడవల మీదుగా కూడా అటునుండి ఇటు, ఇటునుండి అటు ప్రయాణించవచ్చు.

అవతల కొండమీద ఎన్నో ఆశ్రమాలు, ధర్మశాలలు, మందిరాలు, హోటళ్ళు, దుకాణాలు యాత్రికులకు అందుబాటులో ఉన్నాయి. అనేకే యోగా సెంటర్లు, స్పాలు కూడా విదేశీయులకి ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు ఋష్యాశ్రమాలు మాత్రమే ఉండే ఈ ప్రదేశం ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. శివానందాశ్రమం, గీతాభవన్ చాలా సంవత్సరాలనుండి ప్రసిద్ధమైన ఆశ్రమాలు.

ఇక్కడ గంగనీరు ఎంతో స్వచ్చంగా, నిర్మలంగా ఉంటుంది. నీటి అడుగున ఉన్న రాళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తాయి. (ఇటువంటి దృశ్యం ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో ఉన్న మహానదిలో కూడా చూడవచ్చు). నీరు రాళ్ళలోనుండి ప్రవహించడం వల్ల స్నానానికి అనుకూలం కాదు, కానీ వంతెన మీద నుండి యాత్రికులు, మరమరాలు, పిండిఉండలు క్రిందికి వేస్తూ ఉంటే చేపలు గుంపులు, గుంపులుగా వచ్చి తినేసి మళ్ళీ చెల్లాచెదురుగా వెళ్ళిపోతాయి. వాటిని చూస్తూ ఉంటే సమయమే తెలియదు.

ఇక్కడ సంధ్యాసమయంలో గంగకి హారతులు ఇస్తారు. నయనానందకరంగా ఉండే మరుపురాని దృశ్యం! ఋషీకేశ్ కి దగ్గరలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)వారు నిర్మించిన వేంకటేశ్వరస్వామి, చంద్రమౌళీశ్వర స్వామివార్ల ఆలయాలను దక్షిణ దేశవాసులు (తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ ప్రజలు)ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. ఇది హరిద్వార్ కి వెళ్ళే దారిలో ఉంది. ఋషికేశ్ నుండి హరిద్వార్ దారి, గంగానదితో సమాంతరంగా సాగి 30 కి||మీ|| దూరంలో మైదానప్రదేశంలోకి ప్రవేశిస్తుంది. ప్రధానమైన గంగాపాయ, బ్రహ్మకుండ్ వద్ద హరిపాదాల మీదుగా ముందుకు ప్రవహిస్తుంది. గంగానది శివుని జటాజూటం, బ్రహ్మకుండ్, హరిపాదాలనుండి వచ్చింది కాబట్టి త్రిమూర్తుల ఆశీర్వాదాలను, ఇక్కడ స్నానం చేయడం ద్వారా పొందవచ్చునని భక్తుల విశ్వాసం.

ఈ ప్రధాన స్నానఘట్టాన్ని “హరికి పైరి” అంటారు. ఈ ఊరును హరిద్వార్ మరియు హరద్వార్ అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ శివకేశవులిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రోజూ వందలాది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రవాహవేగం ఎక్కువగా ఉండటంవల్ల యాత్రికుల రక్షణ కోసం ఇనుప గొలుసులు (చెయిన్స్) ఏర్పాటు చేశారు. ఇక్కడ నీరు చాలా చల్లగా (మంచు కరిగిన నీరుకదా) ఉండడం వల్ల నీళ్ళలోకి దిగడానికి ముందు సందేహించినా, ఒకసారి దిగాక, మన శరీరం ఆ ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు నెమ్మదిగా మునగాలి. ఇక ఎంతసేపు ఆ నీటిలో ఉన్నా మనకు బయటకు రావాలని అనిపించదు. హిమాలయలనుండి అనేక ఓషధుల మీదనుండి వచ్చిన మంచు కరిగిన నీరు మన శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని, ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, హాయిని ఇస్తుంది, తనివితీరదు.

స్నానం చేశాక యాత్రికులు ఒక పాత్రలోగాని, బాటిల్ లో గాని గంగాజలం తీసుకుని ఒడ్డున ఉన్న శివలింగాలను అభిషేకిస్తూ ఉంటారు, దీపాలను వెలిగిస్తూ ఉంటారు. స్త్రీలు పసుపు, కుంకుమలను వేస్తూ ఉంటారు. మెట్లవద్ద గంగామాత మందిరం, విష్ణు మందిరాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఎన్ క్లోజర్స్ ఉన్నాయి.

మార్బుల్ రాళ్ళతో విశాలంగా ఉన్న స్నానఘట్టాలు నదిపాయలను కలుపుతూ వంతెనలు, చాలా పెద్ద శివుని విగ్రహం, క్లాక్ టవర్, చిన్నచిన్న మందిరాలు అన్నీ చాలా నీట్ గా (శుభ్రంగా) ఉంటాయి. ఇక్కడ ఎంతసేపు ఉన్నా సమయం ఇట్టే గడిచిపోతుంది.

మొత్తం 2,525కి||మీ|| గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు ప్రవహించే గంగానదికి ప్రప్రథమ స్నానఘట్టం హరిద్వార్ లో ఉన్న “హరికి పైరి”. దీనికి ఎగువన భీమగోడా దగ్గర 1854లోనే ఆనకట్ట నిర్మించారు. ఇప్పుడు టెహ్రీ డామ్ వద్ద కూడా డామ్ కట్టారు. “హరికి పైరి”లో ఎప్పుడూ నదీప్రవాహం ఉండేటట్లు నీరు విడుదల చేస్తారు. ఇక్కడి నీరు వేసవికాలంలో చల్లగానూ, చలికాలంలో వెచ్చగానూ ఉంటుంది. అలాగే ఒకరోజులో సూర్యోదయం ముందు వెచ్చగానూ పొద్దు ఎక్కిన కొద్దీ చల్లగానూ ఉంటుంది. ఏ నదిలోనైనా ఇంతేకానీ ఈ నదిలో ఈ తేడా ఎక్కువగా ఉండి శరీరానికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. (వేరే ప్రదేశాలలో 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తేడా ఉంటే ఈ నదిలో 6-8 డిగ్రీల సెంటీగ్రేడ్ డిఫరెన్స్ ఉండవచ్చు! ఎవరైనా కొలిచిచూశారో లేదో తెలియదు).

త్రిమూర్తుల స్పర్శతో పునీతమైన స్వర్గం నుండి (అంతరిక్షం నుండి) భూమి మీదకు దిగివచ్చి (ఈ కథ ముందు సంచికలో “గంగావతరణం” అనే వ్యాసంతో తెలుసుకున్నాము). పవిత్ర గంగాజలానికి ఎటువంటి దోషం, అపవిత్రతం మైల ఉండవు. ఇంటిలో వుంచుకుంటే చాలా మంచిది.

ఇక్కడి నీటిని రాగిచెంబులలో తీసుకొని సీలు వేయించుకొని (పక్కనే ఉన్న దుకాణాలు అందుకే) ఇళ్ళలో పూజామందిరాలలో ఉంచుకుంటారు. హరిద్వార్ గంగ 60 ఏళ్ళు ఉంటుందంటారు. మేము ప్లాస్టిక్ క్యాన్ లో తీసుకువచ్చిన గంగ పదహారు సంవత్సరాలు పాడవకుండా ఉంది. మనం ఎప్పుడైనా తీసి వాడుకోవాలి అంటే ఒక చిన్న బాటిల్ లోకి తీసి అందులోనుండి వాడుకోవాలి. ఇందులో ఇంకొక విశేషమేమంటే ఒక గ్లాసులో/పాత్రలో ముందు కొంత గంగనీరు వేసి (ఒక చెంచాడు) తరువాత దానిని మంచినీటితో నింపినా, ఆ గ్లాసులోని నీరు మొత్తం గంగాజలంగానే పరిగణింపబడుతుందిట. అయితే దీనిని అప్పటికప్పుడు వాడుకోవాలి. (పూజలకి, అభిషేకాలకి, మైలదోషం పోవాలంటే ఇంటిలో చల్లుకోవడానికి, పర్వదినాలలో స్నానానికి, నలుగురికి పంచిపెట్టడానికి (తీర్థంలాగా). (టెంపరరీ పర్పస్ కి) ఈ జలాన్ని శివుని అభిషేకానికి ఇళ్ళలోనైనా, గుడిలోనైనా వినియోగిస్తే ఎంతో మంచిది.

ముఖ్యమైన పర్వదినాలలో దేశం నలుమూలల నుండి వేలాదిమంది యాత్రికులు ఇక్కడ స్నానాలు చేస్తారు. ఆ, కా, మా, వై అంటే ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఈ మాసాలో నదీస్నానం ముఖ్యం. ఇంకా శివరాత్రి, వైశాఖి (ఏప్రిల్ 13,14 తేదీలలో) సోమావతి అమావాస్య, గ్రహణ సమయాలలో కూడా.
పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో ఇక్కడికి అనేకులైన యోగులు, సిద్ధులు, సాధువులు, సన్యాసులు, భక్తులు లక్షలాదిమంది యాత్రికులు, పర్యాటకులు వచ్చి 12 రోజులు స్నానాలు చేస్తారు. ప్రపంచంలో జరిగే అతిపెద్ద గ్యాధరింగ్ ఇదేనట! ఎంతోమంది విదేశీయులు కూడా చూడటానికి వస్తారు. ఇక్కడి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఏర్పాటు బాగాచేస్తారు.6 సంవత్సరాలకి ఒకసారి “అర్థకుంభ్” జరుగుతుంది. అప్పుడు ఇక్కడ అంత రద్దీ ఉండదు.
ప్రతిరోజూ ప్రదోష సమయం (సాయంసంధ్యలో) “హరికి వైరి” గంగకి హారతులిస్తారు. ఆ టైముకి యాత్రికులు అక్కడికి చేరుకుంటారు. వంతెనలమీద నుండి ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.

ఇక్కడ గంగానది రెండు కొండల మధ్యలో విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంటుంది. ఒక కొండపై మానసాదేవి, రెండవ కొండపై చండీదేవి మందిరాలు ఉన్నాయి. ఇదివరకు యాత్రికులు మెట్లదారిలో పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు అందరూ “రోప్ వే” ద్వారా పైకి చేరుకుంటున్నారు. పైనుండి క్రిందికి చూసినప్పుడు ఊరు, గంగానది కనువిందు చేస్తాయి. హరిద్వార్ ప్రాచీన నామం “మాయాపురి”. ఇది ఇక్కడ నెలకొని ఉన్న మాయాదేవి పేరుమీద వచ్చింది, మాయాదేవి గుడి ఇప్పుడు ఇళ్ళ మధ్యలో చిన్న మందిరంలాగా ఉంటుంది. మకరవాహిని గుడి (హరిద్వార్ మెయిన్ రోడ్డు మీద బిర్లా ఘాట్ వద్ద)లో అడిగితె మాయాదేవి గుడి లొకేషన్ చెబుతారు. మకరవాహిని అంటే గంగాదేవి. ఈ గుడిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తెలిసిన దక్షిణదేశపు పూజారులు ఉంటారు. ఇక్కడి ఘాట్ లో రద్దీ చాలా తక్కువగా ఉంటుంది.

దేశం నలుమూలనుండి అనేక శాఖలకు, సంప్రదాయాలకు చెందిన సాధువులు, సన్యాసులు ఈ ప్రాంతాలలో ఆశ్రమాలు, మఠాలు ఏర్పరుచుకొని ఇక్కడ తపస్సు, ఆధ్యాత్మిక సాధనాలు చేసుకుంటూ ఉంటారు. స్త్రీలు ఒంటరిగా ప్రవేశించకూడదు.

ఇక్కడ ఇంకా చూడాల్సిన ప్రదేశాలలో ముఖ్యమైనవి సప్తర్షి ఆశ్రమ్ (ఇక్కడ ఏడుగురు ఋషుల కోసం గంగానది ఏడుపాయలుగా చీలిందట). శాంతికుంజ్ ఇది ఆధునిక ఆశ్రమం. పండిత శ్రీరామశర్మగారి గాయత్రి పరివార్ కి చెందినది. చాలా విశాలమైనది, ఒకపూట ఇక్కడ గడిపి, ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. కన్ ఖేల్ అనే ప్రదేశం దక్షయజ్ఞం జరిగినచోటు అని చెపుతారు. ఇక్కడ శివుడు దక్షమహాదేవ్ అని పిలువబడతాడు. ఇక్కడ కూడా గంగా పాయ ఉన్నది. ఇంకా కొత్తగా నిర్మించిన భారతమాత మందిర్, అద్దాల మందిరం (శీష్ మహల్) చిన్నపిల్లలకు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలో మన చరిత్ర, సంస్కృతి తెలిపే ప్రదర్శనలు ఉన్నాయి.

హరిద్వార్ కి కొంచెం దూరంలో డెహ్రాడూన్ ప్రాచీన ద్రోణుని ఆశ్రమం ఉండే చోటు (మహాభారతం) ఇంకా మస్సూరి హిల్ స్టేషన్ ఉన్నాయి. ఇంకా వివరాలు కావాలంటే “TRIP ADVISOR”లో హరిద్వార్ అని Padmaja Vedantam అని కానీ పద్మజ 111 అని టైప్ చేస్తే నేను రాసిన రివ్యూలు వస్తాయి.
ఋషీకేశ్ వద్ద IDPL, హరిద్వార్ వద్ద BHEL అనే పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో పనిచేసే ఉద్యోగులలో దక్షిణదేశ వాసులు (దాక్షిణ్యాత్ములు) కూడా ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి, ఈ ప్రాంతాలను పలుమార్లు సందర్శించే అవకాశం మాకు కలిగింది. ఆ,కా,మా, వై లలో గంగాస్నానం చేసే భాగ్యం కూడా కలిగింది.

దక్షిణదేశ వాసులు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు …
1 ఎటువంటి బంగారునగలు ధరించకుండా ఉంటే మంచిది.
2 సాధువులు, సన్యాసులు ఎంతోమంది మనకి కనబడతారు. మీకు ప్రత్యేంగా తెలిస్తే తప్ప ఎవరినీ నమ్మకూడదు.
3 ఇక్కడ రుద్రాక్షలు, నవరత్నాలు, స్ఫటికమాలలు ఇంకా అనేక రకాల పూజాసామాగ్రి దొరుకుతాయి. కానీ నకిలీలు (ఇమిటేషన్స్) కూడా ఉంటాయి. బేరాలు ఉంటాయి, ఖరీదు ఎక్కువైనా పెద్దదుకాణాలలో తీసుకుంటే మంచిది.
4 ఇక్కడ చపాతీలు, ఆలుకూర, టీ వంటివి ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయి. కాఫీకాని, దక్షిణదేశ వంటకాల గురించికాని వెతుక్కోవాలి.
5 యాత్రకు వచ్చినప్పుడు, దానధర్మాలు చేయాలి. కాని ఎంతోమంది యాచకులు మన చుట్టూ చేరి, ఎంతమందికి ఇచ్చినా ఇంకా అడుగుతూనే ఉంటారు. చేతిలో ఉన్నంత ఇచ్చి మిగిలినవారికి దణ్ణం పెట్టండి. అంతేకాని తిట్టడం, విసుక్కోవడం చేయరాదు.
6 ఇది తీర్థస్థలం ఇక్కడ మడి, ఆచారాలకంటే శుచి, శుభ్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలి
* ఇక్కడ పండాలు (పండితులు) “వాహి అంటే వంశవృక్షం వారివద్దకు వచ్చిన యాత్రికుల “వంశవృక్షం”లను రికార్డు చేస్తున్నారట. 1980-90 ప్రాంతాలలో అమెరికన్లు ఇక్కడికి వచ్చి వీళ్ళు data-base ఏ విధంగా మెయిన్ టెయిన్ చేస్తున్నారో తెలుసుకొని వెళ్ళారట. ఆ కుటుంబంవారు మళ్ళీ వచ్చినప్పుడు వారు update చేస్తూ ఉంటారట. 400 సం||రాల record ఉందిట. హరిద్వార్ టూరిజం వారు “వాకింగ్ టూర్స్’’ లో ఇటువంటివారిని కలిసే అవకాశం కూడా ఇస్తారుట. ఇంకా సైక్లింగ్ మరియు బైకింగ్ టూర్లని ఆర్గనైజ్ చేస్తున్నారట.
* 1 అక్బరు చక్రవర్తి ఎక్కడ ఉన్నా హరిద్వార్ నుండి ఏనుగుల మీద తెప్పించుకున్న గంగ నీటిని మాత్రమే తాగేవారట.
* 2 సప్తమోక్షపురులలోని మాయాపురి ఇదే.
[అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతికా ద్వారావతీ చైవ సప్తైధా మోక్షదాయకా]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on జ్ఞాన భూములు

జాజిశర్మ said : Guest 7 years ago

హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు. ఆ మార్గము చూపే ప్రదేశం కనుక "హృషికేష్ " అయినది. ఇది గమనించ గలరు.