సారస్వతం

నాడీజంఘుడు

-శారదాప్రసాద్

ధర్మరాజు ” పితామహా ! రాజుకు కావలసిన వాళ్ళు, అక్కరలేని వాళ్ళు ఎవరు ? వివరించండి ” అని అడిగాడు. భీష్ముడు ” ధర్మనందనా ! ఓర్పుగలవారు, ధర్మపరులు, సత్యంపలికే వారు, చంచల బుద్ధిలేని వారు, మదము, కోపం, లోభం లేనివారు, చతురతగా మాట్లాడి కార్యమును సాధించే వారు, తమ రాజుకు సకలసంపదలు చేకూర్చుతుంటారు. వీళ్ళంతా రాజుకు కావలసిన వాళ్ళు. క్రూరుడు, లోభి, ఆశపోతు, చాడీలు చెప్పేగుణం కలవాడు, మందబుద్ధులు, చేసినమేలు మరిచేవారు, అబద్ధాలు చెప్పేవారు, ఒకరితో నిందింపబడిన వారు, పిరికివారు, ధైర్యం లేనివారు, అవినీతిపరులు, దురలవాట్లకు బానిస అయినవారు రాజుకు నష్టం కలిగిస్తారు. వీరు అందరిలో చేసినమేలు మరిచేవారు పరమనీచులు. ఈ సందర్భంలో నీకు ఒక కథ చెప్తాను,జాగ్రత్తగా వినుము! ఒక బ్రాహ్మణుడు తన కులధర్మాన్ని వదిలి ఒక బోయవనితను వివాహం చేసుకున్నాడు. బోయవాళ్ళతో చేరి వేటసాగించి మాంసంతినడం లాంటి భోగములు అనుభవించ సాగాడు. మరింత ధనంసంపాదించవలెనన్న కోరికతో వైశ్యులతోచేరి పయనించసాగాడు. ఇంతలో ఒక ఏనుగు వారిని తరిమింది. వర్తకులంతా పారిపోయారు. ఆ బ్రాహ్మణుడు కూడా పరిగెత్తి ఒక మర్రిచెట్టు కిందకు చేరుకున్నాడు. ఆ చెట్టుకింద నాడీజంఘుడు అనే కొంగ నివసిస్తూ ఉంది. ఆ కొంగ బ్రాహ్మణుడితో ” భూసురోత్తమా ! ఎక్కడి నుండి వస్తున్నారు. ఏ పనిమీద పోతున్నారు ” అని అడిగాడు. అతడు “నేను గౌతముడి కుమారుడను నేను బ్రాహ్మణోచితమైన వేదాధ్యయనం చెయ్యకుండా వ్యామోహంతో ఒక బోయవనితను వివాహం చేసుకుని జీవిస్తున్నాను. అధికంగా ధనం సంపాదించాలని వర్తకులతో కలిసి పోతున్న సమయంలో ఏనుగు చేత తరమబడి ఈ చెట్టుకింద చేరాను ” అని చెప్పాడు. నాడీజంఘుడు ” బ్రాహ్మణోత్తమా ! బాధపడకు నేను నీ దారిద్యాన్ని పోగొట్టగలను. ముందు నా ఆతిధ్యం నీవు స్వీకరించు ” అని పక్కనే ఉన్న నదిలోనుండి చేపలు పట్టుకు వచ్చి కాల్చి పెట్టింది. బ్రాహ్మణుడికి అలవాటైన ఆహారం కనుక వాటిని తిని తన ఆకలి తీర్చుకున్నాడు. అప్పుడు నాడీజంఘుడు ” మంచి స్నేహితుడు, వెండి, బంగారం, మంచి బుద్ధి ఈ నాలుగూ దారిద్యమును పోగొడతాయి. ఇక్కడకు మూడు యోజనముల దూరంలో మధువ్రజపురం ఉంది. అక్కడ నా మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు. అతడి వద్దకు వెళ్ళి నేను పంపానని చెప్పు అతడు నీకు కావలసిన బంగారం, రత్నములు ఇస్తాడు ” అని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు విరూపాక్షుడి వద్దకు వెళ్ళి తనను నాడీజంఘుడు పంపాడని చెప్పి తనకు ధనసంపద కావాలని అడిగాడు. అతడిని చూడగానే అతడు నీచుడని గ్రహించిన విరూపాక్షుడు ” మిత్రమా ! నీవు ఎవరవు నీకుల మేమిటి ? ” అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తనను గురించి చెప్పుకున్నాడు. విరూపాక్షుడు మనసులో ” ఇతడు ఎలాంటి వాడైతే నా కేమి ఇతడు నాడీజంఘుని మిత్రుడు అదే ఇతడి అర్హత. ఇతడికి కావలసిన ధనం ఇస్తాను. ” అని అనుకున్నాడు. ఆ మరునాడు కార్తిక పౌర్ణమి. వేల కొలది బ్రాహ్మణులు విరూపాక్షుడి వద్దకు వచ్చారు. విరూపాక్షుడు వారికి భోజనం పెట్టి బంగారం, వెండి కానుకలు ఇచ్చి పంపాడు. వారితో చేర్చి ఆ బ్రాహ్మణుడికి కూడా భోజనం పెట్టి ఎన్నోకానుకలు ఇచ్చాడు. ఆ కానుకలను మోయ లేక మోస్తూ అతడు నాడీజంఘుడి వద్దకు వచ్చాడు. అతడి మాటలు విని నాడీజంఘుడు తన మాట మన్నించి బ్రాహ్మణుడి దారిద్ర్యాన్ని పోగొట్టిన విరూపాక్షుడిని తలచుకుని సంతోషించాడు.

