వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం – 84

-ఛాయాదేవి

వీక్షణం 84 వ సమావేశం లాస్ ఆల్టోస్ లోని ఉదయలక్ష్మి గారింట్లో ఆద్యంతం అసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ పెద్దు సుభాష్ అధ్యక్షత వహించారు. డా||కె.గీత శ్రీమతి చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే” చదివి వినిపించి కథా పరిచయం చేశారు. తరువాత జరిగిన కథా చర్చలో భాగంగా కథలో స్త్రీ వాదం, విశ్వప్రేమ, మాతృహృదయం, స్వార్థ నిస్వార్థాలు, స్త్రీ, పురుషుల మధ్య సున్నితాంశాలు, కథ నేరేషన్ మొ.న అంశాలను గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. రచయిత్రి, కథా వివరాలు అందజేస్తూ “డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి గంగకు’ హిందీ నుండి అనువాదం చేశారు.

ఇటీవల తాను పి హెచ్ డి చేసిన రచయిత్రి ‘మహాదేవి వర్మ గీతాలు’ కూడా తెలుగు లోకి తీసుకొచ్చారు. “ఒడిశా జానపద కళలు” కూడా ఉపద్రష్ట అనురాధ గారితో కలిసి తెలుగు లోకి అనువాదం చేసి అందించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ క్రియాశీలక సభ్యురాలిగా కూడా పనిచేశారు. గత 28 ఏళ్ల నుండి ప్రతి ఏటా ‘చాసో పురస్కారం’ మంచి కథకులకు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే , ఆమెకు చాలా పేరు తెచ్చిపెట్టిన, ఎందరో మెచ్చుకున్న కథ ఇది. ఈ కథ1976-85 మహిళా దశాబ్ది సందర్భంగా 1976 లో అచ్చయింది. ఆ తర్వాత ఏ కె ప్రభాకర్ గారు వేసిన ‘స్త్రీవాద కథలు’ పుస్తకం లో వచ్చింది. 1992 లో అరుణా సీతేష్ సంపాదకత్వం లో Glimpses: The Modern Indian Short Story Collection లో ప్రచురించబడింది. జయశ్రీ హరిహరన్ ఆంగ్లం లోకి అనువదించారు. హింది, ఒడియా భాషల్లోనూ అనువాదమై అచ్చయింది. ఫెమినిస్ట్ కథలేవీ రాక ముందే వచ్చిన ఈ కథ, స్త్రీ ఆత్మ గౌరవం , ఉన్నత వ్యక్తిత్వం కు అద్దం పడుతుంది. యాష్ ట్రే లో స్త్రీ పాత్ర సమాజం లో కొత్తగా పుడుతున్న పాత్ర. మానవి గా ఎదిగిన స్త్రీమూర్తి పాత్ర. అందుకే ఆమెకు పేరు లేదు. అటువంటి స్త్రీలు పెరిగాక పేర్లు స్థిరపడతాయి అన్నది రచయిత్రి ఉద్దేశం. బతుకుని కత్తిరించి మళ్ళీ అమార్చుకోవడం తెలియాలి. వికారంగా ఉన్న బతుకును అందంగా చేసుకోవడం ఈ కొత్త స్త్రీకి తెలుసు.
ఆ స్త్రీమూర్తిని పట్టుకోవడం లో కథకురాలు కృతకృత్యురాలైంది. అందుకే ఆమె తాను పొయెట్ కాదు అని ఎంత చెప్పినా ఆమె లైఫ్ లోని పొయెట్రీ ని, ‘poetry of life’ పట్టుకున్న కథకురాలని జర్మన్ ప్రొఫెసర్ , విమర్శకుడు, గెర్ట్ హాఫ్ మెన్ ఈ కథ అనువాదాన్ని ఇంగ్లీషులో చదివి ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. ఇది ప్రేమ కథ కాదు. బతుకులోకి కొద్ది రోజులు వచ్చినవాడు స్వార్ధం తో వెళ్లిపోయాడు, తిరిగి స్వార్ధం తో వచ్చాడు.

కొద్దిరోజులు పాటు వచ్చి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాడి పట్ల ఏ భావం ఉంది? ప్రేమ భావమా ? కానే కాదు, బాహ్య ఆకర్షణ. రూపు రేఖలు మొదట లాగుతాయి, లేని గుణగణాల భ్రమ కలుగుతుంది. ఆ ముద్రా ఇంకా కొద్దో గొప్పో మిగిలి ఉండటమూ సహజమే అందుకే కాస్తంత డైలమా పడ్డట్టు అనిపించినా కేవలం అయిదే ఐదు నిమిషాల్లో అతని తగనితనాన్ని మర్యాదగానే చెప్పినా అది మరి చెంప పెట్టే! కథా వస్తువు, భాష , కథ చెప్పిన తీరూ, ప్రతీకాత్మకంగా , కొత్త స్త్రీమూర్తి ఆచరణాత్మక ఆలోచనలతో, తనను తాను, ప్రతిష్టించుకున్న విధానం కథను అత్యుత్తమ స్థాయిలో చేర్చాయి. ” అంటూ జగద్ధాత్రి గారు ఇటీవల “నెచ్చెలి” వనితా మాస పత్రికలో రాసిన వాక్యాలతో ముగించారు గీత.విరామం తర్వాత సుభాష్ గారు “అరుగులు” అన్న వ్యాసాన్ని చదివి వినిపించారు. ఆముక్తమాల్యద నుంచీ ఈ ప్రస్తావన ఉందని, అరుగు ప్రాధాన్యతను, పర్యాయపదాలను వివరించి అందరినీ అలనాటి ఇళ్లకు తీసుకు వెళ్లారు.ఆ తర్వాత అక్కిరాజు రామాపతిరావు గారు కుంభకోణం గురించి, తెలుగు భాష గురించి వివరించారు.

తరవాత లెనిన్ గారు “అహల్య ఎవరు?” అనే ప్రశ్నతో సభను చర్చకు ఆహ్వానించారు. చివరగా జరిగిన కవిసమ్మేళనం, పాటల కార్యక్రమంలో డా||కె.గీత ఇటీవల మరణించిన ప్రసిద్ధ కవి శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి పాటను పాడి, తమ స్వీయకవితను చదివి వినిపించగా, సత్యన్నారాయణ గారు “అక్షరం” అనే గేయాన్ని పాడారు. శ్రీ చుక్కా శ్రీనివాస్ సరిహద్దు కవిత, శ్రీ నితిన్ ఆలపించిన ఎందరో మహానుభావులు అందరినీ అలరించాయి. చివరగా శ్రీకాంత్ గారి గాన విభావరి జరిగింది. ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

సెప్టెంబరు 8 వ తేదీన మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ ప్రాంగణంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గం వరకు వీక్షణం వార్షిక సమావేశం జరుగుతుందని, సాహిత్యాభిలాష కలిగిన అందరూ పాల్గొనచ్చని వీక్షణం నిర్వాహకురాలు డా||కె.గీత సభా ముఖంగా తెలియజేసారు.

 *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked