రాక్షసుల పుట్టుపూర్వోత్తరాలు
అగస్త్యులవారప్పుడు “సరే! అయితే విను. రావణుడి పుట్టుపూర్వోత్తరాలు ముందుగా చెప్పి, ఇంద్రజిత్తు ఆ రావణుణ్ణి ఎట్లా మించిపోయినాడో నీవే తెలుసుకొనేట్లు ఆ రాక్షసుల వృత్తాంతం చెపుతాను” అన్నారు.
“కృతయుగం దగ్గరకు వద్దాం. బ్రహ్మదేవుడు ముందుగా పదిమంది ప్రజాపతులను (మానసపుత్రులను) సృష్టించాడు కదా! ఈ పదిమందిలో పులస్త్యుడు ఒకడు. ఆయన బ్రహ్మర్షి, వేదనిధి, తపస్వి, మహామహిమాన్వితుడు. ఆయన నిరంతర తపస్సు కోసం మేరుపర్వత పాదప్రదేశంలోని తృణబిందు మహర్షి ఆశ్రమం ఆవాసంగా చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతం రమ్యమైన ప్రకృతి సౌందర్య విరాజితమైన ప్రదేశం కాబట్టి సకల దేవగణ సుందర తరుణులు అక్కడ ఆటపాటలతో, వేడుకలతో, తమ యౌవన విలాసాలతో విహరిస్తుండే వారు. అది పులస్త్య మహర్షికి భరింపరానిదైంది. ఆయనకు చాలా కోపం వచ్చింది. “నా చూపుమేర ఇక్కడకు వచ్చినవాళ్ళు, నా తపస్సుకు అంతరాయం కలిగించిన వాళ్ళు తమ కన్యత్వం పోగొట్టుకొని గర్భం ధరిస్తారు గాక” అని శపించాడాయన. అక్కడకు వచ్చే దేవకన్యలంతా భయపడి పోయినారు. అటు రావడం మానేశారు. అయితే తృణబిందు మహర్షి కూతురుకు ఈ విషయం తెలియదు. ఆమె ఒక రోజు ఉద్యాన విహారానికి ఆ ప్రదేశానికి వచ్చింది. అప్పుడు పులస్త్య మహర్షి పరమమనోహరంగా, సుశ్రావ్యంగా వేదగానం చేస్తున్నాడు. అది విని పులకించిపోయి ఆ మహర్షిని చూద్దామని ఆమె ఆయన సమీపానికి వచ్చింది. తత్ఫలితంగా ఆమెలో గర్భధారణ చిహ్నాలు పొడకట్టాయి. చాలా విషాదం పొంది తండ్రి ఆశ్రమం చేరి ఈ విపరీతాన్ని తండ్రికి విన్నవించుకుందామె. తృణబిందు మహర్షి దివ్యదృష్టితో జరిగిందేమిటో తెలుసుకున్నాడు. వెళ్ళి తన కూతురుని భార్యగా స్వీకరించవలసిందిగా పులస్త్య మహర్షిని ప్రార్థించాడు. పులస్త్యుడు రాజర్షి అయిన తృణబిందువు ప్రార్థన కాదనలేక పోయినాడు. ఆమెను పత్నిగా స్వీకరించాడు. ఆమె అత్యంత వినయవిధేయతలతో నిరంతర సేవా పరాయణతతో పులస్త్య బ్రహ్మను సంతోష పెడుతూ వచ్చింది. ఆయన ఆమె పట్ల అనుగ్రహంతో పరప ప్రీతచిత్తుడై ‘నీవు నేను వేదగానం చేస్తున్నప్పుడు నా దరిచేరావు కాబట్టి, నీకు పుట్టే కుమారుడు విశ్రవసుడుగా పేరు తెచ్చుకుంటాడు’ అని ఆమెను సంతోషపరిచాడు. విశ్రవసుడు తండ్రి అంతటివాడుగా లోకపూజ్యుడైనాడు. అసమాన ధర్మతత్పరుడైనాడు. ఈయన పరమధర్మవిదుడై ఉండటాన్ని నిరుపమాన పవిత్రవర్తనను చూసి భరద్వాజ మహాముని తన కూతురునిచ్చాడు ఈయనకు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె సంతానాభిలాష గుర్తించి విశ్రవసుడు ఆమెకు పుత్రుణ్ణి ఇచ్చాడు. శిశువు జాతకాన్ని బట్టి ఈయన సర్కాలోకాలకు ధనాధ్యక్షుడవుతాడని తండ్రి గుర్తించాడు. ఈ కుమారుడికాయన వైశ్రవణుడు అని పేరుపెట్టుకున్నాడు. పెరిగి పెద్దవాడై వైశ్రవణుడు దీర్ఘకాలం తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన సురశ్రేష్టులతో ప్రత్యక్షమై ‘అభీష్టమైన వరమిస్తాను, కోరుకోవలసింది’ అని అనుగ్రహించాడు. అప్పుడు వైశ్రవణుడు ‘దేవా! ధనాధిపతిత్వంతో కూడిన లోకపాలకత్వం నాకు అనుగ్రహించు’ అని అర్థించాడు. ‘సరిసరి! నేను నలుగురు లోకపాలకులను (దిగధీశులను) సృష్టించాలని అనుకొన్నాను. ఇప్పుడు ఇంద్ర, యమ, వరుణులు లోకపాలురుగా ఉన్నారు. నీవు నాలుగో అధిపతివవుతావు’ అని వైశ్రవణుడికి వరమిచ్చాడు. అంతేకాక ఒక మహిమోపేతమైన విమానం కూడా వైశ్రవణుడికి ఆయన సంతోషంతో బహుకరించాడు. ‘దీన్ని ఎక్కి సూర్యసమానతేజుడవై నీవు లోకాలలో విహరించు’ అని ఆశీర్వదించాడు. ‘దీన్ని పుష్పక విమానమంటారు’ అని కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వైశ్రవణుడికి ఒక సంశయం కలిగింది. విమానమైతే ఇచ్చాడు కాని నాకు స్థిరనివాసం ఆయన నిర్దేషించలేదేమిటి? అని తలచి తండ్రి దగ్గరకు వెళ్ళి చేతులు మోడ్చి ‘తండ్రీ! నాకు ఒక ఆవాసం తెలియజేయి’ అని ప్రార్థించాడు.
***