ఉత్తరాకాండ
శ్రీరామచంద్రుడు రావణసంహారం చేసి అయోధ్యలో పట్టాభిషిక్తుడై సకల సంవత్సమృద్ధంగా జనరంజకంగా పరిపాలిస్తుండడం చూసి ఇలలోని నాలుగు దిక్కుల నుంచి పరమఋషులు ఎంతో సంతోషంతో ఆ శ్రీరామప్రభువును అభినందించటానికీ, తమ అభిమానం తెలియజేయటానికీ అయోధ్యకు వచ్చారు.
తూర్పుదిక్కు నుంచి వచ్చిన వారిలో కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, మేధాతిథి కుమారుడు కణ్వుడు మొదలైన వారున్నారు. దక్షిణం నుంచి వచ్చిన వారిలో ఆత్రేయుడు, నముచి, ప్రముచి, ఋషులందరిలోనూ సర్వశ్రేష్టుడూ, మహాప్రభావసంపన్నుడూ అయిన అగస్త్యుడూ ఉన్నారు. పడమటి నుంచి కవషుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు అనే వారు తమ శిష్యులతో కూడా వచ్చారు. ఉత్తరదిక్కు నుంచి వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను సప్తర్షులు వచ్చారు. ఇట్లా వీళ్ళంతా రాచనగరు సింహద్వారం సమీపించి అక్కడి ద్వారపాలకుడితో తమ రాక శ్రీరామచంద్రుడికి తెలియజేయవలసిందిగా అగస్త్యుడి ద్వారా కోరారు. ఆ ప్రతీహరి పరుగు పరుగున వెళ్ళి శ్రీరామప్రభువుకీ వార్త తెలియజేశాడు. శ్రీరాముడు సంభ్రమసంతోషంతో వాళ్ళను వెంటనే తాను దర్శించగోరుతున్నట్లు వర్తమానం పంపాడు. అప్పుడు వాళ్ళంతా శ్రీరాముడి కొలువుకూటానికి వచ్చారు. శ్రీరామభద్రుడు వాళ్ళందరినీ ఎంతగానో గౌరవించాడు. ఉచితాసనాలపై అధిష్టింప చేశాడు. పరమవినీతుడై వాళ్ళతో కుశల ప్రష్ణాదికం చేశాడు. అందరి క్షేమ సమాచారం కనుక్కున్నాడు. వాళ్ళందరూ మేము ఆపదలు లేకుండా సంతోషంగా ఉన్నామని చెప్పారు.
అప్పుడు వాళ్ళు రావణుణ్ణి సపుత్రమిత్రబాంధవంగా సంహరించినందుకు శ్రీరాముణ్ణి అభినందించారు. తమ మాటలలో ఆనందం వెల్లడించారు. ఇప్పుడు సకల కళ్యాణగుణధాముడై, సమస్తప్రజలను సంరక్షిస్తూ, తమ్ములతో, తల్లులతో రాజ్యపరిపాలన చేస్తున్నందుకు శ్రీరాముణ్ణి కొనియాడారు.
శ్రీరామప్రశంస
“లోకకంటకులు, మహాబలపరాక్రమవంతులు, ఎవరికీ తెరిచూడరాని వారూ అయిన ప్రహస్తుడు, వికటుడు, విరూపాక్షుడు, మహోదరుడు, అకంపనుడు, దుర్ధర్షులనే కాకుండా, కుంభకర్ణుడు, అతికాయుడు, దేవాంతకుడు, నరాంతకుడు మొదలైనవారిని శ్రీరాగ్నికి ఎండుకట్టెలను చేశావు. రావణుడి సంగతి సరేసరి. అతడు ముల్లోకాలనూ గడగడ వణికించాడు. ఇక తండ్రిని మించి పోయినవాడు ఇంద్రజిత్తు. మాయాయుద్ధంలో వీడితో పోల్చదగినవాడు మరొకడు లేడు. దేవతలను జయించి ఇంద్రుణ్ణి బందీగా చేశాడు. అటువంటి మంత్ర, తంత్ర, యంత్రశస్త్రవేత్త ఇంకొకరు లేనేలేరు. అటువంటి ఇంద్రజిత్తును నీవు చంపివేయడం ఏంతో గొప్పగా పొగడ వలసిన సంగతి. అది మరొకరికి అసాధ్యం. మాటలకు అందని అవక్రపరాక్రమం చూపి ఇంద్రజిత్తును సంహరించావు” అన్నారు ఋషులు. అప్పుడు శ్రీరాముడు విస్మితుడై “ఇందాక మీరు ప్రస్తావించిన క్రూర, ఘోర, పరమభయంకర రాక్షసులకన్నా ఇంద్రజిత్తు ఘనుడా? ఎందుకు అతన్ని మీరు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు?” అని వాళ్ళను అడిగాడు. “ఇంద్రుణ్ణి కూడా పరిభవించే అంత పరాక్రమం ఎట్లా సంపాదించాడా రాక్షసుడు? దేవరహస్యం కాకపొతే నాకు చెప్పండి” అని వాళ్ళను ప్రార్థించాడు శ్రీరాముడు. “రావణుడిని మించిన పరాక్రమం ఎట్లా ఇంద్రజిత్తుకు లభించింది?” అని ఆశ్చర్యమగ్నమానసుడై తెలుసుకోగోరాడు శ్రీరాముడు.
***