సారస్వతం

శృంగార వియోగ నాయిక

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య శృంగార తాపంతో బాధపడుతున్న నాయిక అలమేలు మంగను వర్ణిస్తున్నాడు. పరి పరివిధాల సపర్యలు చేసినా అవన్నీ ఏమీ ఎక్కడం లేదు. మన్మధ తాపంతో తన్మయావస్థలో ఉన్నది అమ్మ. ఈ కీర్తనలో అన్నమయ్య చెలికత్తెలతో ఏమి చెప్పిస్తున్నాడో చూద్దాం.

కీర్తన:
పల్లవి: ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును
చ.1.చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పరంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును || ఉయ్యాల||
చ.2.పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపైఁ బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు|| ఉయ్యాల||
చ.3.వెన్నెలల వేంకటద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసేని జెలియ|| ఉయ్యాల||
(రాగం: కాంబోధి; రేకు సం: 30, కీర్తన; 5-172)

విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అలమేలుమంగమ్మ – అన్నమయ్య చెలికత్తెలతో ఏమి చెప్పిస్తున్నాడో గమనించండి. చెలికత్తెలు ఏమని వాపోతున్నారో కూడావినండి.

పల్లవి: ఉయ్యాల మంచముమీఁద నూఁచి వేసారితిమి
ముయ్యదించుకయు రెప్ప మూసినాఁ దెరచును
అమ్మ ఉయ్యాలమంచము మీద పడుకొన్నా కూడా ఆమెకు నిద్ర కరువైనది. ఉయ్యాల ఊపి ఊపి మాకు చేతులు నొప్పులు వస్తున్నవి కాని, ఈమె రెప్పలు మాత్రం మూతబడుట లేదు. నిద్రించుట లేదు. ఒకవేళ మూతబడినా అంతలోనే మళ్ళీ లేచి చూస్తోంది.

చ.1.చందమామ పాదమాన సతికి వేఁగినదాఁకా
యెందును నిద్రలేదేమి సేతమే
గందపుటోవరిలోనఁ గప్పరంపుటింటిలోన
యిందుముఖి పవ్వళించు నింతలోనే లేచును
చందమామ అంబరవీధిలో తన ప్రయాణం తాను సాగిస్తూనే ఉన్నాడు. ఎంతసేపైన ఈమెకు నిదుర రావడంలేదు. ఏమి చెయ్యాలే? కర్పూరము మెత్తిన ఇంటిలోను, గంధము దట్టించిన చంద్రశాలలోను అమ్మ ఇందుముఖి పడుకొన్నప్పటికీ అంతలోనే మెలుకువ వస్తోంది. ఏమి చెయ్యాలి.

చ.2.పంచసాయకుని పుష్పబాణమాన యిందాఁక
మంచముపైఁ బవ్వళించి మాటలాడదు
నించిన వాలుగన్నుల నిద్దురంటానుండితిమి
వంచిన రెప్పలవెంట వడిసీఁ గన్నీరు.
పంచబాణుడైన మన్మథుడి విరిబాణాలు తాకి ఇప్పటిదాక మంచముపై పవ్వళించి యున్న అమ్మ ఏమియు మాట్లాడడంలేదు. విప్పారిన గొప్పవైన ఆ వాలుకన్నులు మూతలు పడతాయేమోనని ఆశించి ఎదురు చూస్తుంటే ఆ కన్నులనుండి నీరు గార్చుచున్నవి.

చ.3.వెన్నెలల వేంకటద్రివిభుని లేనవ్వులాన
నన్నుఁ జూచియైనాఁ జెలి నవ్వదాయను
ఇన్నిటాను సంతసిల్లి యీ దేవదేవుని గూడి
మన్ననల యింత లోన మలసేని జెలియ

ఓ చెలులారా! చూచారా! ఈ అమ్మను చూచి మేమెంతగా చిరునవ్వులు నవ్వినప్పటికీ అమ్మ మారు నవ్వదేమి? ఆఖరికి ఆ దేవదేవుడు వెన్నెలలావచ్చి చెలిని కూడినాడు. తనకు లభించిన ఈ మన్ననతో తన స్వామితో పెనగి అప్పుడు నవ్వింది. ఎన్ని విధాల సపర్యలు చేసినా ఊరట కలగని అమ్మ స్వామి రాకతో అతని కలయికతో ఆమెకు ఎనలేని ఆనందం కలిగిందని అన్నమయ్య అపురూప భావనతో మనకు చెప్తున్నాడు.

ముఖ్యమైన అర్ధాలు: ఇంచుక = కొంచెము; వేసారు = శ్రమపడు, నొచ్చు; పాదమాన = పయనము సాగించు; ఇందుముఖి = చంద్రునివంటి ముఖముగల స్త్రీ; పంచసాయకుడు = మన్మథుఁడు. (అయిదుబాణములు కలవాఁడు అని శబ్దార్థము. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము); వడయు = తోడుగా; సంతసిల్లు = అనుమోదిల్లు, అలరారు, అలరు, అలరొందు, ఆనందించు; మన్నన = సమ్మానము, గౌరవము; మలయు = పెనగు, వ్యాపించు.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked