-శారదాప్రసాద్
ఆ మధ్య మేము అమెరికా వెళ్ళినపుడు,మా అమ్మాయి స్నేహితురాలు ఇంటికి వెళ్ళటం జరిగింది. వాళ్ళూ తెలుగు వాళ్ళే. ఆ అమ్మాయి తల్లి తండ్రులు,అత్తా మామలు అందరూ హైదరాబాద్ లో స్థిరపడ్డారట. ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. ’ అమ్మా ! నీ పిల్లల పేర్లేమిటీ?’ అని ఆ అమ్మాయిని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకునే క్రమంలో అడగటం జరిగింది. అందుకు ఆ అమ్మాయి ’అంకుల్! మా పెద్ద అమ్మాయి పేరు ‘తుషి’,రెండవ అమ్మాయి పేరు ‘మాయ’ అని చెప్పగానే నేను బిత్తరపోయాను. ‘తుషి అంటే అర్ధం ఏమిటమ్మా?’ అని ఆ అమ్మాయిని అడిగితే,ఆ అమ్మాయి ‘నాకు తెలియదండి,’త’ కారం వచ్చేటట్లు పేరు ఉండాలని మా పురోహితుడు చెబితే,నేనూ మా వారు కుస్తీపడి ’ పిల్లల పేర్లు’ అనే పుస్తకం చూడటమే కాకుండా నెట్ లో కూడా వెతికి తుషి అనే పేరు ఖాయం చేశామండి’ అని గర్వంగా ఏదో ఘనకార్యం సాధించినట్లు చెప్పింది.మరి మీ పెద్దవారి సలహా తీసుకోలేదా? అని నేనడిగితే,ఆ అమ్మాయి మా పిల్లలకు మా ఇష్టమొచ్చిన పేర్లు పెట్టుకుంటాం! దానికి పెద్దవారి సలహా ఎందుకు?మాకు పేరు పెట్టటం చేతకాక పోతే వాళ్ళను అడగటంలో అర్ధం ఉంది. అంతే కాని , చిన్న చిన్న విషయాలతో వాళ్లకు ఇబ్బంది కలిగించటం ఎందుకు?అని గుక్క తిప్పుకోకుండా ఆ అమ్మాయి సమాధానం చెప్పటం పూర్తిచేసి,’అంకుల్! తుషి ఆంటే అర్ధం ఏమిటో మీరైనా చెప్పరా?’ అని అడిగింది.దానికి నేను, ’అది ఏ భాషలోని పదమో , దాని అర్ధం ఏమిటో నాకు అసలు తెలియదు,కాని ఒకటి మాత్రం గుర్తుకొస్తుంది,గుంటూరులో మా ఎదురింటి వారు వారి కుక్క పిల్లను ముద్దుగా ‘తుషి’ అని పిలవటం’ అని నేను చెబుతుంటే, మా అమ్మాయి నా కాలు తొక్కుతుంది, వాళ్ళు బాధపడుతారేమోనని! ముద్దుగా ఉండే ఆ పాపను చూసినంతసేపూ నాకు బాధగా, జాలిగా ఉంది. ఆ అమ్మాయిని చూసినంతసేపు నాకు మా ఎదురింట్లో ఉన్న కుక్క పిల్లే గుర్తుకొస్తుంది.
‘అయిపోయినదేదో అయిపొయింది,రెండవ పిల్లకైనా మంచి పేరు పెట్టుకోవచ్చు కదా!’ అని అడగగానే ‘అయితే మొదట పిల్ల పేరు బాగాలేదన్నట్లేగా! అంతటికీ ఈయనే కారణం!’ అని భర్త వంక కొరకొరా చూడటం మొదలైంది. అప్పుడు నాకు కొద్దిగా భయం కలిగింది, భార్యాభర్తల కలహానికి నేను కారణ భూతుడిని అవుతున్నందులకు! వెంటనే నేను సద్ది చెప్పి ’పేరులో ఏముందమ్మా, పెరిగి పెద్దదై మీకు మంచిపేరు తెస్తుంది మీ’తుషి’. అసలు Shakespeare ఏమన్నాడో తెలుసా! ‘You may call Rose by any name, but it never loses its fragrance!‘ అని అన్నాడు. దాన్నే సి.నారాయణరెడ్డి గారు ‘గులాబీని ఏ పేరున పిలుచుకున్న గానీ, అది సహజ పరీమళం వదలదెన్నడేనీ!’ అని తెలుగులో చక్కగా చెప్పారు అని వివరిస్తుంటే, కొంత మార్పు కనపడింది వాతావరణంలో. అమ్మ!పరవాలేదు ఉపద్రవం తప్పింది,తొందరగా బయట పడితే బాగుంటుందని మా అమ్మాయి ‘వెళ్లి వస్తామండీ!, చాలా పొద్దు పోయింది’ అని చెప్పి బయలు దేరుతుంటే, ఆ అమ్మాయి వచ్చి, ‘కాసేపు ఆగకూడదా! అంకుల్ మంచి విషయాలు చెబుతున్నారు’ అని చెప్పి మమ్మల్ని మళ్ళీ కూర్చోపెట్టింది.’అది సరే అంకుల్! మరి ‘మాయ’ ఆంటే అర్ధం ఏమిటో చెప్పరా!’ అని జాలిగా అడిగింది. మా అమ్మాయి నాకు చెప్పవద్దని సైగ చేయటం ఆ అమ్మాయి చూసి,’మధ్యలో నీకు ఇబ్బంది ఏమిటీ?’ అని మా అమ్మాయిని చనువుకొద్దీ మందలించి, నా వంక ఉత్సాహంగా చూస్తుంది. కనీసం ’మాయ’ ఆంటే మంచి అర్ధం ఏమన్నా చెబుతానేమో నని! నిజం చెప్పకుండా ఉండలేను,తెలియదని అబద్ధం ఆడనూ లేను!మా అమ్మాయి, నా భార్య నా వంక భయంగా చూస్తున్నారు, ఏమి బాంబు పేలుస్తానేమో నని. ’ చెప్పండి uncle! నేను ఏమీ అనుకోను.’ అని ఆ అమ్మాయి అమాయకంగా అడగటం చూస్తే,నాకు నిజం చెప్పాలనే అనిపించింది .(ఇంటికి వెళ్ళిన తర్వాత,మా వాళ్లకు సద్ది చెప్పుకోవచ్చులే అనే ధైర్యంతో) ’అమ్మా! మాయ ఆంటే అజ్ఞానం,మోహం ఇలాంటి అర్ధాలే ఉన్నాయి ,నాకు తెలిసినంతవరకూ’ అని గబగబా చెప్పి వెంటనే బయలు దేరాం. ఇంటికి వచ్చిన తర్వాత చాల కథ నడిచింది.
అది అప్రస్తుతం, confidential ! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పిల్లలకు పెట్టుకునే పేర్లను బట్టి తల్లితండ్రుల సంస్కారం తెలుస్తుంది.అట్టి సంస్కారవంతుల కుటుంబంలో పుట్టిన పిల్లలకు కొద్దో గొప్పో ఆ వాసనలు అబ్బక మానవు.ఏదో నారాయణరెడ్డి గారు కవితా ధోరణిలో అలా అన్నారు గాని,గులాబీని ఉమ్మెత్త పువ్వు అని పిలిస్తే ఏమి బాగుంటుంది? నా చిన్నతనంలో శ్రీమతి సత్యభామారెడ్డి గారనే ప్రముఖ ‘స్త్రీలవైద్య’ నిపుణురాలు మద్రాస్ విజయా హాస్పిటల్ లో పనిచేశేవారు.ఆ హాస్పిటల్ లో మాకు తెలిసిన వారు చికిత్స పొందుతున్నారు.నాకు ‘బంధురోగి లేక రోగబంధును’ చూడటం కన్నా ఆ డాక్టర్ గారిని చూడాలనే కుతూహలం ఎక్కువగా ఉండేది .ఆమెను చూశాను, పేరుకు తగ్గట్లుగానే ఆమె అందగత్తె.ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆమెనే అడిగాను, ’మీకు ఈ పేరు ఎవరు పెట్టారని?’ అంత బిజీలో ఆమె,’అక్కడ reception లో మా నాన్నగారు ఉన్నారు, వారిని అడగండి.’ అని చెప్పగానే వెంటనే వారి వద్దకు వెళ్లి, ప్రాధేయపడితే వారు ఆ పేరు పెట్టింది శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు అని చెప్పగానే ఆయన సంస్కారానికి మనసులోనే పొంగిపోయి బయటకు వచ్చాను. అసలు,’సత్యభామ’ ఆంటే ఏమిటో తెలుసా? సత్య అంటే నిజంగా , ఇక భామ ఆంటే స్త్రీ అని అర్ధం. అంతా కలిపితే ’నిజమైన స్త్రీ ఆంటే ఇలా ఉండాలి’ అని అర్ధం. ఎంత చక్కటి పేరు! నారాయణ రెడ్డి గారి కూతుళ్ళ పేర్లు గంగ, యమున, సరస్వతి,కృష్ణవేణి . అలాగే జంధ్యాలగారి కూతుళ్ళ పేర్లు సాహితి, సంపద.
ఎంత చక్కటి పేర్లో చూశారా! వారి అభిరుచి, సంస్కారం వారు తమ పిల్లకు పెట్టుకున్న పేర్లలో కూడా ప్రతిబింబిస్తుంది.కొన్ని మినహాయింపులు కూడా లేకపోలేదు.గాంధీ ,నెహ్రూల పేర్లు పెట్టుకున్న కొందరు రౌడీలుగా కూడా చెలామణి అయ్యారు!ఇకపోతే మరోరకం వారు ఉన్నారు! వారు మంచి (పిచ్చి) ఛాందసులు. వారికి అదో రకం సాంప్రదాయపు పిచ్చి. ఆ ఇంటి ఆయన గొప్ప శివభక్తుడు.కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. ఇంటికి ‘కైలాసం’ అని పేరు పెట్టుకున్నాడు.పరవాలేదు ఆయన ఇల్లు ఆయన ఇష్టం. అయితే ఇక్కడ కూడా ఒక చిక్కుండేది. ఎవరైనా ఎప్పుడైనా ఆ ఇంటి ఆయన ఎక్కడ ఉన్నారని అడిగితే ,దానికి కొందరు హాస్యప్రియులు ఇప్పుడే ఆయన కైలాసానికి వెళ్లారని చెప్పేవారు!ఆ ఇంటి ఆయనకు కుక్కలంటే ఎంతో ప్రేమ! ఒక కుక్కను పెంచుకుంటున్నారు. వారు ఆ కుక్కకు ‘నంది’ అని పేరు పెట్టుకొని, ఆ కుక్కను నందీ అని పిలుస్తుంటే,వీరికి నందీశ్వరుని మీద కోపమా లేక ప్రేమో నాకు ఇప్పటికి అర్ధం కాలేదు!నందిని కుక్క అనకుంటే చాలులే, అని అనుకున్నాను.ఏమి చేద్దాం! ఎవరి పిచ్చి వారికి ఆనందం! పేరులో ఏముంది? అని కొట్టి పారెయ్యకండి. పేరులో(name)నేముంది!
మీరైనా మీ మనవళ్ళకు,మనవరాళ్ళకు చక్కటి అర్ధవంతమైన తెలుగు పేర్లను పెట్టండి!