సారస్వతం

కుంతి మాట – సత్సంగ్

– కుంతి

మెయిన్ హాలులో చిన్న బల్బు వెలుగు మిగిలిన ఇల్లంతా చీకటిగా ఉంది. గోడగడియారము పన్నెండు గంటలు కొట్టింది. సోఫాలో దిగాలుగా కూర్చున్న అన్నపూర్ణమ్మ. అదే హాలులో, ఉబికి వస్తున్న కన్నీరునాపుకుంటూ వెక్కిళ్ళు పెట్టడానికి సిద్ధపడుతున్న గుండెను అదుము కుంటూ, అన్యమనస్కంగా పచార్లు చేస్తున్నది అన్నపూర్ణమ్మ మనవరాలు అపరాజిత.

వారిరువురూ గేటు వెలుపలి రోడ్దు వైపుకు చూస్తున్నారు. బయట ముసురు పడుతున్నది. ఇంతలో స్కూటర్ శబ్దము వినిపించింది. ఇద్దరూ ఒకేసారి అటు వైపుచూసారు. నిండుగా తడిసిన శ్రీ రామచంద్రమూర్తి స్కూటర్ పార్క్ చేసి కురిసిన వర్షము వలననో, జారిన కన్నీటి వలననో తడిసిన శరీరముతో లోపలికి వచ్చాడు.. అతడు దీనంగా ఉన్నాడు.ఇంతలో మళ్ళీ గేటు శబ్దమైంది. ముగ్గురు అటు వైపు చూసారు. తండ్రిలాగే తడిసి ముద్దైన రాజీవ్ తన బైక్ ను పార్క్ చేసి ఇంటిలోనికి వచ్చాడు. ఇద్దరు గంభీరంగా ఉన్నారు. ఆ యింట్లోని వారికి , వారి వాలకము చూసిన తరువాత, మధ్యాహ్నము నుండి కనిపించకుండా పోయిన ఆ యింటి ఇల్లాలు సీత జాడ వారు కనిపెట్టలేకపోయారని అర్ధమైపోయింది.
…………………..
“ఏరా! ఏమైనా తెలిసిందా?” ఆదుర్దాగా అడిగింది అన్నపూర్ణమ్మమూర్తిని.
“లేదమ్మా సాయంత్రము మీరు ఫోన్ చేసిన తరువాత నేను వెదకని చోటులేదు. సీతకు ఫోన్ చేసే ప్రయత్నము చేస్తునే ఉన్నాను, సీత ఫోన్ “స్విచ్ అఫ్” అని వస్తుంది. ఆమె కాలేజీకి వెళ్ళాను. అటుపై సీత స్నేహితులందరికీ ఫోన్ చేసాను . . నేను సీత తరుచుగా వెళ్ళే ఊరవతలనున్న స్వామీజీ ఆశ్రమానికి కూడా వెళ్ళి వచ్చాను. మధ్యమధ్యలో రాజీ్వ్ తో మాట్లాడుతునే ఉన్నాను. వాడూ ఊరంతా తిరిగాడు. వాడూ, నేనూ సిటీ అంతా దాదాపుగా తిరిగాము. దాదాపుగా అందరినీ కనుక్కున్నాము.
కానీ…….” అంటూ ఒక్కసారిగా చిన్నపిల్లవాడిలా తల్లి వడిలో తలదూర్చి బావురుమన్నాడు.

పిల్లలిద్దరూ తండ్రిని గట్టిగా పట్టుకుని దగ్గరకు తీసుకున్నారు.
“నాన్నమ్మా! నేను అమ్మవాళ్ళ కొలీగ్స్ ఇండ్లకు వెళ్ళాను. ఇంకా భయమేసి..
” ఆ భయమేసి”
జనరల్ హాస్పిటల్ కు వెళ్ళాను. యేవైనా ఎమర్జెన్సీ కేసులు వచ్చాయేమోనని ….

ఆ మాట అంటుండగానే అపరాజితకు ఒక్కసారిగా అన్నయ్యపై వ్రాలి గట్టిగా యేడవసాగింది. “నాకు అదే భయంగా ఉంది. అమ్మకు ఏదో ప్రమాదము జరిగిందని గట్టిగా అనిపిస్తుంది. మనము పది నిముషాలు ఆలస్యంగా వస్తే ఫోన్ల మీద ఫోన్లు చేసే అమ్మ, ఎక్కడున్నా అరగంట కొకసారి, ఏం ఛేస్తున్నారు? ఎలా ఉన్నారు? అని పలుకరించే అమ్మ సాయంత్రము నుండి కనబడక పోయేసరికి ప్రాణాలు నిలవడము లేదు. మనసేదో కీడు శంకిస్తుంది. కాళ్లు వణుకుతున్నాయి” అంటూ యేడిస్తూ అనసాగింది అపరాజిత.

అన్నపూర్ణమ్మ ముగ్గురినీ దగ్గరకు తీసుకొని” ఇలా దిగాలు పడిపోతే యెలా? దేవుడున్నాడు. మనమెవ్వరికీ యే అన్యాయము చేయలేదు. సీతకే ప్రమాదము జరిగి ఉండదు. సీతది జాలిగుండె. ఎవరికైనా ఆపద వస్తే వారికి సాయము చేయడానికి వెళ్లి ఉంటుంది. ఫోన్ పోయి ఉంటుంది లేదా ఎక్కడైనా మరిచిపోయి ఉంటుంది” అని ధైర్యము చెప్పే ప్రయత్నము చేసింది అన్నపూర్ణమ్మ,

“వేరే ఫోన్ నుండి మన యే ఒక్కరి సెల్ కైనా, ల్యాండ్ లైన్ కైనా ఫోన్ చేసి ఉండవచ్చుకదా!” అన్నది అపరాజిత
“నాన్నా! నేను ఆంబులెన్స్ సెంటర్ కు వెళ్లి కనుక్కున్నాను. సాయంత్రము నుండి యేవైనా ప్రమాదాలు జరిగాయా.,అందులో యాభై యేళ్ళ స్త్రీ యెవరైనా ఉన్నారా అని, వాళ్ళు , అలాంటి వారెవరు ప్రమాదము పాలైనట్టుగా సమాచారము లేదు అని తెలిపారు, ఇక పోలీస్ స్టేషన్ మిగిలింది . మిమ్మల్ని కనుక్కొని ఇంకా కొద్ది సేపు చూసి ఆ పని చేద్దామనుకుంటున్నను” అన్నాడు రాజీవ్.

” అరుణ్ ఎనిమిది గంటలకు ఫోన్ చేసాడు. అతడిని ఇక్కడికి పిలిపించుకొని అతడితో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేద్దామనుకున్నాను, కానీ ఎందుకో అలా చేయాలనిపించలేదు ” అన్నది అపరాజిత

“ఏమిటీ! అరుణ్ ఫోన్ చేసాడా? ఎందుకు? అన్నాడు రామచంద్రమూర్తి
“రెండు రోజులలో ముఖ్యమైన పనికోసము బెంగుళూర్ వెళ్ళాలంటూ, వీలైతే రేపటెల్లుండి బట్టలు, నగలు షాపింగ్ చేద్దామంటూ, రమ్మన్నాడు. ఒక వైపు అమ్మ టెన్షన్ నా మనసులో ఉండడముతో, అతడితో ఏమీ చెప్పలేక, నేను యే విషయము తరువాత ఫోన చేసి చెపుతానని ఫోన్ పెట్టాసాను” అన్నది అపరాజిత.

“నాన్నా! దారిలో ఉండగా శ్రీధరము మామయ్య ఫోన్ చేసాడు. శాలినికి పట్టు చీరలు కొనాలట. శాలిని తల్లి లేనిపిల్ల. వీలైతే రేపు మీ అమ్మగారిని పంపించు, షాపింగ్ చేయవచ్చు” అన్నాడు. నేను యే విషయము వారికి చెప్పలేదు. అలాగే లెండి అన్నాను” అని తెలిపాడు రాజీవ్.

“మా యూనివర్సిటీ వీసీ గారు నేను ఇంట్లో ఉన్నాననుకొని నాకు ఫోన్ చేసారు,.” మిష్టర్ మూర్తీ! నీకూ శ్రీమతికి పదవతేదీనాడు సన్మానము యేర్పాటు చేసాము. నీ పరిశోధనా కృషి వెనుక ఉన్నది నీ శ్రీమతి యొక్క ప్రోత్సాహమే అని మాకు తెలుసు. మీరిరువురు ఆ రోజు తప్పక రావాలి. ఈ విషయము ఆవిడకే డైరెక్ట్ గా చెప్పుదామనుకొని చాలా సేపటి నుండి ఫోన్ చేస్తున్నాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దగ్గరలో ఉందా నేనే చెబుతాను” అన్నాడు. లేదు సార్! నేను ఇంటి బయట ఉన్నాను. ఆవిడకు ఈ విషయము కన్వే చేస్తాను. మీ ప్రేమాభి మానాలకు ధాంక్స్” అని చెప్పి ఫోన్ పెట్టేసాను” చెప్పుకొచ్చాడు రామ చంద్రమూర్తి.

మాటలన్నీ వింటున్న అన్నపూర్నమ్మ” పదిరోజుల్లో పిల్లలకు పెళ్ళిళ్ళు పెట్టుకున్నాము. యేం జరుగుతుందో యేమో? శాంతి నిలయము లాంటి ఇంట్లో యేమి ఉపద్రవము రానుందో? ఇంత సేపు మిమ్మల్ని ఓదార్చాను. కానీ నాకు గుండె చిక్కబట్టడము లేదు” అంటూ ఏడవసాగింది. అపరాజిత కూడా నాన్నమ్మకు జత కలుస్తూ ” నాన్నమ్మా! అమ్మకు ఏమీ కాదు, వెంకటేశ్వరస్వామి కొండకు మెట్లు ఎక్కి వస్తానని మొక్కుకున్నాను. అమ్మ లేకుంటే నేను ఒక్క క్షణము బ్రతుకలేను” ఏడుస్తూ అన్నది.

“ఎల్లుండి అమ్మ బర్త్ డే అందు కోసము నా జీతములో డబ్బులు మిగిల్చుకొని అమ్మకు వెహికిల్ కొన్నాను. అదే రోజు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను” అన్నాడు దిగులుగా రాజీవ్.

“ఒరేయి మూర్తీ! సీత సజావుగా ఇంటికి వస్తే స్వామి వారికి కళ్యాణము చేయిస్తానని మొక్కుకోరా. నాకూ యేదో కీడు శంకిస్తుంది” అన్నది అన్న పూర్ణమ్మ. ఇలా వారంతా బరువెక్కిన గుండెలతో అప్పుడప్పుడు గేటు వైపు చూస్తూ, ఫోన్ వైపు చూస్తూ క్రియా శూన్యులై ఉండగా ఆటో ఆగిన శబ్దము వినబడింది. అందరు ఒక్క సారిగా అటు చూసారు. రాజీవ్ వసారాలోకి పరుగెట్టాడు. ఆటోలో నుండి దిగింది సీత. బ్యాగ్ లో నుండి ఐదు వందల రూపాయల నోట్ అతడి చేతిలో పెట్టింది. అతడు ఆమె వంక జాలిగా చూస్తూ ఒక చేత్తో పట్టుకొని గేట్ లోపలికి వచ్చాడు. రాజీవ్ రావడముతో అతడికి అప్పచెప్పి, వెనుదిరిగి వెళ్ళి పోయాడు.

…………………..

చెదిరిన ముంగురులతో, అక్కడక్కడ చిరిగిన చీరా, జాకెట్ తో, ఒంటి నిండా గాట్లతో, వేడెక్కిన శరీరముతో నిలబడలేక కూలబడిపోతున్న తల్లిని వడుపుగా పట్టుకొని ఇంట్లోకి తీసుకు వచ్చాడు.
రామచంద్రమూర్తి గేట్ మూసి, మెయిన్ హాల్ తలుపు మూసి లోనికి వచ్చాడు. అపరాజిత గ్లాసెడు నీళ్ళు తీసుకొనివెళ్ళి, తల్లిని సోఫాలో కూర్చుండ బెట్టింది. దగ్గరలో ఉన్న శాలువ తెచ్చి ఒంటి పై కప్పింది. కొద్ది సమయము అక్కడ నిశ్శబ్దము రాజ్యమేలింది.

అంత వరకు భయాందోళనలు, భావోద్విగ్నతలకు గురియైన కుటుంబ సభ్యులు ఆవిడ వచ్చిన తీరు, ఆవిడ వాలకము చూసి ఎవరూ మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని చేదిస్తూ,” ఇప్పటికే చాలా పొద్దుపోయింది ఇడ్లీలు పెట్టి హాట్ కేస్ లో ఉంచాను. తలా రెండు తినండి” అన్నది అపరాజిత ఏమి మాట్లాడాలో తెలియక.

” నేను తినే పరిస్థితిలో లేను… మీరు తినండి” అన్నది సీత. మిగిలిన వాళ్ళు కూడా తినే మూడ్ లో లేము అనడముతో ఆ విషయము అక్కడితో ఆగిపోయింది. సీత గంభీరంగా, మౌనంగా ఎటో చూస్తూ ఉంది. నీరసంగా కనిపిస్తున్నా తనను తాను దేనికో సంసిద్ధము చేసుకుంటున్నట్లుగా ఉంది. వెంటనే లేచి బాత్రూమ్ కు వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది. ఫ్రిజ్ లో నుండి నీరు తీసుకొని త్రాగింది. ఆమె అలా లేచివెళుతుంటే ” మదగజాలచే ధ్వంసము చేయబడిన హరిత వనములా, శత్రువుల చేతిలో నుజ్జునుజ్జైన కోటలా”అనిపించింది రామ చంద్రమూర్తికి.

ఎక్కడో హృదయ సంద్రములో కరుణా వీచిక ఎగిసింది. ఆమె మరలా మౌనంగా కూర్చుంది. కాని ఆమె హృదయములో యేదో మదనము జరుగుతుందన్నది మాత్రము వారికి అర్ధమైంది.

ఉండబట్టలేని అన్నపూర్ణమ్మ ” యేమైంది సీతా, ఇంతసేపు అయింది. ఎక్కడికి వెళ్ళావు, అసలేమి జరిగింది. నీ వాలకము చూస్తుంటే నా మనసు యేదో జరుగ కూడనిది జరిగినదని తోస్తుంది. సాయంత్రము నుండి మేము నానా హైరానా పడుతున్నాము తెలుసా?” అంటూ ప్రశ్నల వర్షము కురిపించింది అన్నపూర్ణమ్మ. శరీరము నీరసంగా ఉన్నా దృఢంగా , మనసులో అందోళన ఉన్నా గంభీరంగా, ధైర్యంగా చెప్పడము ప్రారంభించింది. “కాసేపు నెను చెప్పేది ఓపికగా వినండి. నా జీవితములో కలలో కూడా ఊహించని సంఘటన ఈ రోజు జరిగింది. నేను ప్రమాదానికి గురి అయ్యాను…………..శీలపరంగా………….

అందరూ ఉలిక్కి పడ్డారు. తమ మనసుల్లో లీలగా తోస్తున్న విషయమే నిజంగా జరగడముతో తమక్రింద నేల జరిగినట్లుగా భావించారు. మళ్ళీ వినసాగారు.
“మధ్యాహ్నము రెండు గంటలకు కాలేజ్ అయిపోయింది. బయటికి వచ్చాను. ఇంతలో మాపాత స్టూడెంట్ భాను వాళ్ళ నాన్న మస్తానయ్య కనిపించాడు. తనకూతురికి పెళ్ళి పెట్టుకున్ననని చెప్పాడు. వెంటనే పర్స్ లో ఉన్న రెండు వేల రూపాయలు ఆయనకు ఇచ్చి అమ్మాయికి కానుకగా ఇవ్వమన్నాను.” లేదు మేడమ్! మీరు స్వయంగా వచ్చి, ఆమెకందించి ఆశీర్వదించండి” అని పట్టు పట్టాడు. వాళ్ళ ఇల్లు సిటీకి చాలా దూరము. అతడు బాగా బ్రతిమాలాడు. సరే రెండు మూడు గంటలలో పోయి రావచ్చుననుకొని , మీకు ఫోన్ చేద్దామనుకొని, గ్ చూసుకున్నాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. సెల్ స్విచ్ ఆఫ్ చేసి, స్టాఫ్ రూమ్ లోని బీరువాలో పెట్టినట్లు. ఇప్పుడు మళ్ళీ కాలేజీకి వెళ్ళలేననుకొని ఆటో కట్టించుకొని వాళ్ళింటికి వెళ్ళాము. మధ్యమధ్యలో ఫోన్ ఎక్కడి నుండైనా చేయాలని చూసాను. కుదర్లేదు. అక్కడ వాళ్ళింట్లో ఎక్కువ సేపు ఉండలేదు. వాళ్ళింటి నుండి ఐదు గంటలకు బయలుదేరాను. సుమారు కిలోమీటర్ దూరములో నున్న బస్ స్టాండ్ కు చేరుకున్నాను. మస్తానయ్య బస్ స్టాండ్ వరకు వచ్చి, యేదో పని ఉందని చెబితే, నేను వెళ్ళిపొమ్మంటే , అతడు వెళ్ళిపోయాడు.

అది హైవే మార్గము. వచ్చిపోయే వెహికిల్స్ తప్ప మనుషులెవరూ లేరు. జిల్లాల నుండి వచ్చే బస్సులుగానీ,సబ్ అర్బన్ బస్సులుగానీ వస్తాయేమోనని ఎదురు చూడసాగాను. ఇంతలో ఒక టాటా సుమో వచ్చింది. అందులో నుండి నలుగురు యువకులు మన రాజీవ్ వయసులోనున్న వారు దిగారు. వారిని చూస్తుంటే బాగా డబ్బున్న, సంస్కారములేని లంపెన్ గుంపులాగా అనిపించింది. వాళ్ళు రెండు నిమిషాలు అటు ఇటు చూసారు. వేంటనే ఇద్దరు నావెనుకవైపుకు వచ్చారు. ఒకడు నా నోరును నొక్కేసాడు. ఇంకొకడు నా చేతులను వెనక్కి విరిచిపట్టాడు. మరొక ఇద్దరు నన్ను కారు వైపుకు లాక్కొని వెళ్ళసాగారు. వాళ్ళుయేదైనా దొంగతనము చేద్దామనుకున్నరేమోననుకొని, నన్ను నేను విడిపించుకునే ప్రయత్నము చేస్తూ, నొక్కి వేసిన నోటితోనే అరిచే ప్రయత్నము చేస్తూ , గాజులూ పర్స్ చూపి, తీసుకోండని చెప్పే ప్రయత్నము చేసాను. అలా చేస్తూనే నాకున్న ఫోటోగ్రాఫిక్ మెమొరీతో కార్ నంబర్ ను గుర్తుంచుకొనే ప్రయత్నము చేయసాగాను. నేను తీవ్రంగా ప్రతిఘటించడముతో వాళ్ళలో ఇద్దరు నన్ను పొట్టలో తీవ్రంగా పిడి గుద్దులు గుప్పించారు. ఇంకొకడు వీపు పైనా,తలపైనా బాదడము మొదలు పెట్టాడు. అలా ఎంతసేపు కొట్టారో తెలియదు. నేను పూర్తిగా ఎదిరించలేని, అరవ లేని స్థితికి వచ్చాను. నా నోరు నొక్కి పెడుతూనే నన్ను కారులోకి తోసారు. ఆ తరువాత ఎక్కడెక్కడో తిప్పారు. నాకు ఒళ్ళంతా నొప్పులతో, శరీరము బాధ పెడుతున్నా, కళ్ళు మూతలు పడుతున్నా తప్పించుకునే మార్గము వెదుకుతునే ఉన్నాను. అది గమనించిన ఒకడు మళ్ళీ తలపై, కడుపుపై గుద్దులు గుద్దాడు. ఆతరువాత చాలా సేపటికి కాని నన్ను నేను తెలుసుకోలేకపోయాను. నాకు కొంత లీలగా తెలుస్తూనే ఉంది. నన్నెక్కడికో చీకట్లోకి లాక్కెళుతున్నట్లు….నిర్జనప్రదేశములోకి తీసుకువెళుతున్నట్లు……..ఒక్కరి తరువాత ఒక్కరు…..కిరాతకంగా…………రాక్షసంగా…..”

అంటూ చెప్పడము ఆపేసి అంతవరకు దుఃఖాన్ని ధైర్యంగా ఉగ్గబెట్టుకున్నాఅమె చెలియలికట్టలు తెగిన గోదారిలా కన్నీటి ప్రవాహమైనది. అందరూ అమెవంక అలాగే చూడసాగారు. అపరాజిత తల్లి దగ్గరికి వెళ్ళి స్త్రీసహజమైన కరుణాహృదయముతో ఆమెను పొదివి పట్టుకున్నది.

అందరూ చింతాక్రంతులై ,”ఇప్పుడేమిటి? ” అన్న ఆలోచనల్లో మునిగిపోయారు.
దిశా పర్యంతమై పారిపోతున్న సైనికులను దగ్గరికి పిలుచుకొని సైన్యాన్ని సమాయత్తపరుచుకుంటున్న సేనానిలా, కూలిపోయిన కోటలను పునర్నిర్మింపచేయ బూనిన ఓడిపోయిన రాజులా, ధైర్యాన్ని, గంభీరాన్ని పొదివితెచ్చుకొని సీత వాళ్ళను చూస్తూ, “నేనొక నిర్ణయానికి వచ్చాను. నాకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాను.

మనుషులుండాల్సిన ప్రదేశములో మృగాలు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడము పెద్ద తప్పు. అవి మన ఉనికికే పెద్ద ముప్పును తెస్తాయి. ఈరోజు నాకు జరిగినట్లే రేపు ఇంకెవరికైనా జరుగవచ్చు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ పోరాటములో ఎంత దూరమైనా వెళ్లదలుచుకున్నాను” అన్నది.

జరిగిన ఘాతుకాన్ని ఎలా అర్ధము చేసుకోవాలో అర్ధము చేసుకోలేక సతమతమౌవుతున్న ఆ ఇంటి కుటుంబ సభ్యులు సీత మాటలతో పక్కలో బాంబులు పడ్డట్లుగా ఉలిక్కి పడ్డారు. “ఇదంతా ఏమిటీ” అన్నట్లుగా చూసారు.

“ఎంత ఘోరము జరిగిపోయింది. సంప్రదాయబద్దంగా ఎంత పేరు తెచ్చుకున్న ఈ కుటుంబానికి ఎంత కళంకము వచ్చింది. పది రోజులలో పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు పెట్టుకున్నాము. ఇక ఈ పెళ్ళిళ్ళు అవుతాయా? పూజా పునస్కారాలతో, “సత్సంగ్” అన్న ఈ ఇంటి పేరుకు తగ్గట్టుగా ఆధ్యాత్మక కేంద్రమైన ఈ ఇంటికి ఇక ముందు ఎవరు వస్తారు? అందరికీ ఈ విషయము తెలిస్తే మన మొహాన ఉమ్మేయరూ? మనము పది మందిలో తలెత్తుకొని తిరుగగలమా? ఇక ఈ ఇంటి పరువు ప్రతిష్ఠలు మసక బారినట్లే. కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో నాకీ కష్టము రావడము ఏమిటి. జరిగినదే జీర్ణించుకోలేమంటే మళ్ళీ ఈ రాద్దాంతము ఏమిటీ, మనంతట మనము బయటపెట్టు కోవడము ఏమిటీ” అంటూ వేదనతో కూడిన కోపముతో మండిపడింది అన్నపూర్ణమ్మ.

తన వివాహానికేదైనా ఇబ్బంది కలుగవచ్చునని అనిపించేసరికి తల్లికి కొంచెము దూరముగా జరిగింది అపరాజిత.

“అమ్మా! నీ పట్ల జరిగింది అన్యాయం. ఘోరం. చీకట్లో మారుమూల ఎవరికీ తెలియకుండా జరిగిన ఈ ఘాతుకాన్ని పబ్లిసైజ్ చేయాల్సిన అవసరమేముంది? శాలినీ వాళ్ళ నాన్న చాలా పట్టింపులున్న మనిషి. అరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత విశాల స్వభావము కలవారు కాదు. చెల్లెలి నిశ్చితార్ధము నాడు ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలుసు కదా!. పైగా కొన్ని రోజులలో నాన్నకు యూనివర్సిటీలో పెద్ద సన్మానము జరుగబోతుంది. ఈ సమయములో ఇలా జరగడమే మన దురదృష్టము. జరిగినదేదో జరిగినది అనుకోకుండా మనంతట మనము బయటపడి పోలీసులు, కేసులు, లాయర్లు, కోర్టుల చుట్టూ తిరగడము అవసరమా? నీకు జరిగిన అన్యాయానికి నా రక్తము సలసలాకాగుతుంది. వింటున్న నాకే ఇంత కోపావేశాలు కలుగుతున్నాయంటే , కష్టాన్ని అనుభవించిన నీ వేదననూ, ఆగ్రహాన్ని అర్ధము చేసుకోగలను. కానీ మనము ఈ సమస్యను హృదయముతో కాక మెదడుతో ఆలోచించాలేమో?

పురాణాలలో, ఇతిహాసాలలో ఆడవాళ్ళను అవమానించిన రాక్షసులను, కామాంధులను సంహరించడము చూసాము. వారు సంహరింపబడినందుకు పండగలు కూడా జరుపుకుంటున్నాము. కానీ వారు చనిపోయినంత మాత్రాన, దోషులు శిక్షింపబడినంత మాత్రాన సమాజములో మార్పు వస్తుందా, అన్యాయాలు, అత్యాచారాలు ఆగుతాయా, చట్టాలు, శిక్షలు మనుషుల్లో మార్పులు తెస్తే నేడు ఇలాంటి అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి. నాకెందుకో లేనిపోని గందరగోళము మనమే సృష్టించుకుంటున్నామేమో అనిపిస్తుంది.

ఈ విషయ దృష్ట్యా నిన్ను నీ పరిస్థితిని నీచంగా భావించి నిన్ను వదిలేంత, బాధపెట్టేంతటి కుసంస్కారులము, కరుణా రహితులము కాము. అయితే కన్ను పోయేంతగా కాటుక పెట్టుకోవాల్సిన అవసరముందా ? అంటూ కొంత అసహనంగా, కొంత అనునయంగా పలికాడు రాజీవ్.