ఆ రాత్రికి బ్రాహ్మణుడు అక్కడే నిదురించాడు. సగంరాత్రిలో బ్రాహ్మణుడు తనలో ” నా వద్ద ధనం ఉంది కానీ రేపటికి ఆహారం లేదు ” అనుకుని ఒక కర్ర తీసుకుని అక్కడే నిద్రిస్తున్న నాడీజంఘుడి తల పగుల కొట్టి ముక్కలుగా నరికి మూట కట్టాడు. ఇంతలో తెల్లవారింది విరూపాక్షుడి మనసులో కలత రేగింది. ప్రతి రోజూ తన వద్దకు వచ్చే నాడీజంఘుడు ఈ రోజు రాలేదు ఆ నీచుడైన బ్రాహ్మణుడు నాడీజంఘుడికి ఏదైనా అపకారం తలపెట్టాడేమో ? అనుకుని నాడీజంఘుడి వద్దకు భటులను పంపాడు. ఆ భటులు అడవిలో ఉన్న బ్రాహ్మణుడిని అతడి చేతిలోని మాంసపు మూటను చూసారు. వారు ఆ బ్రాహ్మణుడిని పట్టుకుని విరూపాక్షుడి ముందు నిలబెట్టారు. విరూపాక్షుడు మూటలో ఉన్నది నాడీజంఘుడి శరీరానికి చెందినవి అని తెలుసుకుని కోపించి చేసిన మేలు మరచిన ఈ విశ్వాసఘాతకుడిని భక్షించండి ” అని ఆజ్ఞాపించాడు. భటులు ” అయ్యా ! ఈ పాపాత్ముడిని చంపి తిన్న మాకు పాపం చుట్టు కుంటుంది” అన్నారు. విరూపాక్షుడు ” తింటే తినండి లేకున్న లేదు చంపిపారేయండి ” అన్నాడు. భటులు ఆ బ్రాహ్మణుడిని కొట్టిచంపి శరీరాన్ని పారవేశారు. అతడి మాంసం ముట్టడానికి కుక్కలు కూడా దగ్గరకు రాలేదు. విరూపాక్షుడు నాడీజంఘుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇంతలో అక్కడకు వచ్చిన ఇంద్రుడిని చూచి విరూపాక్షుడు నాడీజంఘుడిని బ్రతికించమని కోరాడు. ఇంద్రుడు
” విరూపాక్షా ! నాడీజంఘుడు నీకే కాదు బ్రహ్మదేవుడికి కూడా స్నేహితుడే ! నీవే కాదు బ్రహ్మదేవుడు కూదా అతడి కొరకు విచారిస్తున్నాడు. అటుచూడు నాడీజంఘుడి చితాభస్మం మీద ఒక ఆవు తన దూడకు పాలను ఇస్తుంది. అప్పుడు చిందిన పాలనే అమృతధారలకు నాడీజంఘుడు తిరిగి జీవించాడు చూడు” అన్నాడు. ఇంతలో అక్కడకు వచ్చిన నాడీజంఘుడు చావు బ్రతుకుల్లో ఉన్న బ్రాహ్మణుడిని చూసి అతడిని విడిపించమని విరూపాక్షుడిని కోరాడు. అతడిని విడిచిపెట్టి అతడి బంగారాన్ని కానుకలను అతడికి ఇచ్చి పంపాడు విరూపాక్షుడు. కనుక బ్రహ్మహత్య చేసిన వాడికైనా విముక్తి ఉంటుంది కాని మిత్రుడికి చేసే విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు. మంచిమిత్రుడు ఈ లోకానికే కాదు పరలోకానికి కూడా సహకరిస్తాడు. ధనము, మిత్రులలో మిత్రుడే గొప్పవాడు. కనుక ఉత్తమ గుణసంపన్నుడు, ఉత్తమకులజుడైన మిత్రుడు అన్ని విధాలా శ్రేష్టుడు ” అని చెప్పాడు.పరధర్మ వ్యామోహంలో పడి, స్వధర్మాన్ని విడిచి ప్రవర్తించటం మంచిది కాదు!ఇందులో తన ధర్మాన్ని వదలి, అన్ని హీనమైన కార్యాలను చేసాడు ఆ కుల బ్రాహ్మణుడు!! హీన కార్యాలు చేసేవాడికి ఇతర అవలక్షణాలు కూడా చాలా ఉంటాయి!వాటిలో ముఖ్యమైనవి–హీన గుణం కల వనితలతో సంపర్కం,బ్రాహ్మణుడి లక్షణానికి విరుద్ధమైన వ్యాపారం చేయటం,జూదాలు ఆడటం ,మత్తు పదార్ధాలను సేవించటం లాంటి ఎన్నో దుర్గుణాలు ఉంటాయి!అటువంటివారు పరస్త్రీ వ్యామోహంతో క్షణికానందంకోసం భార్యను కూడా హతమారుస్తారు! ప్రియురాలి సంతానం అడ్డువస్తారేమోనని వారిని కూడా చంపటం నేటికీ కూడా మనం చూస్తున్నాం! వీటన్నిటికీ కారణం క్షణికానందమే! ఉత్తమ కులంలో పుట్టిన బ్రాహ్మణుడికి కూడా హీనజన సాంగత్యం వలన ఇటువంటి గుణాలు అబ్బవచ్చు!వీరినే కుల భ్రష్టులు అనొచ్చు! ఎంత మంచి పరిసరాల్లో ఉంచినా, వీరికి సద్బుద్ధి రాదు!ఇటువంటివారు ఆఖరికి సహాయం చేసిన స్నేహితుడిని కూడా చంపటానికి వెనుకాడరు! అది వారి స్వభావం!అట్టి వారిని చేరదీస్తే, మనకు కూడా ప్రమాదం సంభవించవచ్చు! ఇదే తప్పును నాడీజంఘుడు చేసాడు! గుణ విచక్షణ చేయకుండా, అల్పునికి సహాయం చేస్తే,వాడు మన ప్రాణం మీదికి తెస్తాడు.ఇవన్నీ ఎవరు చెప్పినా వారు మారరు !అది నాడీజంఘుడు లాంటి వారి స్వభావం!తనను చంపిన బ్రాహ్మణుడిని కూడా బతికించమని రాజును వేడుకున్నాడు.ఆ బ్రాహ్మణుడిలో ఏదైనా మార్పు రావచ్చనేమోనని అతని తాపత్రయం కావచ్చునేమో!!వీటినే reformative punishments అని కూడా అనవచ్చునేమో! వాళ్లలో మార్పురావటానికి అవకాశం కల్పించటం గొప్ప సంస్కరణ!నేటి సమాజానికి సరిపోయే ఇటువంటి కధలు భారతంలో కోకొల్లలు!నాడీజంఘుడు లాంటి వారి స్వభావాన్ని, సంస్కారాన్ని,సంస్కరణాన్ని వేమన గారు ఈ తేట తెలుగు పద్యంలో ఎంత గొప్పగా చెప్పాడో చూడండి!

Our culture and dignity lie not in what we do, but what we understand. –Vivekananda

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కినేని గీడు సేయరాదు
పొసఁగ మేలుచేసి పొమ్మనుటే చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

​(​చంపదగిన శత్రువు అయినా చేతికి దొరికినపుడు వీలైతే క్షమించి వదిలిపెట్టాలి. ఇంకా వీలైతే ఏదైనా సహాయం చేసి పంపించాలి. ఎందువల్లనంటే శత్రువు లేకుండా చేసుకోవాలి అంటే మార్గం శత్రువును చంపడం కాదు ఆ మనిషిలోని శతృత్వపు భావాన్ని చంపడం. అది ప్రేమ, సహాయాలతోనే సాధ్యమవుతుంది. అని వేమన భావం. )

శుభం భూయాత్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on నాడీజంఘుడు

శారదయామిని said : Guest 5 years ago

ఇటువంటి నీటి కధలను పిల్లలకు చెప్పాలి!

  • చెన్నై