“చాలు జాలు నీతోడి సరసాలు”
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి “చాలుఁ జాలు నీతోడి సరసాలు” అంటూ స్వామి వారి శృంగార చేష్టలకు కోపం ప్రదర్శిస్తున్నాడు ఈ కీర్తనలో.. ఆ ముచ్చట మనమూ చూద్దాం రండి.
కీర్తన:
పల్లవి: చాలు జాలు నీతోడి సరసాలు యిట్టె
పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి
చ.1. సిగ్గువడితిమిర నీ చేసిన చేతలకు
నగ్గమైతిమిర మరునమ్ములకును
దగ్గరి నీకాకల దగులఁబట్టి నేఁడు
బగ్గన నిందరిలోన బలచనైతిమి || చాలు జాలు ||
చ.2. నొగిలితిమిర నేము నోచిన నోములకు
పొగిలితిమిర నీ పొందులకును
తెగి నీవు నన్ను రతి దేలించి తేలించి నాకు
పగటు బిగువులెల్ల బచ్చిగా జేసితివి || చాలు జాలు ||
చ.3. దప్పి బడితిమిర నీతాలిములనే కడు
నొప్పి బడితిమీర నీ నొక్కు జేతల
ఇప్పుడిట్టె తిరువేంకటేశుడ నీవు నా
కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము || చాలు జాలు ||
(రాగం: రామక్రియ; రేకు సం: 92, కీర్తన; 5-364)
విశ్లేషణ: అన్నమయ్య అమ్మవారి పాత్ర తానే ధరించి శృతిమీరిన శ్రీనివాసుని శృంగార చేష్టలకు చిరుకోపంతో విసుగును ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఏమరుపాటున నా కొంగు జారిందే అనుకో నీవు ఇట్లా చిలిపి పనులకు దిగుతావా? చాలు చాలయ్యా! స్వామీ! ఆపండి అని కోపిస్తూ చెప్తున్నాడు అన్నమయ్య.
పల్లవి: చాలు జాలు నీతోడి సరసాలు యిట్టె
పాలిండ్ల కొంగుజారి బయటఁ బడితిమి
స్వామీ! ఏదో ధ్యాసలో ఉండగా నా కొంగు జారి పాలిండ్లు బయటబడ్డాయే అనుకోండి. మీరిట్లా చిలిపి పనులు, సరసాలు ఆడడం తగునా! ఆపండి మీ సరసాలు ఇంతటితో అని విసుగు ప్రదర్శిస్తున్నది అమ్మ అలిమేలు మంగమ్మ.
చ.1. సిగ్గువడితిమిర నీ చేసిన చేతలకు
నగ్గమైతిమిర మరునమ్ములకును
దగ్గరి నీకాకల దగులఁబట్టి నేఁడు
బగ్గన నిందరిలోన బలచనైతిమి
స్వామీ! మీరు చేసిన చిలిపి చేతలకు చాలా సిగ్గుపడిపోయాను. మన్మధ బాణాలకు తట్టుకోలేక లొంగిపోయి నీకు స్వాధీనమయ్యాము. నీమీద తాపముచే దగ్గరవడం వలన ఎక్కువగా అందరిలో పలచనై చిన్న చూపు చూడబడ్డాము..
చ.2. నొగిలితిమిర నేము నోచిన నోములకు
పొగిలితిమిర నీ పొందులకును
తెగి నీవు నన్ను రతి దేలించి తేలించి నాకు
పగటు బిగువులెల్ల బచ్చిగా జేసితివి
స్వామీ! మీకొరకు ఎన్ని నోములు నోచాము. ఎంత కష్టపడ్డాము? నీపొందుకై ఎంత తపన పడ్డాము? నీవు నా విన్నపాలకు కరిగి తెగించి నన్ను రతులలో తేలించావు. నా బిగువును బెట్టును పూర్తిగా తొలగించి నన్ను నీ దానిగా చేసుకొన్నావు. అలాంటి నిన్ను నేను ఏమని అనగలను చెప్పండి స్వామీ!
చ.3. దప్పి బడితిమిర నీతాలిములనే కడు
నొప్పి బడితిమీర నీ నొక్కు జేతల
ఇప్పుడిట్టె తిరువేంకటేశుడ నీవు నా
కొప్పు సవరము దీసి కొల్లగొంటి మానము
ఓ ప్రాణనాధా! శ్రీనివాసా! నీ తెంపరి పనులకు చాలా కష్టపడ్డామయ్యా! నీ నొక్కులకు అదుములకు మిక్కిలి బాధ పడ్డాను. ఓ గోవింద రమణుడా! తిరుమలేశా! ఇన్నివిధములుగా నాతో సరసమాడి నా కొప్పులోని సవరమును అవలీలగా లాగివేసి నన్ను అన్నివిధాలా లోబరుచుకొన్నావు అని అమ్మ సిగ్గుగా స్వామిని చూస్తూ అంటున్నది.
ముఖ్య అర్ధములు: అగ్గము = స్వాధీనమగుట; కాక = తాపము; బగ్గన = ఎక్కువగా; నొగలు = కష్టపడు; పొగలు = బాధపడు; బిగువులెల్లు పచ్చిగా చేయు = బిడియము పోగొట్టు, బింకము తగ్గించు, బెట్టును లేకుండా చేయు; తాలిమి = ధైర్యము; కొల్లగొంటి = లోబరచుకొను.