సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

“చిత్తగించి చూడవయ్య – సిగ్గువడ నీకేటికి”
అన్నమయ్య తానే చెలికత్తె పాత్ర ధరించి “చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి” అంటూ స్వామి వారు అమ్మవారిని చూసి సిగ్గుపడే సన్నివేశాన్ని హృద్యంగా వర్ణిస్తున్నాడు. ఆ ముచ్చటేదో మనమూ విందాం.

కీర్తన:

పల్లవి: చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి
బత్తిసేసీ నాకె నీపై భావించవయ్యా ॥పల్లవి॥

చ.1. సెలవుల నవ్వుతాను చేరి మాఁటలాడుతాను
పలువరుసలు చూపీఁ బడఁతి నీకు
నిలుగునివ్వెరగుతో నిండుసింగారములెల్లాఁ
బలుమారు నీముందరఁ బచరించీని ॥చిత్తగించి॥

చ.2. కొప్పు చక్కఁబెట్టుకొంటా కొలువులు సేసుకొంటా
నెప్పునఁ జన్నుల నొ త్తీ నెలఁత నిన్ను
వుప్పతిల్లుఁగళలతో నుడివోనిజవ్వనాన
కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట ॥చిత్తగించి॥

చ.3. సరులు దిద్దుకొనుచు చవులెల్లా మోవిఁ జూపి
మరిగించీ నల మేలుమంగ నిన్నును
ఇరవై శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి
వురముపై నుండి యాపె వుబ్బించీ నీమనసు॥చిత్తగించి॥
(రాగం: రామక్రియ; రేకు సం: 805, కీర్తన; 18-30)

విశ్లేషణ: అన్నమయ్య తాను శృంగార దూతికగా, చెలికత్తెగా, చెలికాడుగా, భక్తుడుగా బహురూప ధారియై స్వామిని కీర్తించాడు సంకీర్తించాడు. వాటిలో మేలిముత్యమై భాసిల్లే ఈ కీర్తనలో స్వామి శ్రీనివాసుడు సిగ్గులొలకబోస్తుంటే “స్వామీ! సిగ్గెందుకు అలమేలుమంగమ్మ మీ కోసం భక్తిగా మిమ్ములను తలపులలో నింపుకొని ఎదురు చూస్తున్నది అంటూ స్వాగతిస్తున్నాడు చూడండి.

పల్లవి: చిత్తగించి చూడవయ్య సిగ్గువడ నీకేఁటికి
బత్తిసేసీ నాకె నీపై భావించవయ్యా!

స్వామీ! అలమేలు మంగమ్మకు మీపై ఎనలేని భక్తి. అలాంటి భక్తిభావనలతో మిమ్ము సేవిస్తున్నది. ఆమెను మన్నించి ఒక్కసారి చూడరాదా స్వామీ! ఆమె భక్తి భావాలను ఆదరించరావా స్వామీ అంటూ స్వాగతిస్తున్నాడు అన్నమయ్య.

చ.1. సెలవుల నవ్వుతాను చేరి మాఁటలాడుతాను
పలువరుసలు చూపీఁ బడఁతి నీకు
నిలుగునివ్వెరగుతో నిండుసింగారములెల్లాఁ
బలుమారు నీముందరఁ బచరించీని

స్వామీ! అమ్మ చక్కనైన పలువరసతో అత్యంత అందంగా చిరుమందహాసంతో మీకేసి చూస్తున్నది. ఆమె ఒక్కసారి మిమ్ములను చూసి తత్తరపాటుకు గురి అవుతున్నది. ఆమె తన నిండు సింగారాలను తమ ముందు అనేక సార్లు ప్రదర్శిస్తున్నది. గమనించారా! రండి చూడండి.

చ.2. కొప్పు చక్కఁబెట్టుకొంటా కొలువులు సేసుకొంటా
నెప్పునఁ జన్నుల నొ త్తీ నెలఁత నిన్ను
వుప్పతిల్లుఁగళలతో నుడివోనిజవ్వనాన
కుప్పళించి వలపులు గురిసీ నీయెదుట

స్వామీ! అమ్మ తన కొప్పును పదే పదే సవరించుకొంటున్నది. గమనించారా! నీకు సేవలు చేసే వేళ ఏదో ఒక సందర్భం చూసుకుని తన కుచములను తమకు తాకిస్తున్నది. అనేక మైన ప్రదర్శిత కళలను చూపిస్తూ తన ఎప్పటికీ తగ్గని యౌవనాన్ని నీ ముందు కుమ్మరించి వలపులు కురిపిస్తున్నది.

చ.3. సరులు దిద్దుకొనుచు చవులెల్లా మోవిఁ జూపి
మరిగించీ నల మేలుమంగ నిన్నును
ఇరవై శ్రీ వేంకటేశ యిటు నన్ను నేలితివి
వురముపై నుండి యాపె వుబ్బించీ నీమనసు

అమ్మ తన నగలను మాటి మాటికీ సర్దుకుంటూ తేనేలూరే తన అధరాలను చూపిస్తూ నిన్ను ఆశపడేట్టు చేస్తున్నది. అలాంటి అలమేలు మంగమ్మను నెలకొని యున్న శ్రీవేంకటేశ్వరా! ఇటు నన్ను ఎలుతూ అటు అలమేలుమంగమ్మను వక్షస్థలంలో ఉంచుకుని అనుగ్రహించావు. ఆమె నీ మనసును ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు చేస్తోంది అని అన్నమయ్య శ్రీనివాసునికి నివేదిస్తున్నాడు.

ముఖ్య అర్ధములు: చిత్తగించి = మనసుపెట్టి; భక్తి (ప్ర) = బత్తి (వి); ఆకె = ఆమె అనగా అమ్మవారు; సెలవు = ఆజ్ఞ; పలువరుసలు = దంతములు; నివ్వెరగు = తత్తరపాటు, బిడియము; పచరించు = ప్రదర్శించు; ఉప్పతిల్లు = పుట్టు, ఉత్పత్తియగు, బహిర్గతమగు; ఉడివోని = తగ్గని; జవ్వనము = యౌవనము; కుప్పళించు = ప్రసరింపఁజేయు; మరిగించు = ఆశపడునట్లు చేయు, కాగు; ఇరవు = నెలకొని ఉండుట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked