“వలపు నిలుపలేనివారము”
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
అన్నమయ్య తానే నాయిక పాత్ర ధరించి “వలపు నిలుపలేనివారము” అంటూ స్వామి వారి ని పరిపరివిధముల బ్రతిమాలుతున్నాడు. ప్రశ్నలు వేస్తున్నాడు. ఓ శ్రీనివాసా! ఎన్నో మార్లు పట్టుకుని లాగుతుంటే ఏమి చెయ్యగలవారము “ అంటున్నాడు అన్నమయ్య. “అలాగే నీవు ఆగ్రహించినట్లైతే మేము ఉండగలమా ?” అంటూ స్వామిని బహువిధాల ప్రసన్నుడిని చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నాయిక పాత్రధారిగా అన్నమయ్య రీతిని ఈ శృంగార కీర్తనలో గమనించండి. ఈ కీర్తన భక్తి భావాలతో ఉన్నప్పటికీ అన్నమయ్య భగవంతుని “రా” అని సంబోధిస్తూ…నాయిక శృంగారసమయంలో యిలాంటివి సాధారణం అనికూడా తెలియజేస్తున్నాడు అన్నమయ్య. వినండి.
కీర్తన:
పల్లవి: వలపు నిలుపలేనివారము నేమటుగాన
పలుమారుఁ బట్టుకొన్నఁ బయికొనవేలరా ॥ వలపు ॥
చ.1. ఒత్తి నీవాడినమాటకోరువఁ జాలక నే-
ముత్తరమిత్తము గాని ఊరకుండలేమురా
బత్తి గొట్టానఁ బెట్టఁగఁ బనిలేదు వోరి నీ-
చిత్తమింతేకాని యిఁక జెప్పనేమున్నదిరా ॥ వలపు ॥
చ.2. కాఁకఁల బెరిగినట్టి కళవళమున నిన్నుఁ
దాఁకనాడుదుము గాని తడవుండలేమురా
యేఁకటఁ జెందినయట్టి యింతుల మాటకు నీవు
సోఁకోరువవలెఁ గాక చురుకనరాదురా ॥ వలపు ॥
చ.3. సారెకు నీవెడసిన సైఁచలేము నీవు
చేరువనలిగి మమ్ముఁ జేకొనవేరా
ధీరుఁడవు కోనేటితిరువేంకటేశ నన్ను
గారవించి యిట్లానే కరుణించఁ గదరా ॥ వలపు ॥
(రాగం: ఆహిరి; రేకు సం: 13-4, కీర్తన; 5-77)
విశ్లేషణ: వలపు నిలుపలేనివారము నేమటుగాన
పలుమారుఁ బట్టుకొన్నఁ బయికొనవేలరా
ఓ వేంకటేశ్వరా! మేము నిన్ను త్రికరణసుద్ధిగా వలచినవారమే గాక మిమ్ములను కొలిచేవారము అందుచేత నీవు మమ్ము పలుమార్లు బట్టుకొని పైకి చేకొనుము అంటున్నాడు అన్నమయ్య.
చ.1. ఒత్తి నీవాడినమాటకోరువఁ జాలక నే-
ముత్తరమిత్తము గాని ఊరకుండలేమురా
బత్తి గొట్టానఁ బెట్టఁగఁ బనిలేదు వోరి నీ-
చిత్తమింతేకాని యిఁక జెప్పనేమున్నదిరా
నీవాడిన మాటలకు మరీ మరీ ఒత్తి ఒత్తి మీరాడిన మాటలకెల్లా ప్రత్యుత్తరమిచ్చాము. వాస్తవంగా ఊరక ఉండిపోలేదు. నిజమే! అంత మాత్రముచేతనే మా భక్తిని మీరు యింతగా పరీక్షించవలసిన పనిలేదు సుమా! ఓ శ్రీనివాసా! నీ చిత్తము యింతే అనుకొంటాము. యింతకన్న మేము చేయగలిగినది ఏమున్నదిరా వేంకటేశా!
చ.2. కాఁకఁల బెరిగినట్టి కళవళమున నిన్నుఁ
దాఁకనాడుదుము గాని తడవుండలేమురా
యేఁకటఁ జెందినయట్టి యింతుల మాటకు నీవు
సోఁకోరువవలెఁ గాక చురుకనరాదురా
శ్రీనివాసా! ఒక్కోసారి మేము నీవాడు మాటలకు, చేష్టలకు ఆగ్రహించి చికాకుతో నిన్ను నొప్పించిన మాట నిజము. మేము కాదనడములేదు. నీ రాకకోసం…నీ పొందుకోసం వేచి వేచి వేసారి ఆడదాన్ని ఏవో నాలుగు మాటలు అన్నంత మాత్రాన నీవు ఓర్చుకొనాలి తప్ప తిరిగి మమ్ము ఈ విధముగా నొప్పించుట తగునా? అన్ని విషయాలు సంపూర్ణముగా తెలిసిన దేవాదిదేవుడవు! నీకు మేము తెలియ జెప్పవలసిన అవసరము ఏమున్నదిరా! శ్రీహరీ!
చ.3. సారెకు నీవెడసిన సైఁచలేము నీవు
చేరువనలిగి మమ్ముఁ జేకొనవేరా
ధీరుఁడవు కోనేటితిరువేంకటేశ నన్ను
గారవించి యిట్లానే కరుణించఁ గదరా
ప్రభూ! నా ప్రాణనాధా! నీవు మాపై ఆగ్రహించిన యెడల మేము ఓర్వగలమా? ధైర్యవంతుడవైన నీవు మాకు చేరికై మమ్ము గ్రహించవలెను గాదా! శ్రీతిరుమలలోని కోనేటి రాయుడవు నీవే! ఇప్పుడున్నవిధంగానే ఎల్లప్పుడు మమ్ము మా తప్పులను గాచి మమ్ము గారవించి చేపట్టవలెను స్వామీ! అన్యధా శరణం నాస్తి అంటున్నాడు అన్నమయ్య.
ముఖ్య అర్ధములు = పైకొను = యత్నించు, మీదకువచ్చు, కవియు; ఒత్తి = గట్టిగా, కఠినముగా; బత్తి = భక్తి; గొట్టానబెట్టుట = పరీక్షించుట; కష్టపెట్టు అనే అర్ధంలో; కాక = కోపము, ఆగ్రహము; కళవెళపడు = విభ్రాంతి, కంగారు, చికాకు; తానికనాడు = నొప్పించు, బాధపెట్టు; ఏకట = మిక్కిలి అపేక్ష, ఎక్కువ ఇష్టము; సోకోరు = ఓరిమిని దాల్చు; చురుకను = చురుక్కుమనేట్టు మాట్లాడడం అనే అర్ధంలో చెప్పిన మాట; వెడసు = ఆగ్రహము, కోపము; సైచు = ఓర్చుకొని ఉండు; గారవించు = మన్నించు.