సారస్వతం

భారతీయ – సాహిత్యం – ఆధ్యాత్మికత

[ – కల్లూరి సత్యరామ ప్రసాద్ (హైదరాబాద్)
చిన్మయ మిషన్; కొత్తపట్నం – 523 286 (ప్రకాశం జిల్లా) ఆం.ప్ర.
చరవాణి -> 919493403972 ]

“సహిత” అనే మాటనొక విశేషణపదంగా తీసుకుంటే – దానిని

1) స+హిత = “హితము (శ్రేయస్సు)తో కూడిన” లేదా
2) “కలిసి ఉన్న” (సంస్కృతంలోని ‘సహ’ అనే మాట దీనికి ప్రాతిపదిక కావచ్చునేమో?)

– అనే అర్థాలున్న మాటగా మనం భావించవచ్చు.

కాబట్టేనేమో – దీనిలోనుండి వచ్చిన “సాహిత్యం” అనే మాటకు 1) “అర్థగౌరవం/చమత్కారంతో కూడిన రచన (rhetoric composition); 2) కూడిక/కలయిక (association/fellowship) అనే నిఘంటు-నిర్వచనాలున్నాయి.

తరచి చూస్తే – నిజానికి “సాహిత్య”మనే మాటకు “పై రెండర్థాల కలయికే” సరైన నిర్వచనమేమోననిపించక మానదు!

అయితే, మన వ్యవహారంలో “సాహిత్యమంటే – ఒక ప్రత్యేక అంశంపైన చేయబడిన రచన” అని చెప్పుకుంటున్నాం కదా!

వివిధాంశాలపైన ఆధారపడి ఈ సాహిత్యం రకరకాలుగా ఉండచ్చు –

“పద్యసాహిత్యం; వచనసాహిత్యం; కీర్తనాసాహిత్యం; శతకసాహిత్యం; దళితసాహిత్యం; విప్లవసాహిత్యం; నవలాసాహిత్యం; సినిమా-సాహిత్యం; ‘శవ-సాహిత్యం’….” ఇలా!

ఇక – “అధి+ఆత్మ = “అధ్యాత్మ – ఆత్మకు (నిజమైన తనకు)/ పరమాత్మకు సంబంధించినది”; దీనినుండి వచ్చిన మాటే కదా – “ఆధ్యాత్మికత” అనేది!

అంటే – “నేను పైకి నేనుగా కనిపించే ఈ స్థూలశరీరాన్ని మాత్రమే కాను; నిజానికి ‘దానికి మించిన ఏదో నేనంటే!”

“అలాగే, నేను పూజించే ‘దేవుడో, విగ్రహమో’ – కేవలం ఒక స్వరూపం మాత్రమే కాదు; దాంట్లో కూడా ‘అనిర్వచనీయమైనదేదో’ ఉంది!”

అలాంటప్పుడు “నాకూ, ఈ దైవానికీ, అంతేగాక ఈ ప్రపంచానికీ” ఏదో సంబంధం ఉండి ఉండాలి!” అనే ఆలోచనావిధానమే ‘ఆధ్యాత్మికత’ అని అనుకుంటూ, ఇక ముందుకు సాగుదాం.

[పనిలో పనిగా, “వేదాంతం” అనే మాటకొస్తే – ఆ మాట కొందరికి పైకి భయపెట్టేటట్లనిపించినా, టూకీగా దాన్ని “వేద+అంతం” – అనగా “జ్ఞానానికి ”చిటారుకొమ్మ అయినది లేదా వేదాలకు సారమైనది” అని చెప్పుకోవచ్చు – దానినే ‘ఆత్మ-జ్ఞాన’మని కూడా అనచ్చు.

సాధారణంగా ‘వేదాంతాన్ని’ ఆత్మ-జ్ఞానాన్నిచ్చే ‘ఉపనిషత్తులకు’ పర్యాయపదంగా వాడతారు.]

ఎప్పుడూ మనిషికి ఎదురుగా రెండు మార్గాలలో ఎంపిక ఉంటుంది – “ప్రేయస్సు; శ్రేయస్సు” అని.

మొదటిది పైపైకి మనకు ప్రియంగా కనిపించేది; అది మన ఇంద్రియాలకూ, మనస్సుకూ తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే కలిగించేది. కానీ, ఈ మార్గంలో పయనిస్తే చివరికి మిగిలేది నిరాశా, దుఃఖమూ మాత్రమే!

అలా కాకుండా – రెండవదైన ‘శ్రేయస్సు’ ఒక్కోసారి పైకి చేదుగా అనిపించినా, నిజానికి అదే మనకు మంచిని కలుగజేసేది; శాశ్వత-శాంతిని కలగజేసేదీనూ!

‘హితం’ అనే మాట ‘శ్రేయస్సు’కు పర్యాయపదమే! ‘స-హిత’ అనే మాటను మొదట్లోనే చూచాం కదా!

అందుకనేనేమో – నన్నయగారి మాటగా చెప్పబడుతున్న “విశ్వ-శ్రేయః కావ్యమ్” అనే వాక్యంలో – కవి “తనదైన అనుభూతి తనది గాన” ఏ రచననైనా చేసినా, తాను పొందిన అనుభూతిని, తద్వారా ఆ రచనయొక్క ప్రయోజనాన్నీ ఇతరులు కూడా పొందాలనే సదుద్దేశంతోనే తన రచనను చేస్తాడని సూచించబడింది!