పిల్లల అభిప్రాయలు, అత్తగారి మనసు గ్రహించిన సీత భర్త వంక చూసింది. అతడు కళ్ళు మూసుకొని యేదో ఆలోచిస్తున్నాడు. అతడి అంతరంగము క్షోభిస్తున్నదని తెలియచేస్తున్నట్లుగా అతడి గుండె ఎగిసి పడుతున్నది.

ఇంతసేపు నేను రాకపోయేసరికి మీరెంతగా దుఃఖించారో మీముఖాలను బట్టి నేను అర్ధము చేసుకోగలను. ఒకవేళ నిజంగా నాకేదైనా ప్రమాదము జరిగి హాస్పిటల్ పాలు అయితే మీరు మీ సర్వస్వాన్ని ధారపోసి అయినా నన్ను కాపాడుకునేవారు. నాప్రాణాలను కొని పోకుండా ఆ యముడితో పోరాడేవారు. అటువంటిది ఇపుడు మీరు ఇపుడు ఇట్లా మాట్లాడడము నాకు ఆశ్చర్యంగా ఉంది. నీవన్నట్లు నిజంగా నాకు జరిగినది ప్రమాదమే.. ఈ ప్రమాదములో నాకు ప్రాణాలు పోలేదు. కానీ అంతకంటే మించి వ్యక్తిత్వము, వ్యక్తి స్వేచ్చ, ఆత్మాభిమానము దెబ్బతిన్నాయి. నాకు ప్రమాదము జరిగిందనే బాధ కంటే ఇలాంటి కామాంధులను సభ్య సమాజములో స్వేచ్చగా వదిలితే ఇంకెంత మందికి అన్యాయము జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాను. నేను తల్లిని, ఇల్లాలిని, బాధ్యత గల ఉద్యోగినిని…. కానీ.. వాటన్నింటికీ మించి ముందు స్త్రీని… స్త్రీత్వానికి…. స్త్రీ స్వేచ్చకు విఘాతము కలిగితే సహించలేను. బాధ్యత గల పౌరురాలిగా ఆన్యాయాలను కళ్ళు మూసుకొని భరించలేను” అంటూ స్థిరంగా, దృఢంగా పలికింది. మళ్ళీ ఆ ఇంట్లో కాసేపు నిశ్శబ్దము తాండవించింది.

అంతసేపు అంతర్మధనానికి గురిఅయిన రామచంద్రమూర్తి స్థిరమైన నిర్ణయానికి వచ్చిన వాడిలా, గొంతు సవరించుకొని, “సీతా! నీవు నా సహ ధర్మచారిణివి. నీవు ఈకుటుంబానికి ఎంతగా చేసావో నాకు తెలుసు మన ముప్పై సంవత్సరాల వైవాహిక జీవితములో నీవు మాకు ఇవ్వడమే తప్ప, మేము నీకంటూ ఇచ్చింది ఏమీలేదు. ఈ రోజు నీ మనసుకు గాయమై , నీవు కష్టపడుతుంటే పరువు ప్రతిష్టల పేరుతో, భవిష్యత్తుపై భయముతో నిన్ను ఒంటరిగా వదిలివేయడము అమానుషము. ఇంటి పెద్దగా పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యుత్తును గురించి కూడా నేను ఆలోచించాలి. అయితే ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీకూ, నీలా అన్యాయానికి గురవ్వబోయే వాళ్ళకు అన్యాయము చేసిన వాడిన అవుతాను.ఇటువంటి విషయాలలో తెగింపు, మొండి ధైర్యము ఉండాలి. కామాంధుడై ద్రోహాము చేసిన ఇంద్రుడిని వదిలి అహల్యను శపించిన గౌతముడిని కాలేను. నలుగురిలో భార్య అవమానింపబడినా కాలానికి సమస్యను అప్పచెప్పి చేతులు ముడుచుకొని కూర్చున్న ధర్మరాజును కాలేను. నాకు శ్రీ రామ చంద్రుడే ఆదర్శము. తన భార్యను చెరబట్టి బాధించిన రావణాసురుడిని చంపడానికి సముద్రాన్ని కూడా దాటాడు, తన భార్య గౌరవాన్ని నిలబెట్టాడు, అంతటి వాడిని కాకపోయినా ఇలాంటి నీచులను తుదముట్టించడానికి పరువు ప్రతిష్తలు, సంఘ మర్యాదలు అనే సముద్రాన్ని దాటడానికి ధైర్యము అనే సేతువును కడతాను. దుర్మార్గులు శిక్షించబడే వరకు పోరాడుతాను. పద పోలీస్ స్టేషన్ కు వెళదాము” అంటూ ఆలోచన తో కూడిన ఆవేశముతో సోఫా మీద నుండి లేచి వచ్చి భార్యను దగ్గరకు తీసుకున్నాడు.

తను ఎంతో గౌరవించే భర్త, ఇలా అనేసరికి సంతోషముతో, మరింత గౌరవాదరాలతో అతడి భుజము పై తలను వాల్చింది.

“నాన్నా! మీ పెంపకము, మీరు మాకిచ్చిన సంస్కారము మాకు సభ్యతను, బాధ్యతను నేర్పాయి. కొన్ని క్షణాలు తడబడ్డాను. మనసూ, మెదడూ అంటూ తప్పుచేసిన వారిని వదిలి , తల్లిని శిక్షంచబూనిన పరశురాముడినయ్యాను.. మదించిన వారిని దండించి రక్తపుటేరులు పారించిన పరశురాముని కాలేకపోయాను. కానీ నేను రియలైజ్ అయ్యాను. తప్పు తెలుసుకున్నాను. దోషులను ఎప్పటికప్పుడు ఏరిపారేయాల్సి ఉంటుంది అని గ్రహించలేకపోయాను. పంటకు పురుగు పట్టినప్పుడల్లా మందు కొట్టాల్సిందే. ఇంతకు ముందు కొడితే పురుగు పోలేదు. మళ్ళీ కొత్త పురుగు వచ్చింది కదా అనుకోకూడదు. మళ్ళీ మళ్ళీ కొట్టాల్సిందే. పంటనాశనము చేసి సౌభాగ్యాన్ని హరించే చీడలను నాశనము చేయడములో యే మాత్రము జాలీ దయా ఉండాల్సిన అవసరము లేదు. అమ్మా! నన్ను క్షమించు. భీరువులా మాట్లాడాను. పదండి నేనూ వస్తాను. మీ వెంటే నేను. అన్నాడు ఆవేశంగా రాజీవ్.
“అమ్మా! నా జీవితమును గురించి ఆలోచించాను తప్ప స్త్రీ జాతికిది అవమానమని, దీనికి ఎక్కడో ఒక చోట ప్రతిఘటన ఉండాలని నేను ఆలోచించలేదు. నీలాంటి్ తల్లికి బిడ్డనైనందుకు గర్వపడుతున్నాను. నేను నీపోరాటములో భాగాన్ని అవుతాను” అన్నది అపరాజిత.

“అవునర్రా! పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అంటూ, భగవంతుడు, ఆధ్యాత్మిక చింతన అంటూ ఇన్ని నాళ్ళు బ్రతికిననేను నిజమైన భగవత్తత్వాన్ని అర్ధము చేసుకోలేదు. వ్యవస్థ పతనమైనపుడల్లా, సజ్జనుల స్వేచ్చా స్వాతంత్రాలకు విఘాతము కలిగినపుడల్లా భగవంతుడు యేదో ఒక రూపములో అవతరించి దుష్ట శిక్షణ చేస్తూనే ఉన్నాడు. ఇదిగో సీత రూపములో ఆ దేవుడే దుర్మార్గులను శిక్షించాలనుకుంటున్నాడు కాబోలు. సీతా! అలా మట్లాడినందుకు ఏమనుకోకు తల్లీ. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఎపుడూ సత్సంగంగా మార్చాలన్న నీ ఆలోచనలకు మన ఇంటి నుండి యే బీజవ్యాపనము చేద్దాము. నేనూ వస్తాను పద నీకు న్యాయము జరిగేంత వరకు ఎన్ని కోర్టుమెట్లు ఎక్కడానికైనా నేను సిద్ధము” అని పలికింది అన్నపూర్ణమ్మ.

ఆ కుటుంబ సభ్యులు తమ కారులో పరిచయస్తుడైన సిటీ పోలీస్ కమీషనర్ ఇంటి వైపు ప్రయాణించసాగారు. ఆ యింటి గేటు పక్కన గోడపై వేళ్ళాడుతున్న ” సత్సంగ్ ” బోర్డ్ పైన గల బల్బు, సద్భావ సత్సంగ హృదయులైన వారి వంకే, – “సత్సంగము అంటే నలుగురు ఒక్కచోట కూర్చోని ఉన్నతంగా కాలక్షేపము చేయడమే కాక, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి నలుగురు కలవాలని సూచిస్తున్నట్లుగా” – చూస్తూ, దేదీప్యమానంగా వెలుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked