2017 డిసెంబర్ నెల మధ్యనుండే 2018 సంవత్సరం సిలికానాంధ్రకు శుభసూచకంగా ఉంటుందన్న సంకేతాలు మెండుగా కనిపిచసాగాయి. డిసెంబర్ 15 నుండి 19 వరకు హైద్రాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ సాహిత్యవేదికలపైన పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట కవిత మొదలుకొని పలు సాహితీ దిగ్గజాలు సిలికానాంధ్ర, మనబడి, సుజనరంజని సేవలను కొనియాడుతూ ఆ పేర్లను తమ ప్రసంగాలలో ఉటంకించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ముగింపు సమావేశాల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి ప్రవాసభారతంలో మనబడి సేవలను గుర్తిస్తూ ఇప్పటి తరాలకు, భావితరాలకు మధ్య వారధిగా నిలుస్తున్నదని కొనియాడడం మరొక ఎత్తు.
2018 జనవరి మాసంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఒక సంవత్సరం పూర్తి చేసుకొన్నది. ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు ఐటీ మంత్రివర్యులు నారా లోకేశ్ ముఖ్య అతిధిగా విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వ్యాప్తికి సిలికానాంధ్ర చేస్తున్న కృషిని కొనియాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ‘కూచిపూడి సెంటర్ ఫర్ ఎక్సెల్లన్స్ ‘ కు సిలికానాంధ్ర సహకారం అందించాలని ఆహ్వానించారు.
2018 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో మరిన్ని కొత్త కోర్సులు ప్రారంభమవుతాయి. అలాగే, మనబడి కొత్త లక్ష్యాలను నిర్ణయిస్తూ వాటిని అధిగమించే దిశలో పకడ్బందీగా ప్రణాళికలు వేస్తున్నది.
అలాగే సుజనరంజని మాసపత్రిక కొత్త హంగులను దిద్దుకోబోతూ విన్నూత్న రచనలకు తావు ఇవ్వబోతున్నది.
ఎప్పటిలాగే మీ ఆశీస్సులను, సహకారాన్ని కోరుతూ…
– తాటిపాముల మృత్యుంజయుడు