ఇదే అభిప్రాయాన్ని నన్నయగారే “సారమతిం గవీంద్రులు…” అనే పద్యంలో చిట్టచివరి మాటైన “జగద్ధితంబుగన్ (ప్రపంచానికి మంచి కలుగజేయడంకోసం)” అనే మాటలో ప్రకటించాడు కదా! (1-1-26)

ఈ శ్రేయోమార్గంలో పయనించినవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది.-

ఎందుకంటే శ్రేయోమార్గం –

1) పనిచేసేటప్పుడు ఈశ్వరార్పణబుద్ధికి (అంటే “ఏ పనినైనా చేయించేది భగవంతుడే; నేను ఆయన చేతిలోని పనిముట్టును మాత్రమే!” అనే దృక్పథం)

2) ఫలితాన్ని స్వీకరించేవేళలో ప్రసాదబుద్ధికి (ఫలితం ఆ క్షణంలో అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా ‘అనిపించినా’, ‘అది దేవుడిచ్చినదే’ అనే సంతృప్తిని కలిగే బుద్ధికి) ” దారితీస్తుంది! ఇది మొదటి మెట్టు.

తదుపరి సాధకుడికి గురూపదేశంద్వారా జ్ఞానం లభించి, ఆ జ్ఞానంలో స్థితుడై, ఆత్మ-జ్ఞానాన్ని అలవరచుకుంటాడు.

ఇక – ఈ “సాహిత్యమూ, ఆధ్యాత్మికతా” అనేవి వేటికి దారితీస్తాయో చూద్దాం!

‘కవియొక్క రచన’ తనదైన శైలితో, అనుభూతితో, తగిన వివరాలతో నలుగురిలోకీ పోతుంది – అంటే సమాజంలోనికి అది సాహిత్యంగా “ప్రవహిస్తుంది.”

తాను ఏ అంశంపైన కవిత్వం వ్రాసినా, అది అందరి శ్రేయస్సుకోసమేననే నమ్మకంతోనే ఆ పని చేస్తాడు నిజమైన ఏ కవైనా – అతడు ఆస్తికుడైనా, నాస్తికుడైనా సరే!

దీనికి ప్రతిగా – ఆధ్యాత్మికతతో కూడిన ఆలోచనావిధానం “నేను గమనిస్తున్నదానికంతటికీ అతీతమైనదేదో ఈ విశ్వాన్ని నడుపుతోంది; నాతో పాటుగా ఈ మొత్తం సమాజమంతా/విశ్వమంతా ‘ఒక్కటే సూత్రంపైన’ ఆధారపడి ఉంది!” అన్నట్లుగా మనకు జ్ఞాపకంచేస్తూనే ఉంటుంది!

దానినే భగవంతుడంటారు కొందరు; “ఇదేమీ కాదు, అంతా తనంతట తానే నడిచిపోతోంది!” అంటారు/అనుకుంటారు మరికొందరు!

మన వ్యవహారంలోని ‘నామ-రూపాలు (మనుషుల, వస్తువుల, మనం కొలిచే దేవతలవన్నీ కూడా మనకు తెలిసో, తెలియకుండానో)’ అనుక్షణమూ మారతాయి కాబట్టి, ‘ఈ మారుతున్నదానికి మారనిదొక్కటే ఆధారం’ అనే సారాంశం కూడా సహజంగా మనకు బోధపడుతుంది కదా!

దీన్నే “పారమార్థిక-సత్యం (Absolute Reality)” అంటారు ఆధ్యాత్మికమైన ఆలోచనావిధానం కలిగినవాళ్ళు. ఇంతేగాక, మన దైనందిన వ్యవహారాల్లో మనకు కనబడేది వ్యావహారిక-సత్యం (transactional reality)” అనబడుతోంది;

దీనికంటే ఒక మెట్టు కింద ఉండే సత్యాన్ని “ప్రాతిభాసిక-సత్యమనీ అంటారు (apparent reality).” దీనికి ఉదాహరణలు: “కలలో కనబడే సింహం, తాడును పామనుకోవడం”వంటివి. అసలు నిజం తెలిసిన వెంటనే ఈ ‘ప్రాతిభాసిక-సత్యం’ నశించిపోతుంది; వ్యావహారికసత్యంలోకి వచ్చేస్తాం అప్పుడు!

ఇదే తర్కాన్ని మరికొంత పొడిగిస్తే – “పారమార్థిక-సత్యం (Absolute Reality) బోధపడిన వెంటనే వ్యావహారిక-సత్యం (మనం మెలకువగా ఉన్నపుడు మనకు గోచరించే సత్యం – transactional reality) – ‘ఇక చెల్ల’దని ఆధ్యాత్మిక-వాదం!

{ఇక, అద్వైతమైతే – “నిజానికి ఉన్నది ఒక్కటే – రెండవదనేదే లేదు!” అని, మనలను మరొక మెట్టు పైకి తీసుకుపోతుంది!}

ఈ ‘పారమార్థిక-సత్యాన్నే’ “బ్రహ్మము, పరబ్రహ్మము, పరమాత్మ, పరతత్త్వము”వంటి రకరకాలైన పేర్లతో పిలుస్తారు. “ఇది మాత్రమే సత్యం, “మనం చూచే ఈ జగత్తు, అందులో ‘జరుగుతున్నట్లుగా మనకనిపించే వ్యవహారాలూ’ మాత్రం మిథ్యే!” అనే విషయాన్ని తెలపడమే ఆధ్యాత్మికతయొక్క పరమావధి.

మరి, ప్రతి వ్యక్తిలోనూ ఇలాంటి ‘ఎరుక’ కలిగితే మొత్తం సమాజం కూడా ‘పైకి ఎదగడానికి’ అవకాశముంది!

తిరిగి, ఇందులో ప్రధానంగా మన “భారతీయ-ఆస్తిక-సాహిత్యం”గురించి మాత్రమే నేనిక్కడ క్లుప్తంగా చెప్పదలచుకున్నాను.

ఈ ‘సాహిత్యం’ అనేది ‘మొత్తంగా ఒక పెద్ద కావ్యమే’ కావచ్చు, రామాయణకథాంతర్గతమైన ‘ఆదిత్యహృదయం’ లేదా భాగవతాంతర్గతమైన ‘గజేంద్రమోక్ష-ఘట్టం’వంటి ఒక భాగం కావచ్చు; ఒక స్తోత్రం కావచ్చు; కొన్ని కీర్తనలు కావచ్చు; “విష్ణుసహస్ర-నామావళి”వంటిది కావచ్చు; ఒక హితబోధవంటిదానితో కూడిన ‘ఖండకావ్యం’ కూడా కావచ్చు!

వీటన్నిట్లోనూ నేను గమనించినదేమిటంటే – ఎక్కడో ఒకచోట కవి తన రచనలో “వ్యావహారికసత్యం (transactional reality) నుండి మనలను పారమార్థిక-సత్యందాకా (Absolute Reality)” తీసుకెళ్ళి, ఎక్కడో దానిని “స్పృశింపజేస్తాడు.” ఆ తరవాత తిరిగి వ్యవహారంలోకి వస్తాం – ఫలశ్రుతిని విన్నాకనో, చివరిలోనో, మధ్యలోనో – ఎక్కడో ఒక చోట!

0) ఇక, ఆస్తికుడైన సగటు పాఠకుడు సాధారణంగా చేసేది – విగ్రహ/మూర్తిపూజే కదా! దీనిని ‘సగుణ-సాకార-ఆరాధన’ అందాం. {“స-గుణ” అంటే లక్షణాలతో (attributes) కూడిన; ‘సాకార’ (స+ఆకార) అంటే “ఒక ఆకృతి కలిగిన”} ఎందుకంటే ఇలా పూజింపబడుతున్న దేవుడికి/దేవతలకు ఆకారమూ ఉంటుంది; ‘రక్షించే లేదా శిక్షించే శక్తీ’ ఉంటుంది.

“విష్ణు-సహస్రనామ-స్తోత్రాన్నే” ఒక ఉదాహరణగా తీసుకుంటే – “కేశవ, ధన్వీ, వనమాలీ, సువ్రత” మొదలైన నామాలు “సగుణ-సాకార-“తత్త్వాన్ని సూచిస్తాయి.

{అప్రస్తుతం అని కొందరికి అనిపించినా, ఇక్కడ మరొక ముఖ్యవిషయం.

కొందరైతే ఏకంగా “విగ్రహారాధనే త”ప్పంటారు. కానీ, దానిని సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మే సమర్థించాడు – గీత 12వ అధ్యాయం 5వ శ్లోకంలో – “అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే!” అంటూ.

అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన చెప్పేదేమిటంటే – “నిరాకారపద్ధతిలో ప్రయాస ఎక్కువ; ‘దేహమే తా’ననుకునే సాధారణస్థాయి వ్యక్తికి’ మొదట్లో సాకార-సగుణోపాసనవల్లనే ఏకాగ్రత కుదురుతుం”దని.

అందుకని, దానిని “ఎవరో ‘మేధావులు’ చెప్పారని” మనం తీసిపారేయక్కర్లేదు;
“అలా చెప్తున్నవాళ్ళు కూడా తమ ఏకాగ్రతకోసం ఏదో ఒక ఆకారాన్ని (మూర్తిని} ఎదురుగానో, మనసులోనో పెట్టుకోకపోతే వాళ్ళ పనులు సమర్థవంతంగా జరగవని కాస్త లోతుగా ఆలోచిస్తే వాళ్ళకూ ఆ ‘నిజం’ అర్థం కాకపోదు!}

తరువాత వచ్చేది – “సగుణ-నిరాకార” – ఇతడు “ఈశ్వరుడు.” ఈతడు సర్వవ్యాపి (Omnipresent); సర్వజ్ఞుడు (Omniscient); సర్వశక్తిమంతుడు (Omnipotent). {‘ఆయనకు ఈ మూడు లక్షణాలూ ఉంటాయి; కానీ రూపముండదు కాబట్టి నిరాకార’}

అంతేగాక, “ఈశ్వరుడు మాయకు (ప్రకృతికి) అధిపతి; జీవుడు మాయకు అధీనుడు.”

విష్ణుసహస్రనామాలనే ఇక్కడ కూడా ఉదాహరణగా తీసుకుంటే – “ప్రజాపతి; భర్తా; ధరణీధర” మొదలైనవి ఈ లక్షణాలను (attributes) తెలుపుతాయి. ఇక్కడికొచ్చేసరికి ఆయనకు ఆకారం ఉండాల్సిన అవసరం లేదు!

చిట్టచివరిది – “నిర్గుణ-నిరాకార” {ఈ స్థాయిలో ఆకారమూ ఉండదు; లక్షణాలూ ఉండవు} – ఇక్కడ “సత్-చిత్-ఆనందం” మాత్రమే మిగులుతుంది. దానినే చైతన్యం/Consciousness అంటారు. ఇదే – “ఉనికి, జ్ఞానం, పరమానందం”; దీనినే “పరతత్త్వము, పరమాత్మ, నిర్గుణబ్రహ్మము” అంటారు.

దీనికి ఏ విధమైన గుణాలూ లేవు కాబట్టి ‘అకర్త.’ మాయయే (ప్రకృతి) ఈ చైతన్యాన్ని ఉపయోగించుకుంటూ “ఈ మిథ్యాప్రపంచాన్ని” నడుపుకుంటోందని మనం అర్థం చేసుకోవచ్చు.

తిరిగి విష్ణుసహస్రనామాలలోకి వెడితే “అవ్యక్త, అజ, సమాత్మ, ఆనంద, శాశ్వత”వంటి నామాలను దీనికి ఉదాహరణగా పరిగణించవచ్చు.

{నిజానికి ‘ఆయనకు’ నామరూపాలేవీ వర్తించవు కాబట్టే “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ” అంటుంది తైత్తిరీయం. కాబట్టి ఈ మాటలు పరమాత్మకు కేవలం సూచకాలే గానీ, నిర్వచనాలు కాబోవు}

ఇక మన సాహిత్యం విషయానికొస్తే – దానిలోని సింహభాగం ఆస్తికపాఠకులకే అది ఉద్దేశింపబడుతోంది కాబట్టి, మనం ఇంతవరకూ చెప్పుకున్న ప్రక్రియకు కొన్ని ఉదాహరణలను పేర్కొంటాను:

“ఈ వ్యాసంలోని విషయానికి సంబంధించిన ఉదాహరణలెక్కడినుండి?” అంటే – స్థాలీపులాకన్యాయంగా మన సాహిత్యంనుండి నేను పేర్కొనబోయే క్రింది గ్రంథాలు/రచనలలలోని కొన్ని పద్యాలు/శ్లోకాలు మొ// వాటినుండి:

1) తిక్కన గారి మహాభారతం

2) భగవద్గీత

3) రామరక్షాస్తోత్రమ్

4) పోతనగారి భాగవతంలోని భీష్మస్తుతి, గజేంద్రమోక్షము

5) వాల్మీకి రామాయణం యుద్ధకాండలో వచ్చే “ఆదిత్యహృదయం”

6) త్యాగయ్య కీర్తనలు

7) తక్కినవి – ఆధునికసాహిత్యం, సినిమా సాహిత్యం మొ//

1) మొదట తిక్కన గారు:

“ఆయన తన మొట్టమొదటి పద్యంలోనే ఇద్దరు “ప్రధానులైన దేవుళ్ళను” (వారి పరివారంలో ఉన్నవాళ్ళు వీరిలో ఎవరిలో ఒకరికి చెందుతారు కాబట్టేమో!) కలిపి, “శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింపజేసే” “హరిహరనాథుడిని” సృష్టించాడు కదా! “విష్ణురూపాయ నమశ్శివాయ” అని ఇద్దరినీ ఒకటిగా చేశాడాయన; అంటే “ఎందరో దేవుళ్ళు” ముందు ఇద్దరై, ఆపైన “ఆ ఇద్దరూ” ఒకటైపోవడం!

{ఈ ఊహను స్ఫూర్తిగా తీసుకునే అయి ఉండాలి. వేటూరి సుందరరామమూర్తిగారు కూడా “హరిహరాత్మకమైన అఖిలప్రపంచమ్ము గరుడ-నాగానంద-కావ్యమైన”దంటాడు ఒక సినిమా పాటలో!}

అక్కడితో తిక్కనగారు ఆగలేదు! అదే పద్యంలో ఆ సాకార-సగుణమూర్తినే “పరతత్త్వముఁ గొల్చెదనిష్టసిద్ధికిన్” అంటూ ‘నిర్గుణ-నిరాకారుడిగా’ నిరూపించాడు!

ఇంతకు ముందే “పరమాత్మ సచ్చిదానందు”డనుకున్నాం కదా!

అందుకనేనేమో “భారతామృతముఁ గర్ణపుటంబులనారగ్రోలి, యాంధ్రావళి మోదము”కోసమే కాకుండా ప్రతి పర్వాంతపద్యంలోనూ ఈ ‘ఆనంద-ముద్రను’ విధిగా వాడాడని శ్రీ ఆరుద్ర తన సమగ్రాంధ్రసాహిత్యంలో పేర్కొన్నారు!

