సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

అన్నమయ్య ఈ కీర్తనలో గాలి వీచే పద్ధతులను, మనకు ఏ ఏ ప్రదేశాలలో వీచేగాలి యింపుగా ఉంటుందో ఆ అనుభవాలను చెబుతున్నారు. మనం గమనించినట్లైతే వాస్తుశాస్త్రం ప్రకారం వీచే గాలి ఆధారంగా గాలి ఏ వైపు నుంచి ఇంట్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందో తూర్పు నుంచి వచ్చే గాలి శరీరాన్ని తాకిన వెంటనే మధురానుభూతి కలుగుతుంది. అందుకే తూర్పు దిక్కున అధికంగా ద్వారాలు, కిటికీలు ఏర్పాటు చేయాలి అనేది వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే తూర్పు నుంచి వీచే గాలి వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. అందుకే తూర్పున నీటిని అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరం అన్నారు. పశ్చిమ దిశ నుంచి వీచు గాలి శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అందుకే పశ్చిమాన కిటికీల సంఖ్య, ద్వారాల సంఖ్యను కుదించారు. ఉత్తరం నుంచి వీచే గాలి చల్లగా ఉంటుంది. ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని తాకినప్పుడు శరీరపుష్టిని కలుగజేస్తుంది. అందుకే ఉత్తరంలో ఎక్కువగా కిటికీలు, ద్వారాలు ఉండాలని సూచించారు. దక్షిణం నుంచి వీచే గాలి వాత, పిత్త, కఫ దోషాలను హరించివేస్తోంది. దక్షిణం నుంచి వీచే గాలి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నేటి ఆధునిక వాస్తు సిద్ధాంతులు పడకగదులు, మూలలను ఆధారము చేసుకొని గృహ నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. ఇది శాస్త్ర విరుద్ధం. పడక గదిలో మూలకు మంచాలు వేయడం సరికాదు. ఆగ్నేయం నుంచి వీచే గాలి జిగటగా అంటే బంకగా ఉంటుంది. వంటగదిలో ఎంత ఆధునిక పరికరాలను ఉపయోగించి వంట చేసినా వారి శరీరం చెమటగా, బంకగా ఉంటుంది. అందుకే స్త్రీలు ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో వంట చేసిన తర్వాత స్నానం చేయాలంటారు. ఆగ్నేయం నుంచి వీచే గాలి నేత్రాలకు మంచిది. రోజు 10 నిమిషాలు ఆగ్నేయం దిశ నుంచి వీచే గాలిని ఆస్వాదిస్తే కంటి సంబంధిత జబ్బులు దూరం అవుతాయి. నైరుతి గాలి తాపాన్ని, కోపాన్ని, రోగాలను కలుగజేస్తుంది. కాబట్టి నైరుతి మూలలో కిటికీలు ఉంచకూడదు. వాయువ్య గాలి దాహాన్ని కలుగజేస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఉంచమన్నారు. అలాగే వాయువ్య గాలి పైత్యాన్ని తగ్గిస్తుంది. శరీరం మీద దురదలు ఉన్నవారు వాయవ్య గాలిని ఆస్వాదిస్తే ఫలితం ఉంటుంది. ఈశాన్య గాలి మధురంగా ఉంటుంది కానీ నేత్ర రోగాలను కలుగజేస్తుంది. ఈవిధంగా ఫలితాలు ఉంటాయి. అన్నమయ్య గాలి వర్ణలను ఇప్పుడు చూద్దాం.

కీర్తన:
పల్లవి: వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి ॥పల్లవి॥
చ.1. పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
నిండుఁ గొలఁకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
యెండమావులఁ బోలితేలయ్య గాలి ॥ వెలినుండి॥
చ.2. కొమ్మావిచవికెలోఁ గొలువుండు గాలి
తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి ॥ వెలినుండి॥
చ.3. తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
విరహాతురులనింత వేఁచకువె గాలి ` ॥ వెలినుండి॥
(రాగం: కాంభోది, రేకు 70-4; సం. 5-232)
విశ్లేషణ:
పల్లవి: వెలినుండి లోనుండి వెలితిగాకుండి
వెలి లోను పలుమారు వెదకేవె గాలి
ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బయట నుండి లోపలికీ, లోపలినుండి బయటకీ వెలిలోనూ పలుమార్లు వెదికే గాలిని వర్ణిస్తున్నాడు పల్లవిలో అన్నమయ్య

చ.1. పండువెన్నెలలకునుఁ బ్రాణమగు గాలి
నిండుఁగొలఁకులలోన నెలకొన్న గాలి
బొండుమల్లె లతావిఁ బొడవైన గాలి
యెండమావులఁ బోలితేలయ్య గాలి
పండు వెన్నెలకి ప్రాణం ఈ గాలి అంటున్నాడు. నిండు కొలనులలో ఉన్నగాలి, బొండు మల్లెల సువాసన ఎంత దూరం వ్యాపిస్తోందో అంతవరకూ మనం ఈ గాలి కొలవాలట. ఎండమావుల లాగా తేలిపోయేగాలి అంటూ ఈ ప్రకృతిలో ఉండే గాలిని రకరకాలుగా వర్ణిస్తున్నాడు.
చ.2. కొమ్మావి చవికెలోఁ గొలువుండు గాలి
తమ్మికుడుకులఁ దేనె దాగేటి గాలి
యిమ్మయిన చలువలకిరవైన గాలి
కుమ్మరింపుచు వేఁడి గురిసేవె గాలి
మామిడి చెట్ల కొమ్మలతో వేసిన మండపాల్లో, పందిరులలో కొలువుండే గాలి, తామర పూలపై తేనె తాగుతూ తిరిగేటి ఈ గాలి, శీతోపచారంచేసే ఇంపైన గాలి, అప్పుడప్పుడు ఈ గాలి వేడిగాలి గూడా కుమ్మరిస్తుందట.
చ.3. తిరువేంకటాదిపైఁ దిరమైన గాలి
సురతాంతముల జనులఁ జొక్కించు గాలి
తొరలి పయ్యదలలోఁ దూరేటి గాలి
విరహాతురులనింత వేఁచకువె గాలి
తిరుమల కొండలపై తిరిగుతూ పారాడే ఈ గాలి జనులను మేను చల్లగా తాకుతుందట. ఆడవాళ్ళ పైటలలో దూరే గాలి విరహాతరులను మహా వేధిస్తుందట. ఎంత చక్కటి ఉపమాలంకారాలు? ఎంత గొప్ప భావనలు? గేయాలు రాసే వారు ఎవరూ, చలనచిత్రగీతాలను రాసేవారు, ఈ అన్నమయ్య కీర్తనలను ఆస్వాదించక పోవడం ఆయన ఊహలను అందుకోకపోవడం గుర్తించకపోవడం కించిత్ బాధాకరమైన విషయమే!

ముఖ్య అర్ధములు:
వెలి = బయట; లోనుండి = శరీరంలోపలనుండి; కొలకులు = కొలనువంటి ప్రదేశం; తావి = వాసన, సుగంధము; పొడవైన గాలి = ఎక్కువదూరం వ్యాపించే గాలి; కొమ్మవి చవికె = మామిడి చెట్ల మందిరము, పందిరి వంటి ప్రాంతాలు. తమ్మికుడుకులు = తామరపూలు; చలువలకిరవైన గాలి = శైత్యోపచారం చేసే విధంగా చల్లగా ఉండే గాలి; కుమ్మరింపుచు = ఒక్కసారిగా వీచే.

-0o0-

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked