*పరిమళాల వసంతం*
~ వెన్నెల సత్యం
షాద్‌నగర్
యువకవి కుడికాల వంశీధర్ “సరోజనార్ధన్” పేరుతో కవిత్వం రాస్తున్నాడు. కలం పేరు కాస్త కొత్తగా అనిపించింది. అమ్మానాన్నలను కలంపేరులో నిలుపుకోవడంలోనే ఆయన “హృదయం” ఏమిటో మనకు స్పష్టమవుతుంది. తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, ఆరాధించిన వాడు చుట్టూ ఉన్న సమాజాన్ని సైతం ప్రేమిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వంశీ నానీల్లో ఆ “ప్రేమ” మనకు అడుగడుగునా కనిపిస్తుంది.
ఏ సాహితీ కార్యక్రమం చూసినా యాభై ఏళ్ళకు పైబడిన వారే అధికంగా కనిపిస్తూ ఉంటారు. ఒక వేళ అడపాదడపా యువత కనిపించినా ఏ తెలుగు ఉపాధ్యాయులో, ఉపన్యాసకులో, పరిశోధక విద్యార్థులో అయ్యుంటారు. ఇలాంటి సాహిత్య కార్యక్రమాల్లో తరుచూ పాల్గొంటాడు వంశీ. చదివింది ఆంగ్లమాధ్యమం, చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఈ నేపథ్యంలో వంశీ కవిత్య్వం వైపు అడుగులు వేయడం గొప్ప విషయమే. బహుశా నాన్న గారి సాహిత్య వారసత్వమూ కారణమేమో.
నానీల ప్రక్రియ గత రెండు దశాబ్ధాలకు పైగా తెలుగు నేల మీద అప్రతిహతంగా దూసుకుపోతున్నది. 350కి పైగా సంపుటాలు. వెయ్యి మందికి పైగా కవులు, అనేక భాషల్లోకి అనువాదం నానీల వైభవాన్ని చాటుతున్నాయి. ఈ నానీల ప్రయాణం అనంతమై అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదు.
ఇక వంశీ నానీల లోతుల్లోకి రేఖామాత్రంగా ఓ సారి తొంగి చూద్దాం.
కులమతాల పేరుతో జరుగుతున్న మారణహోమాల మధ్య మానవత్వం ఎలా రంగు వెలసిపోతున్నదో
ఈ నానీలో చెప్తున్నాడు.
*కులానికో రంగు*
*మతానికో రంగు*
*మానవత్వం*
*తెల్లబోయింది*
భావుకత లేనిదే కవి కాలేడన్న నిజాన్ని ఒంటబట్టించుకున్న వంశీ తన భావుకతను ఈ
నానీలో ఎంత సుందరంగా కుప్పపోశాడో చూద్దాం.
*గడ్డిపై*
*మంచుబిందువులు చూశావా?*
*రాత్రి*
*నిశ్శబ్దంగా ఏడ్చింది*
అలాగే అమ్మను గురించి రాయని కవి ఈ భూమ్మీదనే లేడు. చాలా చోట్ల వంశీ “నానీ”లాగా మారిపోయి వాళ్ళమ్మ కొంగుపట్టుకు తిరుగుతున్నట్టు భావన కలుగుతుంది. ఈ నాటి కాలంలో “అమ్మ”ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో, పిల్లల ప్రవర్తన ఎంత క్రూరంగా ఉందో కళ్ళకు కట్టేలా చెప్పాడీ నానీలో
*కొనిపెంచిన పిల్లి*
*ఆసుపత్రికి*
*కనిపెంచిన తల్లి*
*ఆశ్రమానికి*
ఎంత నగ్న సత్యం ఇది.
ఇక జీవన తాత్వికతను ఎంత సుళువుగా నానీలో పలికించాడో చూస్తే పాఠకులు
అబ్బురపడతారు.
*గుండె చప్పుడు*
*ఇలా ఆగిపోయింది*
*చావు డప్పు*
*అలా మొదలయ్యింది*
ఇంతకన్నా ఏం చెప్పగలం జీవితం గురించి.
తన ఉద్యోగ జీవితంలో ఎదురైన సమస్య కాబోలు ఈ నానీలో కుదిర్చాడు.
*అనర్హులది*
*అజమాయిషీ ఐతే*
*సమర్థులు కూడా*
*సంజాయిషీ ఇవ్వాలి*
ఇలాంటి సంధర్భాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయి.
తన మనసున మనసైన మనిషికోసం తపిస్తూ
*నిన్ను చేరేందుకు*
*రెక్కలు లేవు*
*దూరమెంతో తెలియదు*
*లెక్కలు రావు*
అంటూ అమాయకత్వం ఒలకబోసినా కవితాపుష్పక విమానమెక్కి తనను చేరుకునే ఉంటాడు.
ఆధునిక కవిత్వంలో పెడధోరణులను సైతం తూర్పార బట్టే నానీలను రాశాడు.
*ముందుమాట*
*ముప్పై ఠావులు*
*అసలు కవిత్వం*
*ఆరు ఠావులు*
అంటూ కొందరి కవిత్వంలోని డొల్లతనాన్ని సమాజానికి చూపుతాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే స్వర్గమనుకునే సమాజంలో ఈ దేశానికి అసలైన భరోసా
ఎవరిస్తారో సూటిగానే చెప్పాడు ఈ నానీలో
*దేశానికి ఎవరు*
*భరోసా?*
*పంట పండించే రైతు*
*పహారా కాసే జవాను*
కాదని ఎవరైనా అనగలరా?
ఈ “నానీల వసంతం”లోని నానీలన్నీ పరిమళభరితమే. ఆస్వాదించడమే తరువాయి. నానీల
ప్రపంచంలోకి తన “కుడికాలు” పెట్టి ఆరంగేట్రం చేయబోతున్న మిత్రుడు కుడికాల వంశీధర్‌ని అభినందిస్తూ… భవిష్యత్తులో మరింత సాహితీ సృజన చేయాలని ఆకాంక్షిస్తున్నాను.