ఉదాహరణకు విరాటపర్వాంతంలో – “ఆనంద-సంస్తూయమానా!”; ద్రోణపర్వాంతంలో “శాశ్వతానందమూర్తీ!”.. ఇలా గ్రంథాంతంవరకూ!

అంతే కాదు – గ్రంథాదిలో కూడా మొదటి పద్యం పూర్తి కాగానే వచ్చే వచనంలో “కవిత్వతత్త్వ-నిరతిశయానుభావానందభరితాంతఃకరణుడనైనా”నంటూ తిక్కనగారు చెప్పారని కూడా ఆరుద్ర చెప్పుకొచ్చారు.

తిరిగి ఒక సారి జ్ఞాపకం చేసుకుందాం – “సత్తే చిత్ – అదే ఆనందం కూడా” – అవి మూడు విడి పదార్థాలు కానే కావు!

2) భారతాంతర్గతమైన ‘భగవద్గీత’ను కూడా మరొక ఉదాహరణగా తీసుకోవచ్చు.

“తత్త్వమసి” అనే మహావాక్యానికొక వ్యాఖ్యానంగా దీనిని పరిగణిస్తారు.

మొదటి ఆరు అధ్యాయాలు (కర్మషట్కం) “త్వం” పదాన్నీ, 7నుండి 12 అధ్యాయాలు “తత్”పదాన్నీ, చివరి ఆరు “అసి (అయి ఉన్నావు)” అనే పదాన్నీ వివరిస్తాయని పెద్దల మాట.

గీత 9-12లో (రాజవిద్యా-రాజగుహ్య-యోగము) భగవానుడు – “మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్..” అంటాడు. (భగవానుడు అధిష్ఠానమైన పరమాత్మ/చైతన్యం; ప్రకృతి ఆ చైతన్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ చరాచరప్రపంచాన్ని నిర్మించుకుంటుంది!” అని భావం)

15వ అధ్యాయంలో దీనిని ఇంకా వివరిస్తాడు భగవానుడు:

ఉత్తమఃపురుషస్త్వన్యో పరమాత్మేత్యుదాహృతః/
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః// 15-17

యస్మాత్-క్షరమతీతోऽహం అక్షరాదపి చోత్తమః/
అతోऽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః// 15-18

తానే సర్వోత్తముడైన పరమాత్మగా ప్రకటించాక, తరువాతి శ్లోకంలో (15-19) “యో మామేవ మసమ్మూఢః జానాతి పురుషోత్తమమ్/ స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత!//” అని సారాంశాన్ని కూడా చెప్తాడు.

“సర్వ-విత్” అంటే “అంతటినీ తెలిసినవాడు” అని కదా!

“సర్వం ఖల్విదం బ్రహ్మ|”; “బ్రహ్మవిత్-బ్రహ్మైవ భవతి|” అనే ఉపనిషద్వాక్యాలననుసరించి, ఈ విధమైన జ్ఞానాన్ని పొందినవాడు “ఆ బ్రహ్మమే” అవుతున్నాడని చెప్పడమే కదా ఇది!

ఇక్కడితో “అసి” (నీవే అది ‘అయి ఉన్నావు!’) కూడా పూర్తైనట్లు.

తరువాతి అధ్యాయాలలో పునశ్చరణ ఉంటుంది చాలా మటుక్కి. అంటే మళ్ళీ వ్యవహారంలోకి వచ్చేస్తాం – ముందే చెప్పుకున్నట్లుగా!

3) మరొకటి – “రామరక్షా-స్తోత్రమ్”:

ప్రారంభంలో “ధ్యాయేదాజానుబాహుమ్…” అని మొదలుపెట్టి తరువాత “ధ్యాత్వా నీలోత్పలశ్యామం..”
“…స్వలీలయా జగత్త్రాతుమావిర్భూతమజం విభుమ్” అన్నాడు. ఇక్కడ “అజ”, “విభు” శబ్దాలు పరమాత్మనే సూచిస్తాయి. (“విభు” శబ్దానికి “సర్వవ్యాపి” అనే అర్థం కూడా ఉంది.) అంటే అజుడూ, సర్వవ్యాపి అయిన పరబ్రహ్మము తనయొక్క లీలతోనే ఈ జగత్తును రక్షించడానికి అవతారమెత్తాడని.

ఇక వర్ణనభాగమంతా ఆయనయొక్క సుందరాకృతి, ఆయనకున్న దొడ్డగుణాలు, పరాక్రమం మొదలైనవాటిపైనే! అంటే “సగుణ-సాకార!”

చివరన వచ్చే “రామో రాజమణిః….” అనే శ్లోకం “రామే చిత్తలయః సదా భవతు మే..”లో ‘నా మనస్సు రాముడిలో చేరి, ఒకటైపోవాలి” అన్న మాటతో ముగుస్తుంది. అంటే – తిరిగి నిర్గుణనిరాకారుడైన “రాముడనే పరబ్రహ్మము”లోనికి!

4) ఇక తెలుగువారికి కవితామాధుర్యపు పరాకాష్ఠను చూపిన పోతనగారిదగ్గరకు పోదాం!

ఆయన రచనే అయిన భీష్మస్తుతిలో చాలామందికి ఎక్కువగా గుర్తుండేవి “త్రిజగన్మోహన..”, దానికంటే ఎక్కువగా ఒక సినిమాలో కూడా చూపించిన “కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..” కదా!

భీష్ములవారు ఈ స్తుతినంతటినీ సగుణ-సాకారమూర్తియైన భగవానుడిగా మన కట్టెదుట చూపించినా, ఆయన ఆ స్తుతిని ముగించినది మాత్రం

“ఒక సూర్యుండు సమస్తజీవులకు తానొక్కొక్కడై తోచు పో
లికనే దేవుడు సర్వకాలము మహాలీలన్-నిజోత్పన్నజ
న్యకదంబంబుల హృత్సరోరుహములన్-నానావిధానూనరూ
పకుడై యొప్పుచునుండు-నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై!”

అని ముగిస్తాడు; అంటే పారమార్థిక-సత్యంలోకి తీసుకెళ్ళాడు కవి మనల్ని!

ఇక “గజేంద్రమోక్షం”లో వచ్చే స్తుతిగురించి:

ఇది భాగవతంలోని అష్టమస్కంధంలోనిది.

ఇతవృత్తం మనకందరికీ తెలిసినదే!

ఇందులో వచ్చే స్తుతిలో గజేంద్రుడు “విశ్వమయత కలిగిన హరిని” క్రింది విధంగా ప్రార్థంచిన పద్యం దాదాపుగా ప్రతి ఆంధ్రుడికీ సుపరిచితమైనదే!

ఎవ్వనిచే జనించు జగ? మెవ్వనిలోపలనుండు లీనమై?
ఎవ్వనియందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూలకారణంబెవ్వ?
డనాదిమధ్యలయుడెవ్వడు? సర్వముఁ దానయైనవా
డెవ్వడు? వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్. (8-73)

ఇందులో “మూలకారణం, అనాది-మధ్య-లయత్వం, సర్వమూ తానే అయి ఉండడమూ” పరమాత్మను సూచించే భాగం. తనదే అయిన మాయ(ప్రకృతి)తో కలిసినపుడా పరమాత్మ ఈశ్వరుడౌతాడు; అప్పుడీ ‘జగము’ జనిస్తుంది; అతనిలో అంతర్భాగంగా కొనసాగుతుంది; అతనిలోనే నశించిపోతుంది; ఆయన ఆత్మభవుడే! వ్యవహారంలోకి వచ్చేసరికి అట్టి ఈశ్వరుడినే శరణువేడుతున్నాడు గజేంద్రుడు!

ఇంకా కొన్ని పద్యాలలో మాయాత్మకమైన ఈ సృష్టిని “ఒక పరి జగముల వెలినిడి…”; “లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది..”వంటి పద్యాలలో (8-74, 8-75) ఈ సృష్టి జరగడమూ, కొనసాగడమూ, నశించడమూ, ‘ఆయనొక్కడే ఏకాకృతిని వెలగడమూ’ మొ/ వివరించబడ్డాయి!

తిరిగి వ్యవహారంలోకి!

“కలడు కలండనెడివాడు కలడో? లేడో?” అనుకుంటాడొక క్షణంగజేంద్రుడు! (8-86)

మరల “ఎందుకు లేడు? ‘అసాధువులచేఁబడెడి సాధులకడ్డుపడెడివాడు’…” అనుకుంటూ ధైర్యం తెచ్చుకుని (8-87)…

“విశ్వకరు, విశ్వదూరుని
విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వునవిశ్వున్
శాశ్వతు నజు-బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్!” (8-88) అంటూ

“లావొక్కింతయు లేదు” అనే పద్యం మొదలుకొని మరి రెండు మూడు పద్యాలలో శరణుజొచ్చుతాడు;

అప్పుడు “అల వైకుంఠపురంబులో..” ఉన్న హరి “సిరికిం జెప్పడు…” అన్నట్లుగా వచ్చి ఈ భక్తుడిని రక్షిస్తాడు.

ఈ మొత్తం ఘట్టంలో మనం గమనించేదేమిటంటే – భగవంతుడి “సగుణ-సాకార”స్వరూపంనుండి నిర్గుణనిరాకారాన్ని స్పృశింపజేసి మరీ ఈ కవి మనలను “ఇహలోకంలోకి” తీసుకువచ్చాడని!

5) మరొక్క ఉదాహరణ – రామాయణాంతర్గతమైన “ఆదిత్యహృదయం.”

ఇది రామాయణం యుద్ధకాండలోని 107వ సర్గ. ఇందులో మొత్తం 31 శ్లోకాలున్నాయి.

వాల్మీకి రామాయణంలోని రాముడు తానెక్కడా భగవంతుడినని ప్రకటించుకోలేదు! సత్పురుషుడైన ఒక మానవుడిగానే ఆయన రావణుడితో యుద్ధం చేశాడు.

కాబట్టేనేమో అగస్త్యమహర్షి శ్రీరాముడంతటివాడికే ఆదిత్యహృదయాన్ని బోధించాడు!

స్థూలంగా చూస్తే ఈ శ్లోకాలలో సూర్యభగవానుడిని 6నుండి 18వ శ్లోకాలదాకా (సూర్యబింబం సాకారమే కదా!) ప్రముఖంగా సగుణసాకారుడిగానే వర్ణించాడు వాల్మీకి – “రశ్మిమంతం, రశ్మిభావన, ప్రభాకర, గభస్తిమాన్, దివాకర” మొ//.

తదుపరి 19 – 22 శ్లోకాలలో “సగుణ-నిరాకార”కు దగ్గరగా ఉంటుంది వర్ణన.
“తమోఘ్న, హిమఘ్న, జ్యోతిషాంపతి, విశ్వకర్మ, ప్రభుః” మొ/ లక్షణాలు.

చివరిగా 23 – 24 శ్లోకాలలో నిర్గుణత్వాన్ని కూడా సూచిస్తాడు కవి. “సుప్తేషు, జాగర్తి భూతేషు పరినిష్ఠితః, సర్వః ఏషః, ప్రభుః (చైతన్యమే ఈ జగత్తుకు నిజమైన హక్కుదారు కదా!”) మొ/

అక్కడినుండి చివరివరకూ (26 -31) ఫలశ్రుతి, రాముడిని కార్యోన్ముఖుడిని చేయడంతో ఈ సర్గ ముగుస్తుంది – అంటే తిరిగి పారమార్థికంనుండి వ్యావహారికానికి వచ్చేస్తామన్నమాట!

6) ఇక మన వాగ్గేయకారుల విషయానికొస్తే – వాళ్ళ కీర్తనలలో కూడా ఈ మూడు రకాల పోకడలూ కనిపిస్తూనే ఉంటాయి కదా!

త్యాగయ్య కీర్తనలే తీసుకుంటే – “అలకలల్లలాడగ గని..(మధ్యమావతి)”, “సొగసు చూడ తరమా? (కన్నడగౌళ)”; “శ్రీరామ జయరామ! శృంగార రామ యని… (యదుకుల కాంభోజి)”వంటివి సగుణ-సాకారానికీ;

“నిజమర్మములను… (ఉమాభరణం)”; “మరుగేలరా? (జయంతశ్రీ)”; “అనాథుడను గాను…(జింగ్లా)” మొదలైనవి సగుణ-నిరాకారానికీ;

“జ్ఞానమొసగరాదా.. (పూర్వీకల్యాణి)”, “పరమాత్ముడు వెలిగే ముచ్చట… (వాగధీశ్వరి); “ఉండేది రాముడొకడు…(హరి-కాంభోజి)”వంటివి నిర్గుణ-నిరాకారానికీ ‘దాదాపుగా’ ప్రతీకలని భావించవచ్చు.

7) మరొక మాట – ఆధునిక కవులైనా అభ్యుదయకవులైనా కూడా ఈ “భిన్నత్వంలో ఏకత్వం” లేదా “ద్వైతంలో కూడా ఏకత్వం” అనే ఆలోచనావిధానానికి దూరంగా లేరనే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు కోరేది కూడా లోకకల్యాణమే కదా!

సమాజం మొత్తం బాగుపడాలంటే అందులోని ప్రతి వ్యక్తీ మానసికంగా ఎదిగితేనే కదా అది సాధ్యం!

అయితే ఆ కవుల ఆలోచనావిధానమూ, వ్యూహాలూ వేరు కావచ్చు!

‘ఎన్నో’ వస్తువులూ/చింతనలూ ‘కొన్నే’ కావడం; ఆ కొన్నీ ఇంకా తగ్గి, రెండే కావడం, తుదకు ‘ఆ రెండూ ఒకటే కావడం’ – అనగా ‘అద్వైతం’ అన్నది యావద్విశ్వానికీ అభిలషణీయమే కదా!

అందుకనేనేమో – మన సినీ కవి వేటూరి గారు తానెలాటి పాటలను వ్రాసినా, “చివరికి ఏముందండీ! అంతా అద్వైతమే!” అనేసేవారట!

తెలంగాణా పోరాటపు రోజుల్లో ఆరుద్ర వ్రాసిన ఖండకావ్యం పేరు “త్వమేవాऽహం!”

“నీ వెనకనే నేను!” అనే మాటకంటే శ్రేష్ఠమైన మాట కదా – “నువ్వే నేను!” అనడం! “తత్త్వమసి” వంటి వేదాంత-మహావాక్యాలు జ్ఞాపకం రావా – ఇలాటి మాటలు వింటే?

“దాశరథి” రచనయైన ఒక ఖండకావ్యం పేరు – “తిమిరంతో సమరం” (తిమిరం = చీకటి – అజ్ఞానానికి ప్రతీక – ఆ పోరులో గెలిస్తే జ్ఞానమే కదా దొరికేది! అదే కదా “సత్, ఆనందం” కూడా!)

ఇక నా అభిమాన కవి శ్రీశ్రీ గారి మహాకావ్యమొకదాని పేరు “మహా-ప్రస్థానం!” దీనికున్న అర్థాలు “గొప్పగా నిష్క్రమించడం, నిరంతర ప్రయాణం” మాత్రమే గాక, “గొప్ప పదవి/స్థితి” అని కూడా! – అలాటివి రెండుండవు – “ఒక్కటంటే ఒక్కటే” ఉంటుంది!!

8) మన చలనచిత్రాలలోని పాటలెన్నింటిలోనో కూడా అంతర్లీనంగా ఈ ఆధ్యాత్మిక-ధోరణులు కనిపిస్తూనే ఉంటాయి – ఆలోచించి చూస్తే.

కృష్ణశాస్త్రిగారి పాటల్లోనైతే ఎక్కువగా ‘సగుణ-నిరాకార’ ‘నిర్గుణ-నిరాకార’ కనిపిస్తాయి.

“సకలచరాచర-లోకేశ్వరేశ్వర! (ఘనాఘనసుందరా!)”; “ప్రతి మనిషీ నడిచే దైవం; ప్రతి పురుగూ ఎగిరే దైవం (అడుగడుగున గుడి ఉంది)”వంటి ప్రయోగాలు ఆయన రచనల్లో కోకొల్లలు.

వేటూరి గారి “శంకరా! నాదశరీరా! పరా! వేదవిహారా! హరా! జీవేశ్వరా!”; “అద్వైతసిద్ధి”(కి దారితీసే గానం)”
వంటి ప్రయోగాలలో కూడా ఈ ‘వ్యావహారిక-పారమార్థిక’ల “ముందూ వెనుకా” ప్రయాణం కనిపిస్తూనే ఉంటుంది!

ఇదే ‘శంకరాభరణం’ ‘టైటిల్ సాంగ్’గురించి ఒక మాట – ‘శంకరాభరణము’ అంటే ఒక రాగం పేరే కాదు; ‘పాము’ కూడా. (శంకరుడి మెడలో ఉండడంవల్ల ఆయనకు ఆభరణమైనది గనుక!)

అదే ‘శంకరాభరణం’ – “శంకరగళ-నిగళము (శివుడి మెడలో చుట్టుకొని ఉన్నది), అదే శ్రీహరి-పదకమలము (మరొక పాము – ఆదిశేషుడాయనకు పరుపు కదా, ఆ పాము ఆయన కాళ్ళదగ్గరా ఉన్నదే!); అంతే కాదు – ‘రాగరత్నమాలికా-తరలము’ – రాగరత్నాలనే మాలలో మధ్యనున్న ముఖ్యమైన మణి కూడా (ఒక రాగంగా)! –

రకరకాల స్థానాలలో విడివిడి వస్తువులుగా కనిపించేది “ఒక్కటే” సుమా! – అనే కదూ ఆయన చెప్పకనే చెప్పాడు!

ఇవే గాక, మామూలుగా మనం వినే వేరే ఎన్నెన్నో పాటల్లో కూడా – ముఖ్యంగా యుగళ-గీతాల్లో ఆయా కవులు చెప్పేదేమిటి? భిన్నత్వంకంటే ఏకత్వంలో పొందే ఆనందమే ఎక్కువనే కదా! “నీవు లేని నేను లేను; నేను లేని నీవు లేవు..”; “నిజానికే నేనున్నది నీలో..” ఇలాటి ప్రయోగాలెన్నో!

చివరికి త్రాగుబోతుల మాటల్లో కూడా ‘వేదాంతాన్ని’ వెతుక్కోవచ్చు; ఆలోచించి చూస్తే – “జగమే మాయ! బ్రతుకే మాయ!”; “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!…” (సముద్రాల) వగైరా!

పైన చెప్పిన కవులను మాత్రమే పేర్కొనడమంటే మిగతా కవులనెవరినీ పక్కనపెట్టినట్లు కాదు సుమా! సందర్భానికి తగినట్లుగా ప్రతీ కవీ ఇలాటి భావాలను తనకు అవకాశం దొరికినప్పుడల్లా చూపెడుతూనే ఉన్నాడు, ఇక ముందు చూపెడుతూనే ఉంటాడు కూడా!

అద్వైతమే నిజానికి “నిజమైన ఆనందాన్నిచ్చేది!” రెండవదాన్ని చూడడం మొదలైన తక్షణం ఆ ఆనందం పోయి, భయం మొదలౌతుంది! {“ద్వితీయాద్వై భయం భవతి!” అనేది ఒక ప్రముఖమైన ఉపనిషద్వాక్యం!}

అన్నట్లు – మన నిత్యజీవితంలో ఎందరో తాము “అద్వైతస్థితి”కి చేరిపోయామని “సునాయాసంగానే”
“ప్రకటించుకోవడాన్ని” కూడా మనం చూస్తూనే ఉన్నాం!

ఇలా చెప్పుకుంటూ పోతే – మనం చదివే రచనలెన్నిటిలోనో సూచనాప్రాయంగానైనా ‘ఆధ్యాత్మిక-చింతన’ అనేది అంతర్వాహినిగా ఉంటుందనే నా అభిప్రాయంతో చాలామంది ఏకీభవిస్తారనే అనుకుంటున్నాను!